Monday, 26 January 2015

హిందూ ధర్మం - 134 (వైదిక సంస్కృతి - మహాభారతం)

ద్వాపరయుగాంతం వరకు ప్రపంచమంతా సనాతనధర్మమే వర్ధిల్లింది. వేదప్రచారం నిత్యం జరిగింది. ఎక్కడ చూసిన వేదం గురించి చర్చలే, ప్రజలు కూడా వేదంలో ఉన్న విజ్ఞానం గురించే కాలక్షేపం చేసేవారు. అందరూ రోజు రెండుపుటలా నిత్యాగ్నిహోత్రం చేసేవారు. వైదికసంస్కృతి 3 పూవులు, 6 కాయలుగా వర్ధిల్లింది. కానీ విధినిర్ణయాన్ని ఎవరు తప్పించలేరు. ఇంతలోనే మహాభారత యుద్ధం మొదలైంది. సరిగ్గా ఇప్పటికి (2015 జనవరికి) 5152 సంవత్సరాల క్రితం ఉత్తరభారతదేశంలో కురుక్షేత్రంలో మహాభారత యుద్ధం ప్రారంభమైంది. కాలగతిలో కొన్నేళ్ళు అభివృద్ధి చెందితే, మరికొన్నేళ్ళు కష్టాలు పడవలసి వస్తుంది. జీవుల కర్మను అనుసరించి, వారి జన్మకు అనుగుణమైన పరిస్థితులు ఏర్పడవలసి వస్తుంది.

ప్రపంచమంతా వ్యాపించిన సనాతన ధర్మానికి మహాభారత యుద్ధంతో కష్టాలు మొదలయ్యాయి. మహాభారతం కావ్యం కాదు, పురాణం కాదు, మహాభారతం ఇతిహాసం. ఇతిహాసం అంటే ఇలాగే జరిగిందని అర్దం. మహాభారతం విశేషాలను సంస్కృతంలో వ్యాసమహర్షి చెప్పగా, గణపతి రచించాడు. మహాభారత యుద్ధం క్రీ.పూ. 3139 లో జరిగింది. యుద్ధం గెలిచాకా, పాండవులు హస్తినాపురాన్ని (నేటి ఢిల్లీ) రాజధానిగా చేసుకుని 36 ఏళ్ళ 8 నెలలు పాలించారు. క్రీ.పూ. 3102 ఫిబ్రవరి 17,18 నాటికి ద్వాపరయుగం అంతమై కలియుగం మొదలైంది. వీటిని జ్యోతిష్య శాస్త్రమూ, ప్రపంచ ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త ఆర్యభట్ట, అతన ఆర్యభట్టీయం అనే గ్రంధంలో పొందుపరిచారు.

ఏదో పుస్తకంలో ఉన్నది మెము ఎట్లా అంగీకరించాలి అనవచ్చు. దానికి తగిన శాసనాలు ఉన్నాయి, అవే సంవత్సరాలని చెప్పటానికి అన్నిటికంటే ముఖ్యమైన ఖగోళ, అంతరిక్షానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. వ్యాసమహర్షి ప్రజ్ఞ గురించి వర్ణించటం అసాధ్యం. కాలక్రమంలో పుస్తకాలు చినిగిపోతాయి, శాసనాలు కొంత రూపు పోవచ్చు, లేకపోతే విజ్ఞానశాస్త్ర గ్రంధాలు చౌర్యానికి గురై ప్రజలకు అందుబాటులో లేకుండా పోవచ్చు. కానీ ఈ జగత్తులు ఎవరు మార్చలేనిది, ఎప్పటికి సాక్ష్యంగా నిలిచేవి అంతరిక్షంలో గ్రహాల కదలికలు, గ్రహస్థితులు (planetary positions). గ్రహాల మధ్య దూరం, కోణము, ఆ సమయంలో వాటి స్థానం, ఇవన్నీ తరుచుగా ఏర్పడే అంశాలు కాదు. కొన్ని కోట్ల సంవత్సరాలకు మాత్రమే ఒకసారి ఏర్పడే ఈ ఖగోళ శాస్త్ర అద్భుతాలను వ్యాసమహర్షి గుర్తించి, సేకరించి, మహాభారతంలో పొందుపరిచారు, అనగా record చేశారు.. ఈ ఖగోళ అంశాలను ఈ రోజు ఆధునిక సాఫ్ట్‌వేర్ల ద్వారా astronomical dating ద్వారా పరీశీలించినప్పుడు పైన చెప్పుకున్న సంవత్సరాలే వస్తున్నాయి. వాటికి శాసనమైన ఆధారలు ఎన్ని ఉన్నాయో, ఖగోళ, జ్యోతిష్యశాస్త్ర ఆధారాలు అన్నే ఉన్నాయి. Astronomical dating అంటే ఇప్పుడున్న గ్రహస్థితుల నుంచి వెనక్కు లెక్కించుకుంటూ వెళ్ళడం.

