Tuesday, 9 July 2013

ఆషాఢమాసంలో అందరూ తప్పకుండా గోరింటాకు పెట్టుకునే ఆచారం ఉంది.

ఆషాఢమాసంలో అందరూ తప్పకుండా గోరింటాకు పెట్టుకునే ఆచారం మన సంస్కృతిలో ఉంది. అసలు దీని వెనుక ఉన్న రహస్యం ఏమిటి?

ఆషాఢమాసంతో గ్రీష్మ ఋతువు పూర్తిగా వెళ్ళిపోయి వర్ష ఋతువు ప్రారంభవుతుంది. వాతావరణంలో మార్పు వస్తుంది. శ్రావణం నుంచి వర్షాలు పూర్తిగా ప్రారంభవుతాయి.  ఇంతకముందున్న గ్రీష్మ ఋతువు కారణంగా మన శరీరంలో వేడి పెరుగుతుంది. బయటి వాతావరణం ఒక్కసారిగా చల్లబడడం, మన శరీరంలో ఉన్న వేడి, రెండూ పరస్పరం విరుద్ధం కనుక అనారోగ్యం ఏర్పడవచ్చు. గోరింటాకుకు శరీరంలో అధిక వేడిని తీసే శక్తి ఉంది.  గోరింటాకు ఆషాఢంలో పెట్టుకోవడం వలన శరీరంలో వేడి తగ్గి వర్ష ఋతువు అనుగుణంగా శరీరాన్ని తయారు చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అందువల్ల మన ప్రాచీనులు ఆషాఢమాసంలో గోరింటాకు తప్పకుండా పెట్టుకునే సంప్రదాయాన్ని తీసుకువచ్చారు.


గోరింటాకు ఉపయోగాల కోసం ఈ లుంక్ చూడండి - ఔషధమూలిక గోరింటాకు 

Monday, 8 July 2013

ఆషాఢమాసంలో కొత్తగా పెళ్ళైన దంపతులను దూరంగా ఉంచుతారు. ఎందుకు?

మన సంప్రదాయం- శాస్త్రీయం

ఆషాఢమాసంలో కొత్తగా పెళ్ళైన దంపతులను దూరంగా ఉంచుతారు. అమ్మాయిని పుట్టింటికి తీసుకువెళతారు. ఎందుకు?

ఆషాఢమాసంలో స్త్రీ నెలతప్పితే, 9 నెలల తరువాత అంటే వేసవి కాలంలో(మార్చి నుంచి మే మధ్య కాలంలో) ప్రసవం జరుగుతుంది. సాధారణంగానే మన దేశంలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి. వేసవిలో మరింత విజృంబిస్తాయి. అప్పుడే పుట్టిన శిశువుకు ఈ వేడివాతావరణం బాగా ఇబ్బంది కలిగిస్తుంది. శిశువు ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది. ఇది తల్లీబిడ్డల ఆరోగ్యానికి ఏ మాత్రం శ్రేయస్కరం కాదు. అందుకే ఆషాఢమాసంలో కొత్త దంపతులను దూరంగా ఉంచుతారు.

మాతశిశు సంక్షేమమే దేశ సంక్షేమానికి తొలి మెట్టు అన్నది మన పూర్వీకులు ఆలోచన. అందుకే ఈ సంప్రదాయం.

అదే కాకుండా ఆషాఢంలో ధాతుసంరక్షణ, బ్రహ్మచర్యం తప్పనిసరి అని ఆయుర్వేదశాస్త్రం చెప్తున్నది. కొత్తగా పెళ్ళైనా భార్యాభర్తలకు నిగ్రహం తక్కువగా ఉంటుంది, అందుకని వాళ్ళని దూరంగా ఉంచుతారు. మిగితావారు కూడా ఈ మాసంలో బ్రహ్మచర్యం పాటించాలి. దీనివల్ల ఆరోగ్యం రక్షించబడుతుంది.      

Friday, 5 July 2013

బయటనుండి రాగానే ముందుగా కాళ్ళు కడుక్కున్న తరువాతే ఇంట్లోకి ప్రవేశించమని మన పెద్దలు చెప్తారు. దీని వెనుక ఉన్న శాస్త్రీయ కారణం ఏమిటి?

మన సంప్రదాయం - శాస్త్రీయత

బయటనుండి రాగానే ముందుగా కాళ్ళు కడుక్కున్న తరువాతే ఇంట్లోకి ప్రవేశించమని మన పెద్దలు చెప్తారు. దీని వెనుక ఉన్న శాస్త్రీయ కారణం ఏమిటి?

