Showing posts with label పుష్కరాలు. Show all posts
Showing posts with label పుష్కరాలు. Show all posts

Tuesday, 28 July 2015

పుష్కరాలు - నా అనుభవాలు - 2

పుష్కరాలు - నా అనుభవాలు - 2

హైద్రాబాదులోనే రైలు నాలుగు గంటల లేటుగా మొదలైంది. అక్కడకు చేరుకునే సరికి, మధ్యలో సిగ్నల్ లేకపోవడం, అంతా కలిపి కొవ్వూర్ చేరడం కొద్దిగా ఆలస్యమైనా రైలు ప్రయాణం మిగ్లిచిన అనుభూతులు ఆనందాన్నే ఇచ్చాయి. కొవ్వూర్‌లో మాకు చుట్టాలు లేరు, కానీ మాకు కుటుంబ సభ్యుల స్నేహితులకు అక్కడ ఇల్లుందని వాళ్ళింటికి ఆహ్వానించారు. నిజానికి అది వాళ్ళ ఇల్లు కూడా కాదట. వాళ్ళ బంధువులదట. ఆ ఇల్లు పాడుబడి పిచ్చిమొక్కలతో ఉండేదట. పుష్కరాలు వస్తున్నాయి, పుణ్యస్నానానికి వచ్చే పదిమందికి ఆశ్రయం ఇస్తే మంచిదని తలచి, మమ్మల్ని ఆహ్వానించినవారు ఆ ఇల్లు తీసుకుని, దాన్ని బాగు చేయించి, పిచ్చి మొక్కలన్నీ తీయించి, పుణ్యకార్యం కోసం అతిధులు వస్తున్నప్పుడు పవిత్రంగా ఉండాలని గోమయంతో శుద్ధి కొని చేయించారు. వాళ్ళే లైట్లు, ఫ్యాన్లు అమర్చారు. పనివాళ్ళను కూడా నియమించారు. అందరికి ఉచిత భోజన సదుపాయం ఏర్పాటు చేశారు. ఇదంతా ఎంత ఖర్చు. పోనీ ఇల్లేమైనా ఉచితంగా ఇచ్చారా అంటే అదీ లేదు. కేవలం 12 రోజుల వాడుకోవటానికి ఒక నెల అద్దె కట్టమన్నారు. అది ఏ 5 వేలో, పది వేలో కాదు. చాలా ఎక్కువే. 30 పదులు దాటింది. అంత ఖర్చు పెట్టి, చేయడం ఎందుకంటే పుణ్యం కోసం అన్నారు. అదేకాక వాళ్ళ అమ్మమ్మగారి సొంతూరు కొవ్వూరట. అప్పట్లో పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం ప్రత్యేకించి డబ్బు దాచుకుని మరీ ఏర్పాట్లు చేసేవారట. వాళ్ళమ్మగారు కూడా ఆవిడకున్న దాంట్లో పుష్కరాలకు ఏర్పాట్లు చేశారట. ఇప్పుడు వాళ్ళంతా లేకపోవచ్చు, ఈయన పెరిగి పెద్దవారయ్యారు, తాతయ్య కూడా అయ్యారు. కానీ పెద్దలు చేసినదేదైనా పిల్లలు తప్పక ఆచరిస్తారు. వాళ్ళ పూర్వీకులు మొదలుపెట్టిన ఈ ఆచారాన్ని ఆపడం ఇష్టం లేక, మాకు ఆతిధ్యం ఇచ్చిన కుటుంబం వారు హైద్రాబాదు నుంచి కొవ్వూరు వచ్చి, ఏర్పాట్లు చేశారు. వారు, వారి భార్య వస్తే ఫర్వాలేదు. వాళ్ళ పిల్లలు ఆపీసులకు సెలవు పెట్టి మరీ వచ్చారు. ఈయనే పెద్ద అనుకుంటే, ఈయన 90 ఏళ్ళ వయసున్న వాళ్ళ తల్లిదండ్రులను కూడా తమతో తీసుకువచ్చారు. ఇంతమందికి ఆతిధ్యం ఇచ్చి, అందరూ సంతోషంతో వెళ్తుంటే చూసి మురిసిపోవాలాని ఆ పెద్దల కోరికట.

