Wednesday 4 March 2015

హోలికా దహనం వీశేషాలు

5 మార్చి 2015, గురువారం, హోలికా దహనం
6 మార్చి 2014, శుక్రవారం, హోలీ

హోలికా దహనం ఆంతర్యం, విశేషాలు తెలుసుకుందాం.

సనాతన భారతీయ ధర్మంలో అగ్ని ఆరాధనకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రతి పండుగలోనూ అగ్నిదేవుని ఆరాధన ఉంటుంది. హోలి అగ్నిదేవుడికి సంబంధించిన పండుగ. హోలీ ముందురోజు రాత్రి చేసే హోలికా దహనంతో మొదలవుతుంది హోలీ అంటారు Yogi Ananda Saraswathi గారు. అగ్ని దహించడానికే కాదు, కొత్త ఆరంభానికి సూచిక. అందుకే మనం ప్రతి శుభకార్యాన్ని దీపారాధనతో ప్రారంభిస్తాం. ఋగ్ వేదంలో తొలి సూక్తం కూడా అగ్నితోనే 'అగ్ని మీళే పురోహితం' అంటూ మొదలవుతుంది.

అగ్ని దేవుడు మానవులు అగ్నిహోత్రంలో వేసిన హవిస్సును (యజ్ఞ గుండంలో వేసే వాటిని హవిస్సు, హవ్యము అంటారు) ఎంత పవిత్రంగా వేస్తామో, అంతే పవిత్రంగా దేవతలకు చేరవేసి, యాగశాలకు దేవతలను తీసుకువస్తాడు. జనుల కోరికలను తీరుస్తాడు. అందుకే అగ్ని దేవుడు సంతృప్తి చెందితే సకల దేవతలు సంతృప్తి చెందుతారు.

వైదిక కాలంలో ఈ పండుగను 'నన్నావేష్టి యజ్ఞం' అనేవారు. పొలంలో సగం పండి, సగం పచ్చిగా ఉన్న ధాన్యం తెచ్చి హోమం చేసి ప్రసాదంగా స్వీకరించేవారు. ఆ అన్నం హోలీ అనబడేది. అందుచేత ఈ పండుగను హోలికోత్సవం అనేవారు.


ఆయుర్వేద శాస్త్రంలో హోలికా దహనం గురించి తెలుసుకుందాం. హోలికి ముందు రోజు రాత్రి కామదహనం చేస్తారు. కామదహనమైనా, హోలికా దహనమైనా అగ్నిని ప్రజ్వలింపజేయడం, అక్కడ నలుగురు చేరడం కనిపిస్తుంది. దీని వెనుక ఉన్న ఆరోగ్య సూత్రం ఉంది. హోలీ శిశిర ఋతువు చివరలో వస్తుంది. కామదహనంలొ ఔషధ మూలికలకు (మామిడి, రావి, లేక మరేదైనా కావచ్చు, ఋతువును బట్టి కూడా ఏ ఏ సమిధిలను దహనం చేయాలో కూడా మనవాళ్ళు చెప్పారు) సంబంధించిన కర్రలను వాడాలి. ఈ ఆయుర్వేద ఔషధ సమిధలు కాలుతున్న సమయంలో వెలువడే ఔషధవాయువు వల్ల కొద్ది రోజుల్లో వాతావరణమార్పుకు తట్టుకునేల అక్కడున్న జనంలో రోగ నిరోధక శక్తి వృద్ధి చెందుతుంది. తద్వారా అందరి ఆరోగ్యం కాపాడబడుతుంది. అందుకే కామదహనంలో ఔషధమూలికలను మాత్రమే కాల్చాలి. ఏ చెత్త పడితే ఆ చెత్తను కాల్చి, ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని నాశనం చేయకూడదు. హోలికా దహనం వెనుకనున్న ఆయుర్వేద రహస్యం ఈ లింక్‌లో ఉంది. http://ecoganesha.blogspot.in/2013/03/blog-post_26.html

ఈ పోస్టు రాయడంలో కొంతవరకు సహాపయడిన పుస్తకం :  దైవం, దివ్యానుగ్రహ మాసపత్రిక).

Edited 1st time: 15- March-2014
Edited 2nd time: 04-March-2015

1 comment: