Wednesday, 22 October 2014

నరకచతుర్దశికి, దీపావళికి నువ్వుల నూనె దీపాలనే వెలిగించాలంటొంది శాస్త్రం.


నరకచతుర్దశికి,దీపావళికి నువ్వుల నూనె దీపాలనే వెలిగించాలంటొంది శాస్త్రం. ప్రతి సంవత్సరం క్రొత్త మట్టి ప్రమిదలు కొని వాటిని వాడాలి.

మట్టి ప్రమిద మన శరీరానికి సంకేతం. అందులో నువ్వులనూనె మన పూర్వజన్మ వాసనలకు (గత జన్మ నుండి మనకు ప్రాప్తించిన పాపపుణ్యాలు, అలవాట్లు, సంస్కారాలు) ప్రతీక. అందులో వేసే వత్తి అహంకారానికి గుర్తు.  దీపం జ్ఞానానికి సంకేతం. జ్ఞానమనే దీపం మన పూర్వజన్మవాసనలను, అహంకారాన్ని, చెడు అలవాట్లను కాల్చేసి, పరమాత్ముడిని చేరుస్తుంది అన్నది దీపం వెలిగించడం వెనుక ఉన్న అర్ధం. అందువల్ల దీపావళికి మట్టి ప్రమిదలనే కొనండి.

ఈ ధనత్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి పండుగ రోజుల్లో నువ్వుల నూనె దీపాన్నే వెలించాలి. నువ్వుల నూనె క్రిమిసంహారిణి. యాంటి-బ్యాక్టీరియల్ (anti-bacterial) లక్షణాలు కలిగి ఉంటుంది. అందువల్ల నువ్వుల నూనె దీపం వాతావరణంలో ఉన్న క్రిములను నాశనం చేస్తుంది. ఈ దీపపు కాంతి కళ్ళకు మంచిది. దృష్టిని (eye-sight) మెరుగుపరుస్తుంది. ఇక దీపావళి నాడే ఎందుకు నువ్వుల నూనె దీపం పెట్టాలి అంటే దీపవళి చలికాలంలో వస్తుంది. సూర్యుడు భూమికి దూరంగా జరుగుతాడు. చల్లటి వాతావరణంలో అనేక క్రిములు వ్యాపిస్తాయి. అలాగే శ్వాసకు సంబంధించిన అనేక రోగాలు వస్తాయి. ప్రమిదలో నూనె అయిపోయాక వత్తి కూడా కాలిపోతుంది. ఆ వత్తి కాలడం వల్ల వచ్చిన వాసన పీల్చడం ద్వారా ఊపిరితిత్తులు (lungs), గుండెకు(heart) సంబంధించిన రోగాలు రాకుండా నిరోధింపబడతాయి. అలాగే ఈ దీపం కొంత వేడిని కూడా పుట్టిస్తుంది. ఏదైన ఒక వస్తువు కాలినప్పుడు carbon విడుదలవుతుంది. అది గాలిలో ఉన్న తేమను పీల్చేస్తుంది.

మార్కెట్లో దీపావళి కి ప్రత్యేకమైన క్యాండిల్ దీపాలు అమ్ముతున్నారు. అవి వెలిగించకూడదు. సంప్రదాయ దీపం ప్రకృతిలో ఉన్న positive energy ని, దైవి శక్తులను ఆకర్షిస్తే, క్యాండిల్ negative energies ని, దుష్టశక్తులను ఆకర్షిస్తుంది. కావాలంటే మీరు ఒక చీకటి గదిలో క్యాండిల్ వెలిగించి కాసేపు కూర్చొండి. మరొకసారి అదే గదిలో దీపారాధన చేసి కూర్చోండి. మీరే గమనిస్తారు తేడా. క్యాండిల్ శోకానికి కారణమవుతుంది. దీపం శుభాలను తీసుకువస్తుంది.

ఎక్కడ దీపం పేడితే అక్కడ దేవతలు వస్తారు. అందువల్ల దీపకాంతులలో శ్రీ మహా లక్ష్మీని మీ ఇంట్లొకి ఆహ్వానించండి.

అందరికి నరకచతుర్దశి,దీపావళి శుభాకంక్షలు.