ఏదైనా ఒక ఊరికి వెళితే, ఎంతో డబ్బు ఖర్చని భావిస్తున్నారు. అలాంటిది ఊరు కాని ఊరులో అక్కడకు వచ్చే యాత్రికుల కోసం ఇన్ని ఏర్పాట్లు చేయడం నిజంగా ఆశ్చర్యకరం. ఇది ఈ ఒక్క కుటుంబమే చేసిన పని కాదు. దాదాపు జనవరి నుంచి రాజమండ్రి, గోదావారి పరివాహాక ప్రాంతంలో ఉన్న ఖాళీ ఇళ్ళ అద్దె ధరలకు రెక్కలు వచ్చాయి. ఎంతోమంది విదేశాల నుంచి కూడా ఈ 12 రోజుల పుష్కరంలో తమ బంధువులకు ఆతిధ్యం ఇవ్వడం కోసం ఇళ్ళు బుక్ చేసుకున్నారని జర్నలిస్ట్‌ల ద్వారా తెలిసింది.

ఇక గోదావరి పరీవాహక ప్రాంతంలో ఉంటున్నవారి సంగతి ప్రత్యేకించి చెప్పేదేముంది? సంవత్సరం ముందు నుంచే ఆహ్వానాలు వెళ్ళిపోయాయి. 'మీరు మాత్రం మా ఇంటికే రావాలి, ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశాము, మీకు ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటాము. ఇంకేక్కడికి వెళ్ళకండి, నేరుగా ఇటే వచ్చేయండి. వస్తామని మాకు మాట ఇవ్వండి' అంటూ ఎవరికి వారు తమ బంధువులను బ్రతిమాలారు. ఆహ్వానం పంపడం వేరు, బ్రతిమాలడం వేరు. ఎందుకంటే పుష్కర సమయంలో చేసిన ఏ కొద్ది పుణ్యమైనా గొప్ప ఫలాన్ని ఇస్తుందని శాస్త్రం వచనం. విచిత్రం ఏమిటంటే ఒకసారి చెప్పి వదిలేయడం వేరు, సంవత్సరం ముందు చెప్పినా, జనవరి నుంచి ప్రతి నెలా ఫోన్లే. 'టికేట్లు బుక్ చేసుకోండి, రైలుకు దొరక్కపోతే, బస్‌లో రండి, అది కాకపోతే ట్యాక్సీ కట్టుకుని రండి, కానీ మా ఇంటికే రండి, ఇంకెక్కడికి వెళ్ళకండి' అంటు బ్రతిమాలారు. ఇది నా ఒక్కడి అనుభవమే కాదు, బాసర నుంచి అంతర్వేది వరకు, గోదావరి తీరం వెంట, గోదావరి తీరానికి దగ్గరగా ఉన్న ఊర్లల్లో నివసిస్తున్న వారి బంధువులు చాలామందికి విదితమే అనుకుంటాను.

ఆయా ప్రాంతంలో నివసిస్తున్నవారికి పుణ్యం చేసుకోవటానికి ఇదో మంచి అవకాశం. దైవకార్యం మీద వెళుతున్న పదిమందికి ఆశ్రయం కల్పించటం కూడా పుణ్యమే కదా. పైగా ఇలాంటి సమయాల్లోనే బంధువులంతా కలుస్తారు. ప్రేమలు, ఆప్యాయతలు కూడా పెరుగుతాయి. పుష్కరసమయం అనగానే అదొక పుణ్యసమయమని మనసులో పాతుకుపోవడంతో, అప్పుడు కలిగే అనుభూతులే వేరు. సాయంకాలం అయ్యేసరికి ఇంతమంది బంధువులు, మిత్రులందరూ కూర్చుని, సామూహిక లలితా, విష్ణు సహస్రనామ పారాయణలు, భజనలు చేయటం, భక్తి గీతాలు ఆలపించటం నిజంగా మరువలేని ఓ అనుభూతి. మీడియా చానెల్లు పుష్కర ఘాట్లకే పరిమితమవుతాయి, అవి గుమ్మం దాటి ఇంట్లోకి రాలేవు కదా! పుష్కరప్రయాణం ఇలాంటి ఎన్నో మరువలేని అనుభూతులను ఎందరికో మిగిల్చింది.

To be continued ......................................

