Showing posts with label నాగదేవత. Show all posts
Showing posts with label నాగదేవత. Show all posts

Wednesday, 19 August 2015

రోజువారీ ప్రవర్తన - నాగదోషం

నాగపంచమి సందర్భంగా అందరూ నాగదేవతలకు పూజలు చేసి ఉంటారు. సర్పదోష నివారణ జరగాలని కోరుకుని ఉంటారు. నిజానికి సర్పదోషం కేవలం పామును చంపడం చేత మాత్రమే సంక్రమిస్తుందని శాస్త్రం చెప్పలేదు. సర్పదోషానికి పాములను చంపడం ఒక కారణమైతే, నిత్య జీవితంలో చేసే తప్పులు కూడా కొన్ని కారణాలు. అక్రమసంబంధాలు కలిగి ఉండడం, బహుభార్యత్వం, మద్యం సేవించడం, సిగిరెట్ త్రాగడం, మాదకద్రవ్యాలకు బానిసలవ్వడం, తల్లిదండ్రులను గౌరవించకపోవడం, వారి బాగోగులు చూడకపోవడం, స్త్రీలను హింసించడం/ అవమానించడం, నిషిద్ధ, విరుద్ధ ఆహారాలు భుజించడం, గృహస్థులు శాస్త్రం చెప్పిన సమయంలో బ్రహంచర్యం పాటించకపోవడం, అవివాహితులు బ్రహ్మచర్య వ్రతాన్ని వదిలిపెట్టడం వలన కూడా నాగదోషాలు సంక్రమిస్తాయి. అది ఆ వ్యక్తులనే కాదు, వారి వంశాన్ని సైతం బాధిస్తాయి. కనుక అటువంటి అలవాట్లకు దూరంగా ఉన్నవారు ధన్యులు. పైన చెప్పిన వాటిలో ఏవైనా దురలవాట్లు ఉంటే, వాటిని వదిలిచుకుంటాం అని సంకల్పం చేసినవారు మరింత ధన్యులు. అసలు అటువంటి ప్రవర్తన మా జీవితంలోకి రానివ్వమని సంకల్పం చేసినవారి మరీ మరీ ధన్యులు. అందరిపై నాగదేవత అనుగ్రహం కలగి సన్మార్గంలో పయనించుగాక.

Tuesday, 18 August 2015

పూజించవలసింది నాగులనా? దేవతాసర్పాలనా? పాములనా?

19 ఆగష్టు 2015, బుధవారం, శ్రవణ శుద్ధపంచమి, నాగపంచమి

నాగపంచమి, నాగుల చవితి వస్తోందంటే చాలు, హిందూ సంప్రదాయాలు మూఢనమ్మకాలు, పాములు పాలు త్రాగుతాయ? వీళ్ళు పాములను హింసిస్తున్నారు, ఆదిమానవుడి కాలపు అలవాట్లను పాటిస్తున్నారు అంటూ మీడియా ఎంతసేపు దాడి చేసి, ధర్మాన్ని కించపరచాలని చూస్తోందే కానీ, నిజానికి ఈ ఆచారం ఎందుకు వచ్చింది, ఆచరణలో ఏమైనా మార్పులు వచ్చాయా? సంప్రదాయాన్ని తప్పుగా అర్దం చేసుకున్నారా? ఒకవేళ పొరబడి ఉంటే, దాన్ని ఎలా సరిజేసుకోవాలని చెప్పే ప్రయత్నం చేయదు.

ఆంగ్లేయులు భారత్ మీదకు వచ్చిన తర్వాత ఇంగ్లీష్ ప్రభావం బాగా పెరిగింది. అది ఎంతగా పెరిగిందంటే ఎంతో విశాలమైన భాష అయిన సంస్కృతాన్ని, దాని నుండి వచ్చిన భారతీయ భాషలలోని పదాలకు ఇంగ్లీష్‌లో అర్దం వెతుక్కునే స్థితికి చేరుపోయాము. అది ఇంకా దిగజారి ఏకంగా ఇంగ్లీష్ పదాలనే ఉపయోగిస్తూ, దాని అర్దాలనే సంస్కృతపదాలకు అంటగడుతున్నాము. విషయంలోకి వస్తే ఇంగ్లీష్ వాళ్ళకు Snake అనే పదం ఒక్కటే ఉంది. కానీ మన ధర్మంలో నాగులు, సర్పాలని రెండు ఉన్నాయి. నాగులు వేరు, సర్పాలు వేరు. భగవద్గీత 10 వ అధ్యాయంలో శ్రీ కృష్ణపరమాత్మ చెప్పిన మాటలివి.