Tuesday, 21 October 2014

నరక చతుర్దశి విశేషాలు

ఆశ్వీయుజ బహుళ చతుర్దశి - నరక చతుర్దశి

పురాణ ప్రాశస్త్యం: పూర్వం నరకాసురుడనే రాక్షసుడు ప్రాక్ జ్యోతిష్యపురాన్ని పరిపాలించేవాడు. ఆ ప్రాక్ జ్యోత్సిహ్యపురం అనే ప్రాంతం ఈ రోజు ఈశాన్య భారతంలో అస్సాంలోని గౌహతి ప్రాంతం. వాడు 16,000 మంది కన్యలను తన కారాగారంలో బంధించగా, శ్రీ కృష్ణుడు సత్యంభామ సమేతంగా వెళ్ళి, వాడితో యుద్ధం చేసి, వాడిని చంపి, ఆ కన్యలను విడిపిస్తాడు. నరకాసుర వధ జరిగి, స్త్రీలకు దుష్టుడైన నరకుడిని నుంచి విముక్తి లభించినందుకు ప్రతీకగా ఈ రోజు నరక చతుర్దశి జరుపుకుంటారు.  నరకుడి వధతో వాడు చేత హింసించబడి అంధకారంలో మగ్గుతున్న అనేకమంది బయటకు వచ్చారు, విముక్తి పొందారు, అందుకు ప్రతీకగా దీపాలు వెలిగిస్తారు. ఈ నరక చతుర్దశికి అంతరిక్షంలో జరిగే కొన్ని వింతల కారణంగా కూడా దీనికి ఈ ప్రత్యేకత వచ్చింది.   

నరక చతుర్దశి సంధర్భంగా అందరూ ఆచరించవలసిన విషయాలు తెలుసుకుందాం.
నరక చతుర్ద రోజు తెల్లవారుజామున అంటే సూర్యోదయానికి గంటన్నర ముందే నువ్వుల నూనెతో తల అంటుకొని స్నానం చేయాలి. దీనినే తైలాభ్యంగనస్నానం అంటారు. ఇది నరక చతుర్దశి రోజు తప్పక చేయవలసిన విధి. స్నానానికి ఉపయోగించే నీటిలో ఉత్తరేణి, తగిరస, తుమ్మి చెట్లకొమ్మలను కలియబెట్టాలి. స్నానం మధ్యలో ఉత్తరేణి ఆకులను తలపై త్రిప్పుకొని పారేయాలి. ఈరోజు చేసే స్నానం నరక భయాన్ని పొగొడుతుందని, మంగళకరమని చెప్పబడింది. ఆ సమయంలో స్నానం చేయకపోతే దరిద్రం పట్టుకుంటుందని శాస్త్రం చెప్తోంది.

నరకుడనే అహకారాన్ని వెతికి చంపినందుకు గుర్తుగా చేసే స్నానం ఇది. నరకాసురుడంటే అహకారం. జ్ఞానం మాత్రమే అహాన్ని నశింపజేస్తుంది. కనుక చతుర్దశి రోజు చేస్తున్న ఈ స్నానం జ్ఞానానికి సంకేతం అన్నారు భగవాన్ రమణ మహర్షి.

ఈ రోజున సూర్యోదయానికి ముందు నువ్వులనూనెలో లక్ష్మి దేవి, నీటిలో గంగా దేవి ఉంటారని, అందువల్ల ఆ సమయంలో చేసే పైన చెప్పిన విధంగా చేసే స్నానం వల్ల లక్ష్మీదేవి, గంగాదేవిల అనుగ్రహం కలుగుతుందని శాస్త్రం చెప్తోంది. స్నానాంతరం దక్షిణదిశగా తిరిగి యమనామాలు స్మరిస్తూ మూడుసార్లు యమునికి తర్పణం విడువాలి. తల్లిదండ్రులు లేనివారు మాత్రమే ఈ తర్పణాలు వదలాలి.

ఈరోజు ప్రదోషంలో అంటే సాయంకాలం ఇంటిముందు, ఆలయాల్లోనూ దీపాలను వెలిగించాలి. నాలుగు వత్తులతో దీపాన్ని వెలిగించి దీపదానం చేయాలి. 

Monday, 20 October 2014

ధనత్రయోదశి విశేషాలు

ఆశ్వీయుజ బహుళ త్రయోదశి - దీనికే ధనత్రయోదశి, ధన్వంతరి జయంతి అని పేరు.

