Showing posts with label ఉపనిషత్తులు. Show all posts
Showing posts with label ఉపనిషత్తులు. Show all posts

Monday, 19 January 2015

హిందూ ధర్మం - 130 (ఉపనిషత్తులు)


మరణం మనిషికి అంతం కాదు, ఒక సుదీర్ఘమైన ప్రయాణం మధ్యలో వచ్చే తాత్కాలికమైన విరామం మాత్రమే అంటాయి ఉపనిషత్తులు. ఇది కూడా మనకు, పాశ్చాత్య దేశాలకు మధ్యనున్న ఒక తేడా. మరణం అనేది అంతమని, ఇక ఆ తర్వాత అస్తిత్వం ఉండదని భయపడి, దాన్ని మర్చిపోవడం కోసం పాశ్చాత్యదేశాల్లో ప్రజలు, రకరకాల భౌతిక సుఖాల వెంట పరిగెత్తి, మరణాన్ని మర్చిపోవాలని, అది స్మృతిలో లేకుండా ఉండేలా చాలా ప్రయత్నిస్తారు. కానీ ప్రాచ్య (భారతీయ) సంస్కృతిలో మాత్రం ప్రజలు మరణానికి భయపడరు. జీవితంలో ఏది అనుభవించినా, అనుభవించకున్నా, ఏది లభించినా, లభించకున్నా, పుట్టిన ప్రతివాడికి మరణం తధ్యం. అది ఎప్పుడు వస్తుందనేది తెలియదు కానీ, ఏదో ఒక రోజు అందరూ ఎదురుకోవలసిన సత్యం మరణం. దాన్ని తప్పించుకోవడం శరీరానికి అసాధ్యం. అది ఆత్మ ప్రయాణంలో ఎంతో ముఖ్యమైన ఘట్టం కూడా. కొన్ని కోట్ల జన్మల కర్మఫలాలను మోసుకొస్తున్న ఆత్మ, మరణం తర్వాత తన కర్మఫలాల మూటను విప్పి, ఏ కర్మఫలం పక్వానికి వస్తుందో, దాని ఆధారంగా శరీరం ధరిస్తుంది. పాతబట్టలు విప్పేసి, కొత్త బట్టలు కట్టుకోవడం ఎంత సహజమో, అలాగే పాతశరీరాన్ని విడిచి ఆత్మ కొత్త శరీరాన్ని ధరిస్తుంది. వాళ్ళు మరణంతో అస్తిత్వం పోతుందని భావిస్తే, మనం మాత్రం మరణంతో దేహం ఒక్కటే నశిస్తుందని చెప్తాం. మరి ఈ మరణం తర్వాత ఆత్మ ఎక్కడకు వెళుతుంది, ఎలా వెళుతుంది. అసలు మరణం అంటే ఏమిటి? ఇటువంటి అనేక విషయాలను ప్రపంచానికి చెప్పిన తత్వశాస్త్ర నిధులే ఉపనిషత్తులు.

