Sunday 29 December 2019

స్వామి శివానంద విరచిత గురుతత్వము - 34 వ భాగము



185. గురువును సేవించుట కొరకే జీవించి ఉండు.
186. తెల్లవారుజామున నాలుగు గంటలకు నిద్ర మేలుకో. గురు రూపం మీద ధ్యానం చేయుటకు ఈ సమయం ఎంతో అనుకూలమైనది.
187. గురువు గారి ఇంట్లో ఉంటున్న సమయంలో శిష్యుడు ఎంతో సంతృప్తితో జీవించాలి. అతడు పూర్తి నిగ్రహాన్ని పాటించాలి.
188. గురువు ముందు శిష్యుడు చాలా మృదువుగా, ప్రియంగా మరియు సత్యమే మాట్లాడాలి. ఎన్నడూ చెడుగాలేదా దురుసుగా మాట్లాడకూడదు.
189. శిష్యుడు గురువుకు వెన్నుపోటు పొడవకూడదు.
190. ఎవరైతే తన గుర్వుకు వెన్నుపోటు పొడుస్తాడో, అతడు రౌరవమనే నరకానికి వెళతాడు.
191. తినడం కోసం బ్రతికే వాడు పాపాత్ముడు కానీ తన గురువును సేవించడం కోసం తినే వాడు నిజమైన శిష్యుడు.
192. గురువు మీద ధ్యానం చేసే వారికి చాలా తక్కువ ఆహారం అవసరమవుతుంది.
193. గురు సేవ చేయకుండా ఆధ్యాత్మిక గ్రంథాలను అధ్యయనం చేయడం కాలాన్ని వృధా చేసుకోవడమే.
194. గురువుగారికి గురుదక్షిణ ఇవ్వకుండా ఆధ్యాత్మిక గ్రంథాలను నేర్చుకోవాలని అనుకోవడం కాలయాపన లేదా కాలాన్ని వృధా చేసుకోవడమే.
195. గురువుగారి సంకల్పాలను లేదా కోరికలను నెరవేర్చకుండా, కేవలం వేదాంత గ్రంథాలు, ఉపనిషత్తులు మరియు బ్రహ్మసూత్రాలు పఠించడం వలన ఎలాంటి మేలు కలగదు లేదా జ్ఞానము రాదు.
196. ఎంతోకాలం సేవ చేసిన తర్వాత శుద్ధమైన మరియు ప్రశాంతమైన మనస్సే గురువు అవుతుంది.
197. నీకు నచ్చిన అన్ని ఆధ్యాత్మిక గ్రంథాలను పఠించు, ప్రపంచమంతా సంచరిస్తూ ఆధ్యాత్మిక ప్రవచనాలు ఇవ్వు, వేల ఏళ్ళు హిమాలయగుహల్లో గడుపు, సంవత్సరాల తరబడి ప్రాణాయామం చేయి, జీవితమంతా శీర్షాసనం వెయ్యి, కానీ గురువు యొక్క అనుగ్రహం లేకుండా నీవు ముక్తిని పొందలేవు.
198. బ్రహ్మము ఏది అనేది చెప్పటం లేదా చూపించడం గురువుకు అసాధ్యమైనా, లేదా తనకు ఇంతకు ముందు ప్రత్యక్ష జ్ఞానము లేకపోవడం వలన శిష్యుడు అర్థం చేసుకొనుట కష్టమైనప్పటికీ, గురువు యొక్క అనుగ్రహం చాలా నిగూఢమైన పద్ధతిలో పనిచేసి శిష్యుడు ప్రత్యక్షంగా/అపరోక్షంగా పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకొనుటకు సహాయపడుతుంది.
199. తల్లి, తండ్రి మరియు ఇతర పెద్దలును నీ గురువుగా భావించు.
200. గురువు అంగీకరిస్తే ఆయనకు పాదసేవ చెయ్యి.
201. ప్రతి వ్యక్తి గురువు యొక్క సహాయముతో, తన సొంత జ్ఞానముతో మరియు వేదాంత వాక్యాల యొక్క నిజమైన ప్రాముఖ్యాన్ని అర్థం చేసుకొనుట ద్వారా తనలోనే ఉన్న ఆత్మను తెలుసుకోవాలి.
202. ఒక వ్యక్తికి గురువు లేదా ఆధ్యాత్మిక మార్గదర్శి ఉన్నప్పటికీ, అతడు తన సొంత ప్రయత్నంతోనే అన్ని రకాల కోరికలు, వాసనలు మరియు అహంకారాన్ని నిర్మూలించుకుని, ఆత్మసాక్షాత్కారం పొందాలి.
203. గురువు దగ్గరకు వెళ్ళాలంటే మీకు సరైన అధికారము/అర్హత ఉండాలి. నీవు వైరాగ్యము, వివేకము, మానసిక ప్రశాంతత, ఆత్మనిగ్రహం మరియు యమమ్య్ కలిగి ఉండాలి.
204. ఒక వేళ నీవు గనక మంచి గురువులు లేరని అంటే, గురువు కూడా మంచి శిష్యులు లేరనే అంటారు. శిష్యునికి కావలసిన అర్హతలు నీలో కలిగి ఉండు. నీకు సద్గురు లభిస్తాడు.

No comments:

Post a Comment