ధనత్రయోదశి విశేషాలు:

పురాణప్రాశస్త్యం : పాలసముద్రంలో మందరపర్వతాన్ని అమృతం కోసం దేవతలు, రాక్షసులు చిలికినప్పుడు అమృతభాండాన్ని ఒక చేతితోనూ, శంఖువును మరొకచేతితోనూ, మూలికలు, చక్రం మిగితా చేతితులలో ధరించి ఆశ్వయుజ బహుళ ద్వాదశి నాడు ఉధ్బవించాడు #ధన్వంతరి అంటూ పురాణ కధనం. ఈయన్ను పూజించడం వలన ఆరోగ్యం సిద్ధిస్తుంది.

ధనత్రయోదశి కధ:

పూర్వం హిమ అనే పేరుగల రాజు ఉండేవాడు. అతనికి ఒకడే కుమారుడు. ఆ కొడుకుని చిన్నప్పటి నుంచి అలారుముద్దుగా పెంచారు. క్షత్రియుడు కనుక కత్తిసాము మొదలైన క్షత్రియ విద్యలన్నీ నేర్పించారు. కానీ ఈ రాకుమారుడు జాతకరీత్యా అతనకి వివాహం జరిగిన నాలుగో రొజుకు మరణిస్తాడని పురోహితులు చెప్తారు. అయినా, ఓ రాకుమారి అతడిని ఇష్టపడి పెళ్ళి చేసుకుంటుంది. తన పసుపు కుంకాలను తానే కాపాడుకుంటానని శపధం చేస్తుంది. నాలుగవ రోజు...... రాకుమారుడి గది ముందు ఆభరణాలు రాసులుగా పోస్తుంది. దేదీప్యమానంగా దీపాలను వెలిగిస్తుంది. రంగురంగుల రంగవల్లులు దిద్దుతుంది. తన ఆరాధ్య దేవతయైన లక్ష్మీదేవిని కీర్తిస్తూ శ్రావ్యంగా పాటలు పాడుతుంది. రాకుమారుడుఇ ప్రాణాలు తీసుకువెళ్ళడానికి యమధర్మ రాజు పాము రూపం ధరించి వస్తాడు. బంగారు ఆభరణాల మీద దీపపు కాంతి పడి, ఆ గదంతా వెలుగు విరజిమ్ముతున్నాయి. ఆ నెరుపు తళుకులకు ఈ పాము చూపు మందగిస్తుంది. ఆదుగు ముందుకు వేయలేకపోతాడు. ఈ యువరాణి సంగీతానికి పరవశించి వచ్చిన పని మర్చిపోయి, ఆమె సంగీతం వింటూ ఉంటాడు.  ఇంతలోనే తెల్లారిపోతుంది. యమ ఘడియలు దాటిపోవడంతో, ఖాళీ చేతులతో వెళ్ళిపోతాడు.

అందువల్ల ఈ రోజు యముడికి ప్రీతికరంగా యమదీపం వెలిగిస్తారు. ఉత్తరాదిలో ఈ రోజు సాయంత్రం ఆరుబయట, అన్నాన్ని రాశిగా పోసి యమదీపం వెలిగిస్తారు.

ఆశ్వయుజ బహుళ త్రయోదశి (అంటే నరక చతుర్దశికి ముందు వచ్చే తిధి).దీన్నే "ధన త్రయోదశి" అంటారు.ఈనాటి రాత్రి అపమృత్యువు (unnatural death) నివారణకై నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి, పూజించి, ఇంటి ముందు ఉంచాలి. దీనికి "యమ దీపం" అని పేరు. యముని అనుగ్రహం పొందడం కోసం ఈ దీపాన్ని వెలిగించాలి.

కాగా ఈ మధ్యకాలంలో ధనత్రయోదశి రోజున బంగారం కొనాలనే ప్రచారం మొదలైంది. కానీ అటువంటి నియమం ఏమీ లేదు. ప్రపంచీకరణ నేపధ్యంలో దేశంలోకి బహుళజాతి సంస్థలు వ్యాపారం కోసం వచ్చాయి, లాభలు ఆర్జించడమే ధ్యేయంగా ఉన్న సంస్థలు మార్కెట్ చేసుకోవడం కోసం అక్షయతృతీయ, ధనత్రయోదశి రోజున బంగారం కొనాలనే ప్రచారాన్ని మొదలుపెట్టాయి. అసలు ఇటువంటి ఆచారం మన బామ్మలకు, అమ్మమ్మలకే తెలియదట. వాళ్ళకే ఇది వింతగా ఉందంటే అసలు విషయం ఏంటో అర్దం చేసుకోవచ్చు. పురాతనకాలంలో భారతదేశంలో పండుగ రోజంటూ ఏదైనా ఉందంటే అది దానం చేసిన రోజే. సంపదలు దాచుకోవడం కాకుండా, ఉన్న సంపదను పుణ్యంగా మార్చుకుని, వచ్చే జన్మలకు ఉపయోగించుకోవడం భారతీయుల విధానం. ధనత్రయోదశి రోజున చేసే దానం, పూజ, జపం అధికఫలాన్ని ఇస్తాయి. 17 వ శతాబ్దం వరకు భారత్ ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశమనీ, భారత్‌లో బంగారం పొంగిప్రవహించేదనీ ఆంగ్లేయుల రికార్డులే చెప్తున్నాయి. అటువంటి బంగారాన్ని భారతీయులు ఎప్పుడు కొనగోలు చేయలేదు, ఆ అవసరం కూడా రాలేదు. వచ్చిన అతిధులకు బంగారం దానం చేసిన సంస్కృతి మనది.