అట్లాగే ఉపనిషత్తులు ఈ సృష్టి పట్ల, జీవరాశిపట్ల చూపించే ధృక్పధం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ మధ్య కొన్ని మతాల వాళ్ళు సృష్టిని కాదు, సృష్టి కర్తను పూజించాలి. మీ హిందువులు సృష్టిని పూజిస్తారు కనుక నరకానికి పోతారంటూ పోస్టర్లు అంటిస్తున్నారు. దీనికి ఉపనిషత్తులు అద్భుతమైన సమాధానం ఇస్తాయి. ఉపనిషత్తు ఉపదేశాల ప్రకారం ఈ ప్రపంచం సృష్టి కాదు, ఒక అభివ్యక్తీకరణ మాత్రమే (As per upanishads, This Universe is manifestation, not creation). అనగా సృష్టి వేరు, సృష్టికర్త వేరు కాదు, భగవంతుడే ఈ సృష్టి రూపంలో వ్యక్తమవుతున్నాడు.' ఈశావాస్య ఇదం సర్వం' - ఈ సృష్టి అంతా ఈశ్వరుడే వ్యాపించి ఉన్నాడు అంటుంది ఈశావాస్య ఉపనిషద్. బ్రహ్మానుభూతిని పొందిన యోగి రాయిలో, రప్పలో, బ్రాహ్మణునిలో, ఏనుగులో, కుక్కలో, కుక్కను తినేవానిలో, మట్టిలో,.......... ఒక్కటేమిటి, అన్నిటిలో భగవంతుడినే చూస్తాడు. కాదు భగవంతుడే కనిపిస్తాడు. ఈ ధృక్పధమే హిందూ వ్యవసాయవిధానానికి, హిందూ ఆర్ధికవ్యవస్థకు కొన్ని వేల సంవత్సరాల క్రితమే బీజం వేసింది. అటువంటి దృష్టి లోపించినవాడికి రాయి రాయిగానే కనిపిస్తుంది, సృష్టి...సృష్టిగానే కనిపిస్తుంది. వాడు భగవత్ తత్వాన్ని అర్దం చేసుకోలేదని గుర్తు. అటువంటి వారితో వాదించడం కూడా దండగే. వారికి సృష్టి కేవలం సృష్టి మాత్రమే. అంతటా దివ్యత్వాన్ని చూపే ఈ ఉపనిషద్ ధృక్పదం కూడా మనకు, అన్యమాతలకు మధ్య భేధాన్ని నిరూపిస్తుంది.

To be continued ..............

Sunday, 18 January 2015

హిందూ ధర్మం - 129 (ఉపనిషత్తులు)



ఉపనిషత్తులలో చాలా అద్భుతమైన విషయాలు చెప్పబడ్డాయి. (అందులో కొన్ని విషయాలు ఒక చిన్న సంభాషణ రూపంలో చెప్పుకుందాం.)

శిష్యుడు - గురువుగారు! అయితే నా శరీరంలో కూడా ఆత్మ ఉందంటారా?
గురువు - నీ శరీరంలో ఆత్మ ఉండడం కాదు నాయన, నువ్వే ఆత్మవు, నువ్వు శరీరాన్ని ధరించావు.
శిష్యుడు - అన్ని జీవులలోనూ ఆత్మ ఉంటుందా గురువుగారు?
గురువు - అన్ని జీవులయందూ ఆత్మ ఉంటుంది. ఆకాశం కింద నీరు నింపిన అనేక కుండలు పెట్టినప్పుడు, అన్నిటిలోనూ ఆకాశం యొక్క ప్రతిబింబం వేర్వేరుగా కనిపిస్తుంది. ప్రతి కుండలో ఒక ప్రతిబింబం కనిపిస్తున్నందున, అనేక ఆకాశాలు ఉండవు కదా. అట్లాగే ఒకే ఆత్మ ఇన్ని జీవులయందూ వేర్వేరుగా వ్యక్తమవుతున్నప్పటికి, దాని తత్వం ఒక్కటే. ఆత్మ భగవత్ స్వరూపం.
శిష్యుడు - అయితే ఉన్నదంతా ఒకటే తత్వమంటారా?
గురువు - బ్రహ్మానుభూతిని పొందిన యోగులు తమ యందే సర్వలోకాలను, జీవాలను దర్శిస్తారు. వారు తమ నుంచి దేన్ని వేరుగా చూడలేరు. అందుకే తత్వం ఒక్కటే. అదే బ్రహ్మము, సత్యము కూడా.
శిష్యుడు - మరి ఈ ఆత్మను తెలుసుకోవడం ఎలా గురువుగారు?
గురువు - అహింస, సత్యం, అస్తేయం, బ్రహ్మచర్య మొదలైన ధర్మాలు పాటిస్తూ, స్వధర్మాన్ని శ్రద్ధతో ఆచరిస్తూ, నిత్యనైమిత్తిక కర్మలను నిష్కామంగా ఆచరించడం వలన చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి పాత్రతను ఇస్తుంది. అప్పుడే జ్ఞ్ఞానం అబ్బుతుంది. జ్ఞానం ద్వారా మాత్రమే ఆత్మను తెలుసుకోగలం.

