Friday 1 August 2014

భారతీయసంస్కృతిలో పాములు

నాగపంచమి సందర్భంగా ఒక్కసారి మనకు, నాగులకు ఉన్న బంధం గురించి, మన భారతీయసంస్కృతిలో, సనాతన ధర్మంలో వాటికిచ్చిన స్థానం గురించి గుర్తుచేసుకుందాం.

యోగంలో పాము కుండలినిశక్తికి సంకేతం. ప్రతి మనిషిలోనూ కుండలిని అనే మహాశక్తి పాము రూపంలో వెన్నుపూసకు మూడు చుట్టలు చుట్టుకుని, తన పడిగను వెన్నుపూస క్రింది వైపుకు, తోకను పైవైపుకు వచ్చేలా నిద్రిస్తూ ఉంటుంది. యోగా, ధ్యానం మొదలైన సాధనల ద్వారా అది ఉత్తేజితమై మన శరీరంలో ఉన్న 6 చక్రాలను దాటుకుంటూ సహస్రారాన్ని చేరుతుంది. అలా కుండలినీశంక్తి సహస్రారకమలాన్ని చేరితే, మనిషి దివ్యానుభూతికి లోనవుతాడు. ఆ స్థితికి చేరడానికి ఎంతో సాధన కావాలి.

పాము చైతన్యానికి ప్రతీక. ప్రతి హిందూ దేవాలయంలోనూ నాగదేవత తప్పకుండా ఉంటుంది. విష్ణుమూర్తి ఆదిశేషుని మీద శయనిస్తాడు. శివుడు నాగభూషణుడు. పాములనే ధరిస్తా
డు. మన భూమిని ఆదిశేషుడు తన తల మీద మోస్తున్నాడు. వినాయకుడి యజ్ఞోపవీతం, ఉదరబంధనం సర్పమే. అమ్మవారి కురులు నాగులు. సుబ్రహ్మణ్యస్వామిని నాగులకు అధినాయకుడిగా కొలుస్తాము.

మన డి.ఏన్.ఏ. కూడా సర్పాకారంలో ఉంటుంది. మనిషి పుట్టుకకు కారణమైన వీర్యకణాలను సూక్ష్మదర్శని (మైక్రో్‌స్కోప్) ద్వారా పరిశీలిస్తే, అవి కూడా సర్పాకారంలోనే ఉంటాయి, వాటి కదలికలు కూడా పాములను పోలి ఉంటాయి. సంతానం కలగని వారు నాగదేవతను పూజించడం చేత సంతానం పొందిన ఉదంతాలు కోకొల్లలు.

వ్యవసాయదారులైన రైతులకు పాములు స్నేహితులు. పంటపొలాల్లో ఉన్న ఎలుకలను తినేసి పంటలను కాపాడుతాయి. పాములు, వాటి శరీర నిర్మాణం రీత్యా పూర్తిగా భూమిని తాకుతాయి. భూమిలో జరిగే ప్రతి చిన్న మార్పును పసిగట్టగలవు. ప్రపంచంలో ఏ మూలన భూకంపం వస్తున్న, కనీసం 30, 40 రోజుల ముందే పాములు పసిగట్టేస్తాయి. పాముల కదిలకలను గమనించి భూకంపాల నుంచి తప్పించుకోవచ్చని ఆధునిక పరిశోధకులు అంటున్నారు.

సనాతన ధర్మంలో నాగబంధం భార్యభర్తలకు ప్రతీక. భార్యభర్తల ఏ విధంగా కలిసి ఉండాలో, కలిసి అధ్యాత్మిక మార్గంలో ఉన్నతి సాధించాలో గుర్తుచేస్తుంది నాగబంధం. నాగారాధన చేయడం వలన చెవుడు రాదు, కంటి జబ్బులు దరిచేరవు.

పాములను చంపడం వలన నాగదోషం వస్తుందంటోంది ధర్మశాస్త్రం. పాములను చంపినా, లేక పాములను భయపెట్టి, పాము తన తలను నేలకేసి బాదుకుని చనిపోవడానికి కారణమైన వారు, పాముపుట్టలను ధ్వంసం చేసినవారి కుటుంబాలను నాగదోషం పట్టిపీడిస్తుంది. పాము, తన తల నేలకు కొట్టుకుని మరణించడానికి కారణమైన వారి వంశం నిర్వీర్యమవుతంది.

అందరు గుర్తుంచుకోవలసిన విషయం పాములను హింసించడం వల్లనే కాదు, తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోకపోయినా, వృద్ధ తల్లిదండ్రులను వీధిపాలి చేసినా, బాధపెట్టినా నాగదోషం వస్తుంది. ధూమపానం(సిగిరెట్టు), మద్యపానం, మత్తుపధార్ధాలు తీసుకోవడం వంటి అలవాట్ల వల్ల కూడా నాగదోషం వస్తుంది. కాబట్టి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి.

పాములు కనిపిస్తే స్నేక్‌సెల్ వారికి అప్పగించండి. పాములను పూజించే సంస్కృతి మనది. చంపే సంస్కృతి కాదు. అందువల్ల పాములను చంపకండి. జీవవైవిధ్యంలో పాములు కీలక పాత్ర వహిస్తాతని గుర్తిచండి.

ఓం నమో మనసాయై   

No comments:

Post a Comment