ధనత్రయోదశి శుభాకాంక్షలు 

Sunday, 19 October 2014

అష్టసిద్ధులు

సందేహం - అష్టసిద్ధులు అని అంటారు కదా, వాటి గురించి వివరించండి ?

సమాధానం - సనాతనధర్మం ప్రకారం మానవజన్మ యొక్క ముఖ్య ఉద్ద్యేశం ఆత్మవిచారణ చేసి, ఆత్మానుభూతిని పొందిముక్తి పొందడం. ముక్తి పొందిన ఆత్మకు చావుపుట్టుకలు ఉండవు. ఆత్మ అనగానే అది ఏదో ఒక కొత్త శక్తి అని భావించకూడదు. నా శరీరంలో ఉండే నేను ఆత్మ. నేను ఈ శరీరాన్ని ధరించాను. శరీరం వస్త్రాన్ని ధరించినట్టుగానే, ఆత్మ శరీరాన్ని ధరించింది. వస్త్రం చినిగోతే ఎలా పడేస్తామో, అలాగే ప్రారబ్దం తిరిపోగానే ఆత్మ శరీరాన్ని వదిలేస్తుంది. తిరిగి వేరే దేహాన్ని కర్మాణుసారంగా వెతుక్కుంటుంది. ఇంత చేస్తున్న ఆత్మ ఎవరో కాదు మీరే. మనల్ని మనం శరీరంతో గుర్తించుకుంటున్నాం, కానీ మనం శరీరం కాదు. మనల్ని మనం తెలుసుకోవడమే, అన్నిటికి అతీతమైన ఆత్మ స్థితిని పొందే ప్రయత్నమే ఆత్మవిచారణ. అటువంటి ఆత్మానుభూతిని పొందే సులువైన పద్దతిని పరమశివుడు యోగం (యోగా) ద్వారా అందించారు. దాన్ని పతంజలి మహర్షి తిరిగి మానవాళికి అందించారు. ఆత్మ విచారణ చేసే క్రమంలో, సాధకునికి కొన్ని శక్తులు లభిస్తాయి. వాటితో ఆత్మవిచారణకు సంబంధం లేకపోయినా, వాటి మీద అధికమోహం అసలు గమ్యాన్ని మర్చిపోయేలా చేస్తుంది. సిద్ధులు 8 కనుక వాటిని అష్టసిద్ధులు అన్నారు. అవి

1. అణిమా - ఈ సిద్ధితో యోగి తన శరీరాన్ని చీమ కంటే, అణువుకంటే చిన్నగా మార్చుకోగలడు, పూర్తిగా అదృశ్యమవగలడు.

2. మహిమా - దీన్ని పొందడం ద్వారా యోగి తన రూపాన్ని చాలా పెద్దదిగా చేయగలడు, మేఘాలను చీల్చ్కుని, సూర్యుని తాకుతున్నాడా అన్నట్టుగా కనిపిస్తాడు.

3. లఘిమా - దీని ద్వారా దేహాన్ని చాలా తేలికాగా చేస్తారు, ఎండిన ఆకు, పక్షి ఈక కంటే తేలికగా యోగి దేహం మారిపోయే శక్తిని పొందుతుంది, ఈ సిద్ధితో గాలిలో తేలగలడు, నీటిపై నడువుగలడు.

4. గరిమా - భారీకాయంతో పర్వతాన్ని తపలిస్తూ యోగి మొత్తం గాలిని పీల్చేయగలడు.