......................సర్వజీవులయందూ ఒకే ఆత్మ ఉంది అన్న సత్యాన్ని విస్మరించి, ఇతర జీవరాశిని హింసించేవారు తమను తాము హింసించుకుంటున్నవారి కింద లెక్క. వారు ఆత్మహింసకు, ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టే. తనకు మాత్రమే తెలివి ఉందని భావించి, మేధావిగా భావిస్తూ, ఇతరులను మోసం చేస్తాడో, అన్యులకు ద్రోహం తలపెడతాడో, వాడు తన ఆత్మనే మోసగించుకుంటూ ఆత్మద్రోహానికి పాల్పడుతున్న తెలివితక్కువ దద్దమ్మ. అబద్ధాలు ఆడి లోకాన్ని మోసగించువచ్చు అనుకుంటాడు కానీ, ఆత్మను మోసగించలేడు. అలా అబద్దాలు ఆడేవాడు కూడా ఆత్మద్రోహం చేసుకుంటున్నవారే.శరీరం నశ్వరమని తెలిసి, రాకరాక వచ్చిన మానవజన్మలో ఆత్మజ్ఞానం పొంది, జన్మను సార్ధకం చేసుకోకుండా, భౌతిక సుఖాల కోసం వెంపర్లాడేవాడు, ఆత్మ గురించి తెలుసుకోకుండా ఉండేవాడు, ఎప్పుడు మరణం వస్తుందో తెలియనప్పటికి, ఇప్పుడు కాదు, ఇప్పుడు కాదు అంటూ ఆత్మజ్ఞానం పట్ల శ్రద్ధ చూపకుండా అలసత్వం వహించి, జీవితాన్ని వృధా చేసుకునేవారు, నిజానికి ఆత్మ యొక్క హత్యకు పాల్పడుతున్న వారె.

To be continued ................

Tuesday, 6 January 2015

హిందూ ధర్మం - 128 (ఉపనిషత్తులు)

ఉపనిషత్తులు ప్రధానంగా ఆత్మ గురించి, మరణం గురించి, సృష్టి పట్ల. సర్వజీవుల పట్ల మనిషికి ఉండాల్సిన ధృక్పధం గురించి వివరిస్తాయి. భగవంతుడు శాశ్వతమైనవాడు, ఎప్పటికి ఉండేవాడు, పరిమితులు లేనివాడు, మాటలకు, వర్ణనలకు అతీతమైనవాడు. అటువంటి పరమేశ్వరుడిని చర్మ చక్షువులతో (బాహ్య నేత్రాలతో) చూడటం దాదాపు కష్టం. ఎందుకంటే శరీరం నశ్వరమైనది, ఈ రోజు ఉంటుంది, రేపు నశించిపోతుంది. అలా అని మనసుతో కూడా చూడలేము, ఎందుకంటే మనసుకు కొన్ని పరిమితులు ఉన్నాయి. వాటిని దాటి మనసుపోలేదు. కానీ భగవత్ తత్వాన్ని అర్దం చేసుకోవాలన్నా, భగవంతుని చూడాలన్నా, అది ఆత్మ ద్వారా మాత్రమే సాధ్యం. దానికి కారణం ఆత్మ కూడా పరమాత్మ వలె శాశ్వతమైనది, మార్పు చెందనిది. నిత్యం సుఖాన్ని కోరుకోవడం మనిషి యొక్క లక్షణం. కానీ ఈ ప్రపంచంలో ఒక వింత ఉంది. సుఖదుఃఖాలు ద్వందాలు. ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. రెండిటిలో దేన్నీ కోరుకున్నా రెండవది వెనుకే వస్తుంది. మనిషి ఈ రోజు కోట్ల ఐశ్వర్యంతో సుఖంగా ఉన్నాడని అనుకోవచ్చు, కానీ ముసలి వయసు రాగానే ఆ ఆస్థుల యందు, ధనం యందు పెరిగిపోయిన బంధమే దుఃఖానికి కారణమవుతుంది. ఈ రోజు నీకు ఏది సుఖం ఇచ్చిందో, రేపు అదే నీకు దుఃఖాన్ని కూడా ఇస్తుంది. వయసులో ఉన్నప్పుడు నోటికి తాళం వేయరు. ఉదాహరణకు ఒక సమయం ఉండదు, నచ్చినవన్నీ ఇష్టం వచ్చినట్టు తినేస్తారు. ఆహారనియమాల పాటించని కారణంగా కాస్త పెద్దవయసు రాగానే ఏదో ఒక రోగం వస్తుంది. డాక్టర్ కొన్ని తినవద్దు అని చెప్తాడు. అప్పటివరకు నోటికి అలవాటైన రుచులు ఒక్కసారిగా అందకపోయేసరికి ముద్దు నోట్లోకి దిగదు, దాంతో మనసు తీవ్రంగా క్షోభిస్తుంది. వచ్చిన రోగం కంటే ఈ మానసిక క్షోభయే అధికంగా ఉంటుంది. అందుచేత మనిషి సుఖదుఃఖాలకు అతీతంగా అదగాలి. అంటే సుఖదుఃఖాలను పట్టించుకోకపోవడం కాదు, పారిపోవడం కూడా కాదు. సుఖదుఃఖాలు రెండూ, మనసుకు కలిగే భావనలు. ఈ మనసుకు అతీతంగా ఎదిగినప్పుడు మనిషి అన్ని రకాల బాధలు, కష్టాల నుంచి విడువడుతున్నాడు. ఆ ఎదుగుదల గురించి ఉపనిషత్తులు వివరిస్తాయి. ఉపనిషత్తులు గురుశిష్య సంవాద రూపంలో ఉంటాయి. శిష్యుడు అడిగిన ప్రశ్నకు గురువు సమాధానం చెప్తాడు.

