Monday 23 December 2019

దత్తసందేశం



ఇప్పుడు సమాజంలో లోపిస్తున్నది ఇంద్రియ నిగ్రహం. ఇంద్రియ నిగ్రహం లేకపోవడం వల్లన సమాజంలో నేరాల సంఖ్య పెరుగుతోంది. ఇంద్రియ నిగ్రహం గురుంచి శ్రీ దత్తాత్రేయ స్వామి వారు మనకు సోదాహరణంగా చెప్పారు.

జింకకు సంగీతం అంటే ఇష్టం. అందువల్ల జింకను వేటాడాలనుకునే వేటగాడు చక్కగా వేణువు ఊదుతాడు. ఆ సంగీతాన్ని ఇష్టపడిన జింక, వలలో చిక్కి వెటగాడి చేతిలో మృతి చెందుతుంది. అలాగే మనిషికి తన శ్రోత్రేయింద్రం అనగా చెవి (వినే విషయాలు) మీద నిగ్రహం లేనప్పుడు, అతడు కూడా పతనం అవుతాడు. అది నేను జింక నుంచి నేర్చుకున్నాను. అందుకే నాకున్న 24 మంది గురువులలో జింక ఒకటి అన్నారు శ్రీ గురుదత్తుడు. 

మనం కూడా సమాజంలో రకరకాల మాటలు వినడానికి ఇష్టపడతాము. అందులో కొన్ని అవసరమైనవి, కొన్ని అనవసరమైనవి. మంచి విషయాలను వినడానికి పెద్దగా ఇష్టపడము గానీ, ఇతరుల వ్యక్తిగత విషయాల, ఊహాగానలు, చెడు మాటలు, ఆశ్లీల సంభాషణలు వినాలనే ఆసక్తి ఉంటుంది. చెవి మీద మనకు నిగ్రహం ఉండదు. అలా నిగ్రహం లేకపోతే, వ్యక్తి కూడా అన్ని రకాలుగా పతనం అవుతాడు.  

దత్తుడు ఇలా చెబుతున్నారు - పతంగం (మిణుగురుపురుగు) నా గురువు. అది అగ్ని యొక్క అందానికి ఆకర్షితులై, అందులో దూకి బూడిద అవుతుంది. అలాగే మనిషి మూర్ఖుడై, తన కళ్ళు (చూపు) మీద నిగ్రహం లేని కారణంగా కళ్ళకు కనిపించే తాత్కాలిక సుఖాలే నిత్యమని భావించి, వాటిలో చిక్కుకుని పతనం అవుతాడు. సంసారసాగరంలో కొట్టుకుపోతాడు. అందువల్ల ప్రతి వ్యక్తీ తన దృష్టి మీద నిగ్రహం కలిగి ఉండాలని నేర్పిన పతంగం నాకు గురువు.


మనం కూడా అంతే. పతంగం వలె అనవసరమైన వాటిని చూడలని ఆశ పడతాము. ధర్మం కాదని తెలిసినా, చూపులను నిగ్రహించుకోము. అందరిలో దైవాన్ని చూడాలని తెలిసినా, స్త్రీలో అమ్మతతానికి బదులు ఆడతనాన్ని చూస్తారు. అంతేనా, ఏవి చూడకూడదో, ఏవి మనకు అనవసరమో, అవే చూస్తాము. మనల్ని సన్మార్గంలో పెట్టేవి మన కళ్ళకు ఇంపుగా కనిపించవు, అనిపించవు. అదే దత్తుడు చెబుతున్నారు.

చేపలను పట్టాలనుకునే జాలరి ఒక కర్రకు తాడు కట్టి, దాని క్రింద U ఆకారంలో ఉండే ఇనుప కొక్కాని కట్టి, అది కనిపించకుండా, దానికి వానపామును చుట్టి నీటిలోనికి వదులుతాడు. అక్కడుండే చేపలు తమ ఆహరమైన వానపామును చూసి, తన జిహ్వచాపల్యాన్ని నిరోధించలేక, దానిని తినే ప్రయత్నం చేస్తుంది. వెంటనే ఆ ఇనుప కొక్కెం దాని నోట్లోకి చొచ్చుకునిపోయి, అది ఎటూ కదల్లేక కొట్టుకుంటుంది. అది గమనించిన జాలరి, దాన్ని నీటి నుంచి పైకి లాగి, తన పడవలో వేసుకుంటాడు. జిహ్వచాపల్యం కారణంగా, తన నోటి మీద నిగ్రహం లేని కారణంగా చేప తన ప్రాణాన్ని కోల్పోయింది. అందువలన రసేయంద్రియము (అనగా నాలుక) మీద నిగ్రహం కలిగి ఉండాలని నేను చేప ద్వారా నేర్చుకున్నాను. అందుకే చేప నా గురువు అన్నారు శ్రీ దత్తాత్రేయులవారు.