5. ప్రాప్తి - ఈ సిద్ధితో యోగి, ఏ వస్తువునైనా తనకు నచ్చిన విధంగా రూపం మార్చగలడు, దాని స్థితిని మార్చగలడు. భవిష్యత్తును దర్శించగలడు, ఫోనులు మొదలైనవి అవసరం లేకుండా ప్రపంచంలో ఏ మూలన ఉన్నవారితోనైనా సంభాషిచగలడు, వ్యక్తిని చూసి మనసులో ఏముందో చెప్పగలడు, ఎవడు ఎలాంటివాడో, పుట్టుపూర్వోత్తరాలన్నీ చెప్పగలడు, ప్రపంచంలోని అన్ని బాషలను అర్దం చేసుకుంటాడు, ఏ భాషలోనైనా మాట్లాడుతారు, జంతువులు, మృగాలు, పక్షులు, చెట్లతో కూడా మాట్లాడగలడు, వాటి భాషను అర్దం చేసుకోగలరు.

6. ప్రాకామ్య - ఏ ఇతర శరీరాల్లోకైనా ప్రవేశించగలరు, ఇదే పరకాయప్రవేశ విద్య.

7. వశిత్వం - అందరిని వశం చేసుకుంటారు. కౄర మృగాలను సైతం తన దగ్గర పెంపుడు జంతువులను చేసుకోగలరు, తన సంకల్పబలం చేత దుష్టులను కూడా అదుపు చేయగలరు, పంచభూతాలను సైతం తన అదుపులో ఉంచుకుంటారు.

8. ఈశిత్వం - యోగి దైవశక్తిని పొందుతారు, ఈశ్వరతత్వాన్ని పొందుతారు, ఈ ప్రపంచానికి అధిపతి అవుతాడు, మరణించిన వారిని కూడా బ్రతించగలరు.

ఇవి అష్టసిద్ధులు.

ఇవి పతంజలి మహర్షి తన యోగశాస్త్రంలో వివరించిన అష్టసిద్ధులు. మంత్రజపం చేత కూడా కలుగుతాయని గురువుల వచనం. కానీ ఇతరులకు అపకారం చేయడానికి వాడుకుంటే మాత్రం సిద్ధులు నశిస్తాయి.

Thursday, 2 October 2014

బతుకమ్మ పండుగ

తెలంగాణ సంస్కృతికి చిహ్నం బతుకమ్మ. బతుకమ్మ గౌరీదేవి స్వరూపం. ఆశ్వీయుజమాసంలో పెత్రమాస(మహాలయ అమావాస్య,పితృ అమావాస్య)తో మొదలవుతుంది బతుకమ్మ వేడుక. అష్టమి వరకు కొనసాగే పండుగ ఇది. ఇది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు,ఇందులో శాస్త్రీయత కూడా ఉంది.

కొత్తబట్టలు ధరించి,ఇత్తడి తాంబులంలో గుమ్మడి ఆకులు పరిచి వాటి మీద తంగేడు పూలు పేరుస్తారు. కాస్త ఏత్తులో పూల పేర్పు అయ్యాక గునక, బంతి, చామంతి, అడవి చామంతి, మూత్యాలపువ్వు, రుద్రాక్ష, నీలగొరింట, పట్టుకుచ్చులు, కట్ల, బీర.... ఇలా బతుకమ్మను పేర్చడంలో రకరకాల పూలను ఉపయోగిస్తారు. సాయంకాలం అందరూ ఒకచోట చేరి, బతుకమ్మ చుట్టూ తురుగుతూ పాటలు పాడుతూ తిరుగుతారు. చీకటి పడుతుండగా చెరువుల్లో నిమ్మజ్జనం చేస్తారు. మొదటి రోజు పేర్చే బతుకమ్మను 'ఎంగిలి బతుకమ్మ' అంటారు.

 బతుకమ్మ పండుగలో ఉన్న శాస్త్రీయ అంశాలేమిటో తెలుసుకుందాం.

ఇత్తడి తాంబులంలో గుమ్మడి ఆకులు పరిచి వాటి మీద తంగేడు పూలు పేరుస్తారు. తంగేడు పువ్వులు గొంతు సమస్యలకు,మూత్ర సంబంధిత సమస్యలకు ఔషధం. కాస్త ఏత్తులో పూల పేర్పు అయ్యాక గునక, బంతి, చామంతి, అడవి చామంతి, మూత్యాలపువ్వు, రుద్రాక్ష, నీలగొరింట, పట్టుకుచ్చులు, కట్ల, బీర.... ఇలా బతుకమ్మను పేర్చడంలో రకరకాల పూలను ఉపయోగిస్తారు.