ఆయుధానామహం వజ్రం ధేనూనామస్మి కామధుక్|
ప్రజనశ్చాస్మి కన్దర్పః సర్పాణామస్మి వాసుకిః|| 10-28 ||

నేను ఆయుధాలలో వజ్రాన్ని. గోవులలో కామధేనువుని. పుట్టించేవాళ్ళల్లో మన్మదుడిని, సర్పాలలో వాసుకిని.

• సర్పాలలో తాను వాసుకి అని చెబుతున్నాడు. వాసుకి శివుని ఆశ్రయించి ఆయనకు అలంకారంగా వుంటుంది. ఈ వాసుకినే త్రాడు గా చేసుకుని సాగర మధనం చేసారు దేవదానవులు. వాసుకి కద్రువ తనయుడు.

అనన్తశ్చాస్మి నాగానాం వరుణో యాదసామహమ్|
పితౄణామర్యమా చాస్మి యమః సంయమతామహమ్|| 10-29 ||

నేను నాగులలో అనంతుడిని, జలచరాలలో వరుణుడిని, పీత్రులలో ఆర్యముడిని, సంయమవంతులలో నిగ్రహాన్ని.
• ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు తాను నాగులలో అనంతుడనని చెబుతున్నాడు. అనంతుడు అనగా ఆదిశేషుడు. అనంతుడు కద్రువకు పెద్ద కొడుకు, రెండవ వాడు వాసుకి. కద్రువ వినతకు చేసిన అన్యాయానికి చింతించి విష్ణువు గురించి ఘోర తపమాచరించి ఆయనను తనమీద విశ్రాంతి తీసుకునేలా వరం పొందుతాడు అనంతుడు. బ్రహ్మ అతడి బలాన్ని చూసి భూభారాన్ని మోయమని చెబుతాడు. పురాణాల ప్రకారం అనంతుడు అదృశ్యంగా ఈ భూతలాన్ని మోస్తూ ఉంటాడు. ఈ అనంతుడే వివిధ అవతారాలలో స్వామివారిని అనుసరిస్తాడు. రామావతారంలో లక్ష్మణుడిగా, కృష్ణావతారం లో బలరాముడిగా, వేంకటేశ్వర అవతారంలో గోవిందరాజులుగా, భక్తి మార్గాన్ని తెలపడానికి భగవద్ రామానుజులుగా.

ఇప్పుడు మనకు ఒక సందేహం రాక మానదు. పైన సర్పాలలో వాసుకి తానన్నాడు, ఇక్కడ నాగులలో అనంతుడనంటున్నాడు. అసలు సర్పాలు , నాగులు ఒకటి కాదా ? ఏమిటి తేడా? కొంతమంది పండితులు సర్పాలంటే విషపూరితాలు అని , నాగులు అంటే విషరహిత పాములు అని ప్రతిపాదించారు. కానీ పురాణాల ప్రకారం సర్పాలు, నాగులు సోదర సమానులైనా రెంటికీ చాలా వ్యత్యాసం వుంది. నాగులు కామరూపధారులు. అవి కావాలనుకున్నప్పుడు మానవ రూపంలో కనబడగలవు. మానవరూపాన్నే కాదు, ఏ రూపాన్నైనా ధరించగలవు. సర్పాలు అలా కావు, అవి నేలను అంటిపెట్టుకుని పాకుతాయి, భూమి మీద తిరుగాడుతాయి.  నాగులకు ఒక విశిష్ట లోకం వుంది. నాగులకు వాయువు ఆహరం, అనగా అవి గాలిని స్వీకరించి బ్రతుకుతాయి. సర్పాలకు కప్పలు మొదలైన జీవరాశులు ఆహారం.

నాగుల్లో మళ్ళీ 9 జాతులు ఉంటాయి. అట్లాగే సర్పాల్లో కూడా దేవతాసర్పాలని ప్రత్యేకంగా ఉంటాయి. దేవతాసర్పాలు ఎక్కడ ఉంటే అక్కడ మల్లెపూలవాసన వస్తుంది. కానీ ఇవి మానవసంచారం ఉన్న ప్రాంతాల్లో సంచరించవు, మానవజాడలకు దూరంగా ఉంటాయి. మనిషికి గానీ, పాములు పట్టేవాళ్ళకు గాని చిక్కవు. అలా చిక్కుతాయి అనుకోవడం సినిమాల ప్రభావం మాత్రమే.

