Showing posts with label మహాభారతం. Show all posts
Showing posts with label మహాభారతం. Show all posts

Sunday, 22 March 2015

హిందూ ధర్మం - 151 (ఋషుల అత్యవసర సమావేశం)

మహాభారత యుద్ధం నాటికి వర్ణవ్యవస్థ మాత్రమే ఉండేది. కులవ్యవస్థలేదు. ఆ యుద్ధంలో ఎందరో యోధులు, వేదశాస్త్రాలను అభ్యసించిన పండితులు, అనేక నాగరికతలకు మూలపురుషులు, అనేక రాజ్యాల రాజులు పాల్గొన్నారు. అందులో వేదసారాన్ని ప్రచారం చేసిన పండితులు కూడా ఉన్నారు. ఈ యుద్ధం కారణంగా వారందరూ మరణించారు. అదీగాక, యుద్ధంలో వాడిన అస్త్రాలు పడి చాలా రాజ్యాలు తుడిచిపెట్టుకొని పోయాయి. అప్పటివరకు వేదం గ్రంధస్థం కాలేదు. ఆ యుద్ధం సమయానికి దాదాపు 197,29,43,963 సంవత్సరాలకు ముందు వేదం మానవాళికి ఇవ్వబండింది. అప్పటినుంచి పరంపరగా, ఎక్కడా ఆటంకం లేకుండా గురుశిష్యపరంపరగా వచ్చింది. కానీ ఈ యుద్ధం ప్రపంచాన్ని చిన్నాభిన్నం చేసింది. భారతదేశంలో రోడ్ల వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిని, రవాణా వ్యవస్థకు తీవ్ర ఆటంకం కలిగింది. ఇదంతా చూసిన ఋషులు, మునులు తీవ్ర ఆలోచనలో పడ్డారు. 'ఋషిః ఆ క్రాంతి దర్శనః' - భవిష్యత్తును దర్శించగలవారిని ఋషులు అంటారు. మానవజాతి మూలపురుషులైన ఋషులు ప్రపంచ భవిష్యత్తును గమనించారు.

అప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఋషులందరూ భరతభూమికి తరలివచ్చారు. తొలిసారిగా 88,000 మంది మహర్షులతో భారతదేశంలో ఒక పెద్దసమావేశం జరిగింది. అది ఒకరకంగా అత్యవసరసమావేశం లాంటిదే. ప్రపంచభవిష్యత్తుపై మేధోమధనం జరిగింది. అది ఒక యజ్ఞం లాంటిది, అనేకులు దానిపై అభిప్రాయాలు పంచుకున్నారు. యుద్ధం ద్వాపరయుగాంతం యొక్క ప్రభావ ఫలితమే. అందుకే అంతపెద్ద జనవినాశనం సంభవించింది. శ్రీ కృష్ణపరమాత్మ మహానిర్యాణంతో ద్వాపరయుగాంతం అవుతుంది. అప్పుడు ప్రపంచాన్ని ఒక మహాజలప్రళయం ముంచెత్తుంతుంది. ప్రపంచనాగరికతలన్నీ నాశనమవుతాయి. అసలే వేదంలో ఉద్దండులైన వారందరూ యుద్ధం కారణంగా మరణించారు, వేదం నశించకపోయినా, వేదం తెలిసినవారందరూ నశించారు. వేదం నిరంతరం అధ్యయనం చేయాలి, అప్పుడే మానవజాతి పురోగమిస్తుంది, ప్రపంచం శాంతి మార్గంలో ప్రకృతి నియమాలకు లోబడి అభివృద్ధి చెందుతుంది. అందరూ రక్షించబడతారు. ................ రాబోయేది కలియుగం. ప్రజల్లో అధ్యాత్మిక భావన తగ్గిపోతుంది, నాస్తికం, దురాచారం, అధర్మం ప్రభలుతుంది. అప్పటివరకు శరీరంతో ఉన్న రాక్షసులు ఈ యుగంలో మానవ మనసుల్లో తిష్టవేస్తారు. వర్ణాశ్రమ ధర్మాలు మంటగలుస్తాయి. కొత్త మతాలు, వాదాలు పుట్టి జనాలను పక్కదారి పట్టిస్తాయి. అప్పటివరకు సమాజంలో సంచరించిన ఋషులు, మునులు ఇవి చూడలేక సమాజానికి దూరంగా తపస్సులో మునిగిపోతారు. ఎప్పుడో ఒకసారి ఒక మహానుభావుడికి దర్శనం ఇచ్చి, ధర్మరక్షణకు పురికొల్పుతారు.

ఇవన్నీ ఒక ఎత్తైతే  ఈ కలియుగంలో మానవుల ఆయుర్దాయం చాలా తక్కువ, కేవలం 120 సంవత్సరాలు మాత్రమే. అది కూడా సక్రమంగా వాడుకోరు. పైగా అల్పబుద్ధులు, అనంతమైన వేదాన్ని ధారణలో నిలుపుకోలేరు. కాబట్టి ఇప్పుడు వేదాన్ని గ్రంధస్థం చేయవలసిన అవసరం ఏర్పడింది అని అందరూ ఏకాభిప్రాయానికి వచ్చారు.. అది మహాసాహసకృత్యం, అప్పటివరకు ఎవరు చేయడానికి పూనుకోనిది.

To be continued ................

Sunday, 15 March 2015

హిందూ ధర్మం -150 (మహాభారతం అణుయుద్ధమా?)

హిరొషిమా, నాగసాకి మీద అణుబాంబు దాడి జరిగేవరకు ఇటువంటి భయంకరమైన మారణ అస్త్రాలు ఉంటాయని ప్రపంచానికి తెలియదు. అప్పటి వరకు భారతీయ ఇతిహాసాలను చదివిన పాశ్చాత్యులు వీటిని కేవలం కల్పనలుగానే భావించారు. కానీ జపాన్ పై దాడి తర్వాత ఆ భావన పూర్తిగా తొలగిపోయింది. అదికాక రేడియో ధార్మికత వలన మానవులకు ఎటువంటి అనారోగ్య ప్రభవాలు ఏర్పడతాయో కుడా భారతంలోనే ప్రస్తావించడం, అచ్చం అలానే జపాన్‌లో జరగడంతో పశ్చిమ దేశాలు ఒక్కసారి ఖంగుతిన్నాయి. అణుబాంబు నుంచి వెలువడిన రేడియేషన్ వలన గోళ్ళు ఊడిపోతాయి, వెంట్రుకలు రాలిపోతాయి, తాత్కాలికంగా నీటిలో మునిగి ఉపశమనం పొందినా, అది దీర్ఘకాలిక ఉపశమనాన్ని ఇవ్వలేదు. హరప్పా, మోహంజెదారొ ప్రాంతంలో పురావస్తు తవ్వకాలు జరిపినప్పుడు అక్కడ చెల్లాచెదురూగా పడి ఉన్న 44 అస్తిపంజరాలను కనుగొన్నారు. వాటి స్థితిగతులను గమనించి, ఏదో భయాంకరమైన ఉపద్రవం సంభవిస్తే, తప్పించుకోడానికి ఒకరి చేతులు ఒకరు గట్టిగా పట్టుకుని పరుగులు తీస్తున్న విధంగా ఉన్నాయి. ఇవి సాధారణ పురావస్తు పరిశోధనలు చేసినా, అవి వేల సంవత్సరాల నాటివని నిర్ధారణ చేశారు. ఈ తర్వాత అనేకానేక ప్రశ్నలు తలెత్తినా, హరప్ప నాగరికత అణుబాంబు వంటి ఒక మానవ ఉపద్రవం వలననే నశించిందని అనేకమంది శాస్త్రవేత్తలు నిర్ధారణకు వచ్చారు.



ఇక్కడ దొరికిన అస్తిపంజరాలు అత్యంత రేడియో ధార్మికత కలిగి ఉన్నాయి. దాదాపు హిరోషిమా, నాగసాకిలో అణుబాంబు కారణంగా మరణించిన వారి అస్తిపంజరాలకంటే కూడా అధికం అని చెప్పవచ్చు. ఒక ప్రదేశంలో రష్యన్ పరిశోధకులు పరిశోధన జరుపగా, అక్కడ రేడియోధార్మికత సాధరణ స్థాయి కంటే 50 రెట్లు అధికంగా ఉంది. ఇదేగాక, ఉత్తరభారత దేశంలో భారి పేలుళ్ళ కారణంగా ద్వంసమైనవిగా భావిస్తున్న మరికొన్ని నగరాలు కనుగొన్నారు. అటువంటి ఒక నగరం గంగానదికి,  రాజ్‌మహల్ పర్వతాలకు మధ్య ఉన్నది. అది అత్యధిక ఉష్ణోగ్రతకు లోనైన ప్రదేశం అని చెప్తున్నారు. అక్కడే భారీ స్థాయిలో కట్టడాలు, పునాదులు ఒకదానితో ఒకటి కలిసిపోయినాయి. వాటికి కారణం అణుబాంబు విస్పోటనం కానీ, లేక అగ్నిపర్వతం బద్దలవ్వడం .......... రెండిటిలో ఏదో ఒకటి కావాలి. అక్కడ ఎటువంటి అగ్నిపర్వతం లేకపోవడం చేత, ఆయా నగరాలు అణుబాంబు కారణంగానే నశించాయని భావిస్తున్నారు.

ఇక్కడ ఒక ఆసక్తికరమైన అంశం గ్రహించాలి.  అణుబాంబు పితామహుడిగా ప్రపంచం ఓఫెనిహీమర్‌ను గుర్తించింది. ఒకసారి ఓఫెనిహీమర్ ఒక కాలేజీలో ప్రసంగానికి వెళ్ళినప్పుడు అక్కడున్న విద్యార్ధి ' లో జరిగిన అణుబాంబు పరీక్ష మొట్టమొదటిదనీ మీరు భావిస్తున్నార?' అని అడుగుతాడు. అంటే ఆ విద్యార్ధి ఉద్ద్యేశం ఇంతకముందు యు.ఎస్.లో ఎప్పుడైన అణుబాంబు పరీక్ష నిర్వహించారా అని. దానికి సమాధానంగా ఓఫెనిహీమర్ 'అవును, ఆధునిక కాలంలో ఇదే మొదటిదీ అని సమాధానం ఇస్తారు. (అనగా ఆధునిక కాలంలో ఇదే మొదటిది, ఇంతకముందు చాలా పూర్వం అనేకం జరిగాయని ఆయన నమ్మకం). ఓఫెనిహీమర్ హార్వర్డ్‌లో అండర్ గ్రాడుయేషన్ చేసారు. తర్వాత ఒక వ్యక్తి పరిచయం ద్వారా సంస్కృతం నేర్చుకున్నారు. సంస్కృతంలో భగవద్గీతను చదివారు. అటు తర్వాత సనాతనధర్మానికి సంబంధించిన గ్రంధాల మీద ప్రత్యేక ఆసక్తి చూపించి, వాటిని అభ్యసించారు. తరుచూ ఆయన ప్రసంగాల్లో మహాభారతం, భగవద్గీత నుంచి శ్లోకాలు ప్రస్తావించేవారు. శివుడి గురించి, కృష్ణుడి గురించి మాట్లాడేవారు. మొదటి అణుబాంబు పరీక్షా సమయంలో కూడా ఓఫెనిహీమర్ భగవద్గీత నుంచి శ్లోకం గట్టిగా చదివి వినిపించారు. భారతీయులకు అణుబాంబుల గురించి జ్ఞానం వేల ఏళ్ళ క్రితమే తెలుసునని నమ్మినవారిలో ఒకరు ఓఫెనిహీమర్. ఈ విధంగా మహాభారతం అణుయుద్ధం అని చెప్పడానికి అనేకానేక పురావస్తు ఆధారాలతో పాటు అనేకమంది  పాశ్చ్యాతుల పరిశోధనలు నొక్కి చెబుతున్నాయి.

