Friday 25 April 2014

హిందూ ధర్మం - 52 (సత్యం)

సత్యాన్ని పాటించమన్నారని ఎప్పుడూ నేను నిజాలే మాట్లాడుతాను అంటూ అందరితో గొడవలు పెట్టుకోమని, శతృత్వం పెంచుకోమని చెప్పలేదు. రాముడి గురించి వర్ణిస్తూ 'సత్యాయ మితబాషిణాం' అంటారు వాల్మీకి మహర్షి. రాముడు సత్యవంతుడు, మాటమార్చనివాడు, అలా అని ఎక్కువగా మాట్లాడడు. ఆలోచించి మాట్లాడుతాడు, తక్కువగా మాట్లాడుతాడు, కానీ మాట్లాడితే మాత్రం అన్ని నిజాలే మాట్లాడుతాడు. రాముడు అరణ్యవాసంలో తన గురించి చెప్పుకున్నా, సీతమ్మ చెప్పినా ఎక్కడ కైక కారణంగా తాము అడవుల పాలయ్యామని, ఈ కష్టాలన్నిటికి కైకేయి కారణమని, ఆమె మీద చెడుగా చెప్పలేదు. నేను నా తండ్రి దశరధ మహారాజు ఆజ్ఞ ప్రకారం వనవాసానికి వచ్చానని మాత్రమే చెప్పుకున్నాడు. అట్లా అని నిజాలు దాచి పెట్టమని చెప్పడం ఉద్ద్యేశం కాదు.

కఠినమైన నిజాలను ప్రతి సందర్భంలో పలుకవలసిన అవసరంలేదు. సమయం కానీ సమయంలో చెప్పిన నిజం ఒక్కోసారి హానీ చేయవచ్చు. అందువలన కొన్ని సార్లు మౌనం వహించాలి. కానీ మనం మౌనంగా ఉండడం వలన వేరొకరికి అన్యాయం జరగకూడదు. మాట విషయంలో బుద్ధి ఉపయోగించాలి. 'సత్యాయ మితబాషిణాం' తక్కువగా మాట్లాడినా, నిజాలే మాట్లాడాలి. అదే వివేకవంతుని లక్షణం.

మామూలు జీవితానికి వస్తే, చాలామంది ఇతరులతో చాలా విషయాలు పంచుకుంటారు. అవి కష్టసుఖాలే కావచ్చు, లేకమరే ఇతర విషయమైనా కావచ్చు. కొందరి గురించి తప్పుగా మాట్లాడవచ్చు, విమర్శించవచ్చు. అవన్నీ అవతలవారికి చెప్పడం అనవసరం. నిజాలే మాట్లాడమన్నారు కదా, అందుకని వీళ్ళు మనతో మంచుకున్న విషయాలన్నీ వతలవారి ముందు చెప్పేయాలని అనుకోకండి. విమర్శలు, ఇతరుల గురించి చెప్పుకునే మాటలు మొదలైనవి అవివేకంతో మాట్లాడుకునేవి. వాటికి జీవితంలో ప్రాధాన్యం ఇవ్వడం దండగ. అసలు వాటిని గుర్తుంచుకోవడమే వృధా. అటువంటి విషయాలను విడిచిపెట్టాలి తప్ప, సత్యాన్ని పాటిస్తున్నామన్న పేరుతో అందరితో పంచుకుని, శతృవులను పెంచుకోమని ధర్మం చెప్పలేదు. ఒకరి విషయాలను మనం తెలుసుకోవడం అనవసరం, ఒకవేళ పంచుకున్నా, అక్కడికి వదిలేయడమే మంచిది. ఒకరి రహస్యాలను బయటపెట్టడం కూడా దోషమేనని గుర్తుపెట్టుకోండి.

To be continued...........

No comments:

Post a Comment