పాములు పాలు త్రాగవన్నమాట నిజం. అవి సరిసృపాలు కనుక వాటికి జీర్ణవ్యవస్థ ఉండదు. కానీ నాగులు, దేవతాసర్పాలు అందుకు భిన్నం. భక్తికి మెచ్చిన నాగదేవతలు అనేకరూపాల్లో దర్శనమిచ్చి పూజలు అందుకుంటారు, ఆరోగ్యాన్ని, సంతనాన్ని అనుగ్రహిస్తారు. దేవతాసర్పాలకు కూడా శక్తులు ఉంటాయి, అవి కొన్ని ప్రత్యేకమైన క్షేత్రాల్లో ఇప్పటికి ఉన్నాయి. అవి కూడా పాలు త్రాగుతాయి.

ఈ నాగపంచమి మొదలైన నాగదేవతారాధన తిధులు ప్రారంభమైన సమయంలో నాగులు కూడా మానవజాతితో కలిసి సంచరించేవారు. అప్పటి మానవులకు శౌచం ఉండేది. ధర్మనిష్ఠ, సత్యనిష్ఠ, దైవభక్తి ఉండేది. ఆ రోజులు వేరు. కనుక అప్పట్లో నాగజాతికి పాలు, పండ్లు సమర్పించి, పసుపుకుంకుమలు, సారెలతో పూజించి, వారిని సంతోషపెట్టేవారు. క్రమక్రమంగా ప్రజల్లో శౌచం తగ్గిపోవడం, ధర్మంపై శ్రద్ధ తగ్గి, ఆచరణ తగ్గిపోయిన కారణంగా నాగులు ఇంతకముందు వలే మర్త్యలోకంలో సశరీరంతో సంచరించడం మానేశారు. విగ్రహాల్లో వారిని ఆవాహన చేసి, పూజించినవారికి సత్ఫలితాలను ఇస్తున్నారు. అలాగే దేవతాసర్పాలు కూడా జనసంచారం ఉన్న ప్రాంతాల్లో తిరగడం మానేశాయి. ఒక 75 ఏళ్ళ క్రితం వరకు దేవతసర్పాలను చూసి, పూజించి, వరాలను పొందిన కుటుంబాలు ఉన్నాయి, ఆ కుటుంబసభ్యులకు ఇప్పటికి ఆ విషయాలు స్మరణలో ఉంటాయి. కానీ ఇప్పుడు సదాచారం, శౌచం, ధర్మం వంటి మంచి విషయాలను జనం వదిలేశారు, ఒకవేళ ఎక్కడైనా అలాంటివి ఉన్నా, సక్రమంగా పాటించడం తక్కువ. దాంతో దేవతాసర్పాలు జనావాసాలకు దూరంగా వెళ్ళిపోయాయి. ఆలయాల్లో వాటికి జరిగిన అపరాధం కారణంగా కొన్ని శరీరం విడిచిపెట్టాయి.

ఇప్పుడు బయట కనిపించే పుట్టల్లో ఉండేవి దేవతాసర్పాలని చెప్పలేము. చాలామటుకు ఏదో మాములు పాములే జనావాసాల మధ్య పుట్టల్లో ఉంటున్నాయి. నాగపంచమి, నాగులచవితికి నాగదేవతలకు పూజలు చేయాలి. కానీ పైన చెప్పుకున్న విషయాలు అర్దంకాక ప్రజలందరూ మాములు పాములకు పాలు పోస్తున్నారు, పసుపు కుంకుమలు వేస్తున్నారు. మామూలు పాములు పాలు త్రాగవు, వాటికి పసుపుకుంకుమలు పడవు. అందుకే నాగదేవతలను పూజించవలసి వచ్చినప్పుడు నాగప్రతిష్ట, నాగబంధం, నాగశిలలను మాత్రమే పూజించమని ధార్మిక గ్రంధాలు పేర్కొంటున్నాయి.

ఇప్పటి ప్రజల్లో ఈ విషయాన్ని బాగా ప్రచారం చేయవలసిన అవసరం ఉంది. నాగపంచమి, నాగులు చవితి మూఢనమ్మకలు కాదు, నాగదేవతలను పూజించి, సంతానం పొందిన దంపతులు కోకొల్లలు. ఇతర పిల్లలతో పోల్చినప్పుడు నాగదేవాతానుగ్రహంతో కలిగిన సంతానంలో నాగదేవతల యొక్క వరప్రభావం, అంశను తల్లిదండ్రులు పసిగట్టగలుగుతారు. కానీ అలా సంతానం కోసం పూజించవలసింది నాగులనే కానీ మామూలు పాములను కాదు.

ఈశ్వర సృష్టిలో ప్రతి జీవికి ప్రాధాన్యత ఉంది. సాధారణ సర్పాలు జీవవైవిధ్యంలో, ఆహారచక్రంలో తమవంతు పాత్ర పోషిస్తాయి. వాటి మనుగడతోనే మానవమనుగడ సాధ్యమవుతుంది. మామూలు పాముల జోలికి వెళ్ళకుండా ఉండడం, వాటి మానాన వాటిని వదిలేయడం, వాటిని ఎవరైనా హింసిస్తుంటే రక్షించడం వల్ల కూడా దేవతాసర్పాలు, నాగజాతి అనుగ్రహం పొందవచ్చు.

సంప్రదాయం మొదలైనప్పుడు అందులో మూఢనమ్మకమేమీ లేదు. కాలక్రమంలో మారిన అలవాట్ల కారణంగా, వచ్చిన మార్పులను ప్రజలు అర్దం చేసుకోలేకపోయారు. కనీసం ఇప్పటికైనా హిందూసమాజం సంప్రదాయంలోని అసలు విషయాన్ని గమనించాలి. విషయాన్ని సగం సగం చెప్పి, మూఢనమ్మకమంటూ కొట్టిపారేయకుండా, అసలు విషయాన్ని పూర్తిగా ప్రజలకు చెప్పేందుకు మీడియా కూడా ముందురావాలి.

ఇటువంటి మరికొన్ని విషయాలను 2014  నాగపంచమి సంధర్భంగా ప్రచురించడం జరిగింది. లింక్‌లో http://goo.gl/B7ljRm గమనించగలరు.  
నాగుల చవితి సందర్భంగా నాగదేవతలకు నివేదించవలసిన నైవేధ్యం గురించి, ఇతర వివరాల గురించి ఈ క్రింద లింక్‌లో చెప్పటం జరిగింది. నాగులచవితి అయినా, నాగపంచమి అయినా, నివేదన, నియమాలు ఒకటే. వాటిలో మార్పు ఉండదు.
http://ecoganesha.blogspot.in/2014/10/blog-post_26.html

Saturday, 7 February 2015

హిందూ ధర్మం - 141 (మహాభారతానికి పురావస్తు ఆధారాలు)

ద్వారక కాకుండా మహాభారతం చరిత్రలో జరిగిందనడానికి మరికొన్ని ఆధారాలు దొరికాయి. ఉత్తరభారతదేశంలో 35 కు పైగా ప్రదేశాల్లో పురావస్తు ఆధారాలు లభించాయి. అవన్నీ మహాభారత గ్రంధంలో ప్రస్తావించబడిన పురాతన నగరాలుగా ఏవైతే పిలువుబడ్డాయో, అక్కడే లభించాయి.అక్కడ రాగిపాత్రలు, ఇనుము వస్తువులు, ముద్రలు, వెండి, బంగారు నగలు, టెర్రాకోట వస్తువులు, ఇతర సామగ్రి దొరికాయి. వీటి మీద పరిశోధన చేసినప్పుడు వీటి కాలం పండితులు చెప్తున్న మహాభారత కాలానికి సరిపోతోంది.

ఇది కాకుండా దక్షిణభారతదేశంలో కర్ణాటక రాష్ట్రలో తుంగభధ్ర నదీ తీరంలోనూ, ఐహోల్, హళిబిద్ద మొదలైన ప్రాంతాల్లో దొరికాయి. వీటిలో ఐహోల్‌లో దొరికిన తామ్రశాసనం ప్రధానమైనది. అర్జునుడికి జన్మించినవాడు అభిమన్యుడు, అభిమన్యుడి కుమారుడు పరీక్షిత్ మహారాజు, ఆయన కుమారుడు జనమేజయుడు. (కధను క్లుప్తంగా వివరిస్తా) ఒకసారి పరీక్షిత్ మహారాజు చేసిన ఒక తప్పు కారణంగా ఋషి శాపానికి గురై, తక్షకుడి చేతిలో మరణిస్తాడు. తన తండ్రిని చంపిన తక్షకుడి మీద, నాగజాతి మీద పగ తీర్చుకోవాలని జనమేజయుడు సర్పయాగం చేస్తాడు. ఆ యాగంలో వేల కొద్ది సర్పాలు ఆహుతైపోతాయి. ఆ యాగాన్ని ఆపటానికి ఆస్తికమహర్షి వస్తారు, తన ప్రయత్నంలో సఫలం అవుతారు. మానవులకు సర్పాలకు మధ్య స్నేహభావాన్ని, బంధాన్ని పెంచుతారు, దానికి గుర్తుగా ఈ రోజుకి ప్రతీ ఏటా శ్రావణ మాసంలో నాగపంచమి జరుపుకుంటారు హిందువులు.