To be continued ...............

ఈ రచనకు సహాయపడిన వెబ్‌సైట్లు: http://www.worldwideashram.org/worldwideashram/2011/07/new-proofs-of-nuclear-war-in-ancient-india/

Sunday, 8 March 2015

హిందూ ధర్మం -149 (మహాభారతం అణుయుద్ధమా?)

మహాభారతంలోని మౌసుల పర్వంలో మహాభారత యుద్ధంలో వినియోగించిన అస్త్రాల గురించిన వివరాలు వున్నాయి. అతి వేగంతో ప్రయాణించే విమానాల్లో విశ్వాన్ని సైతం నాశనం చేయగల అణుబాంబులు వున్నాయని రాశారు. పది సూర్యులు ప్రసరించగల వేడిని పుట్టించే అస్త్రాలు వున్నాయని వుంది. ఒకేసారి వేయిమందిని భస్మం చేసే అస్త్రాలను వినియోగించారని పేర్కొన్నారు. వెంట్రుకలు, గోళ్ళు లాంటి వాటితోసహా దగ్ధం చేయగల మారణాస్త్రాలు వుండేవి. మహాభారత యుద్ధం జరిగిన 18 రోజులు వందల కిలోమీటర్ల దూరంలోని పక్షులు సైతం ప్రాణాలు కోల్పోయాయి. యుద్ధ గుడారాల్లోని భోజన పదార్థాలు సైతం సూక్ష్మక్రిములకు నిలయంగా మారాయి. వేలాదిమంది సైనికులు పారిపోయి నదీనదాల్లో మునిగి తేలుతూ ప్రాణాలు కాపాడుకొన్నారు.

మహాభారత యుద్ధం ఒక చారిత్రక సత్యం. శ్రీకృష్ణుని ఆధ్వర్యంలో జరిగిన ఈ యుద్ధంలో ఆయన తన యుద్ధ నైపుణ్యం కన్నా వ్యూహాత్మకంగా యుద్ధం నడిపించగలిగాడు.

కురుక్షేత్రంలోని 50 గజాల విస్తీర్ణంలో ఎపి సెంటర్‌ (భూకంపన కేంద్రం) వున్నట్టు కనుగొన్నారు. ఆ 50 గజాల విస్తీర్ణంలో చాలా లోహాలు కరిగి శిలాజాలై కనపడ్డాయి. వీటిపై పరిశోధనలు జరిపితే ఇవి దాదాపు 3000 బి.సి. కాలం నాటివని తేలింది. రోమ్‌కు చెందిన ప్రొఫెసర్‌ అంటోనియో క్యాస్టెల్లానీ కురుక్షేత్ర యుద్ధం జరిగిన ప్రాంతాన్ని సందర్శించిన తర్వాత ఒక వ్యాసం రాస్తూ అక్కడ ప్రాణాలు కోల్పోయినవారి శరీరాల్లోని ఎముకల శకలాలను పరిశీలించిన తర్వాత ఆ మరణాలు అణుయుద్ధం వల్ల సంభవించినవిగానే నిర్ధారించారు.

ఇదికాక, మహాభారత యుద్ధం నాటి అణుబాంబుల రేడియో ధార్మికత ప్రభావం రాజస్థాన్ ప్రాంతంలో ఈనాటికి ఉంది. రేడియో ధార్మికత ప్రభావం కలిగిన బూడీ పొరలు జోధ్‌పూర్‌కు పశ్చిమంగా 10 మైళ్ళ దూరం లో 3 మైళ్ళ మేర విస్తరించి ఉంది. దాని మీద శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. ఆ ప్రాంతంలో ప్రజలు అంగవైకల్యాలతో పుట్టడం, క్యాన్సర్ బారిన పడడం గమనించారు. అక్కడున్న రేడియేషన్ స్థాయులు గమనించిన ప్రభుత్వం, ఆ ప్రాంతాన్ని నివాసయోగ్యం కానిదిగా భావించి, అక్కడ గృహనిర్మాణాలు చేపట్టలేదు.

ఆ ప్రదేశంలో శాస్త్రవేత్తలు ఒక పురాతన నగరాన్ని కనుగొన్నారు. దాని వయసు సుమారు 8,000 నుంచి 12,000 సంవత్సరాలుగా ఆత్యాధునిక పద్దతులలో పరిశోధించి నిర్ధారణకు వచ్చారు. ఆ ప్రాంతం భారీ అణువిస్పోటనానికి గురైందని, చాలా నిర్మాణాలు నాశమయ్యాయని, 5 లక్షలకు పైగా జనాభా ఆ బాంబు కారణంగా మరణించారని భావిస్తున్నారు. ఒక పరిశోధకుడి అంచనా ప్రకారం అక్కడ పడిన అణుబాంబు జపాన్‌లో పడిన అణుబాంబుకు సమానమైందని అంటున్నారు.

To be continued ...........................

ఈ రచనకు సహాయపడిన వెబ్‌సైట్లు:
ఆంధ్రప్రభ 3 జనవరి 2015, శనివారం ప్రచురితమైన వ్యాసం.
http://higher-perspective.blogspot.in/2013/10/ancient-city-discovered-in-india.html

Sunday, 1 March 2015

హిందూ ధర్మం -148 (మహాభారతం అణుయుద్ధమా?)

47,23,920 మహాభారత యుద్ధంలో పాల్గొన్నా యుద్ధం ముగిసేసరికి 10 మాత్రమే మిగిలారు. అందులో పాండవుల పక్షం నుంచి పంచపాండవులు (ధర్మరాజు, అర్జునుడు, భీముడు, నకులుడు, సహదేవుడు), శ్రీ కేష్ణుడు, సాత్యకి (యుయూధనుడు) కలిపి 7 మంది, కౌరవుల పక్షం నుంచి 3, అశ్వత్థామ, కృతవర్మ, కృపాచార్యుడు. ఇంత భారీ జననష్టం కలగడానికి కారణం మహాభారత యుద్ధంలో అణ్వస్త్రాలు ప్రయోగించడమే అనే వాదన కూడా ఉంది. మహాభారతం మాములు యుద్ధం కాదు అణుయుద్ధం అని అనేకమంది పాశ్చాత చరిత్రకారులు, శాస్త్రవేత్తలు వాదిస్తున్నారు. ఈ విషయం మీద దాదాపు 100 సంవత్సరాల నుంచి చర్చ జరుగుతూనే ఉంది. ఇక్కడ కొంత సంధిగ్దత నెలకొంది.

18 రోజుల్లో 47 లక్షల పై చిలుకు జనాభా మరణించడం సామాన్యమైన విషయం కాదు. అది మాములు ఆయుధాలతో సాధ్యమయ్యేదీ కాదు. మహాభారత యుద్ధం జరిగిన కురుక్షేత్రం ఇప్పుడు చెప్పబడుతున్న కురుక్షేత్రం ప్రాంతం కంటే చాలా పెద్దది. ధార్మిక గ్రంధాల్లో రెండు రకాల అస్త్రాలు ప్రస్తావించబడ్డాయి. ఒకటి అస్త్రాలు, రెండు శస్త్రాలు. అస్త్రం అనగా మంత్రించి ప్రయోగించేది, మంత్రించిన గడ్డిపరక కూడా అత్యంత శక్తివంతంగా పనిచేస్తుంది. శస్త్రం అనగా అణ్వస్త్రం, మిస్సైల్. బాణాలను లాంచర్స్ గా అర్దం చేసుకోవచ్చు.

అర్జునుడి గాండీవం కూడా లాంచరే (launcher) అంటున్నారు పాశ్చాత్య పరిశోధకులు. అట్లాగే అక్షయ బాణ తూణీరాలు అనగా మిస్సైల్స్‌ అని చెప్తున్నారు. ఆధునిక సాంకేతిక యుద్ధ అస్త్రాల్లో టెస్లాషీల్డ్‌ అనే అస్త్రం (మిస్సైల్‌) వుంది. శత్రువు ప్రయోగించిన వందలాది అస్త్రాలను ఈ టెస్లాషీల్డ్‌ అనే అస్త్రం నిర్వీర్యం చేస్తుంది. అంటే ఈ అస్త్రం స్వీయ రక్షణకన్నమాట. ఇలాంటి అస్త్రాలు సైతం మహాభారతంలో వినియోగించబడ్డాయి. అర్జునుడు మహాభారత యుద్ధం జరిగిన తొలి రెండు రోజులూ శత్రువు ప్రయోగిం చిన అస్త్రాలనన్నింటినీ నిర్వీర్యం చేశాడని వ్యాసుడు రాశాడు. నిర్వీర్యం అంటే ఈ అస్త్రం నుంచి వెలువడే అత్యంత శక్తి శత్రువు ఉపయోగించిన అస్త్రాన్ని తాకి వెంటనే ఆవిరి చేస్తుంది.

మహాభారతంలో గ్రహాంతరవాసులు కూడా పాల్గొన్నారని కొంతమంది విదేశీ పరిశోధకుల వాదన. 'కొన్ని సాధారణ అస్త్రాలు (మిస్సైల్స్‌) వినియోగించే నైపుణ్యం యుద్ధం చేసే వాడికే వుండేది. ఈ విద్యలో సైతం గ్రహాంతరవాసులే శిక్షణను ఇచ్చినా మరీ భీకర అస్త్రాల నియంత్రణ గెలాక్సీ నివాసుల చేతుల్లోనే వుండివుండాలి. కొన్ని అస్త్రాలకు ఐపీ అడ్రసులు సైతం వుండి వుండవచ్చు' అంటున్నారు జర్మనీకి చెందిన కొల్విన్‌ హెచ్చర్‌. మహాభారత యుద్ధం జరిగిన విధానంపై హెచ్చర్‌ 22 సంవత్సరాల క్రితమే పరిశోధన చేసి పి.హెచ్‌.డి. పట్టా పొందాడు. అయితే ఈ అస్త్రాలన్నీ (మిస్సైల్స్‌) ప్రస్తుతం ఉపయోగిస్తున్న శాస్త్ర పరిజ్ఞానానికన్నా భిన్నంగా వుండే అవకాశాలు వున్నాయి. మహాభారత యుద్ధంలో కోటికి పైగా యోధులు మరణించారంటే ఈ యుద్ధం మహాభీకరమైన అస్త్ర శస్త్రాలతో కొనసాగిందనే చెప్పాలి.

