Wednesday, 30 April 2014

హిందూ ధర్మం - 56 (అక్రోధః)

అక్రోధః - క్రోధము లేకుండుట. ధర్మం యొక్క లక్షణం.

మనిషికుండే అవలక్షణాల్లో ఒకటి, పరమదుర్గుణం కోపమే. కోపం ఆవేశానికి దారి తీస్తుంది. ఆవేశం కారణంగా అనకూడని మాటలు అనేస్తాం. ఆయుధం చేయి దాటితే ప్రాణం పోతుంది, మాట నోరు జారితే సమస్తం పోతుంది. ఒక్కోసారి ఆయుధ ప్రయోగం వలన తగిలే దెబ్బలు బాహ్యాంగానే ఉంటాయి. కానీ మాట జారడం వలన వ్యక్తి ఆంతరంగికంగా గాయపడతాడు. శరీరానికి తగిలిన గాయాలను నయం చేయచ్చు కానీ, మనసుకు తగిలిన గాయాలను మాంచలేము. అందుకే కోపంలేని జీవితాన్ని గడపమని ఋషులు చెప్తున్నారు.  

ఎంతో గొప్ప కీర్తివంతులు, మంచి పేరున్నవారు, సమాజంలో గౌరవంతో బ్రతుకుతున్నవారు కోపానికి గురై పొరపాటుగా పలికిన మాట వారి కీర్తిని, గొప్పతనాన్ని నాశనం చేస్తుంది. క్రోధానికి లోనవడం వలన ఆవేశంలో మంచివాడు కూడా దుర్మార్గపు పనులు చేస్తాడు. ఆవేశం అనర్ధాలకు దారి తీస్తుందన్నారు పెద్దలు. ఒక్కసారి ఆవేశానికి లోనయ్యామా, ఇక మనమేం చేస్తున్నామో, ఏం మాట్లాడుతున్నామో, ఏమి గుర్తుకురావు. ఇంతకముందు మనం విన్న మంచిమాటలు, ధర్మసూక్ష్మాలు, శాస్త్రాలు, పురాణాలు, అన్నీ మర్చిపోతాం. అందుకే యోగి వేమన తన వేమన శతకంలో

కోపమున ఘనత కొంచెమైపోవును
కోపమునను గుణము కొరతపడును
కోపమణచనేని కోరికలీడేరు
విశ్వదాభిరామ వినురవేమ

కోపం వలన కీర్తి, పరువుప్రతిష్టలు నశిస్తాయి. కోపము వలన మంచిగుణాలు కోల్పోతారు. కోపాన్ని అణుచుకున్నవాడి, అదుపు చేసుకున్నవాడి, జయించినవాడి కోరికలన్నీ తీరుతాయి అని భావం.
     
కోపంలేని జీవితం ఒక్కసారిగా సాధ్యపడదు. దానికి సాధన కావాలి. కోపాన్ని అదుపు చేసుకోండి అని ఋషులు చెపలేదు, కోపాన్ని జయించమన్నారు. అదుపు చేసుకోవడం వేరు, జయించడం వేరు. అందుకు తగిన మాత్గాలు కూడా వారే నిర్దేశించారు.

To be continued...........

Realisation is not acquisition of anything new

The real ‘I’ is always there. It is here and now. It never appears anew and disappears again. That which is must also persist for ever. That which appears anew will also be lost. Compare deep sleep and waking. The body appears in one state but not in the other. Therefore the body will be lost. The consciousness was pre-existent and will survive the body. In fact, there is no one who does not say ‘I am’. The wrong knowledge of ‘I am the body’ is the cause of all the mischief. This wrong knowledge must go. That is Realisation. Realisation is not acquisition of anything new nor it is a new faculty. It is only removal of all camouflage.

Maj. Chadwick: I try to shake off the body.

M.: A man shakes off his clothes and remains alone and free. The Self is unlimited and is not confined to the body. How can the body be shaken off? Where will he leave it? Wherever it is, it is his still.

Maj. Chadwick: (Laughter.)

M.: The ultimate Truth is so simple. It is nothing more than being in the pristine state. This is all that need be said. Still, it is a wonder that to teach this simple Truth there should come into being so many religions, creeds, methods and disputes among them and so on! Oh the pity! Oh the pity!