ఆత్మ అంటే ఏంటి? ఆత్మ కళ్ళకు కన్ను వంటిది, చెవులకు చెవి వంటిది, నోరుకి నోరు వంటిది. ఒక దీపం వెలిగించి దాని మీద అనేక చిల్లులు కలిగిన కుండను బోర్లించి పెడితే, ఆ చిల్లుల ద్వారా కాంతిపుంజాలు ఏ విధంగా బయటకు పరసరిస్తాయో, అదే విధంగా ఆత్మ యొక్క చైతన్యం వల్లనే శరీరంలో కదలికలు, ప్రాణం ఉంటాయి. నిత్యం జీవితంలో గమనిస్తే చాలా మంది మరణించినప్పుడు చూడటానికి వెళుతుంటాం.  అక్కడున్న అందరూ ఏడుస్తుంటారు, కొందరేమో అప్పుడే పోయావో అంటూ శోకాలు పెడతారు, పిల్లలేమో 'నాన్నగారు నిన్న రాత్రి వరకు బాగానే ఉన్నారండి. కానీ ఉదయం లేచి చూసేసరికి ఇలా జరిగిపోయింది. మమ్మల్ని విడిచి వెళ్ళిపోయారండి' అంటూ దుఃఖిస్తారు. వెళ్ళిపోవడమేమిటి? ఇంకా శరీరం వాళ్ళ కళ్ళముందే ఉంది. కాకపోతే ఉలుకుపలుకు లేదు, ఒక బొమ్మలాగా ఉన్నాడు. ఇన్నాళ్ళు ఒక పేరుకో, బంధుత్వానికో పలికిన ఆ దేహం ఇప్పుడు ఎన్ని విధాలుగా పిలిచినా స్పందించడం లేదు. మరి ఎక్కడికో వెళ్ళిపొవడమేమిటి? ఇంతకీ అక్కడి నుంచి పోయింది ఎవరు? కదలకుండా పడి ఉన్న దేహం ఎవరు? అతనే కనుక దేహం అయితే అతను అక్కడే ఉన్నాడు. మరీ ఈ ఏడుపులు, శోకాలు ఎందుకు? ఆ శరీరం నుంచి వెళ్ళిపోయిన చైతన్యానికే ఆత్మ అని పేరు.    

To be continued .......................