18 రోజుల్లోనే ఇంత పెద్ద సంఖ్యలో మరణాలు సంభవించడం సామాన్య యుద్ధంలో జరిగే పనికాదు. సామ్రాట్‌ అశోకుడు చేసిన కళింగయుద్ధంలో 16వేల మందే మరణించారని చరిత్రకారులు రాశారు. మహాభారత యుద్ధంలో చాలా భయానకమైన న్యూక్లియర్‌ ఆయుధాలను వినియోగించి వుండాలని శాస్త్రజ్ఞులు అనుమానిస్తున్నారు. ప్రతిరోజూ మూకుమ్మడి మరణాలు సంభవించి వుండాలి. మొహంజిదారో నాగరికత ఒకే ఒక్క రోజులో నాశనం అయి వుండవచ్చని చరిత్ర పరిశోధకులు భావిస్తున్నారు. నాగసాకిపై ప్రయోగించిన అణుబాంబు విస్ఫోటం లాంటిదే మొహం జదారో నగరంలో జరిగి వుండవచ్చన్నది శాస్త్రజ్ఞుల అనుమానం.

అసలు ఆ కాలంలో ఇంత సాంకేతిక పరిజ్ఞానం ఉందా? క్రీస్తుకు పూర్వం భూమిపైని మానవుల్లో ఇంతటి సాంకేతిక పరిజ్ఞానం వున్నట్లు ఇటలీకి చెందిన మిలన్‌ అనే పరిశోధకుడు 1979లో తను రాసిన ‘అటామిక్‌ డిస్ట్రక్సన్‌ ఇన్‌ 3000 బి.సి’ అనే పుస్తకంలో పేర్కొన్నాడు.

మహాభారతం అణుయుద్ధం అనడానికి ఏమైనా ఆధారాలు దొరికాయా?

To be continued ..................

ఈ రచనకు సహాయపడిన వెబ్‌సైట్లు:
https://ramanan50.wordpress.com/2013/09/29/details-of-army-strength-mahabharata/
ఆంధ్రప్రభ 3 జనవరి 2015, శనివారం ప్రచురితమైన వ్యాసం.

Sunday, 22 February 2015

హిందూ ధర్మం - 147 (మహాభారతయుద్ధంలో పాల్గొన్న సైన్యం సంఖ్య)

18 రోజులు జరిగిన మహాభారత యుద్ధంలో మొత్తం 18 అక్షౌహిణిల సైన్యం పాల్గొంది. అసలు అక్షౌహిణి అంటే ఎంత?

ఒక రథము, ఒక ఏనుగు, మూడు గుర్రాలు, అయిదుగురు కాల్బంబులు (పదాతి దళం) కలిసిన సైన్యానికి ‘పత్తి' అని పేరు. అనగా 1:1:3:5 నిష్పత్తిలో ఉంటుంది సేన. దీనికి మూడు రెట్లయిన సైన్యాన్ని ‘సేనాముఖము' అంటారు. మూడు రథాలు, మూడు ఏనుగులు, తొమ్మిది గుర్రాలు, పదిహేను మంది కాల్బలము ఇందులో ఉంటారు. 

సేనాముఖానికి మూడు రెట్లును ‘గుల్మము' అంటారు. ఇందులో తొమ్మిది రథాలు, తొమ్మిది ఏనుగులు, 27 గుర్రాలు, 45 మంది కాలిబంట్లు వుంటారు. గుల్మానికి మూడు రెట్లు ‘గణము' ఇందులో 27 రథాలు, 27 ఏనుగులు, 81 గుర్రాలు, 135 మంది కాలిబంట్లుంటారు. గణానికి మూడు రెట్లు ‘వాహిని'. ఇందులో 81 రథాలు, 81 ఏనుగులు, 2432 గుర్రాలు, 405 మంది కాలిబంట్లు వుంటారు.  

వాహినికి మూడు రెట్లు ‘పౄతన' అంటే 243 రథాలు, 243 ఏనుగులు, 729 గుర్రాలు, 1215 మంది కాలిబంట్లు. పౄతనకు మూడు రెట్లు ‘చమువు' ఇందులో 729 రథాలు, 729 ఏనుగులు, 2187 గుర్రాలు, 3645 మంది కాలిబంట్లుంటారు.

చముకు మూడు రెట్లు ‘అనీకిని'. ఇందులో 2187 రథాలు, 2187 ఏనుగులు, 6561 గుర్రాలు, 10925 మంది కాలిబంట్లు వుంటారు. అనీకినికి పది రెట్లయితే ‘అక్షౌహిణి' అవుతుంది. అంటే అక్షౌహినిలో 21,870 రథాలు, 21,870 ఏనుగులు, 65,610 గుర్రాలు, 1,09,350 మంది కాల్బలము వుంటారు. ఇటువంటి అక్షౌహిణులు 18 కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్నాయి. అంటే 3,93,660 రథాలు, 3,93,660 ఏనుగులు, 11,80,890 గుర్రాలు, 19,88,330 కాల్బలము అన్నమాట. ఇక్కడ మరో విషయాన్ని తెలియజేయాలి. ఒక్కొక్క రథం మీద ఒక యుద్ధ వీరునితో పాటు ఒక సారథి కూడా వుంటాడు. కాబట్టి సారథులను కూడా లెక్కలోకి తీసుకోవాలి. అప్పుడు రథబలం 7,87,320 అవుతుంది. అలాగే గజబలంలో కూడా ఒక్కొక్క ఏనుగు మీదయుద్ధ వీరునితో పాటు ఒక మావటీ వాడు కూడా వుంటాడు. కాబట్టి గజబలం కూడా 7,87,329 అవుతుంది. వీటన్నింటిని కలిపితే కురుక్షేత్ర యుద్ధంలో 47,23,920 మంది పాల్గొన్నట్లు తెలుస్తుంది. ఈ 18 అక్షౌహిణుల్లో పాండవ బలం మాత్రం 7 అక్షౌహిణులు, కౌరవ బలం 11 అక్షౌహిణిలు. 

To be continued ............

ఈ రచనకు సహాయపడిన వెబ్‌సైట్లు: 
సంస్కృతి – సాంప్రదాయం – భక్తి http://goo.gl/tUI5YR

Thursday, 12 February 2015

హిందూ ధర్మం - 146 (మయసభ, రోము రాయబారి, మహాభారతం)

భారత్ భౌతిక సంపదలోనే కాక, ఆధ్యాత్మిక సంపదలో కూడా ధనవంతురాలు, శక్తివంతురాలు. ద్వాపరయుగాంతం నాటికి భారత్‌కు గొప్ప క్షత్రియబలం ఉంది, అణుబాంబులు అత్యధికంగా మన దగ్గరే ఉన్నాయి. ప్రపంచమంతా భరతమాత కాళ్ళ ముందు మోకరిల్లింది. దక్షిణ అమెరికాలో పెరులో విలసిల్లిన మయాన్ నాగరికత మూలుపురుషుడు మయుడు / మయాసురుడు. ఈయన ప్రస్తావన భారతంలో ఉంది. అమెరికాలోకి తెల్లదొరలు ప్రవేశించకముందు అక్కడున్న సంస్కృతి హిందూ సంస్కృతికి చాలా దగ్గరగా ఉండేది. ఒకప్పుడు అమెరికాలో హైందవం ఉందండానికి ఆధారం ఆ దేశంలో జరిగిన పురాతన గణపతి, సూర్య, దేవి విగ్రహాలు, శ్రీ చక్రాలు. (వివరాలకు ఈ లింక్ చూడండి http://ecoganesha.blogspot.in/2014_06_01_archive.html )  అట్లాగే మయుడు కూడా వౌదిక ధర్మాన్ని అనుసరించేవాడే. మయుడు శిల్పి, విశ్వకర్మ. సముద్రగర్భంలో కలిసిపోయినట్టుగా భావిస్తున్న అపూర్వమైన అట్లాంటిస్ నగరం ఈయందేనని, అట్లాంటిస్‌కు మయా నాగరికతకు సంబంధం ఉందని చెప్తున్నారు అక్కడి పరిశోధకులు.

ప్రపంచంలో ధర్మం లోపించినప్పుడు ధర్మప్రచారం చేసి, ప్రపంచాన్ని ఉద్ధరించేది భారతదేశమే, ఇక్కడే సమస్త విద్యలు పుట్టాయి, ఋషులు అనేకులు ఈ భూమిని ఎంతో గొప్పదిగా కీర్తించారు. ఆయా కారణాల చేత ప్రపంచం భరతఖండాన్ని ప్రపంచం గౌరవించింది. అదే గౌరవంతో ధర్మరాజుకు కానుకగా మయుడు తన దగ్గరున్న అపూర్వమైన విద్యతో, విజ్ఞానపటిమతో హస్తినాపురంలో మయసభను నిర్మించాడు. అదీగాక, అప్పుడు భారత్ ప్రపంచశక్తి (Super power), ధర్మరాజు సామ్రాట్టు (Emperor). మహాభారతం సభాపర్వం దీన్ని వివరిస్తుంది. భౌతిక శాస్త్రంలో (physics) కాంతి పర్వార్తనం (refraction), ప్రతిబింబించడం (reflection),  ద్వైధీభూతం (Di-fraction) కావడం, ఇంద్రధనస్సు (rainbow) లాగ విరిగి వికృతి పొందడం వంటి శాస్త్ర విషయాలను ఆధారంగా చేసుకుని, ఉన్న వస్తువులను లేనట్టుగాను, లేని వస్తువులను ఉన్నట్టుగాను కనిపించే అద్భుతరీతలో ఈ 'మయసభ' నిర్మాణం జరిగింది. ఇది ఇప్పటి పార్లమెంటు హాలు వంటిది అనుకోవచ్చు. ఈ మయసభ నిర్మాణం చూడటానికి వచ్చిన దుర్యోధనుడు, నీళ్ళున్న చోట లేవనుకుని భ్రాంతి చెంది జారిపడటం, అది చూసి ద్రౌపది నవ్వడం, ఆ తర్వాత జరిగిన కధ తెలిసిందే. ఎడారిలో నీరు లేకున్నా, ఉన్నట్లు కనిపించడం కాంతిరేఖలు వంగటం వల్లనే జరుగుతుందని ఈనాటి సైన్సు చెపుతోంది. ఇటువంటి వైజ్ఞానిక సత్యాలే మయసభ నిర్మాణానికి ఉపయోగించినట్టు స్పష్టం అవుతోంది.