చెప్పులు వేసుకుని వెళ్ళినా, మన రకరకాల ప్రదేశాల్లో తిరుగుతాం. అవి పరిశుభ్రంగా ఉండచ్చు, ఉండకపోవచ్చు. ప్రతి చోటా అనేక రకాల క్రిములు ఉంటాయి. మనం బయట తిరిగినప్పుడు ఆ క్రిములు మన శరీరానికి, ముఖ్యంగా పాదాలకు అంటుకుంటాయి. మనం నేరుగా ఇంట్లోకి ప్రవేశిస్తే, ఆ రోగకారక క్రిములు ఇంట్లోకి చేరి ఆ ఇంట్లో నివసించేవారికి వ్యాధులు కలిగించవచ్చు. అదే పసిపిల్లలు ఉంటే వాళ్ళు ఇల్లంతా పాకుతారు కనుక ఇంకా త్వరగా అనారోగ్యం వచ్చేస్తుంది. అందుకే మన పెద్దలు బయటకు వెళ్ళిరాగానే ఇంట్లోకి ప్రవేశించే ముందు కాళ్ళు కడుక్కోమన్నారు.

మన నడిచే దారిలో మనకు హాని కలిగించేవి అనేకం ఉండచ్చు. కొందరు దిష్టి తీసిన నీళ్ళు, నిమ్మకాయలు వంటివి ఎక్కడపడితే అక్కడ పడేస్తారు. మనం వటిని దాటే అవకాశం ఉంది. ఒకవేళ మనం అలాంటి వాటిని దాటితే, ఆ దోషం తొలగిపోవడానికి, మనకు ఎటువంటి కీడు జరగకుండా ఉండడం కోసం బయటకు వెళ్ళి రాగానే కాళ్ళు కడుక్కుంటాం.

మరొక ఆరోగ్య రహస్యం కూడా ఉందండి. మన శరీరంలో 72,000 నాడులు ఉంటాయి. మెదడు, కళ్ళకు సంబంధించిన నాడులు కొన్ని పాదాల్లోనూ, అరికాల్లోనూ ఉంటాయి. కాళ్ళు పరిశుభ్రంగా లేకపోతే కంటికి సంబంధించిన వ్యాధులు వస్తాయంటోంది ఆయుర్వేదం. వీటితో పాటు బయటకు వెళ్ళి రావడం వలన అలసట ఏర్పడుతుంది. వెళ్ళిరాగానే కాళ్ళ మీద చల్లటి నీరు పడడంతో ఆ చల్లదనం నాడులు ద్వారా మెదడకు చేరి మెదడు సేద తీరుతుంది. అలసట త్వరగా పోతుంది.

ఇన్ని శాస్త్రీయ విషయాలు, ఆరోగ్య రహస్యాలు ఉన్నాయి కనుకే మనం బయటకు వెళ్ళిరాగానే కాళ్ళు కడుక్కుంటాం. కానీ ఇప్పుడు మనం మర్చిపోయాం. కనీసం ఇక నుంచి మీరు కూడా పాటిస్తారు కదూ.  

Thursday, 4 July 2013

మనం చేసిన పాపం మనమే అనుభవించాలి, అందులోకి అమ్మను లాగడం అనవసరం అంటున్నారు ధారీ దేవి ఆలయ పూజారి.

కేధార్‌నాధ్‌లో వరదలకు ధారిదేవి ఆగ్రహమే కారణమన్న వాదనను ధారీదేవి ఆలయ పూజారి కొట్టిపారేస్తున్నారు. మనం ప్రకృతిని విధ్వంసం చేసిన ఫలితానికి ప్రకృతి వేసిన శిక్ష ఈ వరదలు, మనం చేసిన పాపం మనమే అనుభవించాలి, అందులోకి అమ్మను లాగడం అనవసరం అంటున్నారు ధారీ దేవి ఆలయ పూజారి.

