Monday 23 May 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 79 వ భాగం



ఈ పెద్దలు కూడా ఒక దశలో ఏమిటి ఇదంతా? ఈ మాయేమిటి? అన్నవారే. మనము కూడా స్వార్థ పూరితమైన కర్మలనే తెరను క్రమక్రమంగా తొలగించుకోవాలి. అంతేనే కాని నేనీ సేవ చేస్తున్నానని, చేస్తానని బిగుసుకొని పోయి యుండడం చీకట్లో తచ్చాడడమే.


తనకు జ్ఞానరేఖలు పొడసూపుతూ ఉంటే కోట్ల కొలది కర్మఫలాలు అనుభవించే ప్రాణులకు నేను చేసే సాయం ఏపాటిది? నా సాయం లేకపోతే ఇతరులుద్ధరింపబడేది ఎలా? అనే అహంకారం రానీయకూడదు. ఈశ్వరలీల కొనసాగుతూనే ఉంటుంది. నిమిత్తమాత్రుడవని భావించాలి. ఇట్టి భావాలనూ తొలగించి ధ్యానంలో ఉండి ఆత్మ విచారణ చేయాలి.


పని చేయకపోయినా ప్రపంచానికి మంచి చేసినట్లే


నిష్క్రియంగా ఉన్న జ్ఞానివల్ల, ఏ ఉపయోగం లేదని భావించకండి. అట్టి జ్ఞానుల సన్నిధిలో శాంతి మనకు లభిస్తుంది. శుకుడు, జడభరతుడు, సదాశివ బ్రహ్మేంద్రయోగి వంటి వారి మాటలను విన్నా శాంతి లభించడం లేదా?


అట్టివారిని సమీపిస్తే ప్రాపంచిక సమస్యలూ తీరుతాయి. ఆ సమస్యలను తీరుస్తున్నామని వారనుకోరు. ఇట్టి విషయాన్ని అవగతం చేయడానికే దక్షిణామూర్తి అవతరించాడు. ఇంతవరకూ ఇట్లా ఉన్నా ఇట్టి స్థితియొక్క గొప్పస్థితిని తెలియపర్చడంకోసం అవతరిస్తానని శంకరులుగా అవతరించాడు. నిష్క్రియంగా ఉండండని మనం నిరంతరం మాట్లాడుతున్నాం, ప్రచారం చేస్తున్నాం చూసారా (అని స్వామి నవ్వుకున్నారు).

No comments:

Post a Comment