ఇది కేవలం కధ కాదు. దీనికి సంబంధించిన ఆధారాలే ఐహోల్ లో ఉన్నాయి. సర్పయాగం తర్వాత జనమేజయుడు తన తండ్రి పేరున అగ్రహారాలు దానం ఇస్తాడు. వాటి కోసం రాగిరేగులపై శాసనాలు రాయించాడు . ఆ రాగిరేగులు ఇప్పటికి ఐహోల్ లో ఉన్నాయి. వాటి ఫొటోలు కూడా అనేకులు తీసుకున్నారు. వీటిని కోట వేంకాటాచలం గారు, తన Age of Mahabharata war అనే పుస్తకంలో పొందుపరిచారు. వాటికి శాసనపూర్వక ఆధారాలు అందించారు. 'మహాభారత యుద్ధం క్రీ.పూ.3138 లేద 36 లో ఖచ్చితంగా జరిగిందనడానికి ప్రధానంగా 4 శాసనాలు లభించాయి' అని వారి రచనలో చెప్పారు. వాటి గురించి తరువాయి భాగంలో తెలుసుకుందాం.

To be continued .............

Sunday, 26 October 2014

నాగుల చవితి విశేషాలు

కార్తీక శుద్ధ చవితి, నాగుల చవితి - విశేషాలు

మన దేశంలో ప్రాచీన కాలం నుండి నాగపూజ చేసే ఆచారం ఉంది. కార్తీక శుద్ధచవితిని నాగులచవితిగా జరుపుతారు. పూజించడం అంటే గౌరవించడం అని అర్ధం. వ్యవాసాయంలోనూ, జీవవైవిధ్య రక్షణలోనూ ప్రధానపాత్ర పోషిస్తూ భూమిపై సమతుల్యానికి, జీవనానికి, ప్రత్యక్షంగా, పరోక్షంగా తోడ్పడుతున్న సర్పజాతికి నీరాజనం పట్టి, గౌరవించడమే ఇక్కడ పూజించడం అని అర్ధం చేసుకోవాలి.

ఉదయమే తప్పకుండా తలంటుస్నానం చేయాలి. ఈ రోజు చేసే తలస్నానం కళ్ళు, చెవులకు సంబంధించిన సమస్త రోగాలను తొలగిస్తుంది.

నాగులచవితి రోజున ఉపవాసం ఉండి పాముపుట్టను పూజించాలి. పుట్టలో ఆవుపాలు పోయాలి. పుట్టను పూజించే అవకాశం లేనప్పుడు నాగవిగ్రహాన్ని పాలతో అభిషేకించాలి. సాధారణంగా ప్రతిచోట ఆలయాలలోనూ, రావి, వేప చెట్ల క్రిందా ఈ నాగవిగ్రహాలు / నాగబంధం ఉంటుంది.

ఒక విషయం గుర్తుంచుకోండి. పాములు సరీసృపాలు కనుక పాలు త్రాగవు. అలా అని అన్ని పాములు పాలు త్రాగవని కాదు, దేవతసర్పాలు మాత్రమే పాలు త్రాగుతాయి. మాములు పాములు పాలు త్రాగితే అరగక కక్కెస్తాయి, మరణిస్తాయి కూడా. దేవత సర్పాలు ఎక్కడపడితే అక్కడ ఉండవు. మనిషి కంటికి కనిపించవు, అంటే మానవ కదలికలను లేని మహారణ్యాలలో మాత్రమే ఉంటాయి. అందువల్ల పుట్టలో పాక్యేట్ల కొద్ది పాలు పోయకండి. నాగజాతిని తలుచుకుని నాగదేవతకు నైవేద్యంగా ఒకటి, రెండు చెంచాల పాలు మాత్రమే పుట్టలో పోసి మిగితావి ప్రసాదంగా స్వీకరించడం మంచిది. ఇక నాగదేవత పూజలో పసుపుకుంకుమలను పుట్ట దగ్గర వాడవద్దు. పసుపు అంటే పాములకు అలర్జీ. పసుపు వాటి శరీరానికి అంటుకోవడం వలన కూడా అవి మరణీంచే అవకాశం ఉంటుంది. పండుగ పూట పాపం చేయకండి. పసుపుకుంకుమలను పుట్ట దగ్గర వాడకండి. ఇటువంటి మరికొన్ని విషయాలను నాగపంచమి సంధర్భంగా ప్రచురించడం జరిగింది. లింక్‌లో http://goo.gl/B7ljRm గమనించగలరు.   

