ఉపనిషత్తులలో చాలా అద్భుతమైన విషయాలు చెప్పబడ్డాయి. (అందులో కొన్ని విషయాలు ఒక చిన్న సంభాషణ రూపంలో చెప్పుకుందాం.)
శిష్యుడు - గురువుగారు! అయితే నా శరీరంలో కూడా ఆత్మ ఉందంటారా?
గురువు - నీ శరీరంలో ఆత్మ ఉండడం కాదు నాయన, నువ్వే ఆత్మవు, నువ్వు శరీరాన్ని ధరించావు.
శిష్యుడు - అన్ని జీవులలోనూ ఆత్మ ఉంటుందా గురువుగారు?
గురువు - అన్ని జీవులయందూ ఆత్మ ఉంటుంది. ఆకాశం కింద నీరు నింపిన అనేక కుండలు పెట్టినప్పుడు, అన్నిటిలోనూ ఆకాశం యొక్క ప్రతిబింబం వేర్వేరుగా కనిపిస్తుంది. ప్రతి కుండలో ఒక ప్రతిబింబం కనిపిస్తున్నందున, అనేక ఆకాశాలు ఉండవు కదా. అట్లాగే ఒకే ఆత్మ ఇన్ని జీవులయందూ వేర్వేరుగా వ్యక్తమవుతున్నప్పటికి, దాని తత్వం ఒక్కటే. ఆత్మ భగవత్ స్వరూపం.
శిష్యుడు - అయితే ఉన్నదంతా ఒకటే తత్వమంటారా?
గురువు - బ్రహ్మానుభూతిని పొందిన యోగులు తమ యందే సర్వలోకాలను, జీవాలను దర్శిస్తారు. వారు తమ నుంచి దేన్ని వేరుగా చూడలేరు. అందుకే తత్వం ఒక్కటే. అదే బ్రహ్మము, సత్యము కూడా.
శిష్యుడు - మరి ఈ ఆత్మను తెలుసుకోవడం ఎలా గురువుగారు?
గురువు - అహింస, సత్యం, అస్తేయం, బ్రహ్మచర్య మొదలైన ధర్మాలు పాటిస్తూ, స్వధర్మాన్ని శ్రద్ధతో ఆచరిస్తూ, నిత్యనైమిత్తిక కర్మలను నిష్కామంగా ఆచరించడం వలన చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి పాత్రతను ఇస్తుంది. అప్పుడే జ్ఞ్ఞానం అబ్బుతుంది. జ్ఞానం ద్వారా మాత్రమే ఆత్మను తెలుసుకోగలం.
......................సర్వజీవులయందూ ఒకే ఆత్మ ఉంది అన్న సత్యాన్ని విస్మరించి, ఇతర జీవరాశిని హింసించేవారు తమను తాము హింసించుకుంటున్నవారి కింద లెక్క. వారు ఆత్మహింసకు, ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టే. తనకు మాత్రమే తెలివి ఉందని భావించి, మేధావిగా భావిస్తూ, ఇతరులను మోసం చేస్తాడో, అన్యులకు ద్రోహం తలపెడతాడో, వాడు తన ఆత్మనే మోసగించుకుంటూ ఆత్మద్రోహానికి పాల్పడుతున్న తెలివితక్కువ దద్దమ్మ. అబద్ధాలు ఆడి లోకాన్ని మోసగించువచ్చు అనుకుంటాడు కానీ, ఆత్మను మోసగించలేడు. అలా అబద్దాలు ఆడేవాడు కూడా ఆత్మద్రోహం చేసుకుంటున్నవారే.శరీరం నశ్వరమని తెలిసి, రాకరాక వచ్చిన మానవజన్మలో ఆత్మజ్ఞానం పొంది, జన్మను సార్ధకం చేసుకోకుండా, భౌతిక సుఖాల కోసం వెంపర్లాడేవాడు, ఆత్మ గురించి తెలుసుకోకుండా ఉండేవాడు, ఎప్పుడు మరణం వస్తుందో తెలియనప్పటికి, ఇప్పుడు కాదు, ఇప్పుడు కాదు అంటూ ఆత్మజ్ఞానం పట్ల శ్రద్ధ చూపకుండా అలసత్వం వహించి, జీవితాన్ని వృధా చేసుకునేవారు, నిజానికి ఆత్మ యొక్క హత్యకు పాల్పడుతున్న వారె.
To be continued ................
No comments:
Post a Comment