Sunday 6 August 2017

హిందూ ధర్మం - 248 (14 లోకాలు)

ఇంతకి ఈ 14 లోకాలు ఎక్కడ ఉన్నాయి? వాటి లోకవాసులు ఎలా ఉంటారు? వారు సాధారణ మనుష్యులేనా? లేక దివ్యలోకాలకు చెందినవారా? ఇలా అనేక ప్రశ్నలు తలెత్తుతుంటాయి. ఈ ప్రశ్నలకు నాస్తిక కోణం నుంచి సమాధానాలు వెతికితే, అది అర్ధ సమాచారంతో ముగుస్తుంది, అవగాహనారాహిత్యన్ని బయటపెడుతుంది. మనకు 3 ప్రమాణాలు ఉన్నాయి. ఒకటి శాస్త్రప్రమాణం, రెండవది ఆప్తప్రమాణం, మూడవది ఆత్మప్రమాణం. శాస్త్రమనగా వేదాది శాస్త్రాలు, ఆప్తులు అంటే ధర్మం మేలు కోరేవారు; భగవాన్ రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, కంచి పరమాచార్య, త్రైలింగ స్వామి మొదలైనవారు; ఆత్మప్రమాణం అంటే వ్యక్తి యొక్క అనూభూతి/ దివ్యానుభవం. ఆత్మప్రమాణాన్ని ఆప్తప్రమాణం, శాస్త్రప్రమాణంతో పోల్చి చూసి, అప్పుడే నిర్ధారణకు రావాలి. శాస్త్రకారుల దృష్టి, జ్ఞానం, అనుభవం మనకు లేకపోవచ్చు, కనుక మలిన, సంకుచిత బుద్ధితో వీటికి అర్దాలను చెప్పి అసలు విషయాన్ని పక్కదారి పట్టించకూడదు.



దేవ- అనే పదం ద్యు లేదా ద్యౌ అనే అక్షరం నుంచి వచ్చింది. ద్యౌ అంటే కాంతిగల లోకం. దేవతలు అంటే కాంతి శరీరం కలిగినవారు. వారివి మనలాంటి పాంచభౌతిక దేహాలు కాదు, రక్తమాంసాలతో నిండిన దేహాలు కావు, అవి దివ్యశరీరాలు. వారు కాంతి శరీరులు. అందుకే దేవతలు ప్రత్యక్షం అయ్యారని అంటాము, అంటే కళ్ళముందు కనిపించడం; అదృశ్యం అయ్యారు అంటాము- దృశ్యం అంటే కనిపించేది, కనిపించకుండా పోవటం అదృశ్యం. అంటే తమను వ్యక్తం చేసుకున్న దేవతలు తిరిగి అవ్యక్తమవ్వడం అన్నమాట. అలాగే పితృదేవతలు - మరణించిన మన కుటుంబాలకు చెందినవారు. వీరు కూడా భౌతిక దేహాన్ని కోల్పోయి, పితృలోకానికి చెందిన శరీరాన్ని పొందినవారే. దేవత అంటే ఇచ్చుటకు శక్తి కలిగి ఉన్నది అని అర్దం. పితరులు ఆశీస్సులు నిత్యజీవితంలో ఎంతో అవసరం. అలాగే ఇంద్రాది దేవతలవి కూడా. వారు మనకు ఎన్నో విధాలుగా సాయం చేస్తారు. వరాలను ఇస్తారు. అందుకే దేవతలు అన్నారు. అలాగే తల్లిదండ్రుల ఆశీర్వాదం పిల్లల వృద్ధికి కారణమవుతుంది కనుక వారిని దేవతలుగా భావించమని వేదం చెప్పింది. ఇంద్రుడు, అగ్ని, ఆదిత్యుడు, యక్షులు, గంధర్వులకు పునర్జన్మ ఉంది. అయితే పరంబ్రహ్మ/ పరమాత్మ- ఈ దేవతలకంటే పైస్థాయివాడు. మనం పూజించే శివ, శక్తి, విష్ణు, గణేశ మొదలైన స్వరూపాలు ఈ పరబ్రహ్మం యొక్క ప్రతిబింబాలు.

ఇప్పుడు ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. నిజదేవుడిని పూజించండి, మా ఏసు మాత్రమే నిజదేవుడు, అల్లాహ్ నే అసలు దేవుడు, హిందూ దేవీదేవతలు సైతాన్లు అంటూ మతమార్పిడి మూకలు ప్రచారం చేస్తున్నాయి. దేవత (తెలుగులో దేవుడు) అనేది సంస్కృతపదం. అది ఎవరికి వాడాలో కూడా శాస్త్రమే చెప్పింది. ఈ అన్యమతస్తులు చెప్పిన దేవుడికి రూపంలేదు, అది కాంతిశరీరం కలదని, దివ్యశరీరం కలదని వాళ్ళ గ్రంథాలు చెప్పలేదు. ఉంటే అలా ఎక్కడుందో reference చూపించమని అడగాలి. అసలు శరీరం ఉందని చెప్పడమే నింద అని చెప్పాయి. కానీ వాళ్ళేమో నిజదేవుడంటారు- ఈ దేవుడు అనే పదం వాళ్ళు వాడటం ఆయా గ్రంథాలను అపహాస్యం చేయడం, వాళ్ళ గాడ్‌ (God) కు ఈ పదాన్ని హిందువులు ఉపయోగించటం సనాతనధర్మాన్ని అవమానించటమే అవుతుంది. ఇది మనం గమనించాలి. వారు వాడకూడదని తెలియజేయాలి. 

