Showing posts with label హోలీ. Show all posts
Showing posts with label హోలీ. Show all posts

Friday, 6 March 2015

హోలీ శుభాకాంక్షలు

ఫాల్గుణ మాసంలో వసంత ఋతువు సమీపిస్తుంటే చలి తగ్గుతుంది. వాతావరణంలో వేడి పుంజుకుంటుంది. మొక్కలు, చెట్లకు పచ్చగా మారి ఆహ్లాదాన్ని పంచుతూ, మొగ్గలు తొడుగుతాయి. పక్షుల కిలకిలరావాలతో ప్రకృతి రమణీయంగా కనిపిస్తుంది. ఈ సమయంలోనే మానవుడిలో కామభావనలు పెరుగుతాయి. సామాజిక కట్టుబాట్లనే బంధనాలతో కట్టబడి ఉన్న మనిషి అధిక స్వేచ్ఛను ఆశిస్తాడు. భౌతిక సుఖాల కోసం వెంపర్లాడతాడు. ఇది కట్టడి చేయకపోతే విశృంఖలత్వాం పెరిగి వ్యక్తికి, సమాజానికి, మొత్తం మానవజాతికి పెనుముప్పుగా మారుతుంది. కుటుంబవ్యవస్థ చిన్నాభిన్నం అవుతుంది. ఇదంతా అజ్ఞానం వలన జరుగుతుంది.

శ్రీ కృష్ణపరమాత్మ గీతలో జ్ఞానాన్ని కామం ఆవరించి ఉంటుంది అని చెప్తారు. జ్ఞానం కావలంటే కోరికలు విడిచిపెట్టాలి. అన్ని కోరికలు విడిచిపెట్టనవసరం లేదు. ధర్మ బద్ధంకానీ కామాన్ని(కోరికలను) త్యజించాలి.

ఇక్కడ జరిగేది అదే. రాత్రి పూట కామదహనం. రాత్రి అంటే చీకటి, అజ్ఞానం. కామదహనం అంటే అసభ్యకరమైన, ధర్మబద్ధంకానీ కామపు ఆలోచనలను, విశృంఖలమైన కోరికలను భస్మం చేయడం. మరునాడు సూర్యోదయం అవుతుంది అంటే మనిషికి, సమాజానికి జ్ఞానోదయం అవుతుంది. రంగుల పండుగ హోలీ అవుతుంది అంటే జీవితం రంగులమయం అవుతుంది. కోరికలను అదుపులో పెట్టుకొమ్మనే సందేశాన్ని ఇస్తోంది హోలీ.

పరమశివుడు కామదహనం చేశాడు. ఈ సంఘటన వలన మనకు చక్కని సత్యం బోధపడుతుంది. వసంతాన్ని కారణం చేసుకుని మన్మధుడైనా మర్యాదను ఉల్లంఘిస్తే పరమేశ్వరుని చేత దండన అనుభవించాల్సి ఉంటుంది. మర్యాదను, సమాజపు కట్టుబాట్లను, ధర్మాన్ని పాటించడం సంపద, ఉల్లంఘించడం వినాశనం.

అందరికి హోలీ శుభాకాంక్షలు                        

దివ్య లీల హోలీ

మనిషి అందం శరీరవర్ణంలో కాదు, మనసులో ఉంటుంది, అతని గుణగణాలలో, చేసే కర్మ(పని)లో ఉంటుంది. అది చెప్పడానికే అన్ని వర్ణాలకు అతీతమైన పరమాత్మ, ఏ రూపమూ, ఏ రంగు లేని పరమాత్మ, కృష్ణ (నల్లని)వర్ణంలో శ్రీ కృష్ణుడిగా అవతరించాడు.


ఒకసారి చిన్ని కృష్ణుడు యశోదమ్మ దగ్గరకు వచ్చి " అమ్మా! చూడమ్మా! రాధ తెల్లగా, అందంగా ఉంది. నల్లగా ఉన్నానని నన్ను ఆటపట్టిస్తోంది" అంటాడు. బాధ ఎందుకు కన్నయ! నేను ఉన్నానుగా, ఆ విషయం మనం చూసుకుందాంలే అన్న యశోద, రాధ మీద రంగులు చల్లమని సలహా ఇస్తుంది.

అల్లరి కృష్ణుడు రాధతో పాటు బృందావనంలో ఉన్న గోపికల మీద కూడా రంగులు చల్లుతాడు. ఎన్ని రంగులు చల్లినా రాధ మాత్రం పున్నమి చంద్రుని వలె వెలిగిపోతుంటుంది. అలా శ్రీ కృష్ణపరమాత్మ రాధతో జరిపిన లీల హోలీ.