రాజసూయ యాగంలో ధర్మరాజును సామ్రాట్టుగా చేసినప్పుడు, ఆయనకు బహుమానాలు ఇవ్వటానికి ప్రపంచ నలుమూలల నుంచి అనేకమంది రాజులు భారతదేశానికి వచ్చినట్టు వ్యాసమహర్షి సభాపర్వం 52 లో చెప్పారు. అందులో రోము సామ్రాజ్యం కూడా ఉంది. రోమన్ సామ్రాజ్యం నుంచి రాయబారి హస్తినాపురానికి వచ్చి ధర్మరాజుకు నగలు, బహుమానాలు ఇచ్చారు. భారత్ ఇంతగొప్ప శక్తి కాబట్టే, మహాభారత సంగ్రామంలో ప్రపంచం మొత్తం రెండుగా చీలి, కొందరు కౌరవుల తరుపున, మరికొందరు పాండవుల తరుపున యుద్ధంలో పాల్గొన్నారు.

To be continued ...................
ఈ రచనకు సహాయపడిన గ్రంధం : మనదేశం, మన సంస్కృతి - డా|| వేదవ్యాస, ఐ.ఏ.ఎస్.

Wednesday, 11 February 2015

హిందూ ధర్మం - 145 (భారతదేశ అవతరణ)

శ్రీ కృష్ణుడు చారిత్రిక వ్యక్తి మాత్రమే కాదు, చరిత్రాత్మకవ్యక్తి కూడా. ఆయన ఆధ్వర్యంలోనే భారతదేశం కొత్త రూపు సంతరించుకుంది. శ్రీ కృష్ణుడు జన్మించేసరికి భారతదేశం అనేక రాజ్యాలుగా, వేర్వేరు రాజుల చేత పరిపాలించబడుతూ ఉండేది. ఎవరిలోనూ ఐకమత్యం లేదు. అటువంటి సమయంలో శ్రీ కృష్ణుడు ధర్మరాజుతో రాజసూయ యాగాన్ని జరిపించాడు. ఆ యాగాన్ని సాకుగా చూపి, భరతఖండంలో ఉన్న రాజులందరిని ఒకే ఛత్రం క్రిందకు తీసుకువచ్చి, 18 రాష్ట్రాలతో, ఢిల్లీలో ధర్మరాజు ఆద్వర్యంలో కేంద్రప్రభుత్వాన్ని స్థాపించి, దేశాన్ని సంఘటితం చేశాడు, భారతదేశానికి ఒక రాజ్యాంగం కూడా అందించాడు. ఆ ప్రయత్నంలో తన బంధువులను, మిత్రులను, రాజులను కోల్పోయిన లేక్క చేయకుండా ప్రపంచ యుద్ధమైన మహాభారతాన్ని విజయవంతంగా నడిపించి, ధర్మాన్ని గెలిపించాడు. ఇదంతా వ్యాసుడి సంస్కృత మహాభారతంలో చెప్పబడింది. ఆధునిక కాలంలో 1947, తర్వాత స్వతంత్ర భారతంలో 562 రాజ్యాలను ఎంతో చాకచక్యంగా విలీనం చేసినట్లుగా, 5000 ఏళ్ళ క్రితమే శ్రీ కృష్ణుడు భారతదేశాన్ని సంఘటితం చేశాడు.

యుగపురుషుడు, మనదేశం - మన సంస్కృతి గ్రంధకర్త. డా|| వేదవ్యాస, ఐ.ఏ.ఎస్. గారి మాటల్లో చెప్పాలంటే 'మహాభారత యుద్ధం గెలిచిన తర్వాత కూడా పదవీ కాంక్ష లేకుండా, ప్రజారంజకుడు, సత్యధర్మపరాయణుడైన ధర్మరాజుని భారతదేశ సింహాసనం మీద అధిష్ఠింపజేసి, తాను ఏ పదవీ తీసుకోకుండా, ద్వారకకు పోయి, ఎంతో సామాన్యమైన జీవితం గడిపిన మహాపురుషుడు, దేశభక్తుడు త్యాగి, మహారాజనీతి దురంధరుడు శ్రీ కృష్ణుడు'.

ఆయన ఆ రోజు సంఘటితం చేసిన కారణంగానే భారతదేశం ఇప్పటికి కనీసం ఈ కొద్దిభాగమైన మిగిలింది. శ్రీ కృష్ణపరమాత్మ యోగి, తాత్వికుడు, యుగపురుషుడు. ప్రపంచభవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, ఒక దేశంగా ఏకం కాకుంటే భారత్ జీవించలేదని ముందే గ్రహించారు. ఆయన సంకల్పం వల్లనే 800 వందల సంవత్సరాల పరాయిపాలన తర్వాత కూడా భారతీయులందరిలో ఐకమత్యం వర్ధిల్లింది. ఎన్నో భిన్న సంస్కృతులు, భాషలు, సంప్రదాయాలు ఉన్నా, మా అందరిది ఒకే ధర్మం, ఒకే దేశమని చెప్పగలుగుతున్నామంటే అది కృష్ణుడి సంకల్ప శక్తి మాత్రమే. కృష్ణుడు అర్జునుడికి చెప్పిన గీత కురుక్షేత్రానికి మాత్రమే పరిమితం కాలేదు. మొన్నటి స్వాతంత్ర సంగ్రామంలో కూడా అనేకమంది సమరయోధులు భగవద్గీత చేత ప్రభావితం చెంది, దేశాన్ని దాస్యశృంఖలాల నుంచి విడిపించారు. రవీంద్ర నాథ్ ఠాగూర్ జాతీయగీతంలో జనగణమన అధినాయక జయహే భారత భాగ్యవిధాత అంటారు. ఆయన ఎవరిని ఉద్ద్యేశించి ఆ గీతం రాసిన, అందులో చెప్పిన భారతభాగ్యవిధాత మాత్రం శ్రీ కృష్ణుడే. ఐక్యతలేకపొవడం, ధర్మప్రచారం లోపించడంవలన పశ్చిమాన ఈజిప్ట్ వరకు, తూర్పున భ్రూనై వరకు ఉన్న అఖండభారతం కాలక్రమంలో చిన్న చిన్న ముక్కలైపోయింది, ఆఖరికి కొన్ని రాజకీయ కారణల వల్ల పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లు కూడా ఏర్పడి ఇప్పుడున్న చిన్న ప్రాంతానికి భారత్ పరిమితమైంది. తన భూభాగంలో 90% పైగా కోల్పోయింది.

To be continued .......................

Tuesday, 10 February 2015

హిందూ ధర్మం - 144 (భారతదేశం - ప్రబలశక్తి)

చాలామంది మహాభారతం కేవలం భారతదేశానికి మాత్రమే చెందిన ఇతిహాసం అనుకుంటారు. కానీ నిజానికి మహాభారతం ప్రపంచ ఇతిహాసం. ప్రపంచ చరిత్రను మలుపు తిప్పిన ఘటన అది. మహాభారత యుద్ధం అనేది ఒక ప్రపంచయుద్దం. అందులో ప్రపంచసేనలన్నీ పాల్గొన్నాయి. ప్రపంచం మొత్తం రెండుగా చీలిపోయింది. ఒకటి కౌరవుల పక్షం, రెండవది పాండవుల పక్షం. ఇలా ప్రపంచం రెండూగా చీలిపోవటానికి, అది భారతదేశం కోసం జరగటానికి కారణం ఒక్కటే.

ద్వాపరయుగాంతం నాటికి భారత్ ఒక ప్రపంచశక్తి. అవును .......... అప్పటికి భారత్ ప్రబల శక్తి. 100 ఏళ్ళ క్రితం అతి చిన్నదేశమైన బ్రిటన్ ప్రపంచాన్ని అదుపులో పెట్టుకుంది. ఇప్పుడు అమెరికా ప్రపంచశక్తిగా ప్రపంచాన్ని శాసిస్తోంది. అతి చిన్నదేశమైన బ్రిటన్ ప్రపంచాన్ని పాలించగాలేనిది శాస్త్రం, విజ్ఞానం, సాంకేతికపరిజ్ఞానం, అన్ని శాస్త్రాలకు పుట్టినిల్లైన భారతదేశం ప్రపంచంలో ప్రబలశక్తిగా లేదని వాదించడం ఎంతవరకు సమంజసం. భారతదేశం వేదభూమి, కర్మ భూమి, జ్ఞానభూమి, యోగభూమి, మోక్షభూమి, తపోభూమి.

1947 లో స్వాతంత్ర్యం వచ్చేవరకు భారత్ ఎప్పుడు ఒక దేశంగా లేదని, అది వివిధరాజుల క్రింద అనేకరాజ్యాలుగా పరిపాలించబడిందని కొందరు వాదిస్తుంటారు. ఇంకొందరు ఒక అడుగు ముందుకేసి, భారతదేశం భిన్నజాతులు, నాగరికతలు, సంస్కృతుల సంఘర్షణతో కూడినదని, అది ఒక దేశంగా ఉండరాదని, ఏ ముక్కకు ఆ ముక్క విడగొట్టి ప్రత్యేక దేశాలు చేయాలని వాదనలు తీసుకువస్తూ దేశవిద్రోహానికి పాల్పడుతున్నారు. కానీ భారత్ ఒక దేశంగా 5,000 ఏళ్ళ క్రితమే ఆవ్హిరభించింది. అంతకముందు కూడా భారత్ ఎప్పుడు ప్రత్యేకంగానే ఉంది. 'జంబూ ద్వీపే, భరతవర్షే, భరతఖండే' అంటూ ప్రతి రోజు పూజా ప్రారంభంలో సంకల్పం చెప్తారు. భారత్ ఈ సృష్టి ఆది నుంచే ఒక దేశంగా కొనసాగుతోంది. దేశసమైఖ్యత ఈ మట్టిలోనే ఉంది. అయినప్పటికి భరతఖండం ఒక దేశంగా మహాభారతం వరకు పూర్తిగా అవతరించలేదు. రామయణ సమయానికి భరతఖండం ఉన్నా, అది అనేకమంది రాజుల పరిపాలనలో కొనసాగింది. ద్వాపరయుగంలో కూడ ఇదే పరిస్థితి. కానీ మహోన్నతమైన చరిత్ర కలిగిన భరతవర్షం, భరతఖండం ఎప్పటికి ఒకే దేశంగా కొనసాగాలని శ్రీ కృష్ణ పరమాత్మ సంకల్పించారు. ఏం చేశారో తరువాయి భాగంలో తెలుసుకుందాం

To be continued ...................