Talk 96

Tuesday, 29 April 2014

ఒక్క ఓటు

ఓటు దేశాన్ని మార్చడానికి సామాన్యుడి చేతిలో ఆయుధం. ప్ర్రజాప్రతినిధుల పట్ల పేరుకుపోయిన కోపాన్ని ప్రదర్శించగల శక్తి ఒక్క ఓటుకే ఉంది. ఓటు దేశం పట్ల మనకున్న భాధ్యత. 30-04-2014, తెలంగాణాలో ఎన్నికల ఓటింగ్. ఎన్ని ముఖ్యమైన పనులు ఉన్నా, అన్నిటిని ప్రక్కనపెట్టి ఓటు వేయండి. నా ఒక్క ఓటుతో మార్పు ఏం జరుగుతుంది అనుకోకండి. ఒక్క ఓటు దేశచతిత్రనే మార్చగలదు.

1776 లో ఒక్క ఓటు తేడాతో జెర్మన్‌కు బదులు అమెరికా ఆధికార భాషగా ఇంగ్లీష్ ప్రకటించబడింది.
1845 లో ఒక్క ఓటు తేడాతో టెక్సాస్ అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో చేరింది
1875 లో ఒక్క ఓటు తేడాతో ప్రాన్స్ రాచరికం నుంచి ప్రజాస్వామ్యదేశంగా మారింది
1923 లో ఒక్క ఓటు హిట్లర్‌కు నాజీపార్టీ అధిపతిగా పదివి దక్కింది

ఒక్క ఓటుతో పోయిందేముందిలే అనుకుని ఇంట్లో కూర్చోవడం ప్రతి ఎన్నికలలో పోలింగ్ శాతం పడిపోతోంది. దేశానికి మంచి నాయకత్వం అవసరం. చైనా దురాక్రమణలకు, పాకిస్థాన్ కవ్వింపులకు, అమెరికా కుటిలా రాజకీయ ఎత్తుగడలకు సమాధానం ఇవ్వగల సమర్ధవంతమైన నాయకత్వం భారతదేశానికి ఇప్పుడు అత్యవసరం. సరైన నాయకత్వం లేకపోతే దేశం పతనమవుతుంది. దేశభక్తుడు, అవినీతికి లొంగనివాడు, విదేశాలకు సలాం చేయనివాడు, అందరిని ఒప్పించి నడిపించగలవాడికే ఓటు వేయండి. చేతగానితనంతో పదివి నుంచి పారిపోయేవాడు, లంచాలకు ఆశపడేవాళ్ళను, విదేశీ ఏజెంట్లను తిరస్కరించండి.

ఓటు వేయనివాడు దేశద్రోహి, అటువంటి వాడిని దేవుడు కూడా క్షమించడు. మంచి నాయకులనే ఎన్నుకోండి. భారతదేశాన్ని రక్షించండి. ప్రతి ఓటు విలువైనదే.

జై హింద్ 

Monday, 28 April 2014

హిందూ ధర్మం - 55 (సత్యం)

సత్యాన్ని తెలుసుకోవడం ధర్మం. అందరిలాగే జన్మంచాం, జీవిస్తున్నాం, మరణిస్తాం. జీవితంలో కష్టాలు, కనీళ్ళు వస్తాయి. నిన్న ఉన్నట్టుగా జీవితం ఈ రోజు ఉండదు, ఈ రోజు ఉన్నట్టుగా రేపు ఉండదు, నిరంతరం మార్పులు చెందుతుంది. కానీ ఎన్ని మార్పులు సంభవించినా, ఒకటి మాత్రం నిశ్చలంగా ఉంది, శాశ్వతంగా ఉంది. అది ఈ శరీరం పుట్టక ముందు ఉంది, తల్లి గర్భంలో ప్రవేశించి దేహానికి చైతన్యాన్ని ఇచ్చింది. పెరుగుతున్నది శరీరమే కానీ, ఆ శక్తి కాదు. ముడతలు శరీరానికే పడతాయి, ముసలితనం శరీరానికే వస్తుంది కానీ ఆ పదార్ధానికి రాదు. ఆనందమైనా, విచారమైనా ఆ తత్వానికి తేడా ఉండదు. అది ఎప్పుడు ఉంటుంది. సుఖదుఖాఃలతో దానికి సంబంధం లేదు. అది ఆత్మ. ఆత్మయే నిజం. ఆత్మను తెలుసుకోవడమే సత్యం. ఆత్మను తెలుసుకోవడం అంటే నిన్ను నువ్వు తెలుసుకోవడం. కేవలం పుస్తకంలో చదవడం కాదు, అనుభూతి చెందడం ముఖ్యం.