~ గునక పువ్వు యాంటి-డైహెరియా,యంటి-డైయాబేటిక్ లక్షణాలు కలది.
~ క్రిమి-సంహారిణి,దోమలను నివరించేది బంతిపువ్వు.
~ చామంతిని కాలిన గాయాలకు, దెబ్బలకు, కంటి సంబంధిత రోగాలకు, అరుగుదల సమస్యలకు ఔషధంగా వాడతారు. ఇది యాంటి-బ్యాక్టీరియల్ లక్షణాలు కలిగినది, కాలుష్య కారకాలను, బెంజిన్, అమోనియా వాయువలను పీల్చుకొని, గాలిని శుద్ధిచేస్తుంది.

ఈ విధంగా బతుకమ్మ పేరున వాడే ప్రతి పువ్వుకు చాలా ఔషధ గుణాలు ఉన్నాయి.

ఈ పూలన్ని గోపురంలా పేర్చాక పైన గుమ్మడిపువు గొడుగుపెడతారు. తమలపాకులో పసుపుతో చేసిన గౌరమ్మను ఉంచి పక్కనే దీపం వెలిగిస్తారు. పసుపు శుభానికి సూచన, క్రిమి-సంహారిణి. దీపం జ్ఞానానికి సంకేతం. అది గాలిని శుద్ధి చేస్తుంది, క్రిములను హరిస్తుంది.

సాయంత్రం ఇంటిముందుకాని, వీధిలోకాని, దేవాలయంలో, చెరువు, వాగు ................ ప్రతి చోట అందరు చేరి, బతుకమ్మలను మధ్యలో ఉంచి 'బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో...' అంటూ పాటలు పాడతారు.

చీకటి పడుతుండగా చెరువుల్లో నిమజ్జనం చేస్తారు. ఆ పూలుకున్న ఔషధ గుణాలు నీటిని శుద్ధిచేసి, నీటిద్వారా వచ్చే రోగాలను హరిస్తాయి. ఇంట్లో 9 రోజులపాటు ఆ పూలను పేర్చడం, ఆ వాసన ఇల్లంత వ్యాపించడం ద్వారా ఆ ప్రాంతంలో ఉన్న క్రిములు హరింపబడతాయి, అందరు ఆ వాసన పీల్చడం ద్వారా రోగనిరోధక శక్తి పెరిగి హాయిగా, ఆరోగ్యంగా జీవిస్తారు.

సరస్వతీ దేవి

పిల్లలందరు ముఖ్యంగా పూజించవలసిన అమ్మవారు సరస్వతీ దేవి. మన చదువుల తల్లి సరస్వతీ దేవి.

సరస్వతీదేవి తెల్లని వస్త్రాలు సాత్వికతను సూచిస్తాయి. విద్యాభ్యాసం చక్కగా సాగాలంటే ఆహారంలో, ప్రవర్తనలో, మొత్తం జీవితంలో సాత్వికత ఉండాలి. సత్వగుణమే ప్రధానమని సూచిస్తున్నది అమ్మ వస్త్రధారణ. సరస్వతి దేవి ఒక చేతిలో జపమాలను,మరొక చేతిలో వేదాలను ధరించి కనిపిస్తుంది. వేదం అనంతమైన జ్ఞానానికి సంకేతం. వేదం ఈ సృష్టికి ముందే పరమాత్ముడి ద్వారా ఇవ్వబడింది. వేదం నశించనిది, ఎప్పటికి ఉంటుంది. జపమాల జపానికి సంకేతం. జపమాలతో సరస్వతి దేవి నిరంతరం జపిస్తూ ఉంటుంది. చదువు రావాలి, జ్ఞానాన్ని పొందాలి అంటే,  నేర్చుకున్న విషయాన్ని అనేక మార్లు మననం చేయాలి, మనసులో ధారణ చేయాలి.  అప్పుడే మనకు సారం అర్ధమవుతుంది.