అది 100 శాతం నిజం. అమ్మవారు సర్వాంతర్యామి, అంతటా ఉంది. అమ్మ లేని ప్రదేశమే లేదు. ఆది శక్తి ప్రకృతి రూపంలో చెట్లను, జంతువులను, పశువులను, పక్షులను, క్రిమికీటకాలను, మనుష్యులను నిత్యం రక్షిస్తూ, పోషిస్తూ ఉంది. ఆ ప్రకృతిలో భాగమే శిల(రాయి). అంతటా ఉన్న ఆ పరమేశ్వరిని ఆరాధించడం అందరికి సాధ్యమవ్వదు కనుక తనలోనే భాగమైన రాయిలో తననే(అమ్మవారినే) చూసి పూజించారు మన పూర్వీకులు. కానీ మనకు ఈ దృష్టి ఎప్పుడో పోయింది. ఈ రోజు మనకు తెలిసినంత వరకు అక్కడున్నది ఒక రాయి మాత్రమే. ఆ రాయి మన కోరికలు తీరుస్తుంది. అంతే! మనకు కష్టం వచ్చినప్పుడు, లేక మనకు ఏదైనా అవసరం కలిగినప్పుడు మాత్రమే మనకు అందులో శక్తి కనిపిస్తుంది.

భగవంతుడి మీద భక్తి ఉన్నది అనడానికి సంకేతం ఆయన యొక్క సృష్టిని గౌరవించడం. అంటే ప్రకృతిని రక్షించడం. కానీ ఈరోజు మన ఈ పని మాత్రం చస్తే చేయం. ఉత్తరాఖండ్‌లో కూడా అదే జరిగింది. ఉత్తారఖండ్ గ్రామదేవత ధారీ దేవి. ఉత్తరాఖండ్ మొత్తం ఆమె ఆధీనంలో ఉంటుంది. మరి అక్కడ జరిగిందేమిటి? అమ్మ 'ఇలాకాలో'అక్రమ నిర్మాణాలు చేశారు. తన బిడ్డలైన చెట్లను, అడవులను నరికేశారు. పక్షులు, జంతువుల ఆవాసాలను నాశనం చేశారు. అక్కడ యాత్రకు వెళ్ళిన భక్తులేమి తక్కువ కాదు. ఎక్కడపడితే అక్కడ చెత్తాచెదారం, ప్లాస్టిక్ కవర్లు పడేశారు. నదుల్లో మలమూత్ర విసర్జనలు చేసి, సబ్బులు వాడి, ఉమ్మి అపవిత్రం చేశారు. ఇదంతా ధారి దేవికి జరిగిన అవమానమే కదా. అప్పటివరకు అంతటా వ్యాపించి ఉన్న ఆ దివ్యశక్తికి అపచారం చేస్తూనే ఉన్నాం. అంతిమంగా అమ్మకు ప్రతిరూపమైన విగ్రహాన్ని ప్రక్కకు తొలగించాం. తొలగించామా లేక అమ్మే పక్కకు తప్పకుందా అనేది మనం ఆలోచించాలి.

ఒకవేళ ధారిదేవి విగ్రహాన్ని తొలగించడం వల్లనే వరదలు వచ్చాయనుకుంటే మరి దేవభూమి(ఉత్తరాఖండ్)ను మనం నాశనం చేసినప్పుడు ఇంకేంత కోపం వచ్చి ఉండాలి. అక్కడ పాపభారం పెరిగింది, పర్యావరణ విధ్వంసం తారాస్థాయికి చేరింది. అందుకే వరదలు వచ్చాయి. ఇదంతా మన స్వయంకృతమే.                   

Wednesday, 3 July 2013

అంతా అమ్మ మహిమే అంటున్నారు స్థానికులు

~ ఉత్తరాఖండ్‌లో అలకానంద నదిపైపై హైడల్ పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి అక్కడి ప్రభుత్వం ఎప్పటినుంచో ప్రయత్నిస్తోంది. మన రాష్ట్రానికి చెందిన జీవీకే సంస్థ అనుబంధ కంపెనీ అలకానంద హైడ్రో పవర్ కంపెనీ, 330 మెగావాట్ల జలవిద్యుత్ కేంద్ర నిర్మాణానికి సిద్ధమయ్యింది. ఈ ప్రాజెక్టు నిర్మాణం వలన ధారీదేవి ఆలయం నీట మునుగుతుందని అక్కడి స్థానికులు ఆందోళన చెందారు. బీజేపీ నేతలు, సాధువులు, స్థానికులతో పాటు ప్రాజెక్టు నిర్మాణంతో పర్యావరణానికి హాని జరుగుతుందన్న భయంతో పర్యావరణవేత్తలు కూడా ఈ భారీ జల విద్యుత్ ప్రాజెక్టును గట్టిగా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఇక్కడ జరిగే పర్యావరణ విధంవసం విషయమై పర్యావరణ శాఖ సుప్రీం కోర్టులో అపిడవిట్ దాఖలు చేసింది.  