ఈ సృష్టిలో పరమాత్మ ఒక్కడే సత్యం. ఈ లోకాన్ని మనం అనుభూతి చెందుతున్నాం కానీ ఈ లోకం శాశ్వతం కాదు. నిత్యం మార్పులకు గురవుతుంది. ఒకనాడు ప్రళయం వచ్చి, సమస్త లోకాలు గాఢాంధకారంలోకి వెళ్ళిపోతాయి. రాజులు, రాజ్యాలు, ప్రభుత్వాలు, ప్రజలు, ప్రకృతి, సమస్త లయమవుతాయి. అయినా అప్పుడు కూడా పరమాత్మ నిలిచి ఉంటాడు. మన చుట్టూ ఉన్న బంధువులు, మిత్రులు అందరూ ఏదో ఒక రోజు మరణిస్తారు. మరణం తప్పదు. కానీ ఎందరు మరణించినా, ఎప్పటికి నిలిచి ఉండే తత్వం భగవంతుడు. భగవంతుడే సత్యం. ఆ మాటకు అర్దం ఇప్పుడు కనిపిస్తున్నవన్నీ అసత్యం అని కాదు. మనమున్న స్థితిలో ఇవన్నీ సత్యాలే. కానీ మనకున్న అజ్ఞానమనే చీకటి తొలగి, సత్యం గోచరించిన రోజు, ఈ లోకమంతా ఒక నాటకంలా అనిపిస్తుంది. మనం ఆ నాటకాన్ని చూస్తున్న ఒక ప్రేక్షకుడిగా మిగిలిపోతాం. నాటకం ముగియగానే మనం వచ్చిన ప్రదేశానికి తిరిగి వెళ్ళిపోతాం. అంతవరకు మనకు కనిపిస్తున్నవి సత్యాలే. కానీ ఇవన్నీ చిన్నపాటి సత్యాలు, తాత్కాలిక సత్యాలు. శాశ్వతమైన సత్యం భగవంతుడు. ఆ శాశ్వతమైన, నిత్యమైన సత్యాన్ని తెలుసుకోవడం ధర్మం.

To be continued...........

Sunday, 27 April 2014

హిందూ ధర్మం - 54 (సత్యం)

త్రికరణ శుద్ధిగా సత్యాన్ని ఆచరించడం ధర్మం. అంటే మనసులో ఆలోచనలు, మాట్లాడే మాటలు, చేసే పనుల్లో కూడా సత్యం ఉండాలి. అంటే నీతీగా, నిజాయతీగా బ్రతకాలి, లంచాలు తీసుకోకుండా బ్రతకాలి, అక్రమసంపాదన ఉండకూడదు, ఎవరినీ మోసగించకూడదు. అప్పుడే సత్యాన్ని పాటిస్తున్నాడని అర్దం.

ఉపనిషత్తులు చాలా గొప్పమాటలు చెప్తాయి. అక్రమంగా డబ్బు సంపాదించినవాడు, దుర్మార్గుడు వద్ద నుంచి డబ్బు తీసుకుని బ్రతికేవాడు, దుర్మార్గులని, అక్రమార్కులని ప్రోత్సహించేవారు పాపాత్ములు. వారు మోక్షానికి అనర్హులు. మనం తినే ఆహారం వలన మనసులో మంచి భావనలు ఏర్పడతాయి. అక్రమసంపాదన వలన, తినే ఆహారం కూడా కలుషితమవుతుంది, దొంగ బుద్ధి పెరుగుతుంది. అటువంటి ఆహారం మనసును అపవిత్రం చేస్తుంది. అపవిత్రమైన మనసు చెడు సంకల్పాలు చేస్తుంది, ఫలితంగా మనిషి దుర్మార్గుడిగా మారి లోకకంఠకుడవుతాడు. దైవానికి దూరం అవుతాడు. అట్లాగే అవినీతిపరుల సొమ్ము తినే బ్రతికేవారికి, అతడి వద్ద పనిచేసే ఉద్యోగూలకు ఈ దోషం ఉంటుంది. వారు ఎన్ని కర్మలు చేసినా, అవినీతిపరుడి వద్ద నుంచి వచ్చిన ధనంతో ఆహారం తిన్నారు కనుక వారు కూడా అధోగతి పాలవుతారు.  

