Saturday, 7 June 2014

హిందూ ధర్మం - 77 (శునఃశ్శేపుడి వృత్తాంతం)

వేదం చదువుకున్న శునఃశ్శేపుడు మాటలు ముగించగానే, అంబరీషుడు బంగారు, వెండి నాణేలను, రత్నాలు కోటి రాశులుగా అతని ముందు పోశాడు. వాటితో పాటు లక్షఆవులను ఇచ్చి, శునఃశేపుడిని తనతో తీసుకువెళుతున్నందుకు ఎంతో సంతోషపడ్డాడు. త్వరగా పిల్లవాడిని రధం ఎక్కించాడు. ప్రయాణం మధ్యలో మద్యాహ్నం వేళ ఇద్దరూ ఒక పవిత్ర సరోవర ప్రాంతంలో విశ్రాంతి తీసుకుందామని ఆగారు. అంబరీషుడు విశ్రాంతి తీసుకుంటుండగా, కుతూహలంతో శునఃశ్శేపుడు ఆ సరోవరం చుట్టూ ఉన్న ప్రదేశాన్ని చూస్తూ, అక్కడే ఇతర ఋషులతో కలిసి తపస్సు చేసుకుంటున్న తన మేనమామ విశ్వామిత్రుడిని చూశాడు. ప్రయాణం వలన కలిగిన అలసట, దాహాం కారణంగా పిల్లవాడి ముఖం దీనంగా మారిపోయింది. 'నన్ను రక్షించడానికి అమ్మనాన్నలు లేరు, ఇక నన్ను బంధువులేమి కాపాడతారు. ఓ ఋషిపుంగవ, మీ తపోశక్తి చేత నన్ను మీరు రక్షించగలరు. ఓ నరశ్రేష్టా! అందరికి మీరే రక్ష. అందరిని రక్షింగలవారు కూడా మీరే. కనుక అంబరీషుడి యజ్ఞం పూర్తయ్యేలా అనుగర్హించండి. నాకు బ్రతకాలని ఉంది. నాకు ధీర్ఘాయువును ప్రసాదించండి. నేను గొప్ప తపస్సు చేసి, స్వర్గాది మంచిలోకాలు పొందాలనుకుంటున్నాను. నన్ను ఆశీర్వదించండి. నేను అనాధను అని భావించి, నన్ను రక్షించే నాధుడు మీరే అవ్వండి. ఒక తండ్రి తన కొడుకును రక్షించినట్టుగా, నన్ను ఈ అపాయం నుంచి రక్షించండి' అంటూ ఒక్కసారిగా పిల్లవాడు విశ్వామిత్రుని ఒళ్ళో పడిపోయాడు.

శునఃశ్శేపుడి మాటలు విన్న విశ్వామిత్రుడు అతడిని అనేక విధాలుగా ఓదార్చి, తన కుమారులతో ఈ విధంగా అన్నాడు. 'తల్లిదండ్రులు పుత్రులు కావాలని ఎందుకు కోరుకుంటారు? పదిమందికి సహాయపడతారని, పైలోకాలకు వెళ్ళడానికి పుణ్యకర్మలు చేస్తారని కదా. ఇప్పుడు మీకు ఆ సమయం వచ్చింది. వీడు చిన్నవాడు, ఋషిపుత్రుడు, బ్రతకాళని కోరుకుంటున్నాడు. కనుక అతని కోసం మీలో ఒకరు ప్రాణత్యాగం చేసి అతడిని సంతోషపెట్టండి. మీరు ఇప్పటికే ఎన్నో గొప్ప గొప్ప కర్మలు చేశారు. ఈ పిల్లవాడికి బదులుగా మీరు యాగపశువుగా మారితే, అగ్నిదేవుడు మరింత సంతోషిస్తాడు. దీని ఫలితంగా శునఃశేపుడు రక్షింపబడతాడు, యాగం నిర్విఘ్నంగా పూర్తవుతుంది, దేవతలు తృప్తి చెందుతారు, నా మాటలు సత్యం అవుతాయి' అన్నాడు.

అది విన్న విశ్వామిత్ర పుత్రులైన మధుష్యందుడు మొదలైనవారు 'ఇంకొకరి పిల్లలను రక్షినచడం కోసం మీ పిల్లల్ని ఎలా త్యాగం చేస్తారు. మేము ఇది చాలా తప్పని భావిస్తున్నాం. భోజనానికి పిలిచి కుక్కమాంసం వడ్డించినట్టుగా ఉంది' అంటూ గర్వంతో, అవమానకరంగా సమాధానమిచ్చారు.  

