Sunday 4 January 2015

హిందూ ధర్మం - 126 (ఉపనిషత్తులు)

4. ఉపనిషత్తులు: వేదాల్లో విజ్ఞానశాస్త్రం, అనేకానేక శాస్త్రాలతో పాటు ఆత్మజ్ఞానం కూడా ప్రధానంగా చెప్పబడింది. ఈ జ్ఞానం సర్వాతీతమైనది. పూర్వజన్మ సుకృతం చేత, తపస్సు చేత ఋషులు ఆ జ్ఞానాన్ని పొందారు. ఈ జ్ఞానాన్ని పొందడం అనడాన్ని మాములుగా అర్దం చేసుకోకూడదు. తెలుసుకునేవాడు, తెలుసుకోబడేది అనే రెండూ ఈ స్థితిలో ఉండవు. తెలుసుకునేవాడు తెలుసుకోబడేదిగా మారుతాడు, పాలలో కలిసిన నీరు తన స్వరూపాన్ని కోల్పోయి, పాలుగా మారిపోయినట్టు. పాలలో నీరు కలవడం వలన, పాలు పలుచన అవుతాయేమో కానీ, జ్ఞానం విషయంలో అలా జరుగదు. ఇది పరిపూర్ణస్థితి. ఇక్కడ బేధబుద్ధి (State of differentiation) ఉండదు, అబేధస్థితిలో ఉంటారు. ఇటువంటి స్థితిని పొందిన ఋషులు మంత్రసంహితకు అర్ధాలుగా బ్రాహ్మణాలను, వాటికి కొనసాగింపుగా ఆరణ్యకాలను రచించినా, తాము అనుభూతిని చెందిన స్థితిని, ఆ రహస్యాలను మానవుల కోసం చెప్పాలనుకున్నారు. నిజానికి ఆ స్థితి/జ్ఞానం/తత్వం మాటలకు అతీతమైనది, పరిమితులతో కూడిన మనసు అపరిమితమైన ఆ తత్వాన్ని అందుకోలేదు, కనీసం ఊహించలేదు, అది వర్ణనాతీతం. అది కేవలం అనుభవించవలసినది మాత్రమే. ఉదాహరణకు మీకు బెల్లం ఇష్టం అనుకోండి. బెల్లం తియ్యగా ఉంటుందని చెప్పడం వేరు, దాని రుచిని ఆస్వాదించడం వేరు, ఆ తియ్యదనాన్ని ఆస్వాదించిన తర్వాత, అది ఎలా ఉందంటే తియ్యగా ఉందని మాత్రమే చెప్పగలమే కానీ, దాన్ని మరింత వర్ణించలేము. బెల్లం అనేది ఒక తినే వస్తువు మాత్రమే. ఒక తాత్కాలిక వస్తువు విషయంలోనే ఇలా ఉంటే, ఇక సర్వాతీతమైన జ్ఞానం విషయంలో ఎలా ఉంటుంది. అందునా ఈ జ్ఞానం కాలాతీతం. భూమి, సూర్యుడు, విశ్వం కొంత వరకే ఉంటాయి, కానీ ఈ జ్ఞానానికి నాశనం లేదు.

తాము వేదంలో చెప్పబడిన సర్వోత్కృష్టమైన జ్ఞానాన్ని పొందిన తర్వాత ఋషులు మిగితావారికి కూడా ఆ జ్ఞానం అందాలని ఆకాంక్షించారు. వర్ణనాతీతమైన ఆ జ్ఞానాన్ని తాము పొందిన ఉత్కృష్టమైన ఆ స్థాయిని నుంచి దిగివచ్చిసామాన్యమానవుడికి అర్దమయ్యేలా అందించారు. ఆ అద్భుతమైన జ్ఞానాన్ని వేదాల చివరిభాగంలో ఉంచారు. అటువంటి వేదాల యొక్క చివరి భాగాలే ఉపనిషత్తులు.

To be continued ...............

No comments:

Post a Comment