Sunday 1 June 2014

హిందూ ధర్మం - 73 (రాజర్షి విశ్వామిత్రుడు)

విశ్వామిత్రుడు కోపంతో రగిలిపోతూ 'నేను ఎంతో గొప్ప తపస్సు చేశాను, నన్ను దూషించినవాడు బూడిదవుతారు, అందులో సందేహం లేదు. ఇప్పుడు వారు యముడి పాశాల చేత బంధించబడతారు. ఏడు వందల జన్మల వరకు శవాలను తింటూ బ్రతుకుతారు. భయంకరమైన శరీరం కలిగి, కుక్క మాంసం తినే ముష్టికులుగా మారిపోతారు. ఆ దుర్భుద్ది అయిన మహోదయడు ఎవరిని నిందిస్తే లోకాన్ని నిందించినట్టో, ఎవరు దూషించకూడని నన్నే దూషించాడు కనుక అతను సర్వలోకాల చేత దూషింపబడుతూ నిషాదుడిగా మారిపొతాడు. నా కోపం వలన అతడు పరమ నీచస్థితిని పొంది, అనేక జన్మలు ఎత్తి చాలా కాలం దుర్భరమైన జీవనం సాగిస్తాడు అని విశ్వామిత్రుడు పలుకుతుండగా మునులు రావడం, వారి గమనించడం చూసి మాట్లాడటం ఆపేశాడు. (వచ్చినవారు కూడా ఇష్టపడి రాలేదు. విశ్వామిత్రుని ఆగ్రహానికి గురైతే మళ్ళీ ఏమని శపిస్తాడో అని భయపడి వచ్చారు. ఎంతో కష్టపడి తపస్సు చేసి శక్తిని పొందాడు. కానీ ఏం లాభం? తన మీద తనకు నిగ్రహం లేదు. వశిష్టపుత్రులు శాస్త్రాన్నే చెప్పారు. కానీ కోపం కారణంగా మతితప్పింది. వారు చెప్పినమాటలు చెడుగా తోచాయి. ఎదుటివారు నాలుగు మంచి విషయాలు చెప్పినా, కోపగ్రస్థుడైన వ్యక్తికి అవి చెడుగానే వినిపిస్తాయి. కోపంతో వశిష్టపుత్రులను శపించాడు విశ్వామిత్రుడు. తపస్సు, పూజా, జపం, ధ్యానం మొదలైనవి చేసినప్పుడు మనకు శక్తి లభిస్తుంది, శక్తి పెరుగుతుంది. అది సక్రమంగా వాడుకుంటే, జీవితంలో అనేక అవరోధాలను సునాయాసంగా దాటగలము. కానీ కోపం, ఆవేశం మొదలైనవాటిని అదుపులో ఉంచుకోవాలి. పొరపాటున కోపంలో ఎవరినైన ఒక మాట అంటే, ఆ మాటతో పాటు చేసిన ఫలితంలో కొంత భాగం వెళ్ళిపోతుంది. పెద్దపెద్ద పూజలు చేస్తారు, కానీ పూజ అవ్వగానే ఎవరి మీదనో నోరుపారేసుకుంటారు. ఏం లాభం? చేసిందంతా వృధా అవుతుంది. అదే మంచి మాట పలికితే అది జరిగి, మణ్చి ఫలితాలు వస్తాయి. అందుకే వీలున్నప్పుడు జపతపాలు చేసిన వారి దగ్గర ఆశీస్సులు తీసుకుంటే, తపోశక్తి కారణంగా వారి మాటలు నిజమై జీవితంలో వృద్ధిలోకి వస్తాము. కానీ విశ్వామిత్రుడు ఈ విషయాన్ని కోపంలో మర్చిపోయి, శాపాన్ని విడ్చిపెట్టాడు. ఫలితంగా తాను చేసిన తపస్సులో కొంత శక్తి శాపం రూపంలో కోల్పోయాడు.)    

ఇక్ష్వాకు వంశస్థుడైన త్రిశంకు పరమ ధర్మాత్ముడు. అతడు తన భౌతిక శరీరంతో దేవలోకానికి వెళ్ళి, దేవతలను గెలవాలని నా చెంతకు వచ్చాడు. మీరు చేసే యాగం వలన ఇతడు దేవలోకానికి వెళ్ళాలని అక్కడికి వచ్చిన ఋషులతో అన్నాడు విశ్వామిత్రుడు. ఆయన మాటలు విన్న మహర్షులంతా ఒక చోట చేరి, ధర్మ సమ్మతమైన యాగం ఏమైనా ఉందా అని చర్చించుని, అటువంటి యాగం ఎక్కడ చెప్పబడలేదని నిశ్చయించుకున్నారు. ఒకవేళ విశ్వమిత్రునికి ఈ మాట చెప్పి, యాగం చేయమని చెప్తే, తమని కూడా శపిస్తారని భయపడి, ఈయనతో తలకాయ నొప్పి ఎందుకు? విశ్వామిత్రుడు ఎలా చెప్తే అలాగే యాగం చేద్దాం, ఆయన మాటలను ఆధారంగా చేసుకుని యాగవిధి నిర్వహిద్దాం అని అనుకున్నారు. మనకు ఎందుకు వచ్చిన గోల! మనం యాగం చేద్దాం, విశ్వామిత్రుడు తన తపశక్తితో త్రిశంకును స్వర్గానికి పంపించుకుంటాడు, ఆయన ఏం చేస్తాడో ఆయన ఇష్టం, మన పని మాతం మనం పూర్తి చేద్దామని అని యాగం పనులు ప్రారంభించారు. విశ్వామిత్రుని యాజకర్తగా ఎన్నుకుని, ఆయనికి అధ్యక్షతను అప్పగించారు. మంత్రకోవిధులు, ఋత్విజులు, ఇతరులందరూ కల్పంలో చెప్పబడిన రీతిలో యాగంలో భాగాలను పూర్తి చేశారు. చాలాసమయం తరువాతా విశ్వామిత్రుడు యగంలో తమ భాగం స్వీకరించవలసిందిగా దేవతలను ఆహ్వానించారు. యాగాన్ని వేదం అంగీకరించదు, కనుక దేవతలు తమ యజ్ఞభాగాలను తీసుకుని ఫలం ఇవ్వడానికి ముందుకురాలేదు. దేవతలు హవిస్సు తీసుకోకపోతే, యాగం పూర్తవ్వదు, ఫలితం నెరవేరదు.

 To be continued .................

No comments:

Post a Comment