Sunday 18 April 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (236)



నాది నాకిమ్ము


ఒక భక్తుడు పూజ చేద్దామని కూర్చున్నాడు. అతనికొక సందేహం వచ్చింది. ఈశ్వరుణ్ణి ఇట్లా అడగడం మొదలు పెట్టాడు. స్వామీ! నేనేమో పూజ చేద్దామని కూర్చున్నా. అయినా ఏదో తప్పు చేస్తున్నట్లనిపించిందయ్యా! నేను నీకు ఉద్ధరణి నీళ్లతో అర్హమియ్యడమా? ముల్లోకాలను ఆక్రమించిన పాదాలకా? నేనీ వస్త్రాన్ని అర్పించడమా? దిగంబరునకు, అనగా అన్ని దిక్కులా వ్యాపించిన నిన్ను వస్త్రంతో కప్పడమా? పోనీ, నీకు సాష్టాంగ నమస్కారం చేద్దామంటే అక్కడా లోపం కన్పిస్తోందయ్యా. ఒక వైపు తిరిగి నమస్కరిస్తే మరొక వైపున కాళ్లను చూపించినట్లోతుంది. ఏ దిక్కున నీవు లేవు? ఏవో పువ్వులతో పూజ చేద్దామంటే సర్వాంతర్యామినెట్లా పూజించేది? ఎక్కడో ఒక్క చోటే ఉండవు. ఏదైనా ఫలానాది అడుగుదామంటే నేను అడుగబోయేది ఇంతకు ముందు నీకు తెలియదని అనడం వంటిదే. నా ప్రార్ధన, నీ అనంత శక్తిని శంకించినట్లే. నీవే నేనయ్యానని తెలియక, పొగడడం వల్ల నిన్ను తక్కువ చేసినటౌతుంది కదా! అంతటా ఉన్నవానిని, అన్నీ తెలిసినవానిని ఏమని, ఎంతని అడగడం ఏమిటి? నీవు సచ్చిదానందరూపుడవు. నీకంటే వేరైనది ఏదీ లేదని వేదాలు ఘోషిస్తున్నాయి. అయినా ఏవో లోపాలతో ఉంటున్నా. నీవూ, నేనూ ఒకటని వేదాలు చెప్పినా ఏవో లోపాలు తరుముతున్నాయి నన్ను. నేను నీవంటే భిన్నుడనే భావననను తొలగించు. తొలగించగలిగితే నీవు అన్నీయని, నీవే నేననే భావన కల్గుతుంది నాలో. అనగా అన్నీ నేననే భావన రానీ! ఏవో అవి కావాలని, ఇవి కావాలని నిన్ను అడగడం లేదు. నాది నాకిమ్ము, (స్వ స్వరూపాన్ని ప్రసాదించు) అని ప్రార్థించాలి. అందుకే సదాశివ బ్రహ్మేంద్రులు శివమానసిక పూజా స్తోత్రంలో


మహ్యందేహిచ భగవాన్


మదీయమేవ స్వరూపమానందం


అనగా సహజ రూపమైన ఆనందాన్ని ప్రసాదించుమని అన్నారు.


No comments:

Post a Comment