సమాజంలో అవినీతిని, అక్రమాలను, లంచగొండితనాన్ని ప్రోత్సహించడం సత్యవ్రతానికి విరుద్ధం. పరిపాలించే రాజు సత్యవంతుడైతే దేశం సుభిక్షంగా ఉంటుంది, అదే అతడు అధర్మాత్ముడు, దొంగ అయితే దేశానికి సర్వ అరిష్టాలు చుట్టుకుని జనం నశించిపోతారని శాస్త్రమే చెప్తున్నది. కనుక సమాజంలో మంచిని పెంచడం, నీతి, నిజాయతీలను  ప్రోత్సహించడం సత్యవంతుని లక్షణం. మనసులో కూడా ఇతరుల సొమ్మును ఆశించకపోవడం సత్యం.  

To be continued...........

Saturday, 26 April 2014

హిందూ ధర్మం - 53 (సత్యం)

సత్యమే భగవంతుడు. భగవంతుడిని సత్యపరిపాలన ద్వారానే ఆరాధించాలి. ప్రతి శుభకార్యం తర్వాత మనం శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటాం. సత్యమే తానై ఉన్నవాడు కనుక సత్యనారాయణుడని పేరు. ఆ వ్రతానికి సత్యవ్రతం అని పేరు. ఆ వ్రత కధ చదివితే అర్దమవుతుందో సత్యం విలువ ఏమిటో? సత్యనారాయణ స్వామిని ఆర్ధాదించడంలో తొలిమెట్టు సత్యాన్ని గట్టిగా పాటించడమే.

సత్యనారాయణ స్వామి కధనే పరీశీలించండి. అందులో వైశ్యుని కధ చూస్తే, తమకు కష్ట వచ్చిన ప్రతిసారీ 'స్వామి నీ వ్రతం చేస్తాము' అని మొక్కుకోవడం, కష్టం నుంచి గట్టేక్కగానే మొక్కును మర్చిపోవడం, లేదంటే ఇప్పుడు కాదులే అంటూ వాయిదా వేయడం. ఇదే తంతు. ఆఖరున వారు చెరసాలలో బంధించబడడం, రాజు వారికి సమస్త కానుకులు ఒక ఓడ నిండుగా ఇచ్చి పంపించడం జరుగుతుంది. అప్పుడు అటు సాధువు రూపంలో వచ్చిన స్వామి 'ఆ ఓడలో ఏమున్నాయి అబ్బాయి' అని అడుగుతారు. అందుకు సమాధానంగా 'ఆ ఓడలో ఏముంటాయి రాళ్ళూ రప్పలు తప్ప!' అని సమాధానం ఇస్తారు. వారు ఆ ఓడ ఎక్కి చూస్తే సంపద మొత్తం చెత్తగా మారిపోతుంది. వచ్చినవాడు సాధువు, అతనికి డబ్బుపై మమకారం ఉండదు, అయినా అసత్యం పలికారు, సత్యమే పరమాత్మ. పరమాత్మను ప్రక్కకుతోసారు, దిక్కరించారు, మోసం చేయాలనుకున్నారుం, పర్యవసానం అనుభవించారు. ఆ కధను బాగా గమనించండి. భగవంతునికి మనం మొక్కిన మొక్కు తీర్చకపోవడం వల్ల కోపం రాదు. ఆయనకు కొబ్బరికాయలు, పూలదండలు అవసరం లేదు.

అయ్యో! వీడు నా దగ్గరే అబద్ధం ఆడుతున్నాడు. నా దగ్గరే ఇంతకు తెగిస్తే, ఇక లోకంలో అన్ని అకృత్యాలు చేస్తాడు, అన్ని అసత్యాలు ప్రచారం చేసి, ఎంతమందిని మోసం చేస్తాడో అని పరమాత్మ భావిస్తాడు. అందుకే మొక్కు తీర్చలేదని శిక్షిస్తాడు. మొక్కు తీర్చకపోవడమంటే ఆడినమాట తప్పడం. అది ఆయన దగ్గర తప్పితేనే శిక్షిస్తాడు అనుకోకండి. పరమాత్మ ఎప్పుడు సత్యం వైపే ఉంటాడు. సత్యమే గెలుస్తుంది.

