Friday, 6 March 2015

హోలీ శుభాకాంక్షలు

ఫాల్గుణ మాసంలో వసంత ఋతువు సమీపిస్తుంటే చలి తగ్గుతుంది. వాతావరణంలో వేడి పుంజుకుంటుంది. మొక్కలు, చెట్లకు పచ్చగా మారి ఆహ్లాదాన్ని పంచుతూ, మొగ్గలు తొడుగుతాయి. పక్షుల కిలకిలరావాలతో ప్రకృతి రమణీయంగా కనిపిస్తుంది. ఈ సమయంలోనే మానవుడిలో కామభావనలు పెరుగుతాయి. సామాజిక కట్టుబాట్లనే బంధనాలతో కట్టబడి ఉన్న మనిషి అధిక స్వేచ్ఛను ఆశిస్తాడు. భౌతిక సుఖాల కోసం వెంపర్లాడతాడు. ఇది కట్టడి చేయకపోతే విశృంఖలత్వాం పెరిగి వ్యక్తికి, సమాజానికి, మొత్తం మానవజాతికి పెనుముప్పుగా మారుతుంది. కుటుంబవ్యవస్థ చిన్నాభిన్నం అవుతుంది. ఇదంతా అజ్ఞానం వలన జరుగుతుంది.

శ్రీ కృష్ణపరమాత్మ గీతలో జ్ఞానాన్ని కామం ఆవరించి ఉంటుంది అని చెప్తారు. జ్ఞానం కావలంటే కోరికలు విడిచిపెట్టాలి. అన్ని కోరికలు విడిచిపెట్టనవసరం లేదు. ధర్మ బద్ధంకానీ కామాన్ని(కోరికలను) త్యజించాలి.

ఇక్కడ జరిగేది అదే. రాత్రి పూట కామదహనం. రాత్రి అంటే చీకటి, అజ్ఞానం. కామదహనం అంటే అసభ్యకరమైన, ధర్మబద్ధంకానీ కామపు ఆలోచనలను, విశృంఖలమైన కోరికలను భస్మం చేయడం. మరునాడు సూర్యోదయం అవుతుంది అంటే మనిషికి, సమాజానికి జ్ఞానోదయం అవుతుంది. రంగుల పండుగ హోలీ అవుతుంది అంటే జీవితం రంగులమయం అవుతుంది. కోరికలను అదుపులో పెట్టుకొమ్మనే సందేశాన్ని ఇస్తోంది హోలీ.

పరమశివుడు కామదహనం చేశాడు. ఈ సంఘటన వలన మనకు చక్కని సత్యం బోధపడుతుంది. వసంతాన్ని కారణం చేసుకుని మన్మధుడైనా మర్యాదను ఉల్లంఘిస్తే పరమేశ్వరుని చేత దండన అనుభవించాల్సి ఉంటుంది. మర్యాదను, సమాజపు కట్టుబాట్లను, ధర్మాన్ని పాటించడం సంపద, ఉల్లంఘించడం వినాశనం.

అందరికి హోలీ శుభాకాంక్షలు                        

No comments:

Post a Comment