Saturday 11 July 2015

పుష్కరాల వైశిష్ట్యం

పోషయతి ఆపః జీవయతీతి పుష్కరః అని సంస్కృత నిర్వచనం. నదీజలాలను పోషించేవాడు, వాటికి శక్తినిచ్చి రక్షిస్తున్నవాడు పుష్కరుడు.

పూర్వం తుందిలుడనే ఒకరు శివుని గూర్చి ఘోరమైన తపస్సు చేశారు. అతడి తపస్సుకు శివుడు మెచ్చి తన అష్టమూర్తి తత్వంలో ఒకటైన జలతత్వానికి ఆధిపత్యాన్ని ఇచ్చాడు. నీటికి పవిత్రతను ఇవ్వగలవాడిగా పుష్కరుడయ్యాడు. అటు తర్వాత బ్రహ్మదేవుడు సృష్టి ఆరంభించే ముందు తనకు ఈ పుష్కరుడు కావాలని శివున్ని కోరగా, శివుడు అనుమతిచ్చాడు. పుష్కరుడు బ్రహ్మగారి కమండలంలోకి చేరాడు. ఈ పుష్కరుడు ఎంత గొప్పవాడంటే అహల్యను చెరబట్టి గౌతముడి శాపానికి గురైన ఇంద్రుడికి చర్మవ్యాధి వచ్చింది. అది ఎన్ని చేసినా పోలేదు, కానీ బ్రహ్మదేవుడి కమండలంలో నీటి బిందువులు పడిన కారణంగా ఆ అవస్థ తీరిపోయింది.

ఈ విషయం దేవగురువైన బృహస్పతికి తెలిసింది. తమలో మునిగిన జనుల పాపాలను నదులు ప్రక్షాళన చేస్తాయి. అలా నిత్యం అనేకమంది స్నానాలు చేయటంతో నదులన్నీ పాపాలతో నిండిపోయాయి. వాటిని పాపముక్తం చేయాలన్న ఆలోచన బృహస్పతికి వచ్చి, బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి, తనకు పుష్కరుడు కావాలని, నదులన్నీ పాపలతో కలుషితమయ్యాయని, ఆ నదుల్లో ఈ పుష్కరుడిని ప్రవేశపెట్టి వాటి పవిత్రతను తిరిగి పునరుద్ధరిస్తానని అంటారు. రాకరాక బ్రహ్మదేవుని వద్ద ఉండే అవకాశం వచ్చిందని, దాన్ని వదులుకోవడం ఇష్టం లేని పుష్కరుడు తాను వెళ్ళనంటాడు. అంతా విన్న బ్రహ్మగారు బాగా ఆలోచించి, ఒక నిర్ణయానికి వస్తారు. బృహస్పతి రాశి మారిన ప్రతీసారి ఒక్కో నదికి పుష్కరం వచ్చేలా, ఏర్పాటు చేస్తాడు. ఆ పుష్కర కాలంలో బృహస్పతి, పుష్కరుడే కాక, బ్రహ్మాది ముక్కోటి దేవతలు, పితృదేవతలు, అన్ని లోకాల్లో ఉన్న 3 కోట్ల 60 తీర్ధాలు ఆ నదిని తొలి 12 రోజులు ఆశ్రయిస్తారని, తర్వాత ఏడాది మొత్తం మద్యాహ్న సమయంలో 2 ముహుర్తాల కాలం ఉంటారని శాసనం చేస్తారు. అలా ప్రతి ఏడాది గురువు ఒక్కో రాశిలోకి ప్రవేశించినప్పుడు, రాశిని అనుసరించి ఒక్కో నదికి పుష్కరాలు వస్తాయి. మొత్తం మీద మన దేశంలో ముఖ్యమైన 12 ప్రధాన పుణ్యనదులకే ఈ పుష్కరాలు ఉన్నాయి.

ఇప్పుడు గురువు సింహరాశిలోకి ప్రవేశిస్తున్న కారణం చేత గోదావరికి పుష్కరాలు వస్తున్నాయి. మళ్ళీ ఇందులో కూడా అన్ని నదులకు, గోదావరికి ఒక తేడా ఉంది. ప్రతి నదికి ఆదిపుష్కరాలు మాత్రమే ఉంటాయి, కానీ దక్షిణగంగ అయిన గోదావారికి మాత్రం ఆదిపుష్కరాలు, అంత్యపుష్కరాలు అని రెండు ఉంటాయి. గురువు సింహరాశిలోకి ప్రవేశించిన తొలి 12 రోజులు ఆదిపుష్కరాలు, సింహరాశి నుంచి వెళ్ళిపోయే చివరి 12 రోజులు అంత్యపుష్కరాలు వస్తాయి.

ఈ పుష్కరసమయంలో ఒకసారి స్నానం చేస్తే 60,000 సార్లు గంగాస్నానం చేసిన ఫలితం లభిస్తుంది. ఈ సమయంలో చేసే జప, దాన, స్నాన, యజ్ఞ ఫలాలు కోటి రెట్లు అధికంగా ఉంటాయి. అన్ని కోట్ల మంది దేవతలు, పితృదేవతలు, 3,60,00,000 తీర్ధాలు నదిలో ఉన్నప్పుడు స్నానం చేయడం ఎంతో విశేషం. ఎంత తపస్సు చేసినా ఒక జన్మలో కలగని అదృష్టం పుష్కరసమయంలో మానవులకు కలిగించాడు భగవంతుడు. దేవతలు వస్తే ఏదో ఒక వరం ఇవ్వకుండా వెళ్ళరు, కనుక పుష్కరసమయంలో నదిలో శాస్త్రం చెప్పిన రీతిలో పుణ్యస్నానం చేసినవారికి సకల శుభాలు కలగజేస్తారు.

ఈ ఏడాది మన గోదావరికి పుష్కరాలు వస్తున్నాయి. జూలై 14 న మొదలై 25 వరకు కొనసాగుతాయి.    

No comments:

Post a Comment