నిజానికి రాధ అంటే ఒక పాత్ర/వ్యక్తి కాదు. మహాభారతంలో రాధ ప్రస్తావన ఎక్కాడ కనిపించదు. రాధ అంటే ఇంద్రియాలను జయించడం, ఇంద్రియాల మీద పట్టు సాధించినవారని/జయించినవారని అర్దం. ఆత్మ తత్వం అర్దమైనవారు ఇంద్రియాలను జయిస్తారు. అలాంటి వారు పరమాత్మకు చాలా దగ్గరగా జీవిస్తారు. అలా పరమాత్మకు దగ్గరైనవారి మీద ఆయనకు అవ్యాజమైన ప్రేమ ఉంటుంది. అటువంటి వారితో(రాధ)  పరమాత్ముడు ఆడే దివ్య లీల హోలీ.

1st Edit: 14-March-2014
2nd Edit: 06-March-2015

హోలి కధ

హోలి పండుగ గురించి శ్రీ మద్భాగవతంలో ఒక ఘట్టం ఉంది (క్లుప్తంగా చెప్పుకుందాం).

హిరణ్యకశిపుడనే వాడు రాక్షసులకు రాజు. ఇంట్లో లేదా బయట, పగులు లేక రాత్రి సమయంలో కానీ, మనిషి లేదా మృగం చేత కానీ, భూమి లేక ఆకాశంలో కానీ, రోగాల వలన, ఆయుధముల వలన తనకు మరణం ఉండరాదని బ్రహ్మ దేవుని వద్ద వరం కోరుతాడు. వరం పొంది తనను ఎవరు ఏమీ చేయలేరన్న అహకారంతో యజ్ఞ యాగాదులను ధ్వంసం చేస్తాడు. గోశాలలను, పోలాలను, అడవులను, ఉద్యానవనాలకు నిప్పు పెట్టిస్తాడు. చెరువులను కలుషితం చేసి, విషతుల్యం చేస్తాడు. జనాలను అష్టకష్టాలు పెడతాడు. స్వర్గలోకం మీద దాడి చేసి ఇంద్రుడి ఆధిపత్యానికి విఘాతం కలిగిస్తాడు. తానే దేవుడినని, తననే పూజించాలని ప్రజలకు ఆజ్ఞ ఇస్తాడు. శ్రీ మహావిష్ణువంటే హిరణ్యకశిపుడికి మహాద్వేషం.

ఈయన పుత్రుడే 'ప్రహ్లాదుడు'. ప్రహ్లాదుడు గొప్ప విష్ణు భక్తుడు. ఎల్లప్పుడు విష్ణు నామాన్ని జపిస్తూ ఉండేవాడు. ఇది నచ్చని హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని చంపించడానికి అనేక ప్రయత్నాలు చేస్తాడు. చివరకు సజీవంగా అగ్నిలో పడేసి ప్రహ్లాదుడిని చంపాలనుకుంటాడు.

హిరణ్యకశిపుడికి హోలికా అనే సోదరి ఉంది. సజ్జనులకు (మంచివారికి) అపకారం కలిగించనంతవరకు ఈమెకు అగ్ని వల్ల ప్రమాదం ఉండదని వరం ఉంది. ప్రహ్లాదుడు అగ్నిలోంచి పారిపోకుండా ఉండడానికి అగ్ని జ్వాలల మధ్య హోలికను కూర్చోబెట్టి, హోలిక ఒడిలో ప్రహ్లాదుడిని కూర్చోబెడతారు. ప్రహ్లాదుడు ఏ మాత్రం భయపడకుండా విష్ణు నామన్ని జపిస్తూ హాయిగా కూర్చుంటాడు. తనని కాపాడమని కూడా విష్ణువును ప్రార్ధించడు.

ఎందుకంటే నమ్ముకున్న వారిని రక్షించడం పరమాత్ముడి బాధ్యత. ప్రత్యేకించి అడగాల్సిన అవసరం లేదు. 'నా మే భక్తః ప్రణశ్యతి', నన్ను పూర్తిగా నమ్మినవారు ఎన్నటికి నాశనమవ్వరు అని పరమాత్మే గీతలో చెప్పాడు. అసలు భక్తి అంటే అవ్యాజయమైన ప్రేమ. నేను నమ్మాను కనుక నన్ను దైవం రక్షించాలి, నన్ను ఉద్ధరించాలి అని నిజమైన భక్తుడు కోరుకోడు. నాకు ఏది మంచో అది నా దేవుడు ఇస్తాడని కష్టాలను సైతం ఎదురుకుని పరమాత్ముడిపై మరింత ప్రేమను పెంచుకుంటాడు. అందుకే ప్రహ్లాదుడు ప్రత్యేకించి రక్షించమని అడగలేదు.