Monday, 5 January 2015

హిందూ ధర్మం - 127 (ఉపనిషత్తులు)

వేదం ఉపనిషత్తులతో ముగుస్తుంది. వీటికే వేదాంతం అని పేరు. వేదం పూర్తిగా అర్దమవ్వలాంటే ఉపనిషత్తులను అర్దం చేసుకోవాలి. వేదం యొక్క అంత్యభాగంలో ఉండడమే కాక, వేదవిద్య మొత్తం అభ్యసించిన తర్వాత, విద్యాభ్యాసం చివరలో భోధించబడేవి కనుక వీటికి వేదాంతం అని పేరు. ఇవి సమస్త ప్రపంచానికి ఏకైక తత్వశాస్త్ర నిధులు. ఉపనిషత్తు అనే పదం సంస్కృత భాష నుంచి వచ్చింది. ఉప అనే ధాతువుకి దగ్గరగా అని  అర్దం, ని అనగా తపనతో, నిశ్చయాత్మక బుద్ధితో, కుతూహలంతో అని అర్దం. రకరకాల శాస్త్రాలు మనిషి జీవనానికి తోడ్పడుతాయి, అతని అభివృద్ధికి దోహదపడచ్చు కానీ అవే జీవితం కాదు. జీవితపరమార్ధాన్ని తెలుసుకోపోతే జన్మ వ్యర్ధం. అందుకే గురువు మొత్తం వేదవిద్యను శిష్యునికి ఉపదేశించిన తర్వాత, అతనిని తన దగ్గర కూర్చుబెట్టుకుని జీవిత సత్యాలను భోధిస్తాడు. భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, ఖగోళ శాస్త్రం, యుద్ధవిద్య, వృత్తులు వంటివి నీ జీవనాన్నిసుగమం చేస్తాయెమో కానీ, నీకు ఎందుకు జీవించాలో స్పష్టంగా చెప్పలేవు, మరణసమయంలో పనికి రావు, మరణభయాన్ని తొలగించలేవు. భూమి ఎలా పుట్టింది, ఎప్పుడు పుట్టింది, పర్వతాలు, సముద్రాలు, పీఠభూములు ఏలా ఏర్పడ్డాయి, భూకంపాలు ఎలా సంభవిస్తాయో శాస్త్రాలు నిర్వచనం మాత్రమే చేయగలవు, అవి కేవలం సృష్టిని విశ్లేషించగలవు. కానీ కొత్తగా సృష్టి చేయలేవు. శాస్త్రవేత్త కూడా అంతే. అన్ని చదువుకున్నాకా భౌతికవాదం ప్రభలుతుంది. అన్నీ తనకు తెలుసని అనుకుంటాడు అని చెప్తూ, గురువంటాడు 'నాయనా! నీవు కేవలం సృష్టి క్రమాన్ని మాత్రమే చదువుకున్నావు. కానీ ఈ సృష్టిని సృష్టించిన ఒక కర్త ఉన్నాడు. వాడిని భౌతిక దృష్టితో చూడటం అసాధ్యం. వాడు బాహ్యనేత్రానికి కనిపించడు. విశ్వంలో ఎన్ని పాలపుంతలు దాటి ప్రయాణించినా, సృష్టికర్తను పట్టుకోలేవు. ఆ మాటకు వస్తే, సృష్టికర్త అయిన భగవంతుడు ధృక్ గోచరమైన వస్తువు/విషయం కాదు, కనుక ఆయన్ను బాహ్యంలో వెతకడం కుదరని పని. అలా అని ఏదో తెలియని శక్తి ఉంది, దాన్ని నువ్వు నమ్మవలసిందే అని నేను చెప్పను. ఆ భగవంతుడిని ఎరుకలోకి ఎలా తెచ్చుకోవాలో, నీకు మార్గం వివరిస్తాను. భగవంతుడనేది ఒక నమ్మకం కాకూడదు, ఉన్నాడని రూఢీ చేసుకోవాలి, నేను చూసిన విధంగానే నువ్వూ భగవంతుడిని చూడాలి, నీ తర్వాతి తరంవాళ్ళకి చూపించాలి. అందుకు నీకు ఇప్పుడు మార్గం వివరిస్తాను' అంటాడు శిష్యునితో.

శిష్యుడు కూడా గురువు గారి దగ్గరకు వెళ్ళి, కూర్చుని, శ్రద్ధగా మళ్ళీ మళ్ళీ అడిగి మరీ ఈ జ్ఞానాన్ని తెలుసుకుంటాడు. గురువు కేవలం గ్రంధంలో చెప్పబడిన విద్యనే కాకుండా, తాను జీవితంలో అనుభవపూర్వకంగా తెలుసుకున్న అనేక రహస్య సత్యాలను శిష్యునికి ఉపదేశిస్తాడు. అలా గురువుకు దగ్గరగా ఆసనం వేసుకుని కూర్చుని, విని, నేర్చుకునే విద్య కనుక వీటికి ఉపనిషత్తులు అని పేరు.