To be continued ........................

Sunday, 25 January 2015

రథసప్తమి - విశేషాలు

ఓం ఆదిత్యాయ నమః
మాఘశుద్ధ సప్తమి- రథసప్తమి

ప్రత్యక్ష భగవానుడైన శ్రీ సూర్యనారయణ స్వామిని విశేషంగా ఆరాధించే పర్వదినం. ఈ రోజు చేసే మాఘస్నానానికి చాలా విశేషత ఉంది. రథసప్తమి నాటి ఉదయం సూర్యోదయానికి ముందే 7 తెల్లజిల్లేడు ఆకులను, రేగు ఆకులను తలపై ఉంచుకుని స్నానం చేయడం ఆరోగ్యకరం.

ఈ స్నానం చేసే సమయంలో ఈ క్రింది శ్లోకాన్ని చెప్పుకోవాలి

యద్యజ్జన్మకృతం పాపం మయాసప్తమ జన్నసు
త న్మే రోగం చ శోకం చ మాకరీ హంతు సప్తమీ
ఏ తజ్జన్మ కృతం పాపం యచ్చ జనాంతరార్జితం
మనోవాక్కాయజం యచ్చ జ్ఞాతాజ్ఞాతే చ యే పునః
ఇతి సప్తవిధం పాపం స్నానాన్మే సప్త సప్తికే
సప్తవ్యాధి సమాయుక్తం హర సప్తమి మే హరః ||
ఏతన్మంత్రమయం జప్త్వా స్నాత్వా పాదోదకే నరః
కేశవాదిత్య మాలోక్య క్షణా న్నిష్కల్మషో భవేత్ ||

అంటే జన్మ మొదటి నుండి చేసిన పాపం, జన్మాంతరాలలో చేసిన పాపం, రోగ రూపంలో, శోక రూపంలో వేదించే పాపమంతా మకరంలో ఉండే సప్తమి హరింపజేయాలనీ, సూర్య ప్రియమైన ఈ మకరసప్తమి ఈ జన్మలోనూ, జన్మాంతరాలలోనూ మనసుచేత, వాక్(మాట) చేత, ఇంద్రియాల చేత తెలిసీ తెలియక చేసిన పాపమంతా ఈ స్నానంతో నశించాలనేది అర్ధం.

ఈ రోజు స్నానం చేసే ముందు ఆకులను దొన్నెలుగా చేసి అందులో దీపాలను వెలిగించి, సూర్యున్ని ధ్యానిస్తూ ఆ దీపాన్ని నీటిలో వదలాలి.

సాధారణంగా పుణ్యస్నానం సూర్యోదయానికి గంటన్నర ముందు చేస్తాం. కాని మాఘస్నానం ప్రత్యేకత ఏమిటంటే సూర్యోదయానికి కొద్ది సమయం ముందు స్నానం చేయాలి. ఆరోగ్యం సహకరించని వారు వేడి నీటి స్నానం చేయచ్చు. స్నానం చేయగానే సూర్యునికి అర్ఘ్యం ఇవ్వాలి.

రాగి చెంబులో నీరు తీసుకుని అందులో ఎర్రని పూలు, ఎర్ర గంధం, ఎర్రని అక్షతలు, లేత జిల్లేదు ఆకులు, గరిక ఇవన్నీ కొద్దిగా ఆ నీటిలో వేసి సూర్య భగవానుడికి చూపించి వదలాలి. దీనిని అర్ఘ్యం అంటారు. నీరు వదులుతూ ఈ శ్లోకం చెప్పుకోవాలి.

సప్తసప్తివహ ప్రీత సప్తలోక ప్రదీపన
సప్తమీ సహితో దేవ గృహాణార్ఘ్యం దివాకర

ఈ విధంగా చేయడం వలన ఆరోగ్యం చేకూరుతుంది.  తర్వాత సూర్యభగవానుడికి నమస్కరించాలి. మాఘస్నానానికి కార్తీక స్నానానికి ఉన్నంత విశేషం ఉంది. ఈ స్నానం ఆచరించడం ఎంతో పుణ్యం, పదిమంది ఈ మాఘస్నానం గురించి చెప్పడం వలన కూడా పుణ్యం లభిస్తుందని శాస్త్రం చెప్తోంది. ఈ మాఘస్నానం ఈ మాఘమాసమంతా చేయాలి.

రధసప్తమి రోజు శ్రీ సూర్యనారాయణ మూర్తికి దేశీ ఆవుపాలతో చేసిన పరమాన్నం నివేదన చేస్తారు. ధనుర్మాసంలో ప్రతి రోజు ఇంటిముందు పెట్టిన గోబ్బెమ్మలను పిడకలుగా చేసి, ఆ పిడకలను ఉపయోగించి పరమాన్నం చేయాలి. ఇంటిలో చిక్కుడుచెట్టు ఉంటే దాని దగ్గర సూర్యబింబానికి ఎదురుగా కూర్చుని పరమాన్నం వండాలి. అన్నిటికంటే ముఖ్యమైన విషయం మొదట పాలు పొంగించాలి. పాలు పొంగు వచ్చిన తరువాతే పరమాన్నం వండాలి.