To be continued ..........

Friday, 6 June 2014

హిందూ ధర్మం - 76 (అంబరీషుడి యాగపశువు అపహరణ)

పశ్చిమ దిక్కు వెళ్ళిన విశ్వామిత్రుడు పండులు, కందమూలాలు తింటూ సరోవరాల పక్కన కూర్చుని ఎవరు చేయలేని ఘోరమైన తపస్సు చేశాడు. ఇదే కాలంలో అయోధ్యా నగరాన్ని పరిపాలిస్తున్న అంబరీషుడు ఒక యాగాన్ని తలపెట్టాడు. కానీ ఆ సమయంలో యజమాని యొక్క యాగపశువును ఇంద్రుడు దొంగిలించాడు. ఇది గమనించిన రాజపురోహితుడు 'రాజా! యాగం కోసం నీవు ఏర్పాటు చేసిన పశువు నీ అజాగ్రత్త వలన కనిపించకుండాపోయింది. యాగ సమయంలో రక్షింబడిన వస్తువులు యాగం చేసే రాజు పాలిట వినాశకాలు అవుతాయి. యాగం మధ్యలో ఆపడానికి వీలులేదు. కనుక నీవు దీనికి అనేక ప్రాయశ్చిత్తాలు చేయాలి. యాగపశువు లేదు కనుక అందుకు బదులుగా ఒక మనిషిని ఆ స్థానంలో కూర్చోబెట్టాలి. అతడిని యాగపశువుగా భ్వాఇంచాలి. అప్పుడే తిరిగి యాగం ప్రారంభించబడుతుంది. ఈ మాటలు విన్న రాజు, యాగపశువుగా కూర్చునే వ్యక్తికి బదులుగా వేయి గోవులను దానం చేస్తానని ప్రకటించి అనేక ప్రయత్నాలుఇ చేశాడు. అడువులు, ఆశ్రమాలు, ఊర్లు అన్ని తిరిగుతూ రాజు ఋచికుడనే ఋషుని, అతని పరివారాన్ని భృంగతుంగ పర్వతం దగ్గర చూశాడు. మహాతేజోవంతుడు, అమితప్రతిభావంతుడైన ఋచికునకు నమస్కరించి బాగోగులు, అన్ని వివరాలు తెలుసుకున్న అంబరీషుడు ఋషితో 'ఓ భార్గవా! మీరు నాకు మీ కుమారుడీని యాగపశువు నిమిత్తం దానం చేయాలి. అందుకు బదులుగా నేను మీకు వేయి ఆవులను ఇస్తాను' అన్నాడు. అన్ని దేశాలు తిరిగాను కానీ యజ్ఞపశువు దొరకలేదు. అందుకే మిమ్మల్ని అర్ధిస్తున్నాను. మీ కుమారులలో ఎవరో ఒకరిని నాకు అప్పగించండి అన్నాడు అంబరీషుడు.

దానికి బదులిస్తూ ఋషి ఓ మహాత్మా! నేను నా పెద్ద కొడుకును ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వలేను అన్నాడు(ఎందుకంటే పెద్ద కొడుకే తండ్రి చితి వెలిగించాలి). తన భర్త మాటలు విన్న ఋషిపత్ని 'నా భర్త పెడ్డకుమారుడని ఇవ్వలేనని తేల్చి చెప్పారు. నేను నా ఆఖరి కుమారుడని శునకుడను ఇవ్వలేను, అతనంటే నాకు చాలా ఇష్టం (చిన్న కొడుకే మరణించిన తల్లి చితి వెలిగించాలి). సాధారణంగా తండ్రికి పెద్ద కుమారుడి మీద, తల్లికి చిన్న కుమారుడి మీద అమితమైన ఇష్టం ఉంటుంది అని పలికింది. ఇది విన్న వారి మధ్యమ కుమారుడైన శునఃశేపుడు కలిపించుకుని 'నా తండ్రి పెద్ద కుమారుడిని ఇవ్వలేను అన్నాడు, నా తల్లి చిన్న కుమారుడిని ఇవ్వలేనని చెప్పింది, వీరిద్దరి మధ్యనున్న నన్ను గ్రహించండి రాజా!' అన్నాడు.

To be continued ........

Thursday, 5 June 2014

శ్రీ మాతా అమృతానందమయి సందేశం

పిల్లలు! ప్రకృతి విపత్తులు, భూతాపం, ఇతర వాతావరణ మార్పులు మానవుల మానసిక ప్రశాంతతను నాశనం చేస్తున్నాయి. ఎందుకంటే మనం సాగుస్తున్న అనాలోచిత దోపిడి కారణంగా ప్రకృతితో బంధం దెబ్బతింటోంది. మన గాలి, మన నీరు, మన భూమి విషతుల్యం అవుతున్నాయి.