Monday, 27 July 2015

పుష్కరాలు - నా అనుభవాలు - 1

పుష్కరాల్లో నా అనుభవాలు - 1

పుష్కరాల గురించి మీడియా రెండుగా విడిపోయింది. ఒకదానికి ప్రభుత్వం ఏర్పాట్లు బాగా చేసిందని పొగిడడమే పని, ఇంకోవైపు ఏర్పాట్లు చెత్తగా ఉన్నాయని తెగడడమే పని. అదేదొ పుష్కరాలు ప్రభుత్వ కార్యక్రమం అయినట్టు దాని మీద నానా రభస చేసింది మీడియా. పుష్కరాలకు హిందువులకు సంబంధించిన ఒక సంప్రదాయవేడుక. అది ఏ రాజకీయ పార్టీకి చెందినది కాదు. పుష్కరాల్లో ప్రభుత్వాలే కాక, ప్రజలు కూడా చాలా విశేష సంఖ్యలో ఏర్పాట్లు చేశారు. ఎవరికి వారే కార్యకర్తలై, తమ ధర్మానికి చెందిన ఒక క్రతువును విజయవంతం చేయటానికి తమ వంతు కృషి చేశారు.

ఈ పుష్కరాల్లో ప్రజలు చేసిన కృషిని, వారి సేవను దాదాపు చాలా శాతం మీడీయా చూపించలేదనే చెప్పాలి. ఈ విషయాన్నే మిత్రులతో పంచుకున్నప్పుడు, పుష్కరాల్లో ప్రజల భాగస్వామ్యం గురించి, తమ ధర్మం పట్ల వారికి ఉన్న శ్రద్ధ, నిబద్ధత గురించి అందరికి తెలియజెప్తే బాగుంటుందని అన్నారు. హిందువుల దౌర్భాగ్యం ఏమంటే హిందువులు చేసిన ఏ మంచి పనిని పొగడటానికి మీడియాకు నోరు రాదు, కానీ ఏదో విధంగా ఎప్పుడూ ఎలా దాడి చెద్దామా అని కళ్ళలో వత్తులు వేసుకుని కూర్చుంటారు. మరి మన గురించి ఎవరూ చెప్పరా? చెప్పకపోతేనేం? మనమే చెప్పుకుందాం. అందుకే ఈ చిన్న ప్రయత్నం.






మొన్నే మేము కూడా పుష్కరాలకు వెళ్ళి పుష్కరస్నానం చేసి వచ్చాం. ఈ పుష్కరాలు చాలా మంచి అనుభూతులను పంచాయి. ప్రయణంలో జరిగిన ప్రతి సంఘటనా, ధర్మం యొక్క గొప్పతనాన్ని కళ్ళకు కట్టినట్లు చూపింది. హైద్రాబాదు నుంచి కొవ్వూరుకు రైల్‌లో ప్రయాణం చేశాం. విజయవాడ వరకు ప్రయాణం బానే సాగింది. సికింద్రాబాదులోనే రైలు సగం నిండిపోయింది. అర్ధరాత్రి సమయంలో విజయవాడ చేరింది. ఉదయం లేచు చూద్దును కదా, కాళ్ళ దగ్గర బ్యాగులు పెట్టుకుని జనం కూర్చుకున్నారు, మధ్య బెర్త్ నుంచి దిగి కింద కాళ్ళు పెడదాం అనుకుంటే అక్కడ కూడా ఎవరో దుప్పటి పర్చుకుని నిద్రపోతున్నారు. రైలు మొత్తం కిక్కిరిసిపోయింది. జనరల్ కంపార్ట్‌మెంట్లు నిండిపోవడంతో రిజర్వేషన్ బోగీల్లోకి జనం వచ్చేశారు. బాత్రూంకి వెళ్ళే అవకాశం కూడా లేదు. కొందరు నిల్చునే నిద్రపోతున్నారు, కొందరు దారిలో కూర్చున్నారు. పసిపిల్లలని వెంటబెట్టుకుని వచ్చేశారు కొందరు. బాత్రూం దగ్గర కూడా కూర్చున్నారు చాలామంది.

బయట జోరున వాన. అందరూ ఎక్కిదిగటంతో కంపార్ట్‌మెంట్ అంతా చిత్తడి చిత్తడిగానే తయారయ్యింది. ఎక్కడపడితే అక్కడ సామనులు, బ్యాగులు పెట్టేశారు. రోజు ప్రయాణం చేసే సిటీబస్సు కిక్కిరిసి ఉండి, తెలియకుండా ఎవరి బ్యాగైన మీద పడితే నానా రభస చేసే జనం, అక్కడ అంత కిక్కిరిసి ఉన్నా, సామాన్లు ఎలా పడితే అలా పడేసి ఉన్నా, ఒకరి మీద ఒకరి పడిపోతున్నా, సహనం కోల్పోలేదు. ముగ్గురు కూర్చునే సీట్లో 5-6 మంది కూర్చున్నారు. రిజర్వేషన్ చేయించుకున్నవారు 'మేము మీకు సీటు ఎందుకివ్వాలి?' అని మిగితావారని ప్రశ్నించలేదు. రండి, కలిసి కూర్చుందాం అంటూ సీటు పంచుకున్నారు. సరదాగా కబుర్లు చెప్పుకున్నారు. బయట వర్షం కురుస్తూ, లోపల తడిగా మారినప్పుడు సాధారణంగా చికాకు కలుగుతుంది. కానీ పుష్కరస్నానం కోసం వెళ్ళే యాత్రికుల్లో అసలు అసహనం కనిపించలేదు. అందరిలో ఏదో శాంత భావం, తెలియని ఆనందం మొహంలో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ప్రయాణం మొత్తం చాలా సరదాగా సాగింది. ధనిక పేద, కుల, ప్రాంత బేధాలు కూడా మరచి జనం ప్రయాణం చేశారు.

