Thursday, 5 March 2015

పురాతన కాలంలో వైజ్ఞానికంగా హోలీ - ఆధునిక పోకడలు

## Must read this ##

6 మార్చి 2014, శుక్రవారం, హోలీ

పురాతన కాలంలో వైజ్ఞానికంగా హోలీ - ఆధునిక పోకడలు.

భారతీయుల ప్రతి పండుగలోనూ పర్యావరణము, ఆరోగ్యం ముఖ్యమైన అంశాలుగా ఉంటాయి. హోలీకా దహనం కూడా అలాంటిదే. హోలికా దహనంలో వాడే కట్టెలు కూడా ఔషధగుణములున్న వాటినే ఎంచుకునేవారు. యావత్ భారతదేశంలో ఒకేరాత్రి హోలికా దహనం చేయటం వల్ల శీతాకాలపు చలి- వేసికాలపు వేడి కలిసే ఈ ఋతుపరివర్తన సమయంలో వ్యాపించే మలేరియా, చర్మవ్యాధులు వంటి అంటురోగాలకు కారకాలైన క్రిమికీటకాలు నశిస్తాయి. సూర్యుడి వేడి ఇంకా పెరగకముందే వాయుమండలాన్ని వేడెక్కించడం, వాతావరణలోనికి ఔషధ గుణములున్న పొగను పంపించడం ద్వారా రోగకారక క్రిములు నాశనమవుతాయి. హోలీ దహనజ్వాలకు ప్రదక్షిణం చేయటం వలన 140 °F శరీరానికి తగిలడం, అక్కడున్న వారంత ఆ వాయువును పీల్చడం వలన శరీరంలో ఇంతకముందే ప్రవేశించి ఉన్న రోగకారక క్రిములు నాశనమవుతాయి.

కానీ మనం ఆధునికులం కదా. అందుకే మన పూర్వీకులకు భిన్నంగా హోలీకా దహనంలో రబ్బరు టైర్లు, ఇతర చెత్తాచెదారం వేసి, పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నాం, మన ఆరోగ్యాలను చేతులారా మనమే నాశనం చేసుకుంటున్నాం. భూతాపాన్ని ఇంకా పెంచేస్తున్నాం.

రంగుల విషయానికి వద్దాం. మోదుగ పూలు తెచ్చి, రోట్లో దంచి కుండలోపోసి, రసం తీసి, వెదురు గొట్టాల్లో నింపాలి. ఆ రసం ఎర్రగా ఉంటుంది. దీనికే వసంతం అని పేరు. దానీ వావివరసుల పాటించకుండా అందరూ ఒకరిపై ఒకరు చల్లుకుంటారు. ఈ మోదుగ పూల నుండి తీసిన కషాయం ఈ మాసం వాతావరణంలో మన దేహం మీద పడటం వలన శరీరానికి కాంతి, వర్ఛస్సు పెరుగుంతుందని, ఆరోగ్యం చేకూరుతుందని, శరీరంలో రక్తపోటు వంటి జబ్బుల వలన కలిగే ఉద్రేకాలు తగ్గుతాయని ఆయుర్వేదం చెబుతోంది. ఇదంతా మన పూర్వీకుల ఆలోచన.

కానీ మనమేం చేస్తున్నాం? చెట్ల వ్రేళ్ళు, ఆకుల నుండి తీసిన సహజ రంగులకు భిన్నంగా రసాయన రంగులు వాడుతున్నాం. వాటిలో బోరిక్ యాసిడ్, గాజు పొడితో తయారైన పొటాషియం డైక్రోమేట్, ఆంలం వాడతారు. జింక్ క్లోరైడ్ కలిసిన రంగులు కొంత విషప్రభావాన్ని కలిగుంటాయి. ఇవన్నీ ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. మన శరీరానికి చర్మం  రక్షాకవచం లాంటిది. స్వల్పంగా హానీ కలిగించే రసాయనిక తత్వాలు తగిలినా రక్తంలో కలువనివ్వదు. కాని, శరీరంపై గాయం ఉండటం, గాయం అప్పుడే జరిగి ఉండడటం లేదా పూర్తిగా మానని స్థితిలో ఉన్న పరిస్థితుల్లో దానిపై ఈ రసాయనిక రంగులు తగిలితే, ఆ గాయం రంగుల రసాయనిక ప్రభావం వలన రక్తంలో ప్రసరించే ప్రమాదం ఉంది. నీటితో కలిసి లోపల ప్రవేశించిన రంగులు మలమూత్రాదుల ద్వారా బయటకు వెళ్ళిపోవచ్చు. కానీ, సీసం - తగరం వంటి పదార్ధాలు శరీరంలోనికి ప్రవేశిస్తే బ్లడ్ క్యాన్సర్ వంటి రోగాలకు కారణమయ్యే ప్రమాదం ఉంటుంది. జింక్ క్లోరైడ్ వంటి రసాయనాలు కలిసిన రంగులు చర్మంపై పడితే బొబ్బలు లేచే ప్రమాదం ఉంటుంది. ఈ రంగులు ప్రమాదవశాత్తు నోటిలో పడి శరీరంలో ప్రవేశిస్తే శరీరంలోని సునితమైన భాగాలు దెబ్బతినటమే కాక చర్మం రంగు నీలంగా మారే ప్రమదం ఉంటుంది. గులాల్ తయారిలో పొటాషియం డైకోమేట్ ఉపయోగించారంటే వివిధ చర్మవ్యాధులు కలిగే అవకాశం ఉంటుంది.  

బజారులో దొరికే గులాల్ చాలావరకు రసాయనిక మిశ్రమాలే. అందుచేత వాటిని శరీరంపై ఉత్సాహం కొద్దీ రాసుకోవటంలో సంతోషం కంటే ప్రమాదమే అధికం. పిల్లల విషయంలొ మరీ  జాగ్రత్తగా ఉండాలి. కారణం- వారికి వెంటనే రంగులను దులుపుకోవాలని కానీ, కడిగేయాలని కాని తోచదు. అందుకే పిల్లలు హోలీ ఆడుతుంటే పెద్దలు దగ్గరే ఉండండి. కళ్ళలో రంగులు పడనీయకండి.

ఈ వసంతం తయారు చేసుకోవడంలో ఎంత సరదా ఉండేదో. తయారు చేస్తూనే ఒకరు మీద ఒకరు చల్లుకునేవారు, చాలా సరదాగా గడిపేవారు. పెద్దవాళ్ళని ఒకసారి కదిపితే, ఇప్పటికి ఆ జ్ఞాపకాలను గుర్తుచేసుకుని ఎంత సంతోషపడతారో. కానీ ఇప్పుడు ఆ అవకాశం లేదు, జనానికి అన్నీ రెడీమేడ్ కావాలి, అవసరమైతే డబ్బు పడేస్తాం, కానీ అంత కష్టం ఎవరు పడతారు, మాకు అంత ఓపిక లేదంటారు, ఇలా అనే చాలా సరదాలను, మధురజ్ఞాపకాలను కోల్పోతున్నారు. పైగా మార్కెట్‌ను చైనా రంగులు ముంచెత్తుతున్నాయి. ఆ రంగులను కొని చైనా ఆర్ధికవ్యవస్థకు మరింత బలం చేకూరుస్తున్నాం. ఒకసారి ఆలోచించండి ..................

కొత్త పోకడలు ఆరోగ్యాన్ని, ప్రకృతిని, సరదాలను, పండుగ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని నాశనం చేసేవిగా ఉన్నాయి. భారతీయులు తిరిగి సంప్రదాయ బద్దంగా పండుగుల జరుపుకోవాలి. సంప్రదాయాలను కాపాడాలి.

సహజ రంగులనే వాడండి. పర్యావరణాన్ని కాపడండి. ఆరోగ్యవంతులుగా జీవించండి.

హోలీ శుభాకాంక్షలు

No comments:

Post a Comment