ఈ రోజు ఇంటి ముందు రథం ముగ్గు వేస్తారు. చిక్కుడుపందిరి క్రింద చిక్కుడుకాయలతో రథం చేసి, సూర్యభగవానుడిని పూజించి, సూర్యకిరణాల ప్రసరిస్తూ ఉండగా, ఆ చిక్కుడు పందిరిలో పాలు పొంగించి పరమాన్నం వండి, నివేదన చేయాలి.

Saturday, 24 January 2015

భారత్ ప్రయోజనాలు తాకట్టు పెడుతున్నారు

ఏదో అద్భుతం జరగబోతున్నట్టు మీడియా తెగ హల్‌చల్ చేస్తోంది. ఒబామ కారు ఎలా ఉంటుంది, ఆయన భార్య ఎలాంటి దుస్తులు ధరిస్తుంది, భధ్రతకు ఎంత ఖర్చవుతుందంటూ ప్రోగ్రాంలు వేస్తోంది తప్పించి, ఆ పర్యటన భారత్‌కు లాభమా? నష్టమా? అని చెప్పడంలేదు. నిజానికి ఒబామా పర్యటన వలన లాభం చేకూరేది అమెరికాకి మాత్రమే. నష్టపోయేది మాత్రం భారతే. అసలు అమెరికా ఏదైనా దేశంతో ఒప్పందం చేసుకుందంటే, అక్కడ అమెరికాకు ఏదో ప్రయోజనం ఉంటుంది. అవతలిదేశాలను బలహీనపరిచి, బ్రతికే అమెరికా భారత్ అభివృద్ధికి దోహదపడుతుందనుకోవడం కల్ల. ఒకప్పుడు ఆయుధతయారీ రంగంలో ఉండే కంపెనీలు తర్వాత వ్యవసాయరంగంలోకి ప్రవేశించాయి. బీటీ విత్తనాలు, పేటెంటులు, రసాయన ఎరువులంటూ అంటూ ఆహారభధ్రతను కాలరాస్తూ, విత్తనాలపై గుత్తాధిపత్యం సంపాదించి ఆహారాన్ని, తద్వారా ప్రపంచాన్ని అదుపు చేయాలని పన్నాగం పన్నాయి అమెరికా ప్రభుత్వం, అక్కడి బహుళజాతి సంస్థలు. దానిలో భాగంగా ఇంతకముందు భారత ప్రభుత్వంతో కొన్ని ఒప్పందాలు చేసుకున్నా, అవి పూర్తిగా అమెరికాకు లాభం చేకూర్చేలా లేవు. కనుక ఇప్పుడు ఆ విత్తనాల విషయంలో ఉన్న మిగిలిన అడ్డంకులు/ఆంక్షలు కూడా పూర్తిగా తొలగించుకోవాలని అమెరికా యత్నిస్తోంది. ఈ విషయంలో భారతప్రభుత్వంపై తీవ్రమైన ఒత్తిడి తీసుకువస్తోంది. ఒకవేళ అటువంటి ఒప్పందాలను మీద భారతప్రభుత్వం సంతకం చేస్తే, అది ప్రజల హక్కులను కాలరాసినట్లే అవుతుంది. చిన్న రైతులకు తీరని నష్టం చేస్తుంది, పర్యావరణానికి, జీవవవిధ్యానికి పెను ప్రమాదంగా మారుతుంది. ఈ విత్తనల మీద జరిగే ఒప్పందాల గురించి ఒక్క మాటలో చెప్పాలంటే 'మనం ఏం తినాలో కూడా ఆ కంపెని వాడే నిర్ణయిస్తాడు'. ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకునే మనం, ఏం తింటున్నేమో కూడా తెలుసుకునే హక్కును కోల్పోతాం, ఇప్పుడు అమెరికాలో జరుగుతున్నది కూడా అదే.

మన దేశంలో ప్రభుత్వాలు మారతాయేమో కానీ విధానాలు మాత్రం మారవు. ఒకప్పుడు ప్రతిపక్షంలో ఉండగా, ఏ విధానాలను పార్టీలు వ్యతిరేకిస్తాయో, అధికారంలోకి రాగానే అవన్నీ మర్చిపోతాయి. అణుఒప్పందం కూడా అలాంటిదే. 2008 లో బీజేపీ అణుఒప్పందం బిల్లును వ్యతిరేకించిన విషయం అందరికీ తెలుసు, కానీ ఇప్పుడే అదే బిజేపీ, అణుఒప్పందం కోసం అమెరికాకి ఎర్ర తీవాచీ పరుస్తోంది. అమెరికాకి ఒక రోగం ఉంది. వాళ్ళ దేశంలో చెడిపోయిన, మూతబడిన యంత్రాలను ఇతర దేశాల్లో ఎఫ్.డి.ఐ.ల పేరున అమ్మేసి డబ్బు చేసుకుంటుంది. ఇతర దేశాలను చెత్తకుప్పలుగా భావిస్తుంది. వాడేదో మనకు గొప్ప సహాయం చేస్తున్నట్టు మీడీయా చూపిస్తుంది. అదే తరహాలో మన దేశంలో అమెరికా అణురంగంలో పెట్టుబడులను పెట్టాలని నిర్ణయించుకుంది. లాభాలు మాత్రం వారు తీసుకోవడానికి ఎగబడతారు కానీ ఒకవేళ ఆ అణురియాక్టర్‌లో ఏదైనా ప్రమాదం సంభవిస్తే, దానికి నష్టపరిహారం మాత్రం చెల్లించరట, వారిని కోర్టులో బాధ్యులను చేయకూడదట. ఇది వాళ్ళ ఆర్ధిక విధానాలకు నష్టం కలిగిస్తుందట. అందుకని అణురంగంలో రెండు దేశాలు మరింత ముందుకు వెళ్ళాలంటే, ఈ రెండు విషయాల్లోనూ మనం వారు చెప్పిన మాట వినాలని అమెరికా అంటున్నది. దానికి ప్రభుత్వం కూడా అంగీకరించడానికి సిద్ధంగా ఉంది, అందుకే ఇప్పుడు ఒబామా భారత్‌కు వస్తున్నారు. అంటే వారు మన దేశంలో వ్యాపారం చేసుకుని లాభాలు గడించవచ్చు, కానీ వాళ్ళ వల్ల జరిగిన ప్రమాదాలకు మాత్రం వాళ్ళు బాధ్యులు కాదట.

అనేక రంగాల్లో ఎఫ్.డీ.ఐ.ల పేరున అమెరికా భారత్ యొక్క ఆర్ధిక వ్యవస్థను నాశనం చేయాలని కంకణం కట్టుకుందని తెలిసీ మన ప్రభుత్వాలు అభివృద్ధి అనే మాయమాట చెప్పి అమెరికాను వెనకేసుకొస్తున్నాయి. పార్టీలు మారినా, విధానాలు మారవని నిరూపిస్తున్నాయి. మొత్తంగా చెప్పాలంటే ఒబామ పర్యటన వలన భారత్‌కు లాభం కలుగుతుందని చెప్పలేం కానీ నష్టం మాత్రం తప్పక కలుగుతుంది. దాన్ని ప్రభుత్వాలు మాయమాటలు చెప్పి కప్పిపుచ్చుతున్నా, మీడియా ఇంకా అమెరికాను పొగడడం ఎంతో వింతగా ఉంది. దేశభక్తి గురించి, స్వదేశీ ఆర్ధికవిధానల గురించి తరచుగా మాట్లాడే పార్టీ కూడా అమెరికాతో ఒప్పందాలు చేసుకోవడం ఏమిటో?   

Friday, 23 January 2015

సుభాష్‌చంద్ర్‌బోస్ గురించి ముఖ్యమైన విషయాలు

ఈ రోజు సుభాష్‌చంద్ర్‌బోస్ జయంతి సందర్భంగా వారి గురించి ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం.

సుభాష్‌చంద్ర్‌బోస్, భారతమాత దాస్య శృంఖలాలను తెంచిన యోధుడు. 23 జనవరి 1897 లో ప్రభావతి దేవి, జానకి నాద్ బోస్ దంపతులకు కటక్ లో జన్మించారు సుభాష్ చంద్ర బోస్. వారు కారణజన్ములు, సిద్ధుల సంకల్పంతో జన్మించిన మహాపురుషులు. స్వాతంత్ర్య సమవీరులలో అగ్రగణ్యుడు. అలుపెరుగని పోరాటంతో ఓటమి ఎరుగని వ్యక్తిత్వంతో మాతృభూమి సేవలో గడిపిన మహానుభావులు. నిజం మాట్లాడితే సుభాష్‌చంద్ర బోస్ గాంధీజీ కంటే గొప్పవారు. దానికి సంబంధించిన చిన్న సంఘటన చెప్తాను.

