Saturday 28 May 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 84 వ భాగం



ఇక యజుర్వేదంలో - వేదాలకు త్రయి యని పేరు. బుక్, యజుస్, సామములు. అందు మధ్య యజుర్వేదం. ఆలయం మధ్యలో గర్భగృహం ఉన్నట్లు కర్మకాండలకు అది ప్రాధాన్యం. (బొమ్మ గీయడానికి గోడ ఆధారమైనట్లుగా కర్మకాండలకిది ఆధారమనే ప్రమాణం కూడా ఉంది - అనువక్త)


యజుర్వేదం 7 కాండలతో ఉంటుంది. అందు మధ్యలో రుద్రమంత్రాలుంటాయి. ఆ రుద్రం మధ్యలో శివ పంచాక్షరి మంత్రం. ఆ మంత్రానికి ముందుగా శంభు, శంకర పదాలున్నాయి. పంచాక్షరిలో శివనామం. ఆ పై రెండు పదాలూ ఈ మంత్రాన్ని నడిపిస్తున్నాయి. ఆచార్యుని నుండి పంచాక్షరిని ఉపదేశం పొందాలి. ఆచార్యుడే మన శంకరులు. ముందు శంభువై, తరువాత శంకరుడయ్యాడని చెప్పాను. రుద్రంలో శంభవే... శంకరాయ... పదాల తరువాత పంచాక్షరి ఉంది. శంభువు, శంకరులయ్యాడు. రుద్రానికి, అభినవ శంకరులు వ్యాఖ్యానం వ్రాస్తూ మన శంకరుల ప్రస్తావన అందున్నట్లు వ్రాసేరు. చరాచర వస్తు ప్రపంచం అంతా శివమయమని రుద్రంలోని మంత్రాలుంటాయి. ఇందు మూడు వందల మంత్రాలుండడం వల్ల నామావళిగా, రుద్ర త్రిశతిగా రూపొందింది.


ఇందు రుద్రునకు అసాధారణ నామాలూ ఉన్నాయి. సాధారణ నామాలు బహువచనంలో వాడబడ్డాయి. అసాధారణ నామాలు, ఏకవచనంలో ఉన్నాయి. ఉదాహరణకు కూర్చున్నవారికి, నిలబడినవారికి నమస్కారాలంటూ అసాధారణ నామాలైన కపర్ది, వ్యుప్తకేశ పదాలు వాడబడ్డాయి. కపర్ది యనగా జడలు కలిగినవాడు. వ్యుప్తకేశుడనగా తలగొరుగుకొన్నవాడు, ముండి.


కపర్దమనగా జట. జటలున్న ప్రతివానినీ కపర్దియని అనం. పరమేశ్వరుని జటకే కపర్దమని అంటాం. మిగిలిన దేవతల నెత్తిపై కిరీటాలను ధరిస్తారు. కాని శివుడు యోగియై నెత్తిపై జటలతోనే ఉంటాడు.


No comments:

Post a Comment