ప్రాజెక్టు నిర్మాణానికి గట్టిగా పూనుకున్న కంపెనీ అమ్మవారి విగ్రహాన్ని ఎత్తైన ప్రదేశానికి తరలించాలని భావించింది. ప్రాజెక్టు నిర్మాణానికి అనుగుణంగా, నీటిలో మునగనంత ఎత్తున ప్లాట్ ఫామ్ ఏర్పాటు చేసి దానిపైకి ధారిదేవి విగ్రహాన్ని తరలించుకోవచ్చంటూ తాత్కాలికంగా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇస్తూ తిది నిర్ణయాన్ని వాయిదా వేసింది.  

విగ్రహాన్ని తరలింపును స్థానికులు అడ్డుకుంటామని హెచ్చరించడంతో, ప్రాజెక్టు అధికారులు వ్యూహాత్మకంగా డ్యాంలో నీటిమట్టాన్ని పెంచుతూ వచ్చారు. దీంతో, అమ్మ ఆలయం మునిగిపోయే పరిస్థితి ఏర్పడింది. విగ్రహం మునిగిపోతుందంటూ హడావుడి చేసి, గత నెల(జూన్ 16), ఆదివారం రాత్రి 7.30కు ధారీదేవి పైభాగాన్ని పెకిలించి, ఎత్తున నిర్మించిన ప్లాట్ ఫామ్ పైకి మార్చారు. విగ్రాహాన్ని ప్రవైటు సిబ్బంది సాయంతో మార్చారు.

ధారి దేవి విగ్రహాన్ని మార్చుతున్న సమయంలోనే ఆకాశంలో ఉరుములు, మెరుపులు విపరీతంగా వచ్చాయని ధారీదేవిని పెకిలించిన సిబ్బందే చెప్తున్నారు. కొద్దిసేపటికే భారీ వర్షం మొదలయ్యింది. హిమాలయాల్లో క్లౌడ్ బ్రస్ట్ జరిగి, భారీగా వరద పోటెత్తడంతో పెద్ద నష్టం జరిగింది. ఇదంతా అమ్మ ప్రకోపించడం వల్లే సంభవించిందంటున్నారు స్థానికులు. వందలాది భవనాలు నామరూపాల్లేకుండా పోయినా, వేలాదిమంది కొట్టుకు పోయినా, అలకానంద నది మధ్యలో ఉన్న కేదర్్నాథ్ ఆలయం మాత్రం చెక్కుచెదరకుండా ఉండడం, ఆలయంలోని శివలింగం బురదలో కూరుకుపోకుండ ఉడడం (పూజకోసం తెచ్చిన బిల్వ పత్రాలు శివలింగాన్ని కప్పిఉంచడం),
అంతా అమ్మ మహిమే అంటున్నారు స్థానికులు.

1882లోనూ ఓ సారి ధారాదేవిని ఈ స్థానం నుంచి తరలించడానికి స్థానిక రాజు, సైన్యంతో కలిసి ప్రయత్నించారు. అప్పుడూ ఇదే తరహాలో భారీగా వరదలు వచ్చి ప్రాణ నష్టం జరిగిందని స్థానికులు చెప్తున్నారు. ఇప్పటి వరదలు కూడా ధారీదేవి ఆగ్రహం వల్లే వచ్చాయని అంటున్నారు.           

Tuesday, 2 July 2013

ఉత్తరాఖండ్ ఉపద్రవానికి కారణం ధారీదేవి ఆగ్రహం అంటున్నారు అక్కడి స్థానికులు. అసలు ఏవరీ ధారీ దేవి?

ఉత్తరాఖండ్ ఉపద్రవానికి కారణం ధారీదేవి ఆగ్రహం అంటున్నారు అక్కడి స్థానికులు. అసలు ఏవరీ ధారీ దేవి?

సూమారు 800 ఏళ్ళ క్రితం ఉత్తరాఖండ్‌లో గార్హ్వాల్ ఎగువ ప్రాంతంలో వచ్చిన వరదలకు ఒక అమ్మవారి విగ్రహం కొట్టుకువచ్చి ఇప్పుడు ధారీదేవిని ప్రతిష్టించిన ప్రదేశంలో ఉన్న ఒక శిలకు తగిలింది. దీంతో అక్కడున్న శిల(రాయి) విలపించిందట. అప్పటి నుంచి ఆ ప్రాంతంవారు ఆ శిలను పూజిస్తున్నట్టు అక్కడివారు చెప్తారు.  