స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక స్వాతంత్రదినోత్సవ వేడుకలలో జెండావందన కార్యక్రమానికి బ్రిటిష్ ఇండియా వైశ్రాయి మౌంట్‌బెట్టెన్ హాజరయ్యాడు. అప్పుడు అతన్ని ఒకరు 'ఏవండి! మేము 1945 కి ముందు వరకు చాలా తీవ్రమైన పోరాటాలు చేశాము, ఎన్నో ఉద్యమాలు నడిపాము, అయినా అప్పుడు మీరు మా దేశాన్ని విడిచిపోలేదు. కానీ ఏ ఉద్యమం లేకపోయిన 1947 లో హఠాత్తుగా భారతదేశానికి ఎందుకు స్వాతంత్ర్యం ప్రకటించారు' అని అడిగారు. దానికి ఆయన సమాధానంగా మీరు అహింస పేరుతో కడుపులు మాడ్చుకుని పోరాటం చేయడం వలన మేము భారత్‌ను విడిచిపోలేదు. సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆజాద్ హింద్ ఫౌజ్ ఉధృతికి భయపడి మాత్రమే మేము మీ దేశం విడిచి పారిపోయామని సమాధానం చెప్తారు. మరి మీ మీద మా అహింసాపోరాటం ప్రభావం చూపలేదా అంటే, మా మీద మీ అహింసాపోరాటం చూపిన ప్రభావం అత్యల్పం. బోస్ ప్రభావమే అధికం అన్నారు. అది ఆయన గొప్పతనం, వారు లేకపోతే మనకు స్వరాజ్యం వచ్చేది కాదు.

కానీ అప్పట్లో కూడా రాజకీయాలు నడిచాయి. గాంధీ సిద్ధంతాలకు అడ్డువస్తున్నాడని, గొప్ప ప్రభావం చూపిస్తున్నాడని, అది నచ్చక, బోస్‌ను అర్చాకవాది, అతివాది, హింసావాది అని ముద్రవేసి కాంగ్రెస్ నుంచి వెలివేశారు. అయితే చాలా మంది బోస్ మరణించారని చెప్తారు కానీ అందులో నిజం లేదు. నేతాజీ ఇప్పటికి బ్రతికే ఉన్నారు. హిమాలయాల్లో యోగసాధన చేస్తున్నారు. గత కొనేళ్ళ నుంచి 3 వేర్వేరు శరీరాలతో భారతదేశమంతటా పర్యటిస్తున్నారు. మహాదేవుడైన సదాశివుని ఆశీర్వాదం, సిద్ధపురుషుల ఆశీర్వద ఫలంగా బోస్ ఇప్పటికి సజీవంగా ఉన్నారు. త్వరలో ప్రజల ముందు వచ్చి, దేశాన్ని నడిపించనున్నారని 200 ఏళ్ళకు పై వయసు కలిగి ఇప్పటికి జీవిస్తున్న శ్రీ బర్ఫాని బాబావారు సందేశమిచ్చారు.

హరహర మహాదేవ
జోహార్ జోహార్ సుభాష్ చంద్ర బోస్
జై హింద్

మాఘ శుక్ల పంచమి - వసంత పంచమి, శ్రీ పంచమి

మాఘ శుక్ల పంచమి. దీనికే వసంత పంచమి, శ్రీ పంచమి అని పేర్లు.

అజ్ఞానము మానవుని దానవునిగా రూపొందిస్తుంది. జ్ఞానమును ప్రసాదించి మనిషిని మనీషిగా తీర్చిదిద్దుతుంది. జ్ఞానము, విద్య, చదువు పర్యాయపదాలు. విద్యకు అధిదేవత జ్ఞానప్రదాయిని అయిన శ్రీ సరస్వతీదేవిని స్మరించి, పూజించే రోజే శ్రీపంచమి. మాఘశుద్ధ పంచమి శ్రీ సరస్వతి జన్మదినంగా భావిస్తారు. యావద్భారతావనిలో ప్రజలంతా, ఆ తల్లి కటాక్షం కోసం పూజలు జరిపే పర్వదినమే వసంతపంచమి.

సకల విద్యాస్వరూపిణి పరాశక్తి సరస్వతిగా ఆవిర్భవించిన తిథి. ‘యాదేవీ సర్వభూతేషు విద్యారూపేణ సంస్థితా’’ అంటూ దేవీ భాగవతం ప్రస్తుతించింది. బ్రహ్మవైవర్త పురాణం ఆదిగా ఎన్నో పురాణాలు సరస్వతీదేవిని అర్చించాలని శాసిస్తున్నాయి.

మాఘ శుక్ల పంచమ్యాం విద్యారంభే దినేపి చ
పూర్వేహ్ని సమయం కృత్యా తత్రాహ్న సంయుతః రుచిః॥

మాఘ శుద్ధ పంచమినాడు ప్రాతఃకాలంలో సరస్వతీదేవిని అర్చించి విద్యారంభం చేయాలని శాస్త్ర వచనం. ఈరోజునే క్షీరసాగర మథన సందర్భంగా మహాలక్ష్మి ఆవిర్భవించిన కారణంగా శ్రీపంచమిగా పేర్కొనడంతో, ఈరోజు మహాగణపతిని, శ్రీలక్ష్మిని, శ్రీ సరస్వతిని షోడశోపచారాలతో పూజించాలనీ, శ్రీ సరస్వతిదేవి ప్రతిమతోపాటు, జ్ఞానానికి ప్రతీకలైన పుస్తకాలను, లేఖినులను పూజాపీఠంపై ఉంచి అర్చించాలి. శ్రీ సరస్వతీదేవిని తెల్లని కుసుమాలతో, సుగంధ ద్రవ్యాలతో, చందనంతో, అర్చించి శుక్లవస్త్రాన్ని సమర్పించాలి. అనంతరం పిల్లలకు అక్షరాభ్యాసం జరిపిస్తే, ఆ తల్లి కరుణాకటాక్షాలవల్ల అపారమైన జ్ఞానం లభించి, నిరాటంకంగా విద్యాభివృద్ధి జరుగుతుందని ప్రజలందరి విశ్వాసం. పూర్వం రాజాస్థానాలలో ఈరోజు దర్బారులు నిర్వహించి, కవితా ఘోష్టులు జరిపి కవులను, పండితులను, కళాకారులను సత్కరించడం ఆనవాయితీగా ఉండేది.