To be continued ......................

Sunday, 4 January 2015

హిందూ ధర్మం - 126 (ఉపనిషత్తులు)

4. ఉపనిషత్తులు: వేదాల్లో విజ్ఞానశాస్త్రం, అనేకానేక శాస్త్రాలతో పాటు ఆత్మజ్ఞానం కూడా ప్రధానంగా చెప్పబడింది. ఈ జ్ఞానం సర్వాతీతమైనది. పూర్వజన్మ సుకృతం చేత, తపస్సు చేత ఋషులు ఆ జ్ఞానాన్ని పొందారు. ఈ జ్ఞానాన్ని పొందడం అనడాన్ని మాములుగా అర్దం చేసుకోకూడదు. తెలుసుకునేవాడు, తెలుసుకోబడేది అనే రెండూ ఈ స్థితిలో ఉండవు. తెలుసుకునేవాడు తెలుసుకోబడేదిగా మారుతాడు, పాలలో కలిసిన నీరు తన స్వరూపాన్ని కోల్పోయి, పాలుగా మారిపోయినట్టు. పాలలో నీరు కలవడం వలన, పాలు పలుచన అవుతాయేమో కానీ, జ్ఞానం విషయంలో అలా జరుగదు. ఇది పరిపూర్ణస్థితి. ఇక్కడ బేధబుద్ధి (State of differentiation) ఉండదు, అబేధస్థితిలో ఉంటారు. ఇటువంటి స్థితిని పొందిన ఋషులు మంత్రసంహితకు అర్ధాలుగా బ్రాహ్మణాలను, వాటికి కొనసాగింపుగా ఆరణ్యకాలను రచించినా, తాము అనుభూతిని చెందిన స్థితిని, ఆ రహస్యాలను మానవుల కోసం చెప్పాలనుకున్నారు. నిజానికి ఆ స్థితి/జ్ఞానం/తత్వం మాటలకు అతీతమైనది, పరిమితులతో కూడిన మనసు అపరిమితమైన ఆ తత్వాన్ని అందుకోలేదు, కనీసం ఊహించలేదు, అది వర్ణనాతీతం. అది కేవలం అనుభవించవలసినది మాత్రమే. ఉదాహరణకు మీకు బెల్లం ఇష్టం అనుకోండి. బెల్లం తియ్యగా ఉంటుందని చెప్పడం వేరు, దాని రుచిని ఆస్వాదించడం వేరు, ఆ తియ్యదనాన్ని ఆస్వాదించిన తర్వాత, అది ఎలా ఉందంటే తియ్యగా ఉందని మాత్రమే చెప్పగలమే కానీ, దాన్ని మరింత వర్ణించలేము. బెల్లం అనేది ఒక తినే వస్తువు మాత్రమే. ఒక తాత్కాలిక వస్తువు విషయంలోనే ఇలా ఉంటే, ఇక సర్వాతీతమైన జ్ఞానం విషయంలో ఎలా ఉంటుంది. అందునా ఈ జ్ఞానం కాలాతీతం. భూమి, సూర్యుడు, విశ్వం కొంత వరకే ఉంటాయి, కానీ ఈ జ్ఞానానికి నాశనం లేదు.

తాము వేదంలో చెప్పబడిన సర్వోత్కృష్టమైన జ్ఞానాన్ని పొందిన తర్వాత ఋషులు మిగితావారికి కూడా ఆ జ్ఞానం అందాలని ఆకాంక్షించారు. వర్ణనాతీతమైన ఆ జ్ఞానాన్ని తాము పొందిన ఉత్కృష్టమైన ఆ స్థాయిని నుంచి దిగివచ్చిసామాన్యమానవుడికి అర్దమయ్యేలా అందించారు. ఆ అద్భుతమైన జ్ఞానాన్ని వేదాల చివరిభాగంలో ఉంచారు. అటువంటి వేదాల యొక్క చివరి భాగాలే ఉపనిషత్తులు.

To be continued ...............