పరమాత్ముడి అనుగ్రహం ప్రసరించింది. హిరణ్యకశిపుడి ఆలోచన బెడిసికొట్టింది. అగ్ని ప్రహ్లాదుడికి చిన్న అపకారం కూడా చేయలేదు. కానీ హోలిక ఆ అగ్నిజ్వాలలకు మడి మసైపొయింది. పసివాడు, పరమభాగవతుడైన ప్రహ్లాదుడు చిరునవ్వులు చిందిస్తూ అగ్ని నుండి బయటకు వచ్చాడు.

మన చరిత్రలో జరిగిన ఈ సంఘటనకు చిహ్నంగా హోలికా దహనాన్ని చేసి హోలి జరుపుకుంటాం.

సజ్జనులు, తపస్వులు, సత్యవంతులైన భగవత్భక్తులకు అపకారం చేయదలిస్తే సర్వనాశనమవుతారని, భగవంతుడుని నమ్ముకున్న వారు సదా రక్షింపబడతారని చెప్పడానికి ఇది ఒక తార్కాణం మాత్రమే.

ఓం నమో నారాయణాయ              

Thursday, 5 March 2015

పురాతన కాలంలో వైజ్ఞానికంగా హోలీ - ఆధునిక పోకడలు

## Must read this ##

6 మార్చి 2014, శుక్రవారం, హోలీ

పురాతన కాలంలో వైజ్ఞానికంగా హోలీ - ఆధునిక పోకడలు.

భారతీయుల ప్రతి పండుగలోనూ పర్యావరణము, ఆరోగ్యం ముఖ్యమైన అంశాలుగా ఉంటాయి. హోలీకా దహనం కూడా అలాంటిదే. హోలికా దహనంలో వాడే కట్టెలు కూడా ఔషధగుణములున్న వాటినే ఎంచుకునేవారు. యావత్ భారతదేశంలో ఒకేరాత్రి హోలికా దహనం చేయటం వల్ల శీతాకాలపు చలి- వేసికాలపు వేడి కలిసే ఈ ఋతుపరివర్తన సమయంలో వ్యాపించే మలేరియా, చర్మవ్యాధులు వంటి అంటురోగాలకు కారకాలైన క్రిమికీటకాలు నశిస్తాయి. సూర్యుడి వేడి ఇంకా పెరగకముందే వాయుమండలాన్ని వేడెక్కించడం, వాతావరణలోనికి ఔషధ గుణములున్న పొగను పంపించడం ద్వారా రోగకారక క్రిములు నాశనమవుతాయి. హోలీ దహనజ్వాలకు ప్రదక్షిణం చేయటం వలన 140 °F శరీరానికి తగిలడం, అక్కడున్న వారంత ఆ వాయువును పీల్చడం వలన శరీరంలో ఇంతకముందే ప్రవేశించి ఉన్న రోగకారక క్రిములు నాశనమవుతాయి.

కానీ మనం ఆధునికులం కదా. అందుకే మన పూర్వీకులకు భిన్నంగా హోలీకా దహనంలో రబ్బరు టైర్లు, ఇతర చెత్తాచెదారం వేసి, పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నాం, మన ఆరోగ్యాలను చేతులారా మనమే నాశనం చేసుకుంటున్నాం. భూతాపాన్ని ఇంకా పెంచేస్తున్నాం.

రంగుల విషయానికి వద్దాం. మోదుగ పూలు తెచ్చి, రోట్లో దంచి కుండలోపోసి, రసం తీసి, వెదురు గొట్టాల్లో నింపాలి. ఆ రసం ఎర్రగా ఉంటుంది. దీనికే వసంతం అని పేరు. దానీ వావివరసుల పాటించకుండా అందరూ ఒకరిపై ఒకరు చల్లుకుంటారు. ఈ మోదుగ పూల నుండి తీసిన కషాయం ఈ మాసం వాతావరణంలో మన దేహం మీద పడటం వలన శరీరానికి కాంతి, వర్ఛస్సు పెరుగుంతుందని, ఆరోగ్యం చేకూరుతుందని, శరీరంలో రక్తపోటు వంటి జబ్బుల వలన కలిగే ఉద్రేకాలు తగ్గుతాయని ఆయుర్వేదం చెబుతోంది. ఇదంతా మన పూర్వీకుల ఆలోచన.