“తపస్స్వాధ్యాయ నిరతం” అంటే కొత్త విషయాలు తెలుసుకోవాలన్న తపన, ఆసక్తి ఎంత అవసరమో, తెలిసిన విషయాలను మళ్ళీ మళ్ళీ మననం చేసుకోవడం కూడా అంతే అవసరం అంటుంది మన ధర్మ శాస్త్రం. సరస్వతి దేవి ఒక చేతిలో జపమాలను, మరొక చేతిలో వేదాలను ధరించి కనిపిస్తుంది. మిగితా దేవీదేవతలందరూ పువ్వుల్లో కూర్చుంటే చదువుల తల్లి సరస్వతి దేవి మాత్రం రాయి మీద కూర్చొని ఉంటుంది. ఏ పువ్వైనా కొంత సమయం మాత్రమే వికసించి ఉంటుంది. ఉదయానికి వికసించిన పువ్వు సాయంత్రానికి వాడిపోతుంది. కాని రాయి మాత్రం పదిలంగా ఉంటుంది. ఈ లోకంలో విద్య, జ్ఞానం మాత్రమే శాశ్వతమైనవని, సంపదలు కొంత కాలం మాత్రమే ఉంటాయి అని, అమ్మ సందేశం ఇస్తూ, ఎప్పటికి తరిగిపోని విద్యనే అనుగ్రహిస్తానంటోంది.

అమ్మవారి వాహనం హంస – పాలు,నీరు కలిపి హంస ముందు పెడితే హంస నీటిని వేరు చేసి పాలను మాత్రమే త్రాగుతుంది. ఒక నాణానికి బొమ్మ బొరుసుల తరహాలో ప్రతి విషయంలోనూ మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ప్రతి విషయంలోని మంచిని మాత్రమే వెతికి దానిని మాత్రమే గ్రహించి, చెడును విసర్జించే వారే సరస్వతి దేవికి అత్యంత ప్రియులని, వారి ద్వారా తన వైభవాన్ని చాటుతుందని తన హంస వాహనం ద్వారా అమ్మ సందేశమిస్తోంది.
హంస అంటే ఊపిరి. మనం నిశ్వాస నుంచి  ”సః” అనే శబ్దం అని వెలువడుతుంది. బయటనుంచి లోపలికి ప్రవశించే ప్రాణవాయువు ఉచ్చ్వాశం “అహం” అంటూ లోనికి ప్రవేశిస్తుంది. ఉచ్చ్వాశ, నిశ్వాసల నిరంతర ప్రక్రియనే హంస జపం అంటారు. శరీరంలో ప్రాణం ఉన్నతవరకు ఈ జపం జరుగుతూనే ఉంటుంది. సః అంటే అతడు, భగవంతుడు, పరమాత్మ అని, అహం అంటే నేను అని అర్ధం. ఇది పరంపరలో, వేగంలో ముందు వెనుకా అయి అహం సః, అహం సః…….. అంటూ హంసో హంసో హంసోహం హంస్ససోహం హంసః అంటు బాగా గమనిస్తే సోహం అంటుంది వినిపిస్తుంది. అప్పటివరకు అతడు, నేను అని వెర్వేరుగా వినిపించేది, అతడే నేను గా మారుతుంది. అతడు పరమాత్మ. నేను అంటే జీవాత్మ. అతడే నేను అని తెలుసుకోవడమే అసలైన జ్ఞానం. అదే అసలైన విద్య. దానికి ఎంతో సాధన కావాలి. ఈ విద్యకు అధిదేవత మన అమ్మ సరస్వతి దేవి. అందుకే ఆవిడ హంసను వాహనంగా చేసుకుంది.సర్వసతి అన్న పదం కూడా రెండు పదాలను వచ్చింది. సరః అంటే సారము అని, స్వః అంటే నా/వ్యక్తి యొక్క. అందరిలో ఉండే నేను గురించి పూర్తిగా తెలుసుకునే శక్తినిచ్చేది కనుక అమ్మ సరస్వతీ.

ఇంకోమాటలో చెప్పాలంటే ఎవరో చనిపోతారు. అందరూ ఏడుస్తుంటారు, అప్పుడే పోయావో అంటూ శోకాలు పెడతారు. ఇంకా శవాన్ని దహనం చేయలేదు. ఆ వ్యక్తి అక్కడే పడుకుని ఉన్నాడు. కాకపోతే ఉలుకుపలుకు లేదు, బొమ్మలాగా ఉన్నాడు, అంతేకదా. మరి ఎక్కడికో పొవడమేమిటి? ఎక్కడికో పోయింది ఎవరు? కదలకుండా ఉన్న ఆ దేహం ఎవరు? అతనే దేహం అయితే అతను అక్కడే ఉన్నాడు. మరీ ఈ ఏడుపులు, శోకాలు ఎందుకు? వెళ్ళిపోయిందెవరు, పోని అతను వెళ్ళిపోయాడంటే అక్కడ పడి ఉన్నది ఎవరు? అతను ప్రాణం అయితే, ఆ ప్రాణం ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడికి పోయింది? అసలు ఎందుకు వచ్చింది? ఎలా వచ్చింది? ఇలా అనేక ప్రశ్నలు వస్తాయి. వాటికి సమాధానం చెప్తుందీ విద్య.