మామూలు రోజుల్లో రైలు గమ్యస్థానం చేరుకున్న తర్వాత జనం ఒకరిని ఒకరు తోసుకుని, సామాన్లు కిందపడేసుకుని నానా గొడవ చేసుకుంటారు, కానీ పుష్కర ప్రయాణంలో అలా ఎక్కడా జరగలేదు, ఎవరు తోసుకోలేదు. ఒకరి తర్వత ఒకరు నెమ్మదిగా దిగారు. పక్కవారి సామాన్లు దింపడంలో సాయం చేసుకున్నారు. పెద్దవయసు వారిని దగ్గరి ఉండి మరీ దింపారు. పోని ఇదంతా ఎవరైనా పోలీసులు చెప్పడం చేతనో, లేక ఎవరైనా ఉండి క్రమశిక్షణ నేర్పడం చేతనో వచ్చిన మార్పు కాదు. మొత్తం ప్రయాణం చేస్తున్నవారందరిలోనూ ఒకటే భావం, మేము పుణ్యస్నానానికి వెళుతున్నాం, మా ధర్మానికి సంబంధించిన ఒక ఉత్సవానికి వెళుతున్నాం, ఇది మాకు సంబంధించిన పండుగ.

ఇదంతా చూసి నాకు ఎంత ఆశ్చర్యం వేసిందో, అంతకంటే ఎక్కువ ఆనందం కూడా కలిగింది. ఇంతమంది ఇంత వ్యతిరేకపరిస్థితుల్లో ప్రయాణం చేస్తూ కూడా ఎక్కడ సహనం కోల్పోకుండా, సోదరభావంతో మెలిగారంటే ఇది మాత్రం ఖచ్చితంగా ధర్మ వైభవమే. ఎవరైనా ధర్మం ఎక్కడ ఉంది అన్నప్పుడు ఇదే చెప్పాలనిపిస్తోంది. ప్రజల మధ్య ఐక్యతకు ధర్మమే కారణమన్న ఋషుల మాటకు ఇదియే నిదర్శనంగా కనిపించింది. ఇన్ని కోట్ల మంది ఒక చోటుకు చేరినా, ఏ విధమైన ఘర్షణ లేకపోవడం, వారి మధ్య సఖ్యతను పెంచేందుకు, గోడవలు కాకుండా నియత్రించేందుకు ఏ వ్యవస్థ లేకపోయినా, అందరు కలిసి సరదాగా ప్రయాణం చేయడం ధర్మం యొక్క గొప్పతనమే.

మిత్రుల సహకారంతో ఫొటో తీయడం జరిగింది.

To be continued ....................

Saturday, 11 July 2015

పుష్కరాల వైశిష్ట్యం

పోషయతి ఆపః జీవయతీతి పుష్కరః అని సంస్కృత నిర్వచనం. నదీజలాలను పోషించేవాడు, వాటికి శక్తినిచ్చి రక్షిస్తున్నవాడు పుష్కరుడు.

పూర్వం తుందిలుడనే ఒకరు శివుని గూర్చి ఘోరమైన తపస్సు చేశారు. అతడి తపస్సుకు శివుడు మెచ్చి తన అష్టమూర్తి తత్వంలో ఒకటైన జలతత్వానికి ఆధిపత్యాన్ని ఇచ్చాడు. నీటికి పవిత్రతను ఇవ్వగలవాడిగా పుష్కరుడయ్యాడు. అటు తర్వాత బ్రహ్మదేవుడు సృష్టి ఆరంభించే ముందు తనకు ఈ పుష్కరుడు కావాలని శివున్ని కోరగా, శివుడు అనుమతిచ్చాడు. పుష్కరుడు బ్రహ్మగారి కమండలంలోకి చేరాడు. ఈ పుష్కరుడు ఎంత గొప్పవాడంటే అహల్యను చెరబట్టి గౌతముడి శాపానికి గురైన ఇంద్రుడికి చర్మవ్యాధి వచ్చింది. అది ఎన్ని చేసినా పోలేదు, కానీ బ్రహ్మదేవుడి కమండలంలో నీటి బిందువులు పడిన కారణంగా ఆ అవస్థ తీరిపోయింది.