పూర్వపు రోజుల్లో ప్రజలు ఎడ్లబండ్లు, గుర్రపుబగ్గీల్లో ప్రయాణం సాగించేవారు. ఆ తర్వాత స్కూటర్లు వచ్చాయి. ఇప్పుడు ఒకే వ్యక్తికి రెండు, మూడు, అంతకంటే ఎక్కువ కార్లు ఉన్నాయి. పూర్వం మనం అరిటి ఆకులో భోజనం చేసేవారము. ఈ రోజు మొత్తం చెట్లను నరికేసి, పేపరు కప్పులు, ప్లేట్లు తయారు చేసుకుని, ఒక్కసారి మాత్రమే వాడుకుని అవతల పడేస్తున్నాం. ఈ విధంగా, మరియు అనేక విధాలుగా ప్రకృతి మాతను దోచుకుని, ఆమె వనరులను వృధా చేస్తున్నాం.

ప్రకృతిని కామధేనువుగా భావించే సంప్రదాయం మనది. అదే విధంగా ప్రకృతి కూడా మనకు అన్ని శుభాలను చేకూర్చింది. ఇప్పుడు ఆమె ముసలిదయ్యింది, ఎండిపోయింది. మన అడవులు తరిగిపోతున్నాయి, ఆహార ఉత్పత్తి అంతర్ధామవుతోంది. స్వఛ్చమైన గాలి, నీరు దొరకడం అరుదు. వ్యాధులు పెరుగుతున్నాయి.

మనం ఎక్కడ పొరపాటు చేశాం? అవసరానికి, విలాసానికి / సుఖానికి మధ్య బేధాన్ని మనం మర్చిపోతున్నాం. ఇది మనం అర్దం చేసుకోవాలి. ప్రకృతి నుంచి అవసరానికి మించి తీసుకోవడం పాపం, అధర్మం కూడా. నేను ఒక సామాజిక కార్యకర్త కధ గుర్తు చేస్తాను. తెల్లవారుఝామున అతను పళ్ళు తోముకోవడం కోసం నీటితో నింపబడిన పాత్రను తీసుకుని నది దగ్గరకు వెళ్ళాడు. ఆ సమయంలో అతని సహచరులతో అతను కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడుతున్నాడు. ఇంతలో ముఖం కడుక్కోవడం కోసం అతను తన పాత్రను తీసుకోగా, అందులో నీరు లేవని గమనించాడు. ఓ భగవంతుడా! నేను ఎంత అజాగ్రత్తగా వ్యవహరించాను. ముఖం కడుక్కోవడం పూర్తవ్వకముందే నేను మొత్తం నీటిని ఉపయోగించాను అంటూ బాధపడ్డాడు.

పక్కనే ఉన్న అతని సహచరులకు ఇతను ఇంతగా ఎందుకు బధాపడుతున్నాడో అర్దమవ్వక అతనితో 'ఇందులో బాధపడే విషయం ఏమున్నది? నీ పక్కనే నీటితో నిండిన నది ఉంది కదా' అన్నారు. దానికి బదులిస్తూ అతను 'నదిలో ఎంతో నీరు ఉండవచ్చు కానీ నా అవసరానికి మించి వాడుకునే హక్కు నాకు లేదు' అన్నాడు.

ఆ సామాజిక కార్యలర్త చూపించిన ధర్మాచరణను, మన తరం కనుక తిరిగి గుర్తుంచుకుని ఉంటే - ధర్మం గురించి అవగాహన ఉంటే - పేదరికం, కరువు అనేవి నిర్మూలించబడతాయి. నాకు ఈ విషయంలో సందేహం లేదు. మీరు బ్రతకడానికి అవసరమైనంత మాత్రమే ప్రకృతి నుంచి తీసుకోండి. అప్పుడు అందరికి సరిపడా ఆహారం, నీరు, వస్త్రాలు అందుతాయి. ప్రకృతిమాత తిరిగి కామధేనువుగా మారుతుంది.