మనకు కూడా మన నోటి మీద అదుపు లేదు. కేవలం ఆహారం విషయంలోనే కాదు, మాట్లాడే విషయంలో కూడా. నోటి ఎంత వస్తే అంత మాట్లాడుతాము. ఎలా పడితే అలా మాట్లాడుతాము. ఏది పడితే అది, ఎలా పడితే అలా తింటాము. కొందరు మద్యం సేవిస్తారు, పైగా మద్యపానం పంచమహాపాతకాల్లో ఒకటి. అదేమిటంటే రుచి కోసం అంటారు. దత్తుడు అదే చెబుతున్నారు. మనకు మన జిహ్వ మీద అదుపు ఉండాలి. తినకూడనివి తినరాదు, మాట్లాడకూడనివి మాట్లాడరాదు, త్రాగకూడనివి త్రాగరాదు. లేదంటే చేప వలె మానవుడు కూడా పతనం అవుతాడు.

శ్రీ దత్తాత్రేయ స్వామి వారు ఇలా చెబుతున్నారు - మగ ఏనుగుకు ఆడ ఏనుగును స్పృశించడం, దాని శరీరానికి తన శరీరాన్ని తాకించి, రాపిడి చేయడం ఎంతో ఇష్టం. అది మగ ఏనుగుకు ఉన్న బలహీనత. అది మావటివానికి తెలుసు. అందుకే మావటి వాడు ఏనుగులు సంచరించే ప్రదేశంలో ఒక గొయ్యి త్రవ్వి, దాని మీద వల వేసిం గొయ్యి కనిపించకుండా, గడ్డి, ఆకులతో కప్పేస్తాడు. దాని మీద గడ్డితో ఆడ ఏనుగు బొమ్మను తయారు చేసి నిలబెడతాడు. అటుగా వచ్చిన మగ ఏనుగు, ఆడ ఏనుగును చూసి, కామోద్రేకానికి గురై, దాన్ని సమీపించగానే ఆ గొయ్యిలో పడిపోతుంది. మావాటి వానికి చిక్కుతుంది. ఏనుగంటే భారీ శరీరము, దానికి కోపం, మదము కూడా అలాగే ఉంటాయి. అందుకే మావాటి వాడు, దాన్ని బంధించి, సరిగ్గా ఆహారం అందించకుండా, అప్పుడప్పుడు అందిస్తాడు. అది మాట వినని పక్షంలో, దాన్ని అనేకమార్లు శూలంవంటి పదునైన వస్తువుతో పొడుస్తాడు. పాపం ఆ ఏనుగు ఆ బాధను భరించలేదు. వాడు అదే పని పదే పదే చేస్తాడు. చివరకు ఏనుగు వాడు చెప్పినట్లు వినడం మొదలుపెడుతుంది. మావటి వాడు ఏనుగు ముందు చిన్న కర్ర పెట్టినా, భయానికి మౌనంగా నిల్చుంటుంది. అతడు చెప్పినట్లు ఆడుతుంది. ఏనుగు అనేది అత్యంత భారీజీవి, చాలా శక్తివంతమైనది కూడా. దానిని చూసి పెద్దపులులు, సింహాలు సైతం భయపడతాయి. కానీ కేవలం తన స్పర్శేంద్రియం మీద నిగ్రహం లేని కారణంగా బలహీనుడైన మావటి వానికి ఊడిగం చేసే స్థాయికి వెళ్ళింది. బక్కపలచని మావటికి భయపడుతుంది. మానవుడు కూడా తన స్పర్శేంద్రియం (చర్మం) మీద నిగ్రహం లేనప్పుడు, ఏనుగు వలె పతనం అవుతాడు. ఇది నేను ఏనుగు నుంచి నేర్చుకున్నాను. అందుకే ఏనుగు నాకు గురువు.