ఈ విషయం దేవగురువైన బృహస్పతికి తెలిసింది. తమలో మునిగిన జనుల పాపాలను నదులు ప్రక్షాళన చేస్తాయి. అలా నిత్యం అనేకమంది స్నానాలు చేయటంతో నదులన్నీ పాపాలతో నిండిపోయాయి. వాటిని పాపముక్తం చేయాలన్న ఆలోచన బృహస్పతికి వచ్చి, బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి, తనకు పుష్కరుడు కావాలని, నదులన్నీ పాపలతో కలుషితమయ్యాయని, ఆ నదుల్లో ఈ పుష్కరుడిని ప్రవేశపెట్టి వాటి పవిత్రతను తిరిగి పునరుద్ధరిస్తానని అంటారు. రాకరాక బ్రహ్మదేవుని వద్ద ఉండే అవకాశం వచ్చిందని, దాన్ని వదులుకోవడం ఇష్టం లేని పుష్కరుడు తాను వెళ్ళనంటాడు. అంతా విన్న బ్రహ్మగారు బాగా ఆలోచించి, ఒక నిర్ణయానికి వస్తారు. బృహస్పతి రాశి మారిన ప్రతీసారి ఒక్కో నదికి పుష్కరం వచ్చేలా, ఏర్పాటు చేస్తాడు. ఆ పుష్కర కాలంలో బృహస్పతి, పుష్కరుడే కాక, బ్రహ్మాది ముక్కోటి దేవతలు, పితృదేవతలు, అన్ని లోకాల్లో ఉన్న 3 కోట్ల 60 తీర్ధాలు ఆ నదిని తొలి 12 రోజులు ఆశ్రయిస్తారని, తర్వాత ఏడాది మొత్తం మద్యాహ్న సమయంలో 2 ముహుర్తాల కాలం ఉంటారని శాసనం చేస్తారు. అలా ప్రతి ఏడాది గురువు ఒక్కో రాశిలోకి ప్రవేశించినప్పుడు, రాశిని అనుసరించి ఒక్కో నదికి పుష్కరాలు వస్తాయి. మొత్తం మీద మన దేశంలో ముఖ్యమైన 12 ప్రధాన పుణ్యనదులకే ఈ పుష్కరాలు ఉన్నాయి.

ఇప్పుడు గురువు సింహరాశిలోకి ప్రవేశిస్తున్న కారణం చేత గోదావరికి పుష్కరాలు వస్తున్నాయి. మళ్ళీ ఇందులో కూడా అన్ని నదులకు, గోదావరికి ఒక తేడా ఉంది. ప్రతి నదికి ఆదిపుష్కరాలు మాత్రమే ఉంటాయి, కానీ దక్షిణగంగ అయిన గోదావారికి మాత్రం ఆదిపుష్కరాలు, అంత్యపుష్కరాలు అని రెండు ఉంటాయి. గురువు సింహరాశిలోకి ప్రవేశించిన తొలి 12 రోజులు ఆదిపుష్కరాలు, సింహరాశి నుంచి వెళ్ళిపోయే చివరి 12 రోజులు అంత్యపుష్కరాలు వస్తాయి.

ఈ పుష్కరసమయంలో ఒకసారి స్నానం చేస్తే 60,000 సార్లు గంగాస్నానం చేసిన ఫలితం లభిస్తుంది. ఈ సమయంలో చేసే జప, దాన, స్నాన, యజ్ఞ ఫలాలు కోటి రెట్లు అధికంగా ఉంటాయి. అన్ని కోట్ల మంది దేవతలు, పితృదేవతలు, 3,60,00,000 తీర్ధాలు నదిలో ఉన్నప్పుడు స్నానం చేయడం ఎంతో విశేషం. ఎంత తపస్సు చేసినా ఒక జన్మలో కలగని అదృష్టం పుష్కరసమయంలో మానవులకు కలిగించాడు భగవంతుడు. దేవతలు వస్తే ఏదో ఒక వరం ఇవ్వకుండా వెళ్ళరు, కనుక పుష్కరసమయంలో నదిలో శాస్త్రం చెప్పిన రీతిలో పుణ్యస్నానం చేసినవారికి సకల శుభాలు కలగజేస్తారు.