ఈ భూమిపై ఉంటున్న అన్ని క్రిమికీటకాలు అంతరించిపోతే, రాబోయే 50 సంవత్సరాలలో భూమిపై జీవం అంతరించిపోతుంది. అదే ఒకవేళ మానవజాతి కనుక అంతరించిపోతే, తరువాతి 50 సంవత్సరాలలో జీవరాశి మొత్తం వృద్ధి చెందుతుదని ఒక శాస్త్రవేత్త అన్నారు. పిల్లలు, భూమి బ్రతకడం కోసం మానవులు నశించపోవలసిన అవసరంలేదు.

మన తాతముత్తాతలు మనకు అప్పగించిన ఈ భూమి అతిసుందరమైనది. దాన్ని నాశనం చేసి మాత్రమే తరువాతి తరానికి అందిస్తామా?  ఈ భూమికి చిన్న పగుళ్ళు కూడా లేకుండా తరువాతి తరాలకు అందించవలసిన ధర్మం మన మీద ఉంది. మన సొంత కన్నతల్లి వలనే ఈ భూమిని రక్షించి, పోషించవలసిన అవసరం మన మీద ఉంది. మనం కళ్ళు తెరవాలి. ఇది భూమాత పట్ల మనం నిర్వర్తించవలసిన ధర్మం కాదు, సమస్త మానవాళి పట్ల మనం నిర్వర్తించవలసిన ధర్మం. ఎందుకంటే ప్రకృతి లేనిదే మానవమనుగడ ఉండదు.

ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడండి.

- శ్రీ మాతా అమృతానందమయి 

Wednesday, 4 June 2014

జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం - సద్గురు జగ్గీవాసు దేవ్ సందేశం

ఈ భూమిపై ఏ విషయమైనా చక్కదిద్దడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, వనరులు, సామర్థ్యం అన్నీ ప్రస్తుతం మనకున్నాయి. ఇంతకుముందెన్నడూ మానవ మనుగడలో మనుషులు ఈ విధమైన శక్తియుక్తులతో లేరు. కాని ప్రస్తుతం ఒకే ఒక విషయం కొరవడింది, అది కలుపుగోలు తత్వం.

మనం ఇప్పుడు ఎలాంటి సమయంలో జీవనం సాగిస్తున్నామంటే, మనని ఇంతకాలం పోషించిన వాటిని మనం ఈ రోజు పరిరక్షించుకోవడం గురించి ఆలోచించవలసి వస్తున్నది. భూమిని సంరక్షించుకోవటం గురించి మాట్లాడవలసి వస్తున్నది.

భూమిని పరిరక్షించడం మనం మంచి జీవితాన్ని ఏర్పరచుకోవటం కోసమే. భూమి సరిగా లేకపోతే మనకు సరైన జీవనం లేదు. పర్యావరణ సంబంధిత బాధ్యతలు విధిగా చేయవలసినవి కాదు. ఇదే మన జీవితం, మన పీల్చుకొనే, వదిలే ప్రతి ఊపిరి ఇదే.

ఈ విషయం అనుభూతి పొంది, అనుభవంలోకి తెచ్చుకోకపోతే, మనుషులు దీని గురించే నిజంగా ఏదో చేయగలరని నాకు నమ్మకం కలగటం లేదు. ఆర్థికపరమైన ఆదుర్దాలెలా ఉన్నా, పర్యావరణ సంబంధిత విషయాలు మన ఆర్థిక అభివృద్ధిలో చాలా ముఖ్యమైన భాగాలుగా పరిగణించాలి. లేకపోతే మనం పెద్ద మొత్తంలో మూల్యం చెల్లించవలసి వస్తుంది. ఇది ఎలాంటి విషయం అంటే రాజనీతిజ్ఞులు, పారిశ్రామిక వేత్తలు, ప్రజలు ఎప్పుడూ దీనికి స్పృహతో స్పందించి, కృషి చేయాలి.

ఈ భూమిపై ముఖ్యమైన కొద్దిమందిలో ఏ కొంచెం మార్పు చేయగలిగినా, అలాగే వాటిపై అవసరమైన దృష్టి పెట్టి సరైన రీతిలో వనరులను వెచ్చించినా, ఈ భూమాత తనను తాను సరిచేసుకుంటుంది.

మనం ఒక్క అవకాశం ఈ భూమాతకు ఇస్తే, ఆమె తిరిగి సంపూర్ణమైన సంవృద్ధి, సౌందర్యాలను కచ్చితంగా పొందగలదు. దీనికోసం మనం గొప్ప పనులేమీ చేయనక్కర్లేదు. మనం భూమిని సరిచేయనక్కరలేదు. వీలైనంతవరకు ఆమె జోలికి పోకుండా, కేవలం మనం చేస్తున్న నష్టాన్ని తగ్గిస్తే, మిగతాది అంతా దానంతట అదే జరుగుతుంది.