ఈ విషయం పెద్దగా విడమర్చి చెప్పనక్కర్లేదు. మానవులు కామోద్రేకులు ఇతరుల స్పర్శ కోరి, ధర్మబద్ధం కాని సంబంధాల్లోకి వెళతారు, లేదా అటువంటివి కలిగి ఉండాలని భావిస్తారు. అంత పెద్ద జీవి అయిన ఏనుగు మావటి వానికి ఊడిగం చేసిన విధంగా, తమ జీవితంలో పతనం అవుతారు. కనుక ఏనుగు మనకు నిగ్రహం కలిగి ఉండటం నేర్పిస్తోందని దత్తడు సెలవిస్తున్నారు.

దత్తుడు మనకేమీ చెబుతున్నాడు? నోటి మీద అదుపు లేకపోవడం వలన చేప, స్పర్శ మీద నిగ్రహం లేక ఏనుగు, వినికిడి మీద నిగ్రహం లేక జింక, కంటి మీద నిగ్రహం లేక మిడత పతనం అయ్యాయి. వాటికి కేవలం ఒక్క ఇంద్రియం మీద నిగ్రహం లేకపోవడం వల్లనే అవి నాశనమైతే, మనిషికి తన పంచేంద్రియాల మీద నిగ్రహం లేదు. అతడి పతనం ఎలా ఉంటుందో ఆలోచించండి. మనకు మన కళ్ళ మీద నిగ్రహం లేదు, ఏవి చూడకూడదో అవే చూస్తున్నాము. మన చెవుల మీద మనకు నిగ్రహం లేదు, ఏది వినకూడదో అదే వింటున్నాము. మనకు నోటి మీద నిగ్రహం అసలే లేదు. అనవసరమైనవంతా మాట్లాడుతున్నాము. అలాగే మనం పీల్చే వాసనలు మనలో ఉద్రేకాన్ని కలిగించేవిగా, తమో గుణాన్ని పెంచేవిగనే ఉంటున్నాయి. స్పర్శ విషయంలో కూడా అంతే.


మనం స్వీకరించిన ఆహారంలో 6 వ వంతు మనస్సుగా మారుతుందని ఛాందగ్యోపనిషత్తు చెబుతోంది. ఇంతకీ ఆహరం అంటే ఏంటి? కేవలం నోటి ద్వారా మాత్రమే తీసుకునేది కాదు, కళ్ళ ద్వారా చూసేది, చెవుల ద్వారా వినేది, ముక్కు ద్వారా వాసన పీల్చేది, స్పృశించేది కూడా మనస్సుగా మారుతోంది. అవన్నీ ఆహారమే. మనకు ఇంద్రియ నిగ్రహం లేనప్పుడు, నిషిద్ధమైన ఆహారాన్ని స్వీకరిస్తున్నప్పుడు, మంచి ఆలోచనలు రమ్మంటే ఎక్కడి నుంచి వస్తాయి. మంచి పనులు చేయమంటే ఎలా చేస్తాము. మన శరీరమంతా అశుద్ధమైన, ధర్మబద్ధం కాని, అనైతికమైన ఆహారంతో ఏర్పడుతోంది, దానితోనే నిండుతోంది. అందుకే సమాజంలో మనుషులు పెడద్రోవ పడుతున్నారు.

పిల్లలకు మనం కుళ్ళిపోయిన ఆహారం పెడతామా? పోనీ మనం తింటామా? కుళ్ళిపోయిన, విషాహారం తింటే మన వ్యవస్థ కూడా చెడిపోయి, ఆనారోగ్యం వస్తుంది. వాంతులు, విరోచనాలు అవుతాయి. మరి మనం మన ఇంద్రియాలకు పెట్టే ఆహారం కూడా అలాంటిదే. ఇంద్రియాలు బయట ఉంటాయి, మనస్సు లోపల ఉంటుంది. ఇంద్రియాల ద్వారా మనస్సు ప్రపంచాన్ని చూస్తోంది. మనం బయట జరిగే కుళ్ళును, చెడును ఇంద్రియాల ద్వారా మనస్సుకు అందిస్తున్నాము. అందుకే మనస్సు చెడిపోయి, బయటకు అదే చెడును పంపిస్తోంది. ఆ కారణంగానే మానవుడు నేరాలు చేస్తున్నాడు.