Monday, 9 February 2015

హిందూ ధర్మం - 143

క్రిందటి భాగంలో చెప్పుకున్న శాసనాలు మహాభారతానికి, మహాభారతంలో చెప్పబడిన వ్యక్తులు ఉన్నారనడానికి శాసనమైన ఆధారాలు. ఈ శాసనాలను కుట్రపూరితంగా ఆంగ్లేయులు త్రొక్కివేశారు. కొన్నిటిని నాశనం చేశారు. వాటికి రకరకాల అబద్ధాలను అంటగట్టారు, అయినా సత్యాన్ని ఎవడు దాచలేడు. అనేక మంది పరిశోధకులు ఈ రాగిశాసనాలను పరిశీలించారు. మొదటి శాసనంలో చెప్పబడిన గ్రామాలు ఇప్పటికి ఉన్నాయి.

ఈ శాసనాలు, పురావస్తు ఆధారాలు మహాభారతం చరిత్రలో జరిగిన యధార్ధం అని మళ్ళీమళ్ళీ ఋజువు చేస్తున్నాయి. వాటిని కార్బన్ డేటింగ్ చేసి కాలాన్ని కూడా లెక్కవేశారు. ఇవిగాక మహాభారతంలో చెప్పబడ్డ గ్రహగతులను లెక్కించి చరిత్రలో మహాభారత కాలాన్ని లెక్కించారు. మహాభారత కాలాన్ని లెక్కించడంలో ఖగోళ, జ్యోతిష్య శాస్త్రాలు, అత్యాధునిక కార్బన్ డేటింగ్ పద్ధతి మొదలైనవి ఒకదానితో ఒకటి సరిపోతున్నాయి.

ఇదిఅదే కాక, ఆదిశంకరుల విషయంలో దొరికిన శాసనం బ్రిటిషర్లు లెక్క కట్టిన ఆదిశంకరుల జీవించిన కాలమానానికి పూర్తి విరుద్ధం. ఆంగ్లేయులు కుత్సిత బుద్ధితో ఆదిశంకరుల కాలాన్ని 1000 సంవత్సరాలు ముందు లాగి క్రీ.శ. 5 కాలానికి తీసుకువచ్చారు. కానీ దానికి ఎటువంటి ఆధారాలు చూపలేకపోయారు.

ఇన్ని ఆధారాలు చూపడానికి కారణం ఒక్కటే. భారతీయ ఇతిహాసలు ప్రపంచ చరిత్రలే కానీ కట్టుకధలు, కపోల కల్పనలు కాదు. మన పిల్లలు లేక మన స్నేహితులు మనల్ని మహాభారతం ఎప్పుడు జరిగింది అని ప్రశ్నిస్తే, వారికి ఒక తేదీ చెప్పాలి. అందుకోసమే ఇంగ్లీష్ సంవత్సరాలు చెప్పడం జరిగింది. అదీగాక ఇప్పుడు ప్రపంచమంతా గ్రిగేరియన్ క్యాలండర్‌నే ఫాలో అవుతున్నారు. ప్రపంచానికి హిందువులు తమ చరిత్ర గురించి చెప్పుకోవలసి వచ్చినప్పుడు, ప్రపంచంలో అందరికి సులువుగా అర్దమయ్యేలా చెప్పాలి. అందుకోసమే మహాభారతం నవబరు 22, క్రీ.పూ.3138 న మొదలైందని ఆ రోజు ఉన్న ఆంగ్లతేదీని చెప్పుకుంటున్నాం. ఇన్ని శాసనాలు, ఆధారాలు కళ్ళ ముందు కనబడుతున్నా, ఇంకా మహాభారతం కేవలం ఒక కధ మాత్రమేనని, దాన్ని నమ్మడం మూఢనమ్మకమని చెప్పేవారిని ఏమనాలో హిందువులే నిర్ణయించుకోవాలి.

To be continued ................

Sunday, 8 February 2015

హిందూ ధర్మం - 142 (జనమేజయ శాసనాలు)

పరీక్షిత్ మహారాజు క్రీ.పూ.3041 లో మరణించగా, ఆయన కుమారుడు జనమేజయుడు సింహాసనాన్ని అధిష్టించాడు. జనమేజయ మహారాజు పరిపాలనలో 29 వ సంవత్సరంలో అంటే క్రీ.పూ.3013-3012 లో, అనగా కలియుగం మొదలై 89 ఏళ్ళు గడిచిన తర్వాత ప్లవంగ నామ సంవత్సరం, సోమవారం, చైత్ర అమావాస్య నాడు రెండు గ్రామాలను దానం చేశారు, రెండు దానశాసనాలు వేయించారు. ఇది ఐహోల్ దగ్గర ఉన్నది. మొదటి శాసనం  Indian Antiquary లో 333,334 పేజీలలో ప్రచురితమైంది. జయాభ్యుదయ యుధిష్ఠర శకం 89 అనగా, కలియుగం 89 వ సంవత్సరంలో (క్రీ.పూ.3012) లో శ్రీ సీతారామస్వామి పూజాదికాల కోసం భూమి దానం చేసినట్టుగా స్పష్టం అవుతోంది.



Kishkinda inscription pictures




రెండవ శాసనం ఈ రోజు వరకు హిమాలయాల దగ్గర కేదార క్షేత్రంలో రక్షించబడుతూ వస్తోంది. అది రాగిరేకుల మీద వేయించబడ్డ శాసనం. కేదారనాధ స్వామి పూజాదికాల కోసం జనమేజయుడు కొంత భూమి దానం చేశాడనేది దాని సారాంశం.

kedharnath inscription pictures



మూడవశాసనం దార్వడ్ జిల్లాలో ఐబల్లి అనే గ్రామంలో శివాలయం గోడలపై పులికేశి - 2 రాజు వేయించిన శాసనం.

నాల్గవ శాసనం గుజరాత్‌ను పరిపాలించిన సుధన్వ మహారాజుకు చెందిన తామ్రశాసనం. యుదిష్ఠర శకం 2663 లో ఆదిశంకరులకు గుర్తుగా రాగి రేకులపై శాసనం రాయించి ఇచ్చినట్టుగా ఇది తెలియజేస్తోంది. ఇది ఆదిశంకరుల కాలాన్ని కూడా ఋజువు చేయటానికి ఒక సాక్ష్యం. ఆదిశంకరులు యుధిష్టర శకం 2663 ప్రాంతంలో నివసించారు. యుదిష్ఠరశకం  క్రీ.పూ.3138 లో మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత మొదలైంది. అక్కడి నుంచి 2662 సంవత్సరాలు కూడితే, ఆదిశంకరులు క్రీ.పూ.476-77 నుంచి 509 వరకు జీవించారని ఋజువు అవుతోంది.

To be continued ....................

ఈ రచనకు సహాయపడైన వెబ్‌సైట్లు:
http://mahabharathascience.blogspot.in/p/material-evidence-supporting-time-of.html
http://jayasreesaranathan.blogspot.in/2011/11/inscriptional-evidence-for-mahabharata.html

Saturday, 7 February 2015

హిందూ ధర్మం - 141 (మహాభారతానికి పురావస్తు ఆధారాలు)

ద్వారక కాకుండా మహాభారతం చరిత్రలో జరిగిందనడానికి మరికొన్ని ఆధారాలు దొరికాయి. ఉత్తరభారతదేశంలో 35 కు పైగా ప్రదేశాల్లో పురావస్తు ఆధారాలు లభించాయి. అవన్నీ మహాభారత గ్రంధంలో ప్రస్తావించబడిన పురాతన నగరాలుగా ఏవైతే పిలువుబడ్డాయో, అక్కడే లభించాయి.అక్కడ రాగిపాత్రలు, ఇనుము వస్తువులు, ముద్రలు, వెండి, బంగారు నగలు, టెర్రాకోట వస్తువులు, ఇతర సామగ్రి దొరికాయి. వీటి మీద పరిశోధన చేసినప్పుడు వీటి కాలం పండితులు చెప్తున్న మహాభారత కాలానికి సరిపోతోంది.

ఇది కాకుండా దక్షిణభారతదేశంలో కర్ణాటక రాష్ట్రలో తుంగభధ్ర నదీ తీరంలోనూ, ఐహోల్, హళిబిద్ద మొదలైన ప్రాంతాల్లో దొరికాయి. వీటిలో ఐహోల్‌లో దొరికిన తామ్రశాసనం ప్రధానమైనది. అర్జునుడికి జన్మించినవాడు అభిమన్యుడు, అభిమన్యుడి కుమారుడు పరీక్షిత్ మహారాజు, ఆయన కుమారుడు జనమేజయుడు. (కధను క్లుప్తంగా వివరిస్తా) ఒకసారి పరీక్షిత్ మహారాజు చేసిన ఒక తప్పు కారణంగా ఋషి శాపానికి గురై, తక్షకుడి చేతిలో మరణిస్తాడు. తన తండ్రిని చంపిన తక్షకుడి మీద, నాగజాతి మీద పగ తీర్చుకోవాలని జనమేజయుడు సర్పయాగం చేస్తాడు. ఆ యాగంలో వేల కొద్ది సర్పాలు ఆహుతైపోతాయి. ఆ యాగాన్ని ఆపటానికి ఆస్తికమహర్షి వస్తారు, తన ప్రయత్నంలో సఫలం అవుతారు. మానవులకు సర్పాలకు మధ్య స్నేహభావాన్ని, బంధాన్ని పెంచుతారు, దానికి గుర్తుగా ఈ రోజుకి ప్రతీ ఏటా శ్రావణ మాసంలో నాగపంచమి జరుపుకుంటారు హిందువులు.

ఇది కేవలం కధ కాదు. దీనికి సంబంధించిన ఆధారాలే ఐహోల్ లో ఉన్నాయి. సర్పయాగం తర్వాత జనమేజయుడు తన తండ్రి పేరున అగ్రహారాలు దానం ఇస్తాడు. వాటి కోసం రాగిరేగులపై శాసనాలు రాయించాడు . ఆ రాగిరేగులు ఇప్పటికి ఐహోల్ లో ఉన్నాయి. వాటి ఫొటోలు కూడా అనేకులు తీసుకున్నారు. వీటిని కోట వేంకాటాచలం గారు, తన Age of Mahabharata war అనే పుస్తకంలో పొందుపరిచారు. వాటికి శాసనపూర్వక ఆధారాలు అందించారు. 'మహాభారత యుద్ధం క్రీ.పూ.3138 లేద 36 లో ఖచ్చితంగా జరిగిందనడానికి ప్రధానంగా 4 శాసనాలు లభించాయి' అని వారి రచనలో చెప్పారు. వాటి గురించి తరువాయి భాగంలో తెలుసుకుందాం.

To be continued .............