ఈ రోజు శాస్త్రీయ అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే, ఈ భూమిపై అన్ని క్రిమికీటకాలు అంతరించిపోతే, ఈ భూమిపై జీవం కేవలం 25 సంవత్సరాలు మాత్రమే మిగిలి ఉంటుందని! జీవరాశి మొత్తం మనతో సహా 25 సంవత్సరాలలో అంతమొందుతుంది. కీటకాలు కనుక వెళ్లిపోతే, ఒక్క జీవి కూడా మిగలదు. సమస్త జీవులు చనిపోతాయి. కానీ మనుషులు కనిపించకుండా పోతే 25 సంవత్సరాలలో భూమి తిరిగి పూర్తిగా అభివృద్ధి చెందుతుంది.

ఎవరైనా వారి అంతరంగంలోకి చూసుకుంటే, సహజంగానే అతని ఉనికికీ, బయట ఉండేవాటి ఉనికికీ తేడా
లేదని వారు గుర్తించగలరు. అన్నింటినీ కలుపుకోగలిగిన అనుభవం ఎప్పుడు వస్తుందో, మీ చుట్టూ ఉన్న అన్నింటి గురించీ బాధ్యత వహించడం, జాగ్రత్తపడటం అనేది మీకు చాలా సహజమైపోతుంది.

మన తరం ఒక విపత్తుగా మారకూడదని నా ఆకాంక్ష. మనం చేయలేని పని చేయకపోతే ఫరవాలేదు, కాని మనం చేయగలిగీ చేయకుండా ఉంటే, మనమే ఒక విపత్తు.

- జగ్గీ వాసుదేవ్

సేకరణ : గత ఏడాది సాక్షి ఆదివారం సంచికలో ప్రచురించబడినది

పర్యావరణాన్ని కాపాడండి

Tuesday, 3 June 2014

హిందూ ధర్మం - 75 (త్రిశంకు తలక్రిందులుగా వ్రేలాడటం)

అది విన్న దేవతలు విశ్వమిత్రునితో 'ఏవం భవతు (అలాగే జరుగుగాకా). నీకు శుభములు చేకూరుగాకా. నీవు సృష్టించిన నక్షత్రాలు, తారలు ఇతరములన్నీ వాటి స్థానాల్లోనే ఉంటాయి. కానీ అద్భుతమైన ఈ నక్షత్రాలు వైశ్వానర పథానికి బయట వేరుగా ఉంటాయి. త్రిశంకు ఈ నక్షత్రమండలం మధ్యలో ఉంటాడు కానీ తల్లక్రిందులుగా ఉంటాడు. ఎందుకంటే ఇంద్రుని మాట వ్యర్ధమవ్వదు. ఎన్నో గొప్ప కార్యాలు చేసిన ఈ త్రిశంకు చుట్టూ నక్షత్రాలన్నీ ప్రదక్షిణలు చేస్తాయి. వాటి మధ్య త్రిశంకు పెద్ద నక్షత్రంలా వెలిగిపోతుంటాడు' అనగా, దానికి విశ్వామిత్రుడు అంగీకరించాడు. ఆ యజ్ఞం ముగియగానే, వచ్చిన ఋషులు, దేవతలు ఎట్లా వచ్చారో అట్లాగే వెళ్ళిపోయారు. (అది వేదవిరుద్ధమైన యాగం కనుక అక్కడ దక్షిణలు, ప్రసాదాలు ఏమీ తీసుకోలేదు.

త్రిశంకు గురువు మాటలు విని ఉంటే మంచి స్థితిలో ఉండేవారు. అతడే కాదు, ఎవరైనా పెద్దలు చెప్పిన మంచిమాటలు వింటే అభివృద్ధిలోకి వస్తారు. తన గురువు వద్దని చెప్పినా వినకుండా, అతని కోరిక తీర్చుకోవడం కోసం అందరిని ఆశ్రయించాడు. కోరిక ఉండకూడదు అనటంలేదు, కానీ అది ధర్మ విరుద్ధం కాకూడాదు. జరగబోయే కీడు గమనించి, వశిష్టపుత్రులు శపించినా, విషయం గ్రహించక, ఇంకా అదే వ్యామోహంతో తిరిగాడు. ఆఖరికి విశ్వామిత్రుని వద్దకు చేరుకున్నాడు. యాగం చేశాడు కానీ దేవతలు రాలేదు, పోని స్వర్గలోకానికి వెళ్ళాడా అంటే అదీ లేదు. భూలోకానికి స్వర్గలోకానికి మధ్యలో తలక్రిందులుగా(తల క్రిందకు, కాళ్ళు పైకి పెట్టి) వ్రేలాడుతున్నాడు. ఇంతా చేసి త్రిశంకు సాధించినదేమిటి? అందుకే గురువుల మాటలు ఎప్పుడు పెడచెవిన పెట్టకూడదు. చిన్న కోరిక, ధర్మ విరుద్ధమైన కోరిక, ఈ స్థితికి తెచ్చింది.