ఈ ఏడాది మన గోదావరికి పుష్కరాలు వస్తున్నాయి. జూలై 14 న మొదలై 25 వరకు కొనసాగుతాయి.    

Tuesday, 7 July 2015

నదీస్నానం ఎలా చేయాలి?



నదీస్నానం ఎలా చేయాలి? త్వరలో పుష్కరాలు జరుపుకుంటున్నాము. అదికాక ఎప్పుడూ ఏదో ఒక తీర్ధయాత్ర చేస్తుంటారు. అసలు నదిలో ఏట్లా స్నానం చేస్తే ఫలితం ఉంటుంది?

నీటికున్న అమోఘమైన శక్తి గురించి మొదట గుర్తించింది ఋషులే. ఋషులు ద్రష్టలు. మాములు వ్యక్తులకు ఇంద్రియగోచరం కానీ విషయాలు కూడా ఋషులకు కనిపిస్తాయి. అటువంటి ఋషుల కారణంగా మనకు ఈ సనాతనసంస్కృతి అందింది. ఈ విశ్వంలో మానవులు, జంతువులు, చెట్లు, పక్షి, క్రిమికీటకలే కాక, అనేకమంది ఇతరులు జీవిస్తున్నారు. వారి కర్మఫలాన్ని అనుసరించి వారి జన్మ ఉంటుంది, మన కంటికి కనపడేది ఈ ఒక్క లోకం మాత్రమే. కానీ ఇది కాక ఇంకా అనేకలోకాలు ఉన్నాయి. వాటిలో దివ్యశరీరాలతో అనేకమంది దేవతలు, యక్ష, కిన్నెర, కింపురుష, గంధర్వులు, సిద్ధులు నివసిస్తూ ఉంటారు. వారూ మానవులు పరస్పరం ఆధారపడి జీవనం సాగిస్తూ ఉంటారు. వారిని ఉద్దేశించే మానవులు వివిధరకాల వైదిక కర్మలు ఆచరిస్తారు. అట్లాగే ప్రతినదికి ఒక అధిష్టానదేవత ఉంటుంది. ఆమె అందరికి త్రాగడానికి, పంటలు పండిచుకోవుటకు నీరు ఇస్తోంది. నేలను సస్యశ్యామలం చేస్తోంది, వనాలను రక్షిస్తోంది. అక్కడితో ఆగిపోకుండా ఒక్క మునకతోనే మునిగినవానికి అనుగ్రహం ప్రసరిస్తోంది, పుణ్యం ఇస్తోంది, రోగక్షయం చేస్తోంది. అందుకే నదీమతల్లిగా, అమ్మగా ఋషులు నదులను కీర్తించారు. కానీ ఆమె అనుగ్రహం పొందాలంటే నదిలో స్నానం చేయటానికి ఒక విధానం ఉంది.

నదిలో స్నానం చేసే ముందు నదీమతల్లికి మనస్పూర్తిగా నమస్కారం చేయాలి. పాపాలను, దోషాలను, రోగాలను తొలగించి శుభములను ఇస్తున్న అమ్మకు ప్రేమపూర్వక కృతజ్ఞతలు చెప్పుకోవాలి.

నదీస్నానం ఎప్పుడు చేసినా ముందు సంకల్పం చెప్పుకోవాలి. సంకల్పం చెప్పుకోకుండా స్నానం చేస్తే పుణ్యస్నాన ఫలితం ఉండదు. అది ఇంట్లో చేసిన స్నానంతో సమానమే. నదీస్నానమే కాదు, తటాక, సముద్రస్నానమైన అంతే.

నదీస్నానం చేసేముందు ఒడ్డున ఉన్న కొంత మట్టి తీసుకుని నదిలో వేయాలి. చిటికెడైనా వేయాలి. అదే పుష్కరిణి, తటాకం, చెరువులో స్నానం చేస్తున్నట్లైతే చెరువులో ఉన్న మట్టి కొంచం తీసి ఒడ్డున వేయాలి. సముద్రస్నాన సమయంలో సముద్రంలోకి ఒక చిన్న రాయి విసరాలి. ఇది తప్పక చేయవలసిన విధి. (అయితే పుష్కరాలు మొదలైన సమయంలో ఎంతోమంది జనం ఉంటారు, ఘాట్లు సిమెంటుతో కట్టి ఉంటాయి కనుక అప్పుడు కుదరదు. ఇతర సమయాల్లో మాత్రం చిటికెడుమెట్టిని నదిలో చేసి, శ్లోకం చదివి అప్పుడు చేయాలి.)