Friday, 6 February 2015

హిందూ ధర్మం - 140 (ద్వారక ఆధారాలు)

సముద్రగర్భంలో కనుగొన్న మహానగరం శ్రీకృష్ణపరమాత్ముడి ద్వారకానగరమే అని చెప్పటానికి కొన్ని నాణెలు కూడా లభించాయి. వాటిని కూడ పురావస్తు పరిశోధకులు పరిశీలించారు. జరాసంధుడి బారి నుంచి యాదవులను రక్షించటానికి సముద్రం మధ్యలో ద్వారక నిర్మించిన కృష్ణుడు, ద్వారకలో నివసించేవారికి గుర్తింపుచిహ్నలను ఇచ్చారు. ఈ రోజు ప్రజలకు Identity cards ఇస్తున్నట్టుగా. వాటి మీద 3 తలలు ఉన్న ఒక జంతువులు ఉండేదని మహాభారతం, హరివంశం మొదలైన అనేక గ్రంధాలు చెప్తున్నాయి. అచ్చం ఆ నాణెలను పోలిన వస్తువులే సాగరంగ్రభంలో దొరికాయి. వాటిని కార్బన్ డేటింగ్ చేసినప్పుడు మహాభారతానికి జ్యోతిష్యశాస్త్రం లెక్కకట్టిన తేదీలతో వాటి కాలం సరిపోతోంది.

సాగర గర్భంలో బయటపడిన ద్వారక నగరం ఆషామాషీ నగరం కానే కాదు.. ఇవాళ మనకు తెలిసిన గొప్ప గొప్ప నగరాలకంటే వెయ్యి రెట్లు అడ్వాన్స్‌డ్‌ మెట్రోపాలిటన్‌ సిటీ అని చెప్పవచ్చు. శ్రీకృష్ణుడు పక్కా ప్రణాలికతో ద్వారక నిర్మాణానికి పూనుకున్నాడు.. విశ్వకర్మతో ఈ నగరాన్ని నిర్మించాడు.. గోమతి నది, సముద్రంలో కలిసే చోటును నగర నిర్మాణానికి ఎంచుకున్నాడు. అక్కడ సుమారు 36 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నగర నిర్మాణం జరిగింది.


ఈ నిర్మాణం కూడా సామాన్యమైన రీతిలో లేదు. ద్వారకలో తొమ్మిది లక్షలు.. అవును.. అక్షరాలా తొమ్మిది లక్షల రాజభవనాలు ఉండేవి..ఈ భవనాలన్నీ కూడా క్రిస్టల్స్‌, ఎమరాల్డ్‌, డైమండ్స్‌ వంటి అపురూప రత్నాలతో నిర్మించారు..ఒక్క మాటలో చెప్పాలంటే సిటీ ఆఫ్‌ గోల్డ్‌గా ద్వారకను చెప్పుకోవాలి.

పొడవైన అతి పెద్ద పెద్ద వీధులు.. వీధుల వెంట బారులు తీరిన చెట్లు.. మధ్యమధ్యలో ఉద్యానవనాలు.. వాటి మధ్యలో రాజభవనాలు.. ఏ వర్గానికి ఆ వర్గం ప్రత్యేకమైన నివాస గృహాలు.. వ్యవసాయ క్షేత్రాలు.. ఒక క్రమ పద్ధతి ప్రకారం ఒక నగరంలో ప్రజలందరికీ ఎలాంటి సౌకర్యాలు ఉండాలో.. అలాంటి సౌకర్యాలన్నింటితో నిర్మించిన ఏకైక నగరం ద్వారక..

నగర నిర్మాణం ఇళ్లు, వీధుల నిర్మాణంతోనే అయిపోయిందనుకుంటే పొరపాటే.. హైదరాబాద్‌ మహానగరంలో ఎక్కడ కమర్షియల్‌ జోన్లు ఉండాలో, ఎక్కడ రెసిడెన్షియల్‌ జోన్లు ఉండాలో ఇప్పుడు మాస్టర్‌ ప్లాన్లు వేస్తున్నారు.. ఇప్పటికే కట్టిన నిర్మాణాలను ఎలా తొలగించాలో తెలియక సిగపట్లు పడుతున్నారు.. కానీ, ద్వారకలో ఆనాడే ఇవన్నీ ఉన్నాయి.. కమర్షియల్‌ జోన్లు, ప్లాజాలు, అవసరమైన ప్రతిచోటా ప్రజా సదుపాయాలు (public utilities), భారీ షాపింగ్‌ మాల్స్‌ అన్నీ ఉన్నాయి.. నగర నిర్మాణానికి ముందే మాస్టర్ ప్లాన్‌తో అత్యాధునికంగా, సాంకేతికంగా, పర్యావరణహితంగా నిర్మించబడిన ఏకైక మహానగరం ద్వారక. వేల ఏళ్ళ భారతీయ చరిత్రకు సజీవసాక్ష్యం. హిందువులకు గర్వకారణం.

To be continued ..................

ఈ రచనకు సహాయపడైన వెబ్‌సైట్లు: http://goo.gl/Vw8qRD

Thursday, 5 February 2015

హిందూ ధర్మం - 139 (జలగర్భ ద్వారక పై పరిశోధనలు)

ద్వారక గురించి ఆంధ్రప్రభ పత్రికలో ప్రచురితమైన కధనం చూడండి - ద్వారక వెలికితీతలో భాగంగా పరిశోధకులు 100 నుంచి 140 కిలోల బరువైన బండరాళ్లు చాలా గుర్తించారు. ఇవి ప్రముఖ వ్యక్తుల ఇంటి గోడలకు ఉపయోగించిన బండరాళ్లుగా గుర్తించారు. పడవలకు పెద్దపెద్ద నౌకలకు ఉపయోగించిన కలప శిధిలాలు కూడా లభించాయి. ద్వారకనే పూర్వకాలంలో మంచి నౌకా తీరంగా సైతం వుండేదని శాస్త్రజ్ఞులు అంటున్నారు. ఇవే గాక వేలకొద్ది రాతి ఇటుకలు లభించాయి.

ఆ కాలంలో శత్రువులు దాడి చేసినపుడు తమను తాము రక్షించు కోవడానికి రాతి ఇటుకలను వాడేవారని డాక్టర్‌ ఎస్సార్‌రావు అంటున్నారు. ఈ నగరం గోమతి నది దాకా విస్తరించి ఉన్న పెద్ద నగరంగా ఉండేది. నీటిలో సైతం పూర్తిగా శిధిలం కాని కొన్ని రాతి గోడలు కలిగిన నిర్మాణాలు ఇళ్లూ బయటపడ్డాయి. ఇవేకాక వెండి కంచు ఇత్తడి పాత్రలు సైతం లభించాయి. సముద్ర జిల్లాల్లో ఇంకా క్రిందికి అంటే ఐదు మీటర్ల క్రింద జరిపిన తవ్వకాల్లో ఒక గొప్ప నిర్మాణాన్ని కనుగొన్నారు. దాదాపు అర ఎకరం స్థలంలో ఈ నిర్మాణం వుంది. లోపల ఎన్నో గదులు ఉన్నట్లు గుర్తుగా గోడలు కనుపించాయి. అందులో కంచు గంటలు విల్లుకు మధ్యన ఉపయోగించే వెండి పట్టాలు కనిపించాయి.

ద్వారరకు నాలుగు కిలోమీటర్ల పొడవైన నౌకాశ్రమం ఉండేది. నౌకాశ్రయం ఉన్న ట్లుగా భావిస్తున్న ప్రాంతంలో నలు వైపుల చిన్న చిన్న గృహ నిర్మాణాలు ఉన్నట్లు కనుగొన్నారు. నౌకలకు సంధించిన శ్రామికులు ఈ ఇళ్లలో నివసించేవారని ఊహిస్తు న్నారు. ఇంకా ఈ ద్వారక నగరం గురించిన పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. విలువైన ఆశ్చర్యం గొలిపే వస్తువులు లభించినా భద్రతా కారణాల వల్ల వాటి వివరాలు గోప్యంగా వుంచుతున్నారు. పదిమందిదాకా యువకులను ఎంపిక చేసి పురావస్తు పరిశోధనలో తర్ఫీదు ఇచ్చి సముద్రంలో రెండు గంటల పాటు నిరవధికంగా ఉండగలిగేటట్టుగా వీళ్లకి శిక్షణ ఇచ్చారు. సముద్ర జలాల్లో అవసరమైన ప్రాణవాయువును కొన్ని ప్రత్యేకమైన సిలిండర్లలొ నింపి వీరు తమతోపాటు తీసుకెళ్లే ఏర్పాటు చేస్తున్నారు. ద్వారక నగరంలోని శ్రీకృష్ణుడు నివసించిన భవనాల కోసం అన్వేషణ ప్రారంభమైంది. ఒకానొక ప్రదేశంలో ఆధునిక మైన నిర్మాణాలతో ఒక కట్టడాన్ని కనుగొన్నారు. ఈ కట్టడం లోని శిధిలమైన రాతిగోడల మధ్య కిటికీలు ద్వార బంధాలు గడపలు కనుగొన్నారు. ఇందులోని కొన్ని శిధిల భాగాలను పైకి తెచ్చి వీటిపై కార్బన్‌ పరీక్షలు చేయడం ప్రారంభమైంది. దీనినే కార్బన్‌ డేటింగ్‌ టెక్నిక్‌ అంటారు. కిటికీలు చాలా పెద్ద విగా సముద్రపు గాలులు వీచేలాగా నిర్మాణాలు ఉన్నాయనీ ఇళ్లలోనే స్నానపు గదులను సైతం కనుగొన్నారని తెలియవస్తోంది. ఈ నగరం సౌరాష్ట్రకు ముఖ్య పట్టణంగా వుండేదనీ, మన పురాణాల్లో ప్రస్తావించబడిన శ్రీకృష్ణుడు ఈ ద్వారక వీధుల్లో సంచారించాడని పురావస్తు పరిశోధకులు భావిస్తున్నారు. శ్రీకృష్ణుడు ప్రతి శుక్రవారం పూజించే నారాయణదేవాలయాన్ని సైతం పరిశోధకులు కనుగొన్నారు. ఈ మూర్తిని మహాభారత కాలంలో సముద్ర నారాయణుడని అనేవారు.

శ్రీకృష్ణుడు ద్వారక నగరనిర్మాణం తర్వాత ఈ నగరంలో 36 సంవత్సరాలు నిర్మించాడు. మహాభారతయుద్ధ కాలంలో శ్రీకృష్ణు డూ అతని అంత:పురంలో రుక్మిణీ సత్యభామలతో సహా ఈ నగరం లోనే నివసించాడు. మా పరిశోధనలు సఫలమైతే శ్రీకృష్ణుడు తిరుగా డిన ద్వారకను ఆయన నివసించిన గృహాన్ని కనుగొనగలం అనే ఆశాభావాన్ని ఎస్సార్‌ రావు వ్యక్తం చేస్తున్నారు.

సేకరణ: (http://www.prabhanews.com/tradition/article-412447)

To be continued ..............

Wednesday, 4 February 2015

హిందూ ధర్మం - 138 (ద్వారక)

మహాభారతం కేవలం కట్టుకధ కాదు అని చెప్పటానికి పురావస్తు ఆధారాలు, శాసనాలు దొరికాయి. వాటిలో ప్రధానమైనది ద్వారక. శ్రీ కృష్ణపరమాత్ముడి అద్భుత నగరం, 5000 ఏళ్ళ క్రితం భారత్‌లో ఉన్న నైపుణ్యానికి, సాంకేతికపరిజ్ఞానానికి నిలువుటద్దం.