ఇక ఇప్పటి వరకు విశ్వామిత్రుడు సాధించిందేమిటి? తపస్సు చేసి పొందిన శక్తితో వశిష్టపుత్రులను శపించి సగం శక్తి పోగొట్టుకున్నాడు. అర్దంపర్దం లేని పంతాలకు పోయి, దేవతలను ఎదురించి చేసిన మిగితా పనులతో మొత్తం శక్తి కోల్పోయాడు. కోపం ఎన్నో వేళ ఏళ్ళు కష్టపడి చేసిన తపస్సును వృధా చేసింది.) అందరు వెళ్ళిపోయిన తరువాత విశ్వామిత్రుడు తన దగ్గరే అడవిలో ఉంటున్న మునులతో ఈ విధంగా అన్నాడు. 'మనకు ఈ దక్షిణ దిక్కు కలిసిరాలేదు. నేను గొప్ప తపస్సు చేస్తున్న సమయంలో త్రిశంకు రూపంలో అడ్డకున్లు ఏర్పడ్డాయి. కనుక మనం మంచి సరస్సులతో ఉన్న పశ్చిమ (పడమర దిక్కుకు) వెళ్ళి తపస్సు చేసుకుందాము. అది చాలా విశాలంగా ఉంటుంది, పవిత్రమైన జలాశయాలు ఉన్నాయి, తపోవనం కూడా ఉంది' అని చెప్పి పడమర దిక్కుకు ప్రయాణం మొదలుపెట్టాడు విశ్వామిత్రుడు.

To be continued ..............

Monday, 2 June 2014

హిందూ ధర్మం - 74 (త్రిశంకు స్వర్గానికి వెళ్ళటం)

దేవతలు రావడం లేదని కోపంతో విశ్వామిత్రుడు చేతిలోకి సృవాన్ని(అగ్నిహోత్రంలో హవిస్సు వేయడానికి వడే చెక్క పరికరం) తీసుకుని, దాన్ని ఎత్తి పట్టుకుని పైకి ఊపుతూ, ఒక్కసారి లేచి నిల్చుని తిశంకుతో ఈ విధంగా అన్నారు.  ఓ రాజా! ఇప్పుడు నా శక్తి చూపిస్తాను. నాకున్న శక్తి చేత, నిన్ను ఇప్పుడే ఈ శరీరంతో స్వర్గానికి పంపుతాను. దేవతలు వచ్చి హవిస్సు తీసుకోకపోతే నువ్వు వెళ్ళడం అసాధ్యం. వాళ్ళకి నా శంక్తి తెలియదు. కానీ నేను చేసిన తపస్సు వలన నాకు శక్తి వచ్చింది. దాన్ని వినియోగిస్తాను అన్నాడు. ఈ మాటలు పూర్తి అవుతున్న సమయంలో ఇతర ఋషులు చూస్తుండగా, త్రిశంకు స్వర్గ లోకం దిశగా ఆకాశంలో పైకి వెళుతున్నాడు. త్రిశంకు స్వర్గంలో ప్రవేశించడం చూసి, ఇంద్రుడు, మిగితా దేవతలు ఈ విధంగా అన్నారు. 'త్రిశంకు! ఇదేమైనా నీ విహారస్థలము అనుకున్నావా? అక్కడే ఆగు! నీకు గురువు (వశిష్టమహర్షి) శాపం ఉన్నందువల్ల నీకు ఇక్కడ స్థానం లేదు. ఓ మూఢా! తలకిందులుగా భూలోకంలో పడు'.