మనిషి విన్నదానికంటే చూడటం ద్వారానే గ్రహిస్తాడు, విన్నది గుర్తుండకపోయినా, చూసినది మాత్రమే మనస్సులు చెరగని ముద్ర వేస్తుందని ఆధునిక పరిశోధనలు చెబుతున్నాయి. మరి మనం రోజూ ఏమి చేస్తున్నాం? మన మీడియా ఏమి చూపెడుతోంది. ఒక నేరం ఎలా జరిగింది అనేది మనకు అవసరమా? కానీ క్రైం వాచ్, హత్యలు-నేరాలు మొదలైన ఎన్నో కార్యక్రమాల పేరుతో మనకు టి.వి.చానెల్స్ లో కనిపించేవి నేరాలు, ఘోరాలే. అసలు నేరం ఎలా చేస్తే మనకెందుకు? వాడు తప్పించుకోవడానికి ఏమి చేసాడో మనకెందుకు? కానీ మీడియా చేసే పని ఏంటంటే, వాడు చేసిన నేరాన్ని మళ్ళీ పాత్రలతో చూపించి, వాడు ఏమి చేయడం వలన 'క్లూ' దొరికిందో కూడా చెబుతుంది. అంటే పట్టుబడకుండా నేరాలు ఎలా చేయాలో చెబుతుంది. తాను చూసే విషయాల్లో ఇదంతా అనవరమైన చెత్త. అదే మనస్సులోకి వెళుతోంది.

ఇక మీరు చూసే సినిమాలు/ ధారవాహికల సంగేతి సరేసరి. అందులో సగటున వారానికి ఒక అత్యాచార సంఘటన చూపిస్తారు. మీ మరియు మీ పిల్లల మనస్సులోకి అత్యాచారం అనేది ప్రతివారం పంపుతుంది సీరియల్. అదేగాక మద్యపానం, ధూమపానం, స్త్రీలను హింసించడం, ఏడిపించడం అనేవి ప్రతి సీరియల్లోనూ, సినిమా లోనూ కనిపిస్తాయి. మీరు పురాణాలు చూస్తే, అందులో కథానాయకుడు (హీరో) మరియు ప్రతినాయకుడు (విలన్) మధ్య తేడా స్పష్టంగా ఉంటుంది. రామాయణం తీసుకోండి. రాముడు స్త్రీలను కామంతో చూడడు, మద్యం సేవించడు, ధూమపానం చేయడు, ధర్మానికి కట్టుబడతాడు. రావణుడు దీనికి పూర్తిగా విరుద్ధం. కనిపించిన ప్రతి స్త్రీని ఎత్తుకువచ్చి అత్యాచారం చేసాడు, మద్యపానం, ధూమపానం, పరులను హింసించడం, ఋషులను ఏడిపించడం అతని లక్షణాలు.

కానీ ఇప్పటి సినిమాల సంగతి చూడండి. కథానాయకుడు మరియు ప్రతినాయకునికి మధ్య బేధం లేదు. ఇద్దరు అమ్మాయిలను ఏడిపిస్తారు, మద్యం సేవిస్తారు, ధూమపానం చేస్తారు, 'రూల్స్' అతిక్రమిస్తారు. వాళ్ళిద్దరికీ తేడా ఏముంది? ఏమీ లేదు. కథ చివరలో కథానాయకుడి చేతిలో ప్రతినాయకుడు ఓడిపోతాడు. మీ పిల్లలు సినిమాలో ఎవరిని ఆదర్శంగా తీసుకుంటున్నారు. అయినా ఎవరిని తీసుకుంటే ఏమిటి? ఇద్దరు అంతే. అందుకే పిల్లలు నేరస్థులుగా మారుతున్నారు.

