Thursday 4 July 2013

మనం చేసిన పాపం మనమే అనుభవించాలి, అందులోకి అమ్మను లాగడం అనవసరం అంటున్నారు ధారీ దేవి ఆలయ పూజారి.

కేధార్‌నాధ్‌లో వరదలకు ధారిదేవి ఆగ్రహమే కారణమన్న వాదనను ధారీదేవి ఆలయ పూజారి కొట్టిపారేస్తున్నారు. మనం ప్రకృతిని విధ్వంసం చేసిన ఫలితానికి ప్రకృతి వేసిన శిక్ష ఈ వరదలు, మనం చేసిన పాపం మనమే అనుభవించాలి, అందులోకి అమ్మను లాగడం అనవసరం అంటున్నారు ధారీ దేవి ఆలయ పూజారి.

అది 100 శాతం నిజం. అమ్మవారు సర్వాంతర్యామి, అంతటా ఉంది. అమ్మ లేని ప్రదేశమే లేదు. ఆది శక్తి ప్రకృతి రూపంలో చెట్లను, జంతువులను, పశువులను, పక్షులను, క్రిమికీటకాలను, మనుష్యులను నిత్యం రక్షిస్తూ, పోషిస్తూ ఉంది. ఆ ప్రకృతిలో భాగమే శిల(రాయి). అంతటా ఉన్న ఆ పరమేశ్వరిని ఆరాధించడం అందరికి సాధ్యమవ్వదు కనుక తనలోనే భాగమైన రాయిలో తననే(అమ్మవారినే) చూసి పూజించారు మన పూర్వీకులు. కానీ మనకు ఈ దృష్టి ఎప్పుడో పోయింది. ఈ రోజు మనకు తెలిసినంత వరకు అక్కడున్నది ఒక రాయి మాత్రమే. ఆ రాయి మన కోరికలు తీరుస్తుంది. అంతే! మనకు కష్టం వచ్చినప్పుడు, లేక మనకు ఏదైనా అవసరం కలిగినప్పుడు మాత్రమే మనకు అందులో శక్తి కనిపిస్తుంది.

భగవంతుడి మీద భక్తి ఉన్నది అనడానికి సంకేతం ఆయన యొక్క సృష్టిని గౌరవించడం. అంటే ప్రకృతిని రక్షించడం. కానీ ఈరోజు మన ఈ పని మాత్రం చస్తే చేయం. ఉత్తరాఖండ్‌లో కూడా అదే జరిగింది. ఉత్తారఖండ్ గ్రామదేవత ధారీ దేవి. ఉత్తరాఖండ్ మొత్తం ఆమె ఆధీనంలో ఉంటుంది. మరి అక్కడ జరిగిందేమిటి? అమ్మ 'ఇలాకాలో'అక్రమ నిర్మాణాలు చేశారు. తన బిడ్డలైన చెట్లను, అడవులను నరికేశారు. పక్షులు, జంతువుల ఆవాసాలను నాశనం చేశారు. అక్కడ యాత్రకు వెళ్ళిన భక్తులేమి తక్కువ కాదు. ఎక్కడపడితే అక్కడ చెత్తాచెదారం, ప్లాస్టిక్ కవర్లు పడేశారు. నదుల్లో మలమూత్ర విసర్జనలు చేసి, సబ్బులు వాడి, ఉమ్మి అపవిత్రం చేశారు. ఇదంతా ధారి దేవికి జరిగిన అవమానమే కదా. అప్పటివరకు అంతటా వ్యాపించి ఉన్న ఆ దివ్యశక్తికి అపచారం చేస్తూనే ఉన్నాం. అంతిమంగా అమ్మకు ప్రతిరూపమైన విగ్రహాన్ని ప్రక్కకు తొలగించాం. తొలగించామా లేక అమ్మే పక్కకు తప్పకుందా అనేది మనం ఆలోచించాలి.

ఒకవేళ ధారిదేవి విగ్రహాన్ని తొలగించడం వల్లనే వరదలు వచ్చాయనుకుంటే మరి దేవభూమి(ఉత్తరాఖండ్)ను మనం నాశనం చేసినప్పుడు ఇంకేంత కోపం వచ్చి ఉండాలి. అక్కడ పాపభారం పెరిగింది, పర్యావరణ విధ్వంసం తారాస్థాయికి చేరింది. అందుకే వరదలు వచ్చాయి. ఇదంతా మన స్వయంకృతమే.                   

No comments:

Post a Comment