వెంటనే త్రిశంకు విశ్వామిత్ర మహర్షిని ఉద్ద్యేశించి రక్షించండి, రక్షించండి అంటూ క్రిందకు పడ్డాడు. ఈ మాటలు విన్న విశ్వామిత్రుడు బదులుగా ఇంకా కోపంతో ఆగు, ఆక్కడే ఆగు అంటూ అరిచారు. త్రిశంకును దేవలోకానికి రానివ్వకపోతే నేను చూస్తూ ఊరుకోను, నేనే ఇంకో స్వర్గాన్ని సృష్టిస్తాను అన్ని దక్షినదిశలో సప్తఋషి మండలాన్ని సృష్టించారు. (మాములుగా సప్తఋషి మండలం ఉత్తరదిక్కులో ఉంటుంది. ఇది దేవతలకు వ్యతిరేకంగా చెస్తున్నాడు, ఉత్తరానికి ఎదురుగా దక్షిణ దిశలో సృష్టించాడు.) నక్షత్రాలను, గెలాక్సీలను కూడా తయారు చేశాడు. అయిన విశ్వామిత్రునిలో కోపం చల్లారలేదు. అదే కోపంతో ఇప్పుడు నేను వేరొక స్వర్గాన్ని చేసి, అందులో దేవతలను, ఇంద్రుడిని కూడా సృష్టిస్తాను. ఇంద్రుడి అవసరం కూడా నా స్వర్గానికి లేదు అంటూ సృష్టి ప్రారంభించగా దేవతలు ఆశ్చర్యపోయారు. ఈ ప్రమాదమేంటి? ఈయన వేరొక స్వర్గాన్ని సృష్టితున్నాడు. సృష్టికి ప్రతి సృష్టి చేస్తున్నాడు, ఇది ధర్మవిరుద్ధం, సృష్టి నియమాలకు విరుద్ధం అని రాక్షసులు, మునులతో కలిసి దేవతలందరూ విశ్వామిత్రుని ఆశ్రమాన్ని చేరుకుని 'మీరు తపస్సు చేత గొప్ప స్థితిని పొందారు. మీ తెలియనిది కాదు. త్రిశంకు తన గుర్వుల చేత శపించబడ్డాడు. కనుక అతడు తన భౌతిక శరీరంతో స్వర్గ ప్రవేశానికి అనర్హుడు' అన్నారు. ఇది విన్న విశ్వామిత్రుడు గట్టి స్వరంతో 'నేను సశరీరంతో త్రిశంకును స్వర్గానికి పంపుతానని అతనికి ప్రమాణం చేసాను. ఆ మాటను అసత్యం చేయడం, తప్పడం నాకు ఇష్టంలేదు. త్రిశంకు శాశ్వతంగా స్వర్గంలో ఉండుగాకా. నేను సృష్టించిన నక్షత్రాలు, తారలు, ఇతరములన్నీ ఈ సృష్టి ఉన్నంతకాలం ఉంటాయి. మీరు నా స్వర్గాన్ని కూడా అంగీకరించండి' అన్నాడు దేవతలతో.

To be continued ............

Sunday, 1 June 2014

హిందూ ధర్మం - 73 (రాజర్షి విశ్వామిత్రుడు)