ఇది చేసే సమయంలో ఈ క్రింది శ్లోకం చెప్పాలి.
పిప్ప్లాదాత్ సముత్పన్నే కృత్యేలోకే భయంకరి |
పాషాణం తే మయాదత్తం అహారార్ధం ప్రకల్పయ ||

నదిలో స్నానం చేసేముందు ఇంట్లో తప్పనిసరిగా స్నానం చేసి, శుభ్రమైన వస్త్రాలు ధరించి, అప్పుడు నదీతీరానికి వెళ్ళాలి. ముందు స్నానం చేయకుండా నేరుగా వెళ్ళి నదిలో మునగకూడదు. నదిలో ఒళ్ళు రుద్దుకోవటం, ఉమ్మివేయటం, మలమూత్ర విసర్జనలు చేయటం నిషిద్ధం. నదీస్నానం అంటే నదిలో కేవలం 3 సార్లు మునకవేయటం మాత్రమే. అంతకుమించి అక్కడ సబ్బు రుద్ధుకోవటం, షాంపూలు వాడటం చేయకూడదు. అలా చేయడం నదీమతల్లికి చేసే అపచారం, పుణ్యం రాకపోగా పాపం చుట్టుకుంటుంది.

నదిలో స్నానం చేయటానికి కూడా ఉతికిన వస్త్రాలే ధరించాలి. స్నానం కోసం ధరించే వస్త్రాలకు తప్పినిసరిగా అంచు ఉండాలి. మగవారైతే పంచకట్టుకుని చేయాలి. ప్యాంటు, షర్టు వేసుకుని చేయకూడదు. వస్త్రాన్ని అనేకమార్లు కత్తిరించి కుట్టగా ప్యాంటు, షర్టు తయారైతాయి. శాస్త్రం ప్రకారం అవి చినిగిన వస్త్రాలతో సమానం. చినిగిన వస్త్రాలు ధరిస్తే దరిద్రం పడుతుంది. శాస్త్రం ప్రకారం చినిగిన వస్త్రాలు ధరించి పూజచేయటం అపచారం, అది కూడదు. ఎప్పుడూ పంచెకట్టుకునే అవకాశం లేకపోయినా కనీసం శుభకార్యాలు, దేవలయసందర్శన, పుణ్యస్నానం, పూజ సమయంలోనైన సంప్రదాయ దుస్తులు ధరించాలి. స్త్రీలు కూడా సంప్రదాయ వస్త్రాలనే ధరించాలి. అలా ధరించేందుకు డబ్బు సరిపోని పేదవారైతే, వారికి ఉన్నదాంట్లో మంచి వస్త్రాలు కట్టుకుని స్నానం చేయాలి.

పురుషులు నదిప్రవాహానికి ఎదురుగాను, స్త్రీలు నదిప్రవాహం వెళుతున్న దిశగా నిల్చుని స్నానం చేయాలి. తల కూడా మునిగేట్లుగా 3 సార్లు మునకవేయాలి. ముందు ఊపిరి తీసుకుని, బొటను వేలుతో ముక్కురంధ్రాలను, మధ్యవేలుతో చెవి రంధ్రాలను మూసి, కన్నులు, నోరు మూసుకుని స్నానం చేయాలి. లేదంటే ముక్కు, చెవి రంధ్రాల ద్వారా నీరు లోపలికి వెళ్ళే అవకాశం ఉంటుంది.

నది ఆభిర్భావప్రదేశం నుంచి సాగరసంగమం వరకు ప్రతి చోటా దేవలయాలు, దివ్యధామాలు, ఆశ్రమాలు నెలకొని ఉంటాయి. వాటి నుంచి వచ్చే వేదమంత్రఘోషను నదీజలాలు గ్రహిస్తాయి. నదిలో పూర్తిగా మునిగి స్నానం చేస్తే, ఆ దివ్యమంత్రశక్తి శరీరానికి, మనసుకు పట్టుకుని, రక్షణకవచం వలె పనిచేస్తుంది.  సూర్యుడికి అర్ఘ్యప్రధానం చేయాలి. నదిలో నిల్చుని ఏదైనా మంత్రజపం కూడా చేయవచ్చు, కానీ పుష్కరసమయంలో, రద్దీ ఉన్న సమయంలో కాకుండా నదీతీరం ఖాళీగా ఉన్న సమయంలో ఇలా చేయడం ఉత్తమం. లేకపోతే అందరిని ఆపి ఇబ్బంది పెట్టినందుకు పాపం వస్తుంది. సాధ్యమైనత త్వరగా పుష్కరస్నానం ముగించుకుని బయటకు రావడం ఉత్తమం.