అలకానంద నది మధ్యలో ఒక ఉంటూ, నది యొక్క ధారను(ప్రవాహాన్ని) నియంత్రిస్తుంది కనుక ఈ అమ్మవారికి ధారీ దేవి అని పేరు వచ్చిందని కొందరు చెప్తారు.

ధారీదేవి కాళీమాత ప్రతిరూపం, శక్తి స్వరూపిణి. చార్‌ధాం క్షేత్ర దర్శనానికి వచ్చే భక్తులకు రక్షకురాలు, ఉత్తరాఖండ్ గ్రామ దేవత ఈ ధారీ దేవి.  

ధారీ దేవి కేధార్‌నాధ్‌లో నిత్యం సంచారం చేస్తూ, రక్షిస్తూ ఉంటుంది. ఉదయం బాలిక స్వరూపంలో, మధ్యాహ్నం యవ్వన స్త్రీ రూపంలో, రాతి వేళ ముసలి స్త్రీ రూపంలో దర్శనమిస్తూ, కేధార్‌నాధ్ క్షేత్రంలో  తిరుగుతూ ఉంటుంది.

బధ్రీనాధ్ నుంచి శ్రీనగర్ వెళ్ళే దారిలో, రుద్రప్రయాగకు సుమారు 20 కిలోమీటర్ల దూరంలో, శ్రీనగర్‌కు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది ధారిదేవి ఆలయం.

ఈ తల్లి యొక్క సగభాగం ఇక్కడ ధారిదేవి రూపంలో పూజింపబడుతుంటే, మిగితా సగభాగం కాళీమట్ ప్రాంతంలో కాళీ దేవి రూపంలో పూలందుకొంటున్నది.

శ్రీ దేవీ భాగవతంలో చెప్పబడిన శక్తి యొక్క 108 దివ్య క్షేత్రాల్లో ఈ ధారీ దేవి కూడా ఉండడం విశేషం.

Monday, 1 July 2013

ఈ మొత్తం ప్రపంచంలో కేవలం 12 జ్యోతిర్లింగాలు మాత్రమే ఉన్నాయి.

ఈ మొత్తం ప్రపంచంలో కేవలం 12 జ్యోతిర్లింగాలు మాత్రమే ఉన్నాయి. ఆ 12 కూడా మన పవిత్ర భారతదేశంలో ఉండడం విశేషం. సౌరాష్ట్రలో సోమనాధుడు, శ్రీశైల మల్లిఖార్జునుడు, ఉజ్జైయిని మహాకాళేశ్వరుడు ......ఇలా మొత్తం 12 ప్రదేశాల్లో పరమశివుడు జ్యోతిర్లింగ స్వరూపంలో  దర్శనమిస్తున్నాడు.

ఖగోళ, అంతరిక్ష శాస్త్రాలను అనుసరించి ఎక్కడైతే పవిత్రమైన కాస్మిక్ శక్తి అత్యధికస్థాయిలో కేంద్రీకృతమవుతుందో, ఎక్కడైతే దైవ శక్తులు, దివ్య శక్తుల సంచారం అధికంగా ఉంటుందో, ఏ ప్రదేశానికి వెళ్ళడం చేత మానవుడు అతి త్వరగా పరమాత్మ జ్ఞానాన్ని పొందగలడో అటువంటి ప్రదేశాల్లో కొలువై ఉన్నాయి ఈ ద్వాదశ(12) జ్యోతిర్లింగ క్షేత్రాలు.

జ్యోతిర్లింగం అనే పేరే చెప్తోంది అవి జ్యోతి స్వరూపాలని. కొంత సాధన చేసి, వాటిని దర్శించవలసిన రీతిలో దర్శించడం చేత అవి మనలో కమ్ముకున్న దట్టమైన అజ్ఞాన పొరల్నీ కాల్చివేసి ఆత్మ జ్ఞానాన్ని ప్రసాదించగల దివ్య ఉపకరణాలు. వాటి దగ్గర ధ్యానంలో కూర్చోవడం చేతనే ఎన్నో వందల జన్మలుగా మనం కూడగట్టుకున్న పాపపు వాసనలను ఒక్క క్షణంలో తీసివేయగల దివ్య ధామాలు.

వాటిలో ఒక్కటే, హిమాలయ పర్వతాల్లో కొలువై ఉన్న కేధార్‌నాధ్ జ్యోతిర్లింగ క్షేత్రం.

ఓం నమః శివాయ