బ్రహ్మదేవుడంతటి వాడే పరాశక్తిని శారదామాత రూపంలో దర్శించి, ఆరాధించి ఆమె కృపవల్ల సృష్టి రచనను సృజనాత్మకంగా ఆరంభించాడంటారు. గాయత్రీదేవికి గల ఐదు రూపాలలో సరస్వతీదేవి దొకటి. యాజ్ఞవల్క్యుడు గురుశాపం వలన విద్యలను కోల్పోవడంతో, సూర్యుని ఆరాధించగా, ఆతడు యాజ్ఞవల్క్యునికి సరస్వతీ ఉపాసనను ఉపదేశించాడు. సరస్వతీదేవి కృపవలన స్మృతి శక్తిని తిరిగి సంపాదించుకుని మహావిద్వాంసుడయ్యాడు.

వాల్మీకి సరస్వతీదేవిని ఉపాసించి శ్రీమద్రామాయణ రచనను చేసేడని పురాణాలు చెబుతున్నాయి. అలాగే వ్యాసమునీంద్రుడు కూడా సరస్వతీదేవి అనుగ్రహంవల్లనే వేద విభజన గావించి, పురాణాలను ఆవిష్కరించాడని, మహాభారత, భాగవత, బ్రహ్మసూత్రాది రచనలు చేసి భారతీయ సనాతన ధర్మవ్యవస్థకు మూలపురుషుడుగా నిలిచాడనీ ప్రతీతి. తెలుగులో భాగవతాన్ని రచించిన పోతన మహాశయుడు సరస్వతీదేవి అనుగ్రహం పొందడమేకాక, ఆ గ్రంథాన్ని పొట్టకూటికోసం నరులెవ్వరికి అంకితమివ్వనని వాగ్దానం చేసినట్లు చెప్పుకున్నాడు.

పరాపర విద్యలకు అధిష్ఠాత్రి సరస్వతి. ఆమె అనుగ్రహంవలన ఉలుకూ, పలుకూ, బుద్ధి, శక్తి లభిస్తాయి. మతిమరుపు, మాంద్యం తొలగుతాయి. మేథాశక్తి పెంపొంది, సరియైన జ్ఞానం కలిగి ఇహమూ, పరమూ, మోక్షమూ లభిస్తాయి. జ్ఞాన లబ్ధికి ఆటంకాలైన సకల అవరోధాలను తొలగించే తల్లి సరస్వతి. అందుకే ‘‘నిశే్శష జాడ్జాపహా’’ అన్నారు. శృతులలో సరస్వతీదేవిని ప్రాణశక్తిగా, జ్ఞానశక్తిగా కీర్తించడం జరిగింది. ‘అమ్మలగన్నయమ్మ’ ఆమె. నదులలో గొప్పది. దేవతలలో శ్రేష్టురాలు. అందుచేతనే ‘‘యాబ్రహ్మాచ్యుత శంకరః ప్రభృతిః దైవైః’’ సదా పూజలనందుకుంటున్నది. శ్రీ శంకర భగవత్పాదులు శారదాదేవి కృపచేతనే అపారమైన వేద వేద వాఙ్మయాన్ని పొంది, భారతీయ సనాతన ధర్మ వ్యవస్థను పునఃప్రతిష్ఠించినట్లు విజ్ఞులు చెబుతారు. శారదామాత పట్ల తన శరణాగతికి ప్రతీకగా శృంగేరీ క్షేత్రంలో ఆ తల్లిని ప్రతిష్ఠించారు. మనందరికీ మార్గనిర్దేశం చేసేరు.

- ఏ.సీతారామారావు
(Source: http://www.andhrabhoomi.net/node/202508)

ఈ రోజు సరస్వతీదేవిని తెల్లనిపూలతో పూజించాలి. పాలతో చేసిన క్షీరాన్నం నివేదన చేయాలి. ఓం సరస్వత్యై నమః అనే మంత్రాన్ని జపించాలి. పుస్తకాలు, కలముల(పెన్నులు) యందు సరస్వతీ దేవిని ఆవాహన చేసి పూజించాలి.మాటను అదుపులో పెట్టుకోవాలి. ఎవరిని దూషించరాదు, ఇతరుల గురించి చెడుగా మట్లాడరాదు. ఎందుకంటే వాక్కు కూడా సరస్వతీ కటాక్షమే. పిల్లలు, పెద్దలు అన్న తేడా లేకుండా అందరూ సరస్వతీమాతను పూజించాలి.