స్నానం ముగించిన తర్వాత ఒడ్డుకు వచ్చి, ఉతికిన శుభ్రమైన వస్త్రాలను ధరించాలి. పుణ్యస్నానం చేశాక తడి బట్టలను నదిలో పిండకూడదు. అది కేవలం అశుభం జరిగినప్పుడు మాత్రమే చేస్తారు. అట్లాగే నదిలో బట్టలు ఉతకడం, జాడించడం లాంటి పనులు అసలే చేయరాదు. నది పవిత్రతకు భంగం కలిగించకుండా జాగ్రత్తపడాలి. వీలుంటే స్నానానంతరం గట్టు మీద, లేక ఒడ్డున కూర్చుని స్తోత్ర పారాయణ చేయడం, జపం చేయడం చేయాలి. నదీతీరాలు ఋషులు నడిచిన దివ్యప్రదేశాలు.

చాలామంది నదీతీరంలో దీపాలు వెలిగిస్తుంటారు, పూజలు చేస్తారు, దానాలు చేస్తారు. (నదిలో దీపాలు కార్తీకమాసంలోనే వదులుతారు.) అంతవరకు బాగానే ఉన్నా, వీటి కోసం తెచ్చిన ప్లాస్టిక్ కవర్లు, ఇతర చెత్తంతా నదిలోకానీ, నదితీరంలో కానీ పడేస్తారు. అరరే! ఇప్పుడే స్నానం చేశాను కదా, ఈవిడ నదీమతల్లి కదా, నాకు ఆశీర్వాదం ఇచ్చింది కదా అనే ఆలోచన అస్సలు ఉండదు. అలా నదిలో చెత్త విసిరేస్తే స్నానఫలితం వస్తుందని ఎందుకు అనుకుంటున్నారు? నదీతీరం పవిత్ర ప్రదేశం. అక్కడ చెత్త వేయరాదు. దగ్గరలో చెత్తబుట్ట ఉంటే, అందులో వేయండి, లేదా చెత్త మొత్తం ఒక కవర్లో పెట్టి, మీ దగ్గరే పెట్టుకోండి. ఇంటికి వచ్చాకో, లేదా ఇంకెక్కడైనా చెత్తబుట్ట కనిపిస్తే, అక్కడ పడేయండి. ఇష్టంవచ్చినట్లు నదిలో చెత్త వేస్తే, పుణ్యం రాదు, అసలు స్నానం ఫలితం కూడా రాదు, పాపం వస్తుందని గ్రహించండి.

అవకాశం ఉంటే పూలు, గాజులు, పసుపుకుంకుమలతో నదీమతల్లలకు తాబులం సమర్పించడం చాలా మంచిది, కానీ చీరలు, జాకెట్ పీసులు నదిలో వదలకుండా, అక్కడే స్నానం కోసం వచ్చిన సువాసినికి ఇస్తే (నది అధిష్టాన దేవతను వారిలో భావించి), నదీమతల్లి ఆనందిస్తుంది. అలా చేస్తే జలగండాల నుంచి నదీమతల్లి రక్షిస్తుంది. అంటురోగాలు రాకుండా ఉంటాయి.

నదీస్నానం శ్రద్ధను, మేధస్సును, ఆరోగ్యాన్ని, జ్ఞానాన్ని, పుణ్యాన్ని, శుభాలను, చిత్తశుద్ధిని కలిగిస్తుంది. కేవలం మునక చేతనే చర్మరోగాలు, ధీరకాలిక వ్యాధులు నయమైన వారు ఎందరో ఉన్నారు. నదులకు శక్తి ఉంది, అధిదేవతలూ ఉన్నారు. శాస్త్రం చెప్పిన రీతిలో నదీస్నానం చేసే ఫలితాలు అనుభవంలో తెలుస్తాయి. నదీమతల్లుల పవిత్రతను కాపాడండి. నదులను కలుషితం కానివ్వకండి. అన్నిటికంటే ముందు నదుల్లో కూడా ప్రాణం ఉందని గుర్తించండి.