1980వ దశకంలో గుజరాత్‌ సముద్ర తీరంలో జరిగిన పరిశోధనలు భారతీయ చారిత్రక నిర్మాణంలో అపూర్వ ఘట్టాన్ని ఆవిష్కరించాయి, కుట్రపూరిత బ్రిటీష్ చరిత్రకు సవాల్ విసిరాయి. శ్రీ కృష్ణుడి ఉనికి అబద్దమంటూ వస్తున్న ప్రచారాలకు గట్టి సమాధానం ఇచ్చాయి.  భారత పురావస్తు పరిశోధనా సంస్థ, జాతీయ సముద్రగర్భ శాస్త్ర సంస్థల సంయుక్త పరిశోధన జరపాలని జడ్.డి.అన్సారీ, ఎమ్.ఎస్.మతే ప్రతిపాదించారు. దీని ద్వారా డాక్టర్ ఎస్.ఆర్.రావు ఆధ్వర్యంలో చెప్పుకోదగిన కృషిజరిగింది. ఆ పరిశోధనల్లో భాగాంగా గుజరాత్ పశ్చిమాన గోమతి నది అరేబియా సముద్రంలో కలిసే ప్రాంతంలో సాగర గర్భంలో ఒక మహానగరం బయటపడింది.. మహాభారత కాలాన్ని, శ్రీకృష్ణుడి ఉనికిని ఈ నగరం బయటి ప్రపంచానికి చాటి చెప్పింది.. ఇదే ఇవాళ మనం చెప్పుకుంటున్న ద్వారక.. .కృష్ణుడి ద్వారక.. విశ్వకర్మ నిర్మించిన ద్వారక..

192 కిలోమీటర్ల పొడవు …
192 కిలోమీటర్ల వెడల్పు..
36864 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం..
బారులు తీరిన వీధులు..
వీధుల వెంట బారులు తీరిన చెట్లు..
రాయల్‌ ప్యాలెస్‌లు..
రెసిడెన్షియల్‌ కాంప్లెక్స్‌లు..
కమర్షియల్‌ మాల్స్‌..
కమ్యూనిటీ హాల్స్‌..
వాటర్ ఫౌంటేయిన్లు ....
క్రీస్తుపూర్వం మూడు వేల సంవత్సరాల నాడే
అపూర్వ మహానగరం..
రత్నస్తంభాలు..
వజ్ర తోరణాలు..
సాటిలేని వాస్తు/శిల్ప కళా నైపుణ్యం..
సముద్రం మధ్యలో మహా నిర్మాణం..
జగన్నాథుడి జగదేక సృష్టి..
క్రీస్తుపూర్వం 3000 సంవత్సరాల నాటి
లెజెండ్‌ సిటీ…
ద్వారక..
ఇప్పుడు సాగర గర్భంలో..
మన నాగరికత..
మన సంస్కృతి..
మన హిందూ ప్రతిభకు పట్టం కట్టిన నాటి కాస్మోపాలిటన్‌ సిటీ..
ద్వారక

1983 నుంచి 1992 వరకు 12 సార్లు సాగరాన్ని మధించారు. ఫలితంగా నాటి ద్వారకకు చెందిన వస్తువులు సేకరించి ఫిజికల్ రిసెర్చి లేబొరేటరీకి పంపారు. అక్కడ థెర్మోలూమినెసెన్స్, కార్బన్ డేటింగ్ వంటి అత్యాధునికపరీక్షలు జరిగాయి. అవన్నీ ద్వారాకలో దొరికిన వస్తువులు ఖగోళశాస్త్రవేత్తలు లెక్కకట్టిన మహాభారత సమయానికి సరిగ్గా సరిపోతున్నాయి.  ఏవో రెండు, మూడు వస్తువులు దొరికితే ఫర్వాలేదు, ఏకంగా ఒక మహానగరమే సాగర గర్భంలో దొరికింది.

To be continued ..................

ఈ రచనకు సహాయపడైన వెబ్‌సైట్లు: http://goo.gl/Vw8qRD

Tuesday, 3 February 2015

హిందూ ధర్మం - 137 (15 రోజుల్లో 2 గ్రహణాలు - యుద్ధానికి సూచన)

ఒక రోజుకు 24 గంటలుగా, ఆర్ధరాత్రి 12 గంటల నుంచి మరుసటి రోజు అర్దరాత్రి 12 గంటల వరకు గల 24 గంటల సమయం ఒక రోజు అవుతుందనే భావనతో గ్రిగెరియన్ క్యాలండర్ రూపొందించారు పాశ్చాత్యులు. కానీ ప్రతి రోజులో సరిగ్గా 24 గంటలు ఉండవు. ఒక్క విషువత్తు రోజుల్లో (Equinox) తప్ప, ఎప్పుడు రోజులో సరిగ్గా 24 గంటలు ఉండవు. 24 గంటలకంటే కాస్త ఎక్కువ, తక్కువ ఉంటాయి. కానీ భారతీయుల (హిందువుల) కాలగణన అసాధారణమైనది. ఏదో అర్దరాత్రి సమయం పట్టుకుని రోజుని లెక్కించేకంటే, ఎవరూ మార్చలేనివి, సహజమైనవి, నిర్ద్వందమైనవి అయిన సూర్యోదయ, సూర్యాస్తమయ సమయాలను, గ్రహగతులను ఆధారంగా చేసుకుని కాలగణన చేశారు. సృష్టిలో జరిగే ప్రతి చిన్న మార్పును గమనించి, సరియైన లెక్క కట్టారు. అలా వచ్చిందే పంచాంగం. ఈ భారతీయ కాలగణనను ఆధారంగా చేసుకుని వెనక్కు లెక్కించుకుంటూ వెళ్తే, 13 రోజులలో రెండు గ్రహణాలు అరుదు కానీ సాధ్యమే.

ఈ గ్రహణాలే కాకుండా ఆ సమయంలో కనిపించిన తోక చుక్కలు, ఉల్కాపాతాల గురించి కూడా మహాభారతంలో చెప్పారు. ఆ సమయంలో మహాఘోర అనే పేరుగల తోక చుక్క కనిపించిందట. దాన్నే కర్ణుడు మహాపాత్ అన్నాడు. ఆ తోక చుక్కనే ఈరోజు Halley comet అంటున్నారు. వీటినన్నిటిని పరిశీలించిన వ్యాసుడు ఇలా అన్నారు.

చతుర్దశీం పంచదశీం భూతపూర్వాంచ షోడసీం
ఇమాంతూ నాభిజానామీ అమావాస్యాంతు త్రయోదశీం
..............................
ఉత్పాతమోఘ్ర రౌద్రశ చ రాత్రౌ వర్షంతి శోణితం

14, 15, 16 రోజుల్లో అమావాస్య రావడం చూశాను కానీ, 13 రోజున అమావాస్య రావడం, అదే సమయంలో 13 రోజుల వ్యవధిలో చంద్ర సూర్యగ్రహణాలు ఏర్పడడం ఇప్పటి వరకు నేను చూడలేదు. ఇది ఘోరమైన ఉత్పాతాన్ని, భారీ జననష్టాన్ని సూచిస్తోంది అన్నారు వ్యాసమహర్షి. భీష్మ పితామహుడు కూడా పక్షంరోజుల్లో రెండు గ్రహణాలు రావడం గమనించి కలవరపడ్డారు. ఇది భారీజననష్టాన్ని, రక్తపాతాన్ని తీసుకువస్తుందని భయపడ్డారు.

అయితే ఇప్పటివరకు ఖగోళశాస్త్రానికి సంబంధించిన అంశాలు చూశాం, ఇప్పుడు మహాభారతానికి సాక్ష్యాలుగా నిలుస్తున్న శాసనాల గురించి తెలుసుకుందాం.

To be continued .......................

ఈ రచనకు సహాయపడైన వెబ్‌సైట్లు: http://www.boloji.com/index.cfm?md=Content&sd=Articles&ArticleID=1052

Monday, 2 February 2015

హిందూ ధర్మం - 136 (మహాభారతం - అరుదైన గ్రహణం)

మనకు ఎప్పుడైనా గ్రహణాలు సంభవించప్పుడు, ఇది చాలా అరుదుగా ఏర్పడే గ్రహణం, ఇలా 100 ఏళ్ళకు ఒక్కసారి మాత్రమే జరుగుతుందని, లేదా 150 ఏళ్ళకు ఒక్కసారి మాత్రమే జరుగుతుంది, దీన్ని తప్పక వీక్షించండి అని నాసా మొదలైన సంస్థలు, భారతదేశంలో ఉండే మరికొన్ని సంస్థలు ప్రకటనలు జారీ చేస్తాయి. ఈ గ్రహణం కూడా అలాంటిదే, చాలా అరుదుగా ఏర్పడేది. ఈ గ్రహణానికి ఒక ప్రత్యేకత ఉంది.

1. జ్యేష్ఠా నక్షత్రంలో అమావాస్య రావడం 19 ఏళ్ళకు ఒక్కసారి మాత్రమే జరుగుతుంది.
2.a. అదే సమయంలో జ్యేష్ఠాలో సూర్యగ్రహణం 340 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే ఏర్పడుతుంది.
2.b అదీగాక, శని రోహిణిలో ఉండటం 7000 ఏళ్ళకు ఒక్కసారి మాత్రమే జరుగుతుంది.