మనం చూసే సినిమాల్లో డైలాగులు పిల్లలను తప్పుద్రోవ పట్టించేవిగా ఉంటాయి. కొన్ని ఉదాహరణలు - అమ్మాయిలు బుద్ధిమంతులను ఇష్టపడరు, నీలాంటి కోతులనే ఇష్టపడతారు అని అంటుంది ఈ చిత్రంలో కథానాయిక. ఇలాంటి డైలాగులు మీ పిల్లలకు వినిపించి వాళ్ళు బుద్ధిగా ఉండాలని మీరు కోరుకుంటారు. ఎంత విచిత్రం?! దాదాపు ప్రతి చిత్రంలోనూ కథానయికను (హీరోయిన్) కథానాయకుడు (హీరో) ఏడిపిస్తాడు. అక్కడే వాళ్ళకు ప్రేమకు పునాది పడుతుంది. అది చూసే పిల్లలకు, యువత అమ్మాయిలను ఏడిపించకుండా ఉండాలని మీరు ఎలా భావిస్తారు? ఆడపిల్లను ఏడిపిస్తేనే ప్రేమ పుడుతుందని వాడు చూసిన సినిమా చెబుతోంది. కాదంటారా? ఒక చిత్రంలో ప్రతినాయకుడు (విలన్) కథానాయికను ఏడిపిస్తాడు, కొందరు స్త్రీలపై అత్యాచారం చేస్తాడు. వాడికి మద్దతు తెలుపుతూ ఆ వెనుకనున్న ఒక వ్యక్తి "వాడు మగాడు. వాడు ఏమైనా చేస్తాడు" అంటాడు. అంటే మగవాళ్ళు స్త్రీలను ఏమైనా చేయచ్చనే సందేశమే పిల్లలకు వెళుతుంది. ఇలాంటి డైలాగులు విన్న పిల్లలు సచ్ఛీలురై ఉండాలని మీరు ఎలా కోరుకుంటారు.

ఏవండీ ఇదంత నిజమేనా? పిల్లలు మంచినే నేర్చుకుంటారు అని అంటారేమో... తల్లి టి.వి.రిమోట్ ఇవ్వలేదని 15 ఏళ్ళ పిల్ల ఆత్మహత్య చేసుకుంది. తల్లిదండ్రులు ఫోన్ చూడవద్దు అన్నారని 12 ఏళ్ళ బాలుడు, టి.వి.చానెల్ మార్చలేదని ఒక చిన్న పిల్ల ఆత్మహత్య చేసుకున్నారు. అసలా ఆ వయస్సులో పిల్లకు ఆత్మహత్య అంటే ఏంటో తెలుసా? ఎలా చేసుకోవాలో తెలుసా? ఎవరు నేర్పించారు? మీరు చూపెట్టిన సినిమాలే. ఆ సినిమాల్లో, ధారవాహికల్లో ప్రతి వారం ఒక ఆత్మహత్య దృశ్యం ఉంటుంది, ఇంక వార్తల్లో చెప్పనక్కర్లేదు. అది తప్పో, ఒప్పో పిల్లలకు తెలియదు. వారికి అంత విచక్షణ ఉండదు. తాము కోరింది దక్కనప్పుడు తెర మీద పాత్రలు ఆత్మహత్యకు పాల్పడటం చూసి, వాళ్ళు ఉరేసుకుంటున్నారు.

నిజం చెప్పాలంటే చెవి ద్వారా విన్నప్పుడు మనస్సు ఆలోచిస్తుందేమో గానీ, కళ్ళ ద్వారా చూసినప్పుడు ఆలోచించదు. అక్కడ విచక్షణ పని చేయదు. చూసింది చూసినట్లు మనస్సులో ముద్ర పడిపోతుంది.

అలా కాక పిల్లలకు మీడియా ద్వారా మంచిని చూపించవచ్చు. సమాజం చెడిపోలేదు. సమాజంలో ఇంకా చాలా మంచి ఉంది. అందుకే మనం బ్రతకగలుగుతున్నాము. అత్యాచారాలు, హత్యలు, ఆత్మహత్యల గురించి చూపెట్టేకంటే, అందరికీ సాయం చేస్తున్నవారి గురించి, సమాజసేవ చేసినవారి గురించి చెప్పచ్చు. అలాంటివి టి.వి.ల్లో ప్రసారం చేయవచ్చు. ఈ సమాజంలో మంచి ఇంకా చచ్చిపోలేదని, మంచిపనులు అనేకం చేయవచ్చని చెప్పొచ్చు. వారు వాటిని ఆదర్శంగా తీసుకుంటారు. చెడు ఎంటో తెలిస్తే చాలు, దాన్ని చూడక్కర్లేదు. కానీ మంచి మాత్రం చూడాలి. అప్పుడే మంచిపనులు చేయగలరు.