అలాగే యక్ష, కిన్నెర, కింపురుష మొదలైన ఇతర లోకవాసుల గురించి, సూర్యమండలం, చంద్రమండల వాసుల గురించి పురాణాలు చెబుతున్నాయి. వీరి ఎక్కడ ఉన్నట్లు? వీరిని మానవులుగా, కొండజాతి వారిగా భావించకూడదు. యక్షులు, గంధరువులు మొదలైన వారితో సంభాషించిన మహాత్ములు, సిద్ధులు ఈ భూమి మీద తిరిగారు. వారి చరిత్రలు మనలో పేరుకుపోయిన ఎన్నో సందేహాలను, అపార్ధాలను తొలగిస్తాయి. యక్షులు, గంధర్వులు మొదలైనవారు కామరూపధారులు. ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరించగలరు. వీరు చెడ్డవారు అనే అభిప్రాయం చాలామంది చెప్తారు. కానీ వాస్తవంలో చక్కని జ్ఞానం, లోకహితం కోరే యక్షులు అనేకమంది ఉన్నారు. భగవంతుడు వీరిని కొన్ని అరణ్యాలకు రాజులుగా నియమించాడు. ఆయుర్వేద మూలికలపై వీరి ఆధిపత్యం ఉంటుంది. సంపదల కోసం లోకులంతా పూజించే కుబేరుడు యక్షరాజు. కొన్ని పురాతన ఆలయాలను నిర్మించినప్పుడు, ఆ ఆగమంలో భాగంగా ఆ ఆలయసంపదలకు రక్షకులుగా యక్షులను నియమించడం కనిపిస్తుంది. ఆలయ గోడలపై రకరకాల రూపాలు చెక్కి ఉండటం మనం చూస్తుంటాము. అందులో కొన్ని యక్షులవి ఉంటాయి. వారు ఆ ఆలయానికి రక్షకులుగా ఉంటారు. 

ఆలయ సంపదను, హుండీ డబ్బును ప్రభుత్వం తీసుకుని ప్రజల కోసం ఉపయోగించాలి. దేవాలయంలో స్వామికి అర్పించిన బంగారాన్ని ప్రభుత్వం కరిగించి తాకట్టు పెట్టాలి; ఇలాంటి మాటలు అప్పుడప్పుడూ వింటూ ఉంటాము. గుప్తనిధుల కోసం దేవాలయంలో తవ్వకాలు జరపడం చూస్తుంటాము... ఇలాంటి మాటలు మాట్లాడేవారిని, నిధుల కోసం ఎగబడేవారిని యక్షులు శిక్షిస్తారు. కాబట్టి అలాంటి మాటలు మాట్లాడకుండా, పనులు చేయకుండా జాగ్రత్తపడండి. యక్షులకు దైవభక్తి ఉంటుంది. మనం వృక్షాల చుట్టూ ప్రదక్షిణం చేస్తాం. అప్పుడు మనకు తగిన ఫలితం ఇచ్చేది ఎవరు?.... యక్షిణీదేవతయే ఆ చెట్టు మీద ఉండి, మన ప్రదక్షిణకు తగిన ఫలితం ఇస్తుందని తంత్రగ్రంథాల్లో శివపార్వతుల సంవాదంలో కనిపిస్తుంది. అనగా వీరు దివ్యశరీరం కలవారని స్పష్టమవుతోంది.  దేవలోక గాయకులు గంధర్వులు. వీరు కూడా దివ్యశరీరులు. వీరికి దైవభక్తి అధికం, పరమాత్మను ఉద్దేశించి వీరు చేసే గానాలకు గంధర్వవేదం అనే ప్రత్యేక వేదం కలిగి ఉన్నారు. అహోబిలంలో ఛత్రవట నృసింహస్వామి వారి సన్నిధిలో హాహా, హూహూ అనే పేరుగల గంధర్వులు గానం చేశారు. అప్పుడు స్వామి వారి గానానికి మైమరిచి, తాళం వేశారు. అహోబిలంలో ఛత్రవట నృసింహస్వామి వారి మూలవిరాట్టు స్వయంభూః. అక్కడ స్వామి రూపం కూడా తాళం వేస్తున్నట్లుగానే ఉంటుంది. 

అహోబిలం, మాల్యాద్రి, అరుణాచలం, శేషాచలం (తిరుమల), శ్రీశైలం, పశ్చిమ కనుమూల్లో కొన్ని ప్రదేశాలు.... ఇలా అనేక పవిత్ర స్థలాల్లో యక్షులు, సిద్ధులు, గంధర్వులు మొదలైన ఇతరలోక జీవులు ఈనాటికీ తపస్సు చేసుకుంటున్నారు. అలాగే కొందరు ఋషుల జీవిత చరిత్రలను గమనించినప్పుడు, వారు తపస్సు చేసుకోవడం కోసం, దేవకార్యం కోసం భూలోకనికి వచ్చారాని చెప్పబడి ఉంటుంది. ఆ కార్యం పూర్తవ్వగానే తిరిగి దివ్యలోకాలకు వెళ్ళిపోయారని కనిపిస్తుంది. అంటే మనకు కనిపించే ఈ లోకం కాక మరెన్నో లోకాలు ఉన్నాయని ఆప్తుల ద్వారా, గురువుల ద్వారా స్పష్టమవుతోంది.

(వివరణ ఇంకా పూర్తికాలేదు)
To be continued ........

2 comments:

  1. మీ విశ్లేషణ చాలా బాగుంది. తదుపరి భాగం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తూంటాను....

    ReplyDelete
    Replies
    1. ధన్యుడినండి, శివార్పణం....

      Delete