జీవితంలో ఎవరి కోసం సత్యంగానో, అసత్యంగానో బ్రతకవలసిన అవసరమేమిటి? మీకోసం సత్యంగా బ్రతకండి, మీ జీవితాలను ఉద్ధరించుకోవడం కోసం సత్యంగా బ్రతకండి. ముందు మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడం ఆపండి. మీ బలహీనతలను పరమాత్మ ముందు అంగీకరించండి. మీలో దుర్గుణాలను నిస్సందేహంగా అంగీకరించి, మార్చుకునే ప్రయత్నం చేయండి. అంతేకానీ ఇది కాలం కాదు, ఇలా బ్రతకలేమంటూ సమర్ధించుకోకండి. అదే ధర్మం చెప్తుంది. సత్యం ధర్మాచరణలో ముఖ్యమైన అంశం.

To be continued...........

Friday, 25 April 2014

హిందూ ధర్మం - 52 (సత్యం)

సత్యాన్ని పాటించమన్నారని ఎప్పుడూ నేను నిజాలే మాట్లాడుతాను అంటూ అందరితో గొడవలు పెట్టుకోమని, శతృత్వం పెంచుకోమని చెప్పలేదు. రాముడి గురించి వర్ణిస్తూ 'సత్యాయ మితబాషిణాం' అంటారు వాల్మీకి మహర్షి. రాముడు సత్యవంతుడు, మాటమార్చనివాడు, అలా అని ఎక్కువగా మాట్లాడడు. ఆలోచించి మాట్లాడుతాడు, తక్కువగా మాట్లాడుతాడు, కానీ మాట్లాడితే మాత్రం అన్ని నిజాలే మాట్లాడుతాడు. రాముడు అరణ్యవాసంలో తన గురించి చెప్పుకున్నా, సీతమ్మ చెప్పినా ఎక్కడ కైక కారణంగా తాము అడవుల పాలయ్యామని, ఈ కష్టాలన్నిటికి కైకేయి కారణమని, ఆమె మీద చెడుగా చెప్పలేదు. నేను నా తండ్రి దశరధ మహారాజు ఆజ్ఞ ప్రకారం వనవాసానికి వచ్చానని మాత్రమే చెప్పుకున్నాడు. అట్లా అని నిజాలు దాచి పెట్టమని చెప్పడం ఉద్ద్యేశం కాదు.

కఠినమైన నిజాలను ప్రతి సందర్భంలో పలుకవలసిన అవసరంలేదు. సమయం కానీ సమయంలో చెప్పిన నిజం ఒక్కోసారి హానీ చేయవచ్చు. అందువలన కొన్ని సార్లు మౌనం వహించాలి. కానీ మనం మౌనంగా ఉండడం వలన వేరొకరికి అన్యాయం జరగకూడదు. మాట విషయంలో బుద్ధి ఉపయోగించాలి. 'సత్యాయ మితబాషిణాం' తక్కువగా మాట్లాడినా, నిజాలే మాట్లాడాలి. అదే వివేకవంతుని లక్షణం.

మామూలు జీవితానికి వస్తే, చాలామంది ఇతరులతో చాలా విషయాలు పంచుకుంటారు. అవి కష్టసుఖాలే కావచ్చు, లేకమరే ఇతర విషయమైనా కావచ్చు. కొందరి గురించి తప్పుగా మాట్లాడవచ్చు, విమర్శించవచ్చు. అవన్నీ అవతలవారికి చెప్పడం అనవసరం. నిజాలే మాట్లాడమన్నారు కదా, అందుకని వీళ్ళు మనతో మంచుకున్న విషయాలన్నీ వతలవారి ముందు చెప్పేయాలని అనుకోకండి. విమర్శలు, ఇతరుల గురించి చెప్పుకునే మాటలు మొదలైనవి అవివేకంతో మాట్లాడుకునేవి. వాటికి జీవితంలో ప్రాధాన్యం ఇవ్వడం దండగ. అసలు వాటిని గుర్తుంచుకోవడమే వృధా. అటువంటి విషయాలను విడిచిపెట్టాలి తప్ప, సత్యాన్ని పాటిస్తున్నామన్న పేరుతో అందరితో పంచుకుని, శతృవులను పెంచుకోమని ధర్మం చెప్పలేదు. ఒకరి విషయాలను మనం తెలుసుకోవడం అనవసరం, ఒకవేళ పంచుకున్నా, అక్కడికి వదిలేయడమే మంచిది. ఒకరి రహస్యాలను బయటపెట్టడం కూడా దోషమేనని గుర్తుపెట్టుకోండి.

To be continued...........