విశ్వామిత్రుడు కోపంతో రగిలిపోతూ 'నేను ఎంతో గొప్ప తపస్సు చేశాను, నన్ను దూషించినవాడు బూడిదవుతారు, అందులో సందేహం లేదు. ఇప్పుడు వారు యముడి పాశాల చేత బంధించబడతారు. ఏడు వందల జన్మల వరకు శవాలను తింటూ బ్రతుకుతారు. భయంకరమైన శరీరం కలిగి, కుక్క మాంసం తినే ముష్టికులుగా మారిపోతారు. ఆ దుర్భుద్ది అయిన మహోదయడు ఎవరిని నిందిస్తే లోకాన్ని నిందించినట్టో, ఎవరు దూషించకూడని నన్నే దూషించాడు కనుక అతను సర్వలోకాల చేత దూషింపబడుతూ నిషాదుడిగా మారిపొతాడు. నా కోపం వలన అతడు పరమ నీచస్థితిని పొంది, అనేక జన్మలు ఎత్తి చాలా కాలం దుర్భరమైన జీవనం సాగిస్తాడు అని విశ్వామిత్రుడు పలుకుతుండగా మునులు రావడం, వారి గమనించడం చూసి మాట్లాడటం ఆపేశాడు. (వచ్చినవారు కూడా ఇష్టపడి రాలేదు. విశ్వామిత్రుని ఆగ్రహానికి గురైతే మళ్ళీ ఏమని శపిస్తాడో అని భయపడి వచ్చారు. ఎంతో కష్టపడి తపస్సు చేసి శక్తిని పొందాడు. కానీ ఏం లాభం? తన మీద తనకు నిగ్రహం లేదు. వశిష్టపుత్రులు శాస్త్రాన్నే చెప్పారు. కానీ కోపం కారణంగా మతితప్పింది. వారు చెప్పినమాటలు చెడుగా తోచాయి. ఎదుటివారు నాలుగు మంచి విషయాలు చెప్పినా, కోపగ్రస్థుడైన వ్యక్తికి అవి చెడుగానే వినిపిస్తాయి. కోపంతో వశిష్టపుత్రులను శపించాడు విశ్వామిత్రుడు. తపస్సు, పూజా, జపం, ధ్యానం మొదలైనవి చేసినప్పుడు మనకు శక్తి లభిస్తుంది, శక్తి పెరుగుతుంది. అది సక్రమంగా వాడుకుంటే, జీవితంలో అనేక అవరోధాలను సునాయాసంగా దాటగలము. కానీ కోపం, ఆవేశం మొదలైనవాటిని అదుపులో ఉంచుకోవాలి. పొరపాటున కోపంలో ఎవరినైన ఒక మాట అంటే, ఆ మాటతో పాటు చేసిన ఫలితంలో కొంత భాగం వెళ్ళిపోతుంది. పెద్దపెద్ద పూజలు చేస్తారు, కానీ పూజ అవ్వగానే ఎవరి మీదనో నోరుపారేసుకుంటారు. ఏం లాభం? చేసిందంతా వృధా అవుతుంది. అదే మంచి మాట పలికితే అది జరిగి, మణ్చి ఫలితాలు వస్తాయి. అందుకే వీలున్నప్పుడు జపతపాలు చేసిన వారి దగ్గర ఆశీస్సులు తీసుకుంటే, తపోశక్తి కారణంగా వారి మాటలు నిజమై జీవితంలో వృద్ధిలోకి వస్తాము. కానీ విశ్వామిత్రుడు ఈ విషయాన్ని కోపంలో మర్చిపోయి, శాపాన్ని విడ్చిపెట్టాడు. ఫలితంగా తాను చేసిన తపస్సులో కొంత శక్తి శాపం రూపంలో కోల్పోయాడు.)    

ఇక్ష్వాకు వంశస్థుడైన త్రిశంకు పరమ ధర్మాత్ముడు. అతడు తన భౌతిక శరీరంతో దేవలోకానికి వెళ్ళి, దేవతలను గెలవాలని నా చెంతకు వచ్చాడు. మీరు చేసే యాగం వలన ఇతడు దేవలోకానికి వెళ్ళాలని అక్కడికి వచ్చిన ఋషులతో అన్నాడు విశ్వామిత్రుడు. ఆయన మాటలు విన్న మహర్షులంతా ఒక చోట చేరి, ధర్మ సమ్మతమైన యాగం ఏమైనా ఉందా అని చర్చించుని, అటువంటి యాగం ఎక్కడ చెప్పబడలేదని నిశ్చయించుకున్నారు. ఒకవేళ విశ్వమిత్రునికి ఈ మాట చెప్పి, యాగం చేయమని చెప్తే, తమని కూడా శపిస్తారని భయపడి, ఈయనతో తలకాయ నొప్పి ఎందుకు? విశ్వామిత్రుడు ఎలా చెప్తే అలాగే యాగం చేద్దాం, ఆయన మాటలను ఆధారంగా చేసుకుని యాగవిధి నిర్వహిద్దాం అని అనుకున్నారు. మనకు ఎందుకు వచ్చిన గోల! మనం యాగం చేద్దాం, విశ్వామిత్రుడు తన తపశక్తితో త్రిశంకును స్వర్గానికి పంపించుకుంటాడు, ఆయన ఏం చేస్తాడో ఆయన ఇష్టం, మన పని మాతం మనం పూర్తి చేద్దామని అని యాగం పనులు ప్రారంభించారు. విశ్వామిత్రుని యాజకర్తగా ఎన్నుకుని, ఆయనికి అధ్యక్షతను అప్పగించారు. మంత్రకోవిధులు, ఋత్విజులు, ఇతరులందరూ కల్పంలో చెప్పబడిన రీతిలో యాగంలో భాగాలను పూర్తి చేశారు. చాలాసమయం తరువాతా విశ్వామిత్రుడు యగంలో తమ భాగం స్వీకరించవలసిందిగా దేవతలను ఆహ్వానించారు. యాగాన్ని వేదం అంగీకరించదు, కనుక దేవతలు తమ యజ్ఞభాగాలను తీసుకుని ఫలం ఇవ్వడానికి ముందుకురాలేదు. దేవతలు హవిస్సు తీసుకోకపోతే, యాగం పూర్తవ్వదు, ఫలితం నెరవేరదు.

 To be continued .................