మంచి విషయాలను ఎంత మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు చెబుతున్నారు? రాత్రి పడుకునే ముందు విన్నది బాగా గుర్తుంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఒకప్పుడు అమ్మమ్మలు, బామ్మలు, అమ్మలు పిల్లలకు నీతిని పెంచే కథలు చెప్పేవారు. రామాయణ, మహాభారతాలు చెప్పేవారు. అందుకే అప్పటి పిల్లలు గొప్పవాళ్ళయ్యారు. ఇప్పుడు మనమా పని ఎందుకు చేయము? ఆ ముష్టి టి.వి.ని, సెల్‌ఫోన్‌ను, యూట్యూబ్‌ను పిల్లలకు/ యువతకు ఎందుకు దూరం పెట్టము? పిల్లలకు వారి ఇంద్రియాల ద్వారా మంచి మంచి విషయాలను పంపించాలి. అది మెదడుకు ఆహారం అవుతాయి. అప్పుడు పిల్లలు సమాజంలో మంచిని పంచుతారు.

టి.వి.లు, యూట్యూబ్ మొదలైన వాటిల్లో వచ్చే చెత్తకు, చెడుకు మీరు, మీ పిల్లలు దూరంగా ఉండటం ఇంద్రియ నిగ్రహం. అదే నేటి సమాజానికి దత్తుని సందేశం.

ఇప్పుడు ఇది చెప్పుకున్నాము కనుక అసలు ఉపవాసం అంటే ఏంటో కూడా తెలుసుకుందాము.

కొందరు పదే పదే ఆహారం మానేసి, ఆ దేవుడికి ఉపవాసం ఉన్నాము, ఈ దేవుడికి ఉపవాశం ఉన్నాము అంటారు. వారి భావనలో ఉపవాసం అంటే నోటి ద్వారా తీసుకునే ఆహారం తగ్గించడం. ఉప అంటే దగ్గరగా, వాసం అంటే ఉండటం. భగవంతునికి దగ్గరగా ఉండటం ఉపవాసం. ఇందులో కేవలం నోటి ద్వారా తీసుకునే ఆహారం మానేస్తే సరిపోదు. ఇంద్రియాల ద్వారా మనస్సు బాహ్య విషయాలను స్వీకరిస్తోంది. ప్రాపంచిక విషయాలు ఇంద్రియాలకు, మనస్సుకు ఆహారం. కనుక మనం ప్రయత్నపూర్వకంగా ఇంద్రియాలను ఆ రోజు నిగ్రహించాలి. అంటే రెచ్చగొట్టే విషయాలను చూడకూడదు, వినకూడదు, అనవరమైనవి మాట్లాడకూడదు, సాధ్యమైనంత మౌనంగా ఉండాలి. మనస్సును రెచ్చగొట్టే వాసనలు పీల్చకూడదు. పొద్దున వార్తపత్రిక తెరవగానే కనిపించేవి నేరాలు, ఘోరాలే. కనీసం ఆ రోజైనా అలాంటి వాటికి దూరంగా ఉండాలి. సినిమాలు, సీరియళ్ళు చూడకూడదు. పెడార్ధాలు వచ్చే పాటలు వినకూడదు. సాధయమైనంతవరకు భగవత్ సంబంధమైన విషయాలను ఇంద్రియాల ద్వారా స్వీకరించాలి. భగవంతుని భజన చేయాలి, నామసంకీర్తనం చేయాలి, జపం చేయాలి. భగవత్ కథలు చదవాలి. భక్తిని పెంచే కీర్తనలు వినాలి. భగవంతునికి సంబంధించిన విషయాలను మాట్లాడాలి. అలా భగవంతునికి మానసికంగా, ఇంద్రియాల ద్వారా దగ్గరకు జరగాలి. అది నిజమైన ఉపవాసము.

ఉపవాసం ఇంద్రియ నిగ్రహాన్ని పెంచి, సాధనకు తోడ్పడుతుంది కదా అని ఒక భక్తుడు భగవాన్ రమణ మహర్షిని అడుగుతారు. దానికి సమాధానంగా భగవాన్ - కేవలం ఆహారం మానేయడం సబబు కాదని, ఆధ్యాత్మిక తృష్ణ ఆ రోజంతా మనస్సులో మెదులుతూ ఉండాలని చెప్పారు. పైగా ఉపవాసం ఉన్న రోజు మీరు చూసేవి, చేసేవి మనస్సుపై బలమైన ముద్ర వేసి, ఆ తర్వాత సంస్కారాలుగా ఏర్పడతాయని అంటారు.