ఇన్నాళ్ళు అతన్ని దేహంగా గుర్తించినవారు ఇప్పుడు అతన్ని వెరొక పదార్ధంగా గుర్తిస్తున్నారు. ఆ పదార్ధమే ఆత్మ. దాని గురించి తెలుసుకుంటే ఇక ఈ లోకంలో తెలుసుకోవలసినవంటూ ఏవీ ఉండవు. అది అర్దమైతే అన్ని అర్దమైనట్లే. దాన్ని తెలుసుకోవడమే ఆత్మవిద్య. దాన్ని అనిగ్రహించే తల్లీ మాన సరస్వతీదేవి.

సరస్వతీ నమస్థుభ్యం వరదే కామరూపిణి
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతుమే సదా

సర్వం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు

ఇదే వ్యాసాన్ని అచ్చంగా తెలుగు మాసపత్రికకు జూన్‌లో రాయడం జరిగింది
http://acchamgatelugu.com/?p=6548

Wednesday, 1 October 2014

సరస్వతీ తత్వం

సరస్వతీ అనే పదంలోనే అమ్మవారి తత్వం దాగివుంది. సరః అంటే సారము, స్వ అంటే తన యొక్క అని అర్దం. తన యొక్క సారాన్ని/తత్వాన్ని సంపూర్ణంగా తెలిపేది సరస్వతి.

మనం ఆత్మ స్వరూపులం అయినా, మనల్ని మనం ఈ శరీరంగా భావించుకుంటాం. మనసుకు కలిగిన బాధలను మనవిగా భావించి బాధపడతాం. పూర్వజన్మ కర్మఫలాలను అనుభవించేది దేహము, దేహంలో ఉన్న మనస్సే కానీ, మనం కాదు. కానీ శరీరానికి కలిగిన కష్టనష్టాలకు, దుఃఖాలకు కృంగిపోతాం. అహంకారమమకారాలకు బానిసలమై, పరిమితి కలిగిన ఈ దేహాన్నే మనంగా ఊహించుకుంటూ జీవిస్తున్నాం.

కానీ నిజానికి మన తత్వం ఏమిటి? మనమేమిటి? అని ఆలోచిస్తే ఎప్పుడు మనలో 'నేను' అనే తలంపు ఒకటి మెదులుతుంటుంది. ఈ దేహం పుట్టినప్పటి నుంచి మరణించేవరకు ఆ తలంపు మనల్ని వీడదు. ఆ 'నేను' అనే తలంపు ఎక్కడి నుంచి వస్తోందో తెలుసుకునేందుకు ధ్యానంలో విచారాణ ప్రారంభిస్తే, అది ఆఖరున ఆత్మలో లయమవుతుందంటారు భగవాన్ శ్రీ రమణ మహర్షి. ఆత్మ మన సహజ స్థితి, నిత్యానంద స్థితి, ఆత్మయే మనం. ఈ శరీరంలో ఆత్మ ఉండడం కాదు, ఆత్మ ఈ శరీరాన్ని ధరించింది, ఆ ఆత్మయే మనం. ఆత్మకు పరిమితి లేదు, ఆత్మ అంతటా వ్యాపించి ఉంది, ఈ లోకంలో ఆత్మ తప్ప మరొకటిలేదు.

ఈ ఆత్మ తత్వమే సనాతన భారతీయ సంస్కృతిని ప్రపంచంలో అత్యున్నత స్థానంలో నిలిపింది. ప్రపంచంలో ఇతర మతాలు అశాశ్వతమైన ఈ శరీరం గురించి చెప్తే, మన ధర్మం సనాతనమైన ఆత్మ తత్వం గురించి ప్రపంచానికి చెప్పింది. మానవజన్మకు సార్ధకత/ నిర్యాణం/ మోక్షం లభించాలంటే ఆత్మ తత్వం అర్దమవ్వాలి. అటువంటి ఆత్మ తత్వం(మన తత్వం) గురించి మనకు సంపూర్ణంగా తెలియజేస్తుంది కనుక అమ్మను సరస్వతీ దేవిగా ఆరాధిస్తాం.

ఓం సరస్వత్యై నమః