నాగులచవితికి నువ్వులపిండి, చలిమిడి, వడపప్పు, చిమ్మిలి తప్పనిసరిగా నివేదనగా సమర్పించాలి. ఇవి గర్భదోషాలను తొలగిస్తాయి, ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి.      

పుట్ట దగ్గర / నాగబంధం దగ్గర పూజించాకా, ఇంటి గడప దగ్గర కూడా పాలుపోయాలి. ప్రతి ఇంటి గుమ్మం దగ్గర నాగరాజు కొలువుండి ఇంటిని రక్షిస్తుంటాడు. కనుక ఇంటి గడప మీద పాలు పోయండి, కాసింత చిమ్మిలి, చలివిడి పెట్టండి, ఒక అరటిపండు ముక్క పెట్టండి. నాగులను పాలు పోసి పూజించాం కనుక ఈ రోజు తరిగిన కూరలు తినకూడదని పెద్దలు చెప్తారు. కనుక ఆహారం తీసుకునేవారు, కత్తితో కూరలు కోయకుండా ఉండేలా జాగ్రత్త తీసుకోండి.

మరునాడు ఇంట్లో బంగారంతో కాని,వెండితో కాని,కొయ్యతో(చెక్క) కాని,మట్టితో కాని చేసిన నాగప్రతిమను పంచామృతాలతోనూ,జాజి,సంపెంగ లాంటి సువాసనగల పూలతోనూ పూజించాలి. ఈ నాగపూజ వలన సర్పదోషాలు నశిస్తాయి.  

Friday, 1 August 2014

భారతీయసంస్కృతిలో పాములు

నాగపంచమి సందర్భంగా ఒక్కసారి మనకు, నాగులకు ఉన్న బంధం గురించి, మన భారతీయసంస్కృతిలో, సనాతన ధర్మంలో వాటికిచ్చిన స్థానం గురించి గుర్తుచేసుకుందాం.

యోగంలో పాము కుండలినిశక్తికి సంకేతం. ప్రతి మనిషిలోనూ కుండలిని అనే మహాశక్తి పాము రూపంలో వెన్నుపూసకు మూడు చుట్టలు చుట్టుకుని, తన పడిగను వెన్నుపూస క్రింది వైపుకు, తోకను పైవైపుకు వచ్చేలా నిద్రిస్తూ ఉంటుంది. యోగా, ధ్యానం మొదలైన సాధనల ద్వారా అది ఉత్తేజితమై మన శరీరంలో ఉన్న 6 చక్రాలను దాటుకుంటూ సహస్రారాన్ని చేరుతుంది. అలా కుండలినీశంక్తి సహస్రారకమలాన్ని చేరితే, మనిషి దివ్యానుభూతికి లోనవుతాడు. ఆ స్థితికి చేరడానికి ఎంతో సాధన కావాలి.

పాము చైతన్యానికి ప్రతీక. ప్రతి హిందూ దేవాలయంలోనూ నాగదేవత తప్పకుండా ఉంటుంది. విష్ణుమూర్తి ఆదిశేషుని మీద శయనిస్తాడు. శివుడు నాగభూషణుడు. పాములనే ధరిస్తా
డు. మన భూమిని ఆదిశేషుడు తన తల మీద మోస్తున్నాడు. వినాయకుడి యజ్ఞోపవీతం, ఉదరబంధనం సర్పమే. అమ్మవారి కురులు నాగులు. సుబ్రహ్మణ్యస్వామిని నాగులకు అధినాయకుడిగా కొలుస్తాము.

మన డి.ఏన్.ఏ. కూడా సర్పాకారంలో ఉంటుంది. మనిషి పుట్టుకకు కారణమైన వీర్యకణాలను సూక్ష్మదర్శని (మైక్రో్‌స్కోప్) ద్వారా పరిశీలిస్తే, అవి కూడా సర్పాకారంలోనే ఉంటాయి, వాటి కదలికలు కూడా పాములను పోలి ఉంటాయి. సంతానం కలగని వారు నాగదేవతను పూజించడం చేత సంతానం పొందిన ఉదంతాలు కోకొల్లలు.

