Monday 28 April 2014

హిందూ ధర్మం - 55 (సత్యం)

సత్యాన్ని తెలుసుకోవడం ధర్మం. అందరిలాగే జన్మంచాం, జీవిస్తున్నాం, మరణిస్తాం. జీవితంలో కష్టాలు, కనీళ్ళు వస్తాయి. నిన్న ఉన్నట్టుగా జీవితం ఈ రోజు ఉండదు, ఈ రోజు ఉన్నట్టుగా రేపు ఉండదు, నిరంతరం మార్పులు చెందుతుంది. కానీ ఎన్ని మార్పులు సంభవించినా, ఒకటి మాత్రం నిశ్చలంగా ఉంది, శాశ్వతంగా ఉంది. అది ఈ శరీరం పుట్టక ముందు ఉంది, తల్లి గర్భంలో ప్రవేశించి దేహానికి చైతన్యాన్ని ఇచ్చింది. పెరుగుతున్నది శరీరమే కానీ, ఆ శక్తి కాదు. ముడతలు శరీరానికే పడతాయి, ముసలితనం శరీరానికే వస్తుంది కానీ ఆ పదార్ధానికి రాదు. ఆనందమైనా, విచారమైనా ఆ తత్వానికి తేడా ఉండదు. అది ఎప్పుడు ఉంటుంది. సుఖదుఖాఃలతో దానికి సంబంధం లేదు. అది ఆత్మ. ఆత్మయే నిజం. ఆత్మను తెలుసుకోవడమే సత్యం. ఆత్మను తెలుసుకోవడం అంటే నిన్ను నువ్వు తెలుసుకోవడం. కేవలం పుస్తకంలో చదవడం కాదు, అనుభూతి చెందడం ముఖ్యం.

ఈ సృష్టిలో పరమాత్మ ఒక్కడే సత్యం. ఈ లోకాన్ని మనం అనుభూతి చెందుతున్నాం కానీ ఈ లోకం శాశ్వతం కాదు. నిత్యం మార్పులకు గురవుతుంది. ఒకనాడు ప్రళయం వచ్చి, సమస్త లోకాలు గాఢాంధకారంలోకి వెళ్ళిపోతాయి. రాజులు, రాజ్యాలు, ప్రభుత్వాలు, ప్రజలు, ప్రకృతి, సమస్త లయమవుతాయి. అయినా అప్పుడు కూడా పరమాత్మ నిలిచి ఉంటాడు. మన చుట్టూ ఉన్న బంధువులు, మిత్రులు అందరూ ఏదో ఒక రోజు మరణిస్తారు. మరణం తప్పదు. కానీ ఎందరు మరణించినా, ఎప్పటికి నిలిచి ఉండే తత్వం భగవంతుడు. భగవంతుడే సత్యం. ఆ మాటకు అర్దం ఇప్పుడు కనిపిస్తున్నవన్నీ అసత్యం అని కాదు. మనమున్న స్థితిలో ఇవన్నీ సత్యాలే. కానీ మనకున్న అజ్ఞానమనే చీకటి తొలగి, సత్యం గోచరించిన రోజు, ఈ లోకమంతా ఒక నాటకంలా అనిపిస్తుంది. మనం ఆ నాటకాన్ని చూస్తున్న ఒక ప్రేక్షకుడిగా మిగిలిపోతాం. నాటకం ముగియగానే మనం వచ్చిన ప్రదేశానికి తిరిగి వెళ్ళిపోతాం. అంతవరకు మనకు కనిపిస్తున్నవి సత్యాలే. కానీ ఇవన్నీ చిన్నపాటి సత్యాలు, తాత్కాలిక సత్యాలు. శాశ్వతమైన సత్యం భగవంతుడు. ఆ శాశ్వతమైన, నిత్యమైన సత్యాన్ని తెలుసుకోవడం ధర్మం.

To be continued...........

No comments:

Post a Comment