కానీ మనమేం చేస్తున్నాం? చెట్ల వ్రేళ్ళు, ఆకుల నుండి తీసిన సహజ రంగులకు భిన్నంగా రసాయన రంగులు వాడుతున్నాం. వాటిలో బోరిక్ యాసిడ్, గాజు పొడితో తయారైన పొటాషియం డైక్రోమేట్, ఆంలం వాడతారు. జింక్ క్లోరైడ్ కలిసిన రంగులు కొంత విషప్రభావాన్ని కలిగుంటాయి. ఇవన్నీ ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. మన శరీరానికి చర్మం  రక్షాకవచం లాంటిది. స్వల్పంగా హానీ కలిగించే రసాయనిక తత్వాలు తగిలినా రక్తంలో కలువనివ్వదు. కాని, శరీరంపై గాయం ఉండటం, గాయం అప్పుడే జరిగి ఉండడటం లేదా పూర్తిగా మానని స్థితిలో ఉన్న పరిస్థితుల్లో దానిపై ఈ రసాయనిక రంగులు తగిలితే, ఆ గాయం రంగుల రసాయనిక ప్రభావం వలన రక్తంలో ప్రసరించే ప్రమాదం ఉంది. నీటితో కలిసి లోపల ప్రవేశించిన రంగులు మలమూత్రాదుల ద్వారా బయటకు వెళ్ళిపోవచ్చు. కానీ, సీసం - తగరం వంటి పదార్ధాలు శరీరంలోనికి ప్రవేశిస్తే బ్లడ్ క్యాన్సర్ వంటి రోగాలకు కారణమయ్యే ప్రమాదం ఉంటుంది. జింక్ క్లోరైడ్ వంటి రసాయనాలు కలిసిన రంగులు చర్మంపై పడితే బొబ్బలు లేచే ప్రమాదం ఉంటుంది. ఈ రంగులు ప్రమాదవశాత్తు నోటిలో పడి శరీరంలో ప్రవేశిస్తే శరీరంలోని సునితమైన భాగాలు దెబ్బతినటమే కాక చర్మం రంగు నీలంగా మారే ప్రమదం ఉంటుంది. గులాల్ తయారిలో పొటాషియం డైకోమేట్ ఉపయోగించారంటే వివిధ చర్మవ్యాధులు కలిగే అవకాశం ఉంటుంది.  

బజారులో దొరికే గులాల్ చాలావరకు రసాయనిక మిశ్రమాలే. అందుచేత వాటిని శరీరంపై ఉత్సాహం కొద్దీ రాసుకోవటంలో సంతోషం కంటే ప్రమాదమే అధికం. పిల్లల విషయంలొ మరీ  జాగ్రత్తగా ఉండాలి. కారణం- వారికి వెంటనే రంగులను దులుపుకోవాలని కానీ, కడిగేయాలని కాని తోచదు. అందుకే పిల్లలు హోలీ ఆడుతుంటే పెద్దలు దగ్గరే ఉండండి. కళ్ళలో రంగులు పడనీయకండి.

ఈ వసంతం తయారు చేసుకోవడంలో ఎంత సరదా ఉండేదో. తయారు చేస్తూనే ఒకరు మీద ఒకరు చల్లుకునేవారు, చాలా సరదాగా గడిపేవారు. పెద్దవాళ్ళని ఒకసారి కదిపితే, ఇప్పటికి ఆ జ్ఞాపకాలను గుర్తుచేసుకుని ఎంత సంతోషపడతారో. కానీ ఇప్పుడు ఆ అవకాశం లేదు, జనానికి అన్నీ రెడీమేడ్ కావాలి, అవసరమైతే డబ్బు పడేస్తాం, కానీ అంత కష్టం ఎవరు పడతారు, మాకు అంత ఓపిక లేదంటారు, ఇలా అనే చాలా సరదాలను, మధురజ్ఞాపకాలను కోల్పోతున్నారు. పైగా మార్కెట్‌ను చైనా రంగులు ముంచెత్తుతున్నాయి. ఆ రంగులను కొని చైనా ఆర్ధికవ్యవస్థకు మరింత బలం చేకూరుస్తున్నాం. ఒకసారి ఆలోచించండి ..................

కొత్త పోకడలు ఆరోగ్యాన్ని, ప్రకృతిని, సరదాలను, పండుగ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని నాశనం చేసేవిగా ఉన్నాయి. భారతీయులు తిరిగి సంప్రదాయ బద్దంగా పండుగుల జరుపుకోవాలి. సంప్రదాయాలను కాపాడాలి.