వ్యవసాయదారులైన రైతులకు పాములు స్నేహితులు. పంటపొలాల్లో ఉన్న ఎలుకలను తినేసి పంటలను కాపాడుతాయి. పాములు, వాటి శరీర నిర్మాణం రీత్యా పూర్తిగా భూమిని తాకుతాయి. భూమిలో జరిగే ప్రతి చిన్న మార్పును పసిగట్టగలవు. ప్రపంచంలో ఏ మూలన భూకంపం వస్తున్న, కనీసం 30, 40 రోజుల ముందే పాములు పసిగట్టేస్తాయి. పాముల కదిలకలను గమనించి భూకంపాల నుంచి తప్పించుకోవచ్చని ఆధునిక పరిశోధకులు అంటున్నారు.

సనాతన ధర్మంలో నాగబంధం భార్యభర్తలకు ప్రతీక. భార్యభర్తల ఏ విధంగా కలిసి ఉండాలో, కలిసి అధ్యాత్మిక మార్గంలో ఉన్నతి సాధించాలో గుర్తుచేస్తుంది నాగబంధం. నాగారాధన చేయడం వలన చెవుడు రాదు, కంటి జబ్బులు దరిచేరవు.

పాములను చంపడం వలన నాగదోషం వస్తుందంటోంది ధర్మశాస్త్రం. పాములను చంపినా, లేక పాములను భయపెట్టి, పాము తన తలను నేలకేసి బాదుకుని చనిపోవడానికి కారణమైన వారు, పాముపుట్టలను ధ్వంసం చేసినవారి కుటుంబాలను నాగదోషం పట్టిపీడిస్తుంది. పాము, తన తల నేలకు కొట్టుకుని మరణించడానికి కారణమైన వారి వంశం నిర్వీర్యమవుతంది.

అందరు గుర్తుంచుకోవలసిన విషయం పాములను హింసించడం వల్లనే కాదు, తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోకపోయినా, వృద్ధ తల్లిదండ్రులను వీధిపాలి చేసినా, బాధపెట్టినా నాగదోషం వస్తుంది. ధూమపానం(సిగిరెట్టు), మద్యపానం, మత్తుపధార్ధాలు తీసుకోవడం వంటి అలవాట్ల వల్ల కూడా నాగదోషం వస్తుంది. కాబట్టి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి.

పాములు కనిపిస్తే స్నేక్‌సెల్ వారికి అప్పగించండి. పాములను పూజించే సంస్కృతి మనది. చంపే సంస్కృతి కాదు. అందువల్ల పాములను చంపకండి. జీవవైవిధ్యంలో పాములు కీలక పాత్ర వహిస్తాతని గుర్తిచండి.

ఓం నమో మనసాయై   

Thursday, 31 July 2014

నాగపంచమి - సర్పాలను కాపాడి, నాగజాతి అనుగ్రహం పొందండి

మహాభారతం పంచమవేదం. అది అనేక ధర్మసూక్ష్మాలతో కూడి ఉంటుంది. అందులో కొన్నిసార్లు ధర్మం అధరంగా, అధర్మం ధర్మంగా కనిపిస్తుంది. మహాభారతాన్ని వ్యాఖ్యానం చేయడం చాలా కష్టం. అయినప్పటికి నాగపంచమికి సంబంధించి పరీక్షిత్ మహారాజుకు చెందిన ఈ చారిత్రిక సంఘటనను చాలా క్లుప్తంగా తెలుసుకుందాం.......

మహాభారతం ముగిసాక హస్తినాపురాన్ని అధిష్టించిన పరీక్షిత్ మహారాజు వేటకు వెళ్ళిన సమయంలో, తపస్సులో ఉన్న ఋషి మెడలో చనిపోయిన పామును వేసి, ఆ మునికుమారుడి శాపానికి గురై శాపకారణంగా తక్షకుడి (పాము) కాటుకు మరణిస్తాడు. తన తండ్రి మరణానికి కారణమైన తక్షకుడిని, సర్పజాతిని సంహరించడం కోసం పరీక్షిత్ మహారాజు కుమారుడైన జనమేజయుడు సర్పయాగం చేస్తాడు. ఆ యాగ ప్రభావం చేత ఎక్కడెక్కడో ఉన్న సర్పాలన్నీ వచ్చి హోమగుండంలో పడి ప్రాణులు వదిలేస్తాయి. తనను రక్షించమని వేడుకుంటూ తక్షకుడు ఇంద్రుని శరణువేడి, ఇంద్ర సింహాసనాన్ని చుట్టుకుంటాడు. కానీ జనమేజయుడి ఆదేశం మీద వేదపండితులు ఇంద్రుని సింహాసనంతో కూడి తక్షకుడు యాగంలో పడి మరణించాలని మంత్రపూర్వకంగా చెప్తారు. దాంతో ఇంద్రుడి హడలిపోతాడు. ఇంతలో మానసాదేవి ఆదేశం మేరకు ఆమె కుమారుడైన ఆస్తిక మహర్షి యాగం ఆపటానికి వస్తారు.. యాగాన్ని ఆపి, సర్పజాతిని కాపాడటంలో ఆస్తిక మహర్షి విజయవంతమవుతారు. ఆయన కారణంగా సర్ప సత్ర యాగం ఆగిన రోజు శ్రావణ శుక్ల పంచమి. ఆ తర్వాత మానవజాతికి, సర్పజాతికి మధ్య స్నేహభావాన్ని పెంపొందేలా ఆ మహర్షి కృషి చేశారు. అందుకు గుర్తుగా అప్పటి నుంచి ప్రతి ఏటా శ్రావణ శుక్ల పంచమిని నాగపంచమిగా జరుపుకుంటున్నాం.