ఈ అరుదైన కూటమి మహాభారత యుద్ధం తర్వాత ఇప్పటి వరకు మళ్ళీ ఏర్పడలేదు. ఈ గ్రహణం, మహాభారతంలో చెప్పిన గ్రహకూటములు కోసం వెనక్కు లెక్కించుకుంటూ వెళ్తే, యుద్ధం సరిగ్గా 22 నవంబరు క్రీ.పూ. 3137 ప్రారంభమైందని తేలుతుంది. మనిషి లెక్కించటంలో తప్పులుండవచ్చు కానీ, గ్రహాలు, భూమి కదలికలు చాలా ఖచ్చితమైనవి. ఇక్కడ ఒక సందేహం వస్తుంది, ప్రతి 7000 సంవత్సరాలకు మాత్రమే ఒకసారి ఏర్పాడుతుంది అన్నారు కదా, మరి మహాభారతం క్రీ.పూ.3137 లోనే జరిగిందని ఎలా నిర్ధారణకు వచ్చారు? అంతకంటే ముందు కూడా కూటమి ఏర్పాడి ఉండచ్చు కదా? అని అనిపిస్తుంది. కానీ ఈ ఖగోళవింతకు ఇంకో అరుదైన వింత తోడయ్యింది. విచిత్రమేంటంటే ఈ రెండు గ్రహణాలు కేవలం 13 రోజుల వ్యవధిలో ఏర్పడ్డాయి. చంద్రుడు భూమికి ఉపగ్రహం. చంద్రుడు 360 డిగ్రీలు తిరుగుతాడు. చంద్రుడి గమనంలో ప్రతి 12 డిగ్రీల మార్పును ఒక తిధిగా పరిగణిస్తారు. చంద్రుడు, భూమి, సూర్యుడు ......... ఈ ముగ్గిరిలో భ్రమణం కారణంగా, చంద్రుడిపై భూమి నీడ పడినప్పుడు కనిపించని ప్రాంతాన్ని బట్టి చంద్రుడి ఎదుగుదల, క్షీణించడం కనిపిస్తాయి.  సాధారణంగా అమావాస్య, పూర్ణిమకు మధ్య 15 రోజులు వ్యవధి ఉంటుంది. కానీ ఈ విశేష సంఘటన (వింత) జరిగడానికి కారణం చంద్రుడు తన కక్ష్యలో 180 డిగ్రీలు (అంటే పూర్ణిమ నుంచి అమావాస్య వరకు లేదా అమావాస్య నుంచి పూర్ణిమ వరకు) తిరగటానికి సాధారణంగా 12 డిగ్రీల వేగంతో పరిభ్రమిస్తాడు. అప్పుడు అమావాస్య, పూర్ణిమలకు మధ్య 15 రోజుల వ్యవధి ఉంటుంది. కానీ ఈ ఖగోళ వింత ఏర్పడినప్పుడు చంద్రుడు తన సాధారణ వేగానికి భిన్నంగా 13-17 డిగ్రీల వేగంతో తిరిగడం వలన 13 రోజుల వ్యవధిలోనే ఇలా జరిగింది. దీన్ని ఆధునిక సాఫ్ట్‌వేర్‌ల ద్వారా పరిశీలించి, భారతీయులు, విదేశీయులు ............ అనేకులు ధృవపరచటం జరిగింది. ఇలా జరగడానికి భారతీయ ఖగోళశాస్త్రంతో పాటు, ఆధునికశాస్త్రవేత్తలు కూడా కారణాలు వివరించారు. ఈ వింత మహాభారతం జరిగిందని ధృవపరచటానికి ఒక సాక్ష్యం. ఇటువంటివే అనేకం మహాభారతంలో ప్రస్తావించటం జరిగింది. వాటిని ఆధారంగా చేసుకుని Astronomical dating చేసినప్పుడు పైన చెప్పిన తేదీలలో మాహాభారతం జరిగిందని నిర్ధారించారు.

To be continued ................

ఈ రచనకు సహాయపడైన వెబ్‌సైట్లు:
http://www.patheos.com/blogs/drishtikone/2009/08/krishna-and-mahabharat-historical-reality/
http://www.patheos.com/blogs/drishtikone/2010/09/astronomical-proof-mahabharata-war-and-shri-krishna-part-ii/

Sunday, 1 February 2015

హిందూ ధర్మం - 135 (మహాభారతం - గ్రహణాలు)

మహాభారత యుద్ధం నవంబరు 22, క్రీ.పూ.3137 న ప్రారభమైంది. ఈ విషయంలో ఖగోళశాస్త్రానికి సంబంధించిన ఋజువు కూడా మహాభారతంలో ఉంది. గ్రహకూటములు సామన్యమైనవి కావు అవి ప్రతి దశాబ్దం, శతాబ్దంలో ఏర్పడేవి అంతకంటే కావు. కొన్ని ఇప్పటి వరకు అసలు ఏర్పడనే లేదు. కొన్ని కేవలం వేలఏళ్ళకు ఒక్కసారి మాత్రమే జరిగే అపూర్వసంఘటనలు. ఖగోళవింతలు అత్యంత అరుదుగా జరుగుతాయి.

భూమి నీడ చంద్రుని మీద పడినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. అది కూడా ఒక్క పూర్ణిమ రోజున మాత్రమే ఏర్పడుతుంది. ఒక శతాబ్దం (100 సంవత్సరాలు)లో 150 గ్రహణాలకు పైగా ఏర్పడతాయి. వాటిలో కొన్ని సంపూర్ణ చంద్రగ్రహణాలు కాగా, కొన్ని పాక్షిక చంద్రగ్రహణాలు. సంపూర్ణచంద్రగ్రహణం అధికంగా 2 గంటలు, పాక్షిక చంద్రగ్రహణం 4 గంటలు కొనసాగే అవకాశం ఉంటుంది. క్రీ.పూ.3500 నుంచి క్రీ.పూ.700 మధ్య సుమారు 4350 చంద్రగ్రహణాలు ఏర్పడ్డాయి.

అట్లాగే చంద్రుడి నీడ భూమిపై నుంచి వీక్షిస్తున్న ప్రాంతంలో పడినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఒక శత్బాదంలో దాదాపు 240 సూర్యగ్రహణలు ఏర్పడుతాయి. క్రీ.పూ.3500 నుంచి క్రీ.పూ.700 వరకు సుమారు 6960 సూర్యగ్రహణాలు ఏర్పడ్డాయి. సూర్యగ్రహణం అమావాస్య రోజునే ఏర్పడుతుంది. ఈ గ్రహణాల్లో కొన్ని పాక్షికం కాగా, కొన్ని సంపూర్ణ సూర్యగ్రహణాలు. సంపూర్ణసూర్యగ్రహణం అత్యధికంగా 8 నిమిషాలు, పాక్షికం 115 నిమిషాలకు వరకు జరుగుతుంది. అందువల్ల గ్రహణాలను ముఖ్యంగా నమోదు చేశారు వ్యాసమహర్షి. మహాభారతంలోని భీష్మ పర్వం మరియు ఉద్యోగపర్వంలో ఇటువంటి కొన్ని సంఘటనలు నమోదు చేశారు. వాటిలో ఒకటి శని రోహిణి నక్షత్రంలో, అంగారకుడు జ్యేష్ఠా నక్షత్రంలో ఉండగా, 2 గ్రహణాలు ఏర్పడ్డాయి, కృత్తికా నక్షత్రంలో చంద్రగ్రహణం, జ్యేష్ఠాలో సూర్యగ్రహణం.

To be continued .....................

Monday, 26 January 2015

హిందూ ధర్మం - 134 (వైదిక సంస్కృతి - మహాభారతం)

ద్వాపరయుగాంతం వరకు ప్రపంచమంతా సనాతనధర్మమే వర్ధిల్లింది. వేదప్రచారం నిత్యం జరిగింది. ఎక్కడ చూసిన వేదం గురించి చర్చలే, ప్రజలు కూడా వేదంలో ఉన్న విజ్ఞానం గురించే కాలక్షేపం చేసేవారు. అందరూ రోజు రెండుపుటలా నిత్యాగ్నిహోత్రం చేసేవారు. వైదికసంస్కృతి 3 పూవులు, 6 కాయలుగా వర్ధిల్లింది. కానీ విధినిర్ణయాన్ని ఎవరు తప్పించలేరు. ఇంతలోనే మహాభారత యుద్ధం మొదలైంది. సరిగ్గా ఇప్పటికి (2015 జనవరికి) 5152 సంవత్సరాల క్రితం ఉత్తరభారతదేశంలో కురుక్షేత్రంలో మహాభారత యుద్ధం ప్రారంభమైంది. కాలగతిలో కొన్నేళ్ళు అభివృద్ధి చెందితే, మరికొన్నేళ్ళు కష్టాలు పడవలసి వస్తుంది. జీవుల కర్మను అనుసరించి, వారి జన్మకు అనుగుణమైన పరిస్థితులు ఏర్పడవలసి వస్తుంది.

ప్రపంచమంతా వ్యాపించిన సనాతన ధర్మానికి మహాభారత యుద్ధంతో కష్టాలు మొదలయ్యాయి. మహాభారతం కావ్యం కాదు, పురాణం కాదు, మహాభారతం ఇతిహాసం. ఇతిహాసం అంటే ఇలాగే జరిగిందని అర్దం. మహాభారతం విశేషాలను సంస్కృతంలో వ్యాసమహర్షి చెప్పగా, గణపతి రచించాడు. మహాభారత యుద్ధం క్రీ.పూ. 3139 లో జరిగింది. యుద్ధం గెలిచాకా, పాండవులు హస్తినాపురాన్ని (నేటి ఢిల్లీ) రాజధానిగా చేసుకుని 36 ఏళ్ళ 8 నెలలు పాలించారు. క్రీ.పూ. 3102 ఫిబ్రవరి 17,18 నాటికి ద్వాపరయుగం అంతమై కలియుగం మొదలైంది. వీటిని జ్యోతిష్య శాస్త్రమూ, ప్రపంచ ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త ఆర్యభట్ట, అతన ఆర్యభట్టీయం అనే గ్రంధంలో పొందుపరిచారు.

ఏదో పుస్తకంలో ఉన్నది మెము ఎట్లా అంగీకరించాలి అనవచ్చు. దానికి తగిన శాసనాలు ఉన్నాయి, అవే సంవత్సరాలని చెప్పటానికి అన్నిటికంటే ముఖ్యమైన ఖగోళ, అంతరిక్షానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. వ్యాసమహర్షి ప్రజ్ఞ గురించి వర్ణించటం అసాధ్యం. కాలక్రమంలో పుస్తకాలు చినిగిపోతాయి, శాసనాలు కొంత రూపు పోవచ్చు, లేకపోతే విజ్ఞానశాస్త్ర గ్రంధాలు చౌర్యానికి గురై ప్రజలకు అందుబాటులో లేకుండా పోవచ్చు. కానీ ఈ జగత్తులు ఎవరు మార్చలేనిది, ఎప్పటికి సాక్ష్యంగా నిలిచేవి అంతరిక్షంలో గ్రహాల కదలికలు, గ్రహస్థితులు (planetary positions). గ్రహాల మధ్య దూరం, కోణము, ఆ సమయంలో వాటి స్థానం, ఇవన్నీ తరుచుగా ఏర్పడే అంశాలు కాదు. కొన్ని కోట్ల సంవత్సరాలకు మాత్రమే ఒకసారి ఏర్పడే ఈ ఖగోళ శాస్త్ర అద్భుతాలను వ్యాసమహర్షి గుర్తించి, సేకరించి, మహాభారతంలో పొందుపరిచారు, అనగా record చేశారు.. ఈ ఖగోళ అంశాలను ఈ రోజు ఆధునిక సాఫ్ట్‌వేర్ల ద్వారా astronomical dating ద్వారా పరీశీలించినప్పుడు పైన చెప్పుకున్న సంవత్సరాలే వస్తున్నాయి. వాటికి శాసనమైన ఆధారలు ఎన్ని ఉన్నాయో, ఖగోళ, జ్యోతిష్యశాస్త్ర ఆధారాలు అన్నే ఉన్నాయి. Astronomical dating అంటే ఇప్పుడున్న గ్రహస్థితుల నుంచి వెనక్కు లెక్కించుకుంటూ వెళ్ళడం.

To be continued ........................