Thursday, 22 January 2015

హిందూ ధర్మం - 133 (4 వేదాలు )

వేదాలు నాలుగు. అవి ఋగ్ వేదం, యజుర్ వేదం, సామ వేదం అధర్వణ వేదం. తొలుతుగా భగవంతుడు ఋగ్, యజుర్, సామ, అధర్వణ వేదాలను అగ్ని, వాయు, ఆదిత్యుడు, ఆంగీరసుడు అనే నలుగురు ఋషులకు ప్రకాశ పరిచినట్లు శతపధబ్రాహ్మణం 11:4, 2.3 చెప్తోంది. మనుస్మృతి కూడా ఇదే విషయాన్ని చెప్తూ, ఈ నలుగురు ఋషులే బ్రహ్మదేవుడికి నాలుగు వేదాలను బోధించారని, అలా నాలుగు వేదాలను ఒకేసారి నేర్చుకున్న మొదటివారు బ్రహ్మదేవుడని చెప్తోంది. (అయితే ఇక్కడ రెండు వాదాలు ఉన్నాయి. మొదటివాదం పైన చెప్పుకోగా, రెండవది ఇలా ఉంది. తొలుత వేదం నాలుగు భాగాలుగా కాక, ఒకట్టిగానే ఇవ్వబడిందని, ద్వాపారయుగాంతంలో వ్యాసమహర్షి దాన్ని నాలుగు వేదాలుగా విభాగం చేశారని చెప్తారు.) భగవంతుని ద్వారా ప్రకాశపరచబడిన వేదాలను ఈ ఋషులే మిగితా ఋషులందరికి చెప్పారు. ఇప్పుడు నడుస్తున్న ఈ జీవ చక్రంలో, ఇప్పటికి సుమారు 197.5 కోట్ల సంవత్సరాల క్రితం వేదాన్ని స్వరయుక్తంగా ఋషులు దర్శించారు. వాటిని ధారణలో నిలుపుకున్నారు. ఎక్కడ గ్రందస్థం చేయలేదు, అనగా పుస్తకంలో రాయలేదు. గురువు నుంచి విని నేర్చుకోవడం తప్ప వేరొక మార్గం లేదు. దానికి ఎంత జ్ఞాపకశక్తి ఉండాలి! ఇన్ని కోట్ల సంవత్సరాలలో ఒక్క అక్షరం మార్చబడలేదు. ఎలా అందుకున్నారో, అచ్చం అలానే వేదాన్ని తరతరాలుగా వల్లెవేస్తూ వచ్చారు.

ఎవరైనా కొత్త కాపురం మొదలుపెడుతుంటే, కొత్త ఇంట్లోకి వెళ్తూ, కొన్ని సామాన్లు, అవి కూడా అతి ముఖ్యమైనవి, ఏవి అత్యవసరమో అవి మాత్రమే తీసుకుని వెళతారు. తర్వాత మెల్లిగా కొత్త కొత్త వస్తువులు కొనుక్కుంటారు. ఇల్లు నిండిపోయి, తిరగడానికి చాలా  ఇరుకుగా అయిపోయేవరకు. అట్లానే భగవంతుడు కూడా సృష్ట్యాదిలో వేదాన్ని ఇచ్చినప్పుడు, అప్పుడు వారికి కావల్సిన జ్ఞానాన్ని అందించాడు. కానీ తర్వాత వేల మంది మహర్షులు వచ్చారు. కొత్త కొత్త విషయాలు కనుగొన్నారు. వేదంలో మంత్రసంహితలో అన్నీ బీజ రూపంలో ఉన్నా, వాటిని అర్దం చేసుకుని, పరిశీలించి, పరిశోధించి, వేద విజ్ఞానాన్ని అనేకమంది మహర్షులు విస్తరించారు. శౌర శక్తితో నడిచే విమానాలు, వాయువు ఆధారంగా నడిచేవి, రాడార్లకు అందనంత గొప్ప పరిజ్ఞానం కలిగినవి, శబ్దవేగంతో పయనించే విమానాలు, యుద్ధ విమానాలు, అంతరిక్ష నౌకలు మొదలైన అనేక విమానాలు కనుగొన్నారు. స్థూలంగా వైమానిక శాస్త్రమే వచ్చింది. అట్లానే ఖగోళశాస్త్రం, రసాయన శాస్త్రం, వృక్ష, జంతు, జీవ, భౌతిక శాస్త్రాలు, విద్యుత్ శక్తికి సంబంధిచినవి, అణ్వస్త్రాలకు చెందిన విజ్ఞానశాస్త్రం మొదలైన రకరకాలశాస్త్రాలు వివిధ ఋషుల పరిశోధన ఫలితంగా లోకం చూసింది. చిన్న విత్తనం నుంచి మఱ్ఱి చెట్టు పుట్టి, పెద్దగా ఊడలతో, కొమ్మలు, రెమ్మలు, ఆకులతో విస్తరించినట్టు వేదవిజ్ఞానం మంత్రసంహితను, బ్రాహ్మణాలను ఆధారంగా చేసుకుని, ద్వాపరయుగం నాటికి శాఖోపశాఖలుగా విస్తరించింది.