ఒక విషయం గుర్తుంచుకోండి. పాములు సరీసృపాలు కనుక పాలు త్రాగవు. అలా అని అన్ని పాములు పాలు త్రాగవని కాదు, దేవతసర్పాలు మాత్రమే పాలు త్రాగుతాయి. మాములు పాములు పాలు త్రాగితే అరగక కక్కెస్తాయి, తర్వాత మరణిస్తాయి. దేవత సర్పాలు ఎక్కడపడితే అక్కడ ఉండవు. మనిషి కంటికి కనిపించవు, మానవ కదలికలను లేని మహారణ్యాలలో మాత్రమే ఉంటాయి. అందువల్ల పుట్టలో పాక్యేట్ల కొద్ది పాలు పోయకండి. నాగజాతిని తలుచుకుని నాగదేవతకు నైవేద్యంగా ఒకటి, రెండు చెంచాల పాలు మాత్రమే పుట్టలో పోసి మిగితావి ప్రసాదంగా స్వీకరించడం మంచిది. నాగదేవత పూజలో పసుపుకుంకుమలను పుట్ట దగ్గర వాడవద్దు. అసలు పుట్టలో పాలు పోయకూడదు, నాగశిలకు, నాగబంధానికి మాత్రమే పాలు పోసి, పూజించాలి. ధార్మిక గ్రంధాల్లో అలాగే చెప్పారు. నాగబంధం/ నాగశిల మీద మాత్రమే చల్లవచ్చు. పసుపు అంటే పాములకు అలర్జీ. పసుపు వాటి శరీరానికి అంటుకోవడం వలన కూడా అవి మరణించే అవకాశం ఉంటుంది. పండుగ పూట పాపం చేయకండి. పసుపుకుంకుమలను పుట్ట దగ్గర వాడకండి.

కొందరు ఇంటి ముందుకు పాములను తీసుకువస్తూ ఉంటారు. వాటికి పాలు పోయకండి, అలా వచ్చేవారికి రూపాయి కూడా ఇవ్వకండి. ఎందుకంటే వారు పాములను 3 నెలల ముందే పట్టి, నీరు, ఆహారం ఇవ్వకుండా, ఒక బుట్టలో పెట్టి, ఆ బుట్టను ఒక చీకటి గదిలో పడేస్తారు. 3 నెలలపాటు తినడానికి ఏమి దొరకని ఆ పాము, ఆఖరికి ఏమి పెట్టినా తినేందుకు సిద్ధం అవుతుంది, బలం కోల్పోతుంది, మరణానికి చేరువవుతుంది. అదే సమయంలో వాటిని తీసి, కోరలను పీకేసి, నోరు కుట్టెస్తారు, చిన్న సందు మాత్రమే వదులుతారు. వాటినే నాగపంచమి రోజున జనం మధ్యకు, గుడి దగ్గరకు తీసుకువచ్చి, పాలు సమర్పించమని చెప్పి, డబ్బులు తీసుకుంటారు. ఏది దొరకని ఆ సర్పం, తాత్కాలికంగా పాలు త్రాగిన, తర్వాత అది మరణిస్తుంది. అందుకని ఎక్కడైనా, అటువంటివి కనిపించినా, ఎవరైనా మీ దగ్గరకు పాము తీసుకువచ్చినా, వెంటనే పోలిసులకు కానీ, స్నేక్ సెల్ వారికి కానీ సమాచరం ఇవ్వండి. సర్పాలను కాపాడి, నాగజాతి అనుగ్రహం పొందండి.

ఇవిగో అటవీ శాఖవారి టొల్ ఫీ నెబరు - 1-800-425-5364
ప్రెండ్స్ ఆఫ్ స్నేక్ హెల్ప్ లైన్ నెంబరు - +91 83742 33366.