మరి ఈనాడు మనం చేసేది ఏంటి? ఉపవాసం ఉండి చక్కగా ఒక సినిమా చూస్తాము, సిరియల్ చూస్తాము. అనవసరమైనవన్నీ చూస్తాము. ఏదైతే చెడు ఉందో, అదంతా మనస్సుకు మేతగా ఆ రోజే వేస్తున్నాము. ఇంక మనస్సు ఎలా అదుపులో ఉంటుంది? అసలు మనం చేసేది ఉపవాసమేనా?

మరి మనం ఇప్పుడు ఏమీ చేయాలి? మనస్సుకు ఇప్పటివరకు ఇంద్రియాల ద్వారా తామోగుణ ప్రధానమైన ఆహారాన్నే పంపాము. ఆహారశుద్ధ్వే సత్త్వశుద్ధిః అని ఉపనిషత్తు అంటుంది. శుచిగా వండిన మంచి ఆహారం తీసుకోవడం వలన మనశ్శుద్ధి ఏర్పడుతుంది. ముందుగా నోటి ద్వారా స్వీకరించే ఆహారంలో మనం మార్పులు చేసుకోవాలి. అత్యధికంగా సాత్త్వికహారం తీసుకుంటే మనలో సత్త్వగుణం పెంపొందుతుంది. కానీ మనం సాత్త్వీకాహారం ఎందుకు ఇష్టపడతాము. మనకు బిర్యానీలు కావాలి, బాగా మసాల దట్టించిన ఆహారం కావాలి. రజోగుణాన్ని పక్కన పెడితే, అవి తమోగుణ ప్రధానమైన ఆహారం. అవి మనస్సులో తమస్సును, బద్ధకాన్ని కలిగిస్తాయి. లౌకిక వాఛలను ప్రేరేపిస్తాయి. వాటికి తోడు పొద్దున లేవగానే త్రాగే టీ, కాఫీలు. టీ, కాఫీల్లో ఉండే కొన్న రకాల రసాయన పదార్ధాలు అవి తీసుకునేవారిలో లైంగిక వాంఛను ప్రేరేపిస్తాయి. మరి మనం పిల్లలకు పసివయస్సు నుంచే పాలకు బదులు, టీ, కాఫీలు అలవాటు చేస్తున్నాము. కొందరికైతే ఉదయం లేవగానే ఈ పానీయాలు త్రాగకపోతే ఇక వేరే ఏ పని చేయలేని స్థాయికి చేరారు. వాటికి బానిసలయ్యారు. ఇవి మనకు తెలియకుండానే లోపలున్న తమస్సును ప్రేరేపిస్తాయి.

యుక్తవయస్సులో ఉన్న పిల్లల మనస్సు ఎలా ఉంటుందో మనకు తెలిసిందే. శరీరంలో జరిగే మార్పులు, మనస్సులో కలిగే ఆలోచనలతో వాళ్ళకు స్పష్టత ఉండదు. అలాంటి పిల్లలకు తల్లిదండ్రులు ఈ పానీయాలను అలావాటు చేస్తే, వీటి రసాయన చర్య వారి మనస్సుపై ప్రభావం చూపి, వారిని ఇంకా రెచ్చగొడుతుంది. పాపం! ఆ పిల్లలకు వారి మనస్సుపై ఇవి ప్రభావితం చేస్తున్నాయన్న సంగతి తెలియదు.

ఇక మద్యం గురించి చెప్పవలసిన పనిలేదు. ఇప్పుడు జరుగుతున్న అనేక నేరాల్లో, నేరం జరిగే సమాయానికి నేరస్థులంతా మద్యం సేవించే ఉంటున్నారు. మద్యం త్రాగితే తమ మీద తమకే నిగ్రహం ఉండదు. మరి అలాంటి మద్యాన్ని ప్రభుత్వాలు ప్రోత్సహిస్తాయి. మీరు చూసే సినిమాలు, హీరోలేమీ తక్కువగాదు. దాదాపు ప్రతి సినిమాలో కథానాయకుడు విద్యార్ధి దశలోనే మద్యం సేవిస్తూ, పార్టీలు చేసుకుంటూ కనిపిస్తాయి. అది చూసిన పిల్లలకు మద్యం త్రాగడం తప్పని ఎలా తెలుస్తుంది? పైగా ఇదంతా 'కామన్', 'ఫ్యాషన్' అంటూ సమాధానమిస్తారు. మనస్సు మరియు శరీరంపై నిగ్రహాన్ని తప్పించే ఆహారపనీయాలు మనం ఎందుకు తీసుకోవాలి?