To be continued ....................

Wednesday, 21 January 2015

హిందూ ధర్మం - 132 (కర్మకాండ, జ్ఞానకాండ)

వేదంలో చెప్పబడిన శాస్త్రవిహితకర్మలను నిష్కామంగా (ఎటువంటి కోరికలు లేకుండా, ప్రతిఫలం ఆశించకుండా, శ్రద్ధగా) ఆచరిస్తూ, ఉపనిషత్తులలో చెప్పబడిన విషయాలను ధారణలో ఉంచుకుని, సాధన చేస్తే, మనిషి సత్వరజస్తమో గుణాలకు అతీతంగా ఎదుగుతాడు.

ఏదైనా ఒక ఆహార పదార్ధం వండే ముందు పాత్రను శుభ్రం చేస్తారు. శుభ్రం చేసిన పాత్ర మాత్రమే వంటకు పనికి వస్తుంది. అంటే అప్పుడు మాత్రమే దానికి పాత్రత వస్తుంది. అలాగే ఆత్మజ్ఞానానికి కూడా. మాములువారికి వేదాంతం చెప్పగానే అర్దమయ్యే విషయం కాదు. అర్దమైనట్టుగా అనిపిస్తుందేమో కానీ, అనుభూతికి దోహదపడదు. అలా అర్దమవ్వాలంటే ధర్మాచరణ చాలా ముఖ్యం.

ఒక విత్తనాన్ని నాటే ముందు, అక్కడి భూమి పరిస్థితిని గమనిస్తారు. విత్తనం నాటిన తర్వాత, దానికి తగిన నీరు అందిస్తారు, పోషకాలు అందిస్తారు. అన్నీ సక్రమంగా బయట నుంచి అందినా, విత్తనంలో ఉన్న జీవం వీటిని గ్రహించినప్పుడే మొలకెత్తుతుంది. అదే విధంగా బ్రహ్మజ్ఞానం కూడా. గురువు చెప్పిన బ్రహ్మవిద్య ముందు వినాలి. తర్వాత సాధన ద్వారా దాన్ని అనుభూతి చెందడానికి ప్రయత్నించాలి. అనుభూతి చెంది ఆ స్థితిలో ఆత్మగా నిలబడాలి. అప్పుడే జీవితం పండుతుంది. దానికి ఉపనిషత్తులు ఎంత దోహదం చేస్తాయో, కర్మకాండ కూడా అంతే దోహదపడుతుంది. వంటకు ముందు పాత్రను శుభ్రపరిచిన విధంగానే వ్యక్తి యొక్క చిత్తాన్ని (అనుభవాల సమూహాన్ని) శుద్ధం చేయాలి. అలా చిత్తాన్ని శుద్ధం చేయగల శక్తి కేవలం వేదంలో చెప్పబడిన ధర్మానికి (కర్మలకు) మాత్రమే ఉంది. శుద్ధి చేయబడిన పాత్రలో వండిన పదార్ధం ఏ విధంగా నివేదనకు ఉపయోగపడుతుందో, అదే విధంగా కర్మలను ఆచరించడం వలన శుద్ధి పొందిన మనస్సు మాత్రమే బ్రహ్మవిద్యను అర్దం చేసుకోగలుగుతుంది. బయటనుంచి లభించనవన్నీవిత్తనం సరైన సమయంలో గ్రహించి మొలకెత్తినట్టు, చిత్తశుద్ధి వలన వ్యక్తి ఉపనిషద్ రహస్యాలను గ్రహించగలుగుతాడు. కనుక వేదంలో జ్ఞానకాండ ఎంత ప్రధానమో, ఆచారకాండ కూడా అంతే ప్రధానం. ఈ రోజు చాలామంది ఆచారకాండను విడిచిపెట్టి కేవలం జ్ఞానకాండ ఒక్కటి చెప్పుకుంటే సరిపోతుందని చెప్తున్నారు. అది చాలా తప్పుడు వాదన. ధర్మాన్ని ఆచరించకుండా ఉపనిషత్తులను అర్దం చేసుకునే ప్రయత్నం చేస్తే, అవి అర్దంకాకపోగా, విపరీత అర్ధాలు వస్తాయి. అందుకే వేదం కర్మకాండ, జ్ఞానకాండ అని రెండు భాగాలుగా విభజించబడింది.

To be continued .................