సహజ రంగులనే వాడండి. పర్యావరణాన్ని కాపడండి. ఆరోగ్యవంతులుగా జీవించండి.

హోలీ శుభాకాంక్షలు

Wednesday, 4 March 2015

హోలికా దహనం వీశేషాలు

5 మార్చి 2015, గురువారం, హోలికా దహనం
6 మార్చి 2014, శుక్రవారం, హోలీ

హోలికా దహనం ఆంతర్యం, విశేషాలు తెలుసుకుందాం.

సనాతన భారతీయ ధర్మంలో అగ్ని ఆరాధనకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రతి పండుగలోనూ అగ్నిదేవుని ఆరాధన ఉంటుంది. హోలి అగ్నిదేవుడికి సంబంధించిన పండుగ. హోలీ ముందురోజు రాత్రి చేసే హోలికా దహనంతో మొదలవుతుంది హోలీ అంటారు Yogi Ananda Saraswathi గారు. అగ్ని దహించడానికే కాదు, కొత్త ఆరంభానికి సూచిక. అందుకే మనం ప్రతి శుభకార్యాన్ని దీపారాధనతో ప్రారంభిస్తాం. ఋగ్ వేదంలో తొలి సూక్తం కూడా అగ్నితోనే 'అగ్ని మీళే పురోహితం' అంటూ మొదలవుతుంది.

అగ్ని దేవుడు మానవులు అగ్నిహోత్రంలో వేసిన హవిస్సును (యజ్ఞ గుండంలో వేసే వాటిని హవిస్సు, హవ్యము అంటారు) ఎంత పవిత్రంగా వేస్తామో, అంతే పవిత్రంగా దేవతలకు చేరవేసి, యాగశాలకు దేవతలను తీసుకువస్తాడు. జనుల కోరికలను తీరుస్తాడు. అందుకే అగ్ని దేవుడు సంతృప్తి చెందితే సకల దేవతలు సంతృప్తి చెందుతారు.

వైదిక కాలంలో ఈ పండుగను 'నన్నావేష్టి యజ్ఞం' అనేవారు. పొలంలో సగం పండి, సగం పచ్చిగా ఉన్న ధాన్యం తెచ్చి హోమం చేసి ప్రసాదంగా స్వీకరించేవారు. ఆ అన్నం హోలీ అనబడేది. అందుచేత ఈ పండుగను హోలికోత్సవం అనేవారు.


ఆయుర్వేద శాస్త్రంలో హోలికా దహనం గురించి తెలుసుకుందాం. హోలికి ముందు రోజు రాత్రి కామదహనం చేస్తారు. కామదహనమైనా, హోలికా దహనమైనా అగ్నిని ప్రజ్వలింపజేయడం, అక్కడ నలుగురు చేరడం కనిపిస్తుంది. దీని వెనుక ఉన్న ఆరోగ్య సూత్రం ఉంది. హోలీ శిశిర ఋతువు చివరలో వస్తుంది. కామదహనంలొ ఔషధ మూలికలకు (మామిడి, రావి, లేక మరేదైనా కావచ్చు, ఋతువును బట్టి కూడా ఏ ఏ సమిధిలను దహనం చేయాలో కూడా మనవాళ్ళు చెప్పారు) సంబంధించిన కర్రలను వాడాలి. ఈ ఆయుర్వేద ఔషధ సమిధలు కాలుతున్న సమయంలో వెలువడే ఔషధవాయువు వల్ల కొద్ది రోజుల్లో వాతావరణమార్పుకు తట్టుకునేల అక్కడున్న జనంలో రోగ నిరోధక శక్తి వృద్ధి చెందుతుంది. తద్వారా అందరి ఆరోగ్యం కాపాడబడుతుంది. అందుకే కామదహనంలో ఔషధమూలికలను మాత్రమే కాల్చాలి. ఏ చెత్త పడితే ఆ చెత్తను కాల్చి, ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని నాశనం చేయకూడదు. హోలికా దహనం వెనుకనున్న ఆయుర్వేద రహస్యం ఈ లింక్‌లో ఉంది. http://ecoganesha.blogspot.in/2013/03/blog-post_26.html

ఈ పోస్టు రాయడంలో కొంతవరకు సహాపయడిన పుస్తకం :  దైవం, దివ్యానుగ్రహ మాసపత్రిక).

Edited 1st time: 15- March-2014
Edited 2nd time: 04-March-2015