మరి మిగితా ఇంద్రియాల సంతి ఏమిటి? వాటిని ఎలా నిగ్రహించాలి. మన మనస్సులో తప్పుడు భావన కలిగించే ఏవైనా విషయాలు మనకు తారసపడినా, వినబడినా ముందుగా ఇంద్రియాలను అక్కడి నుంచి దృష్టి మరల్చాలి. ఆ ప్రదేశం నుంచి, వ్యక్తుల నుంచి దూరం జరగాలి. ఈ విషయంలో తాబేలు మనకు ఉదాహరణ అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఏదైనా అనుకోని సంఘటన ఎదురైనప్పుడు ఏ విధంగానైతే తాబేలు తన పెంచులోకి ముడుచుకుని పోతుందో, అలానే సాధకుడు సైతం తన మనస్సును, ఇంద్రియాలను చెడు విషయాల నుంచి మళ్ళించాలి. దానితో పాటు మానసికంగా బలవంతులమవ్వాలి. అది ఎలా సాధ్యమవుతుంది అంటే మనశ్శుద్ధి ద్వారా.

ఇప్పటికే అనేక జన్మలుగా మనస్సుకు బహిర్ముఖమై అనవరమైన విషయాలను స్వీకరించడం నేర్పించాము. మరి మనస్సు మాట వినదే. అప్పుడే మనకు సాయం చేసి భగవత్ ప్రార్ధన, పూజ, జపము. గురువు ఉంటే ఆయన ఉపదేశం చేసిన మంత్రం నిత్యం జపించాలి. ఒకవేళ గురువు లేకుంటే, శ్రీ రామ, శ్రీ రామ అంటూ శ్రీ రామ నామం; లేదా శివ, శివ అంటూ శివ నామం; అలా మన ఇష్టదైవం యొక్క నామాన్ని నిత్యం స్మరిస్తూ ఉండాలి. ముందుగా ఒక సమయం పెట్టుకుని, ఉదయమో, సాయంకాలమో స్నానం చేయగానే, శుచిగా దేవుడి ముందు కూర్చుని జపం చేయాలి. ముందే ఒక సంఖ్యను గానీ, లేదా సమయాన్ని గానీ నిర్ణయం చేసుకుని క్రమం తప్పకుండా అది చేయాలి. రామ నామం లేదా గోవింద నామం లేదా శివ నామం 15 నిమిషాలు చేస్తే జప సంఖ్య 2,000 దాటుతుంది. రోజులో ఒక్క 15 నిమిషాలు కేటాయించలేమా?

రోజూ ఒక సమయం పెట్టుకుని ఆ సమయానికి పూజో, జపమో చేస్తుంటే, మనస్సు ఆ సమయానికి అక్కడ వచ్చి నిల్చుంటుంది. మొదట్లో నిరాకరించినా, క్రమంగా మనస్సు సహకరిస్తుంది. పైగా జపం అనేది మనస్సును శుద్ధి చేస్తుంది. ఆ విషయం మనకు వెంటనే తెలియకపోవచ్చు కానీ క్రమం తప్పకుండా చేస్తుంటే ఒక 6-7 నెలలకు అనుభూతిలో తెలుస్తుంది. అది కొనసాగించినప్పుడు, బయట పరిస్థితులు ఎంత అల్లకల్లోలంగా ఉన్నా లోపల ప్రశాంతత ఉంటుంది. మానసిక బలం పెరుగుతుంది. అప్పుడు పొరపాటున మనమేది చూసినా, మనస్సు చలించదు.

ఈ విషయం మనకు శ్రీ హనుమంతులవారు సుందరకాండలో చూపించారు. సీతాన్వేషణ కోసం లంకకు వెళ్ళిన హనుమంతులవారు అక్కడున్న స్త్రీలందరిలో సీతమ్మను వెతుకుతారు. అది రాత్రి సమయం కావడంతో అందరూ నిద్రించి ఉంటారు. అందరికి వస్త్రాలు ఉండాల్సిన రీతిలో ఉండవు. హనుమంతుడు అందరిని చూసి, తర్వాత అంటారు. వారిని చూసినప్పుడు సీతమ్మను వారిలో వెతికాను కాని వేరే ఆలోచన లేదు. నా మనస్సు చెదరలేదు అని. మనకూ ఆ స్థితి రావాలి. అదే దత్తుడు చెబుతున్నారు.

No comments:

Post a Comment