Wednesday, 30 September 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (40)

నేటి శస్త్రాల కంటే నాటి అస్త్రాలు అధిక శక్తి సంపన్నమైనవి. ఇదంతా మంత్ర శక్తి వల్లనే. వీటి గురించి పురాణాలలో చాలా విశేషాలున్నాయి బ్రహ్మాస్త్రం, నారాయణాస్త్రం, పాశుపతాస్త్రం మొదలైనవాటి గురించి చదివేటపుడు నేటి అణ్వాయుధాలు దిగదుడుపుగా కన్పిస్తాయి. ఇవి భ్రూణాన్ని కూడా పాడు చేస్తాయి. అశ్వత్థామ ప్రయోగించిన అపాండవాస్త్రం ఉత్తర గర్భానికి చేటు తీసుకొని రాలేదా? కృష్ణుడే రక్షించాడు.


సైనికుల శక్తిని గుర్తించింది అమ్మవారు. అదృష్టవశాత్తు కుట్ర మాత్రం ఈమే సైన్యం చేయలేదు. ఆమె జ్ఞాన స్వరూపురాలు కదా. అంతా ఆమెకు తెలుసు. ఇదంతా ఆమె లీలయే. 


విశుక్రుడు విజృంభించడానికి విఘ్నేశ్వరుని మహత్త్వం ప్రకటింప బడడానికీ ఆమెయే కారకురాలు. 


శివశక్తులనుండి శక్తి, జ్ఞానాగ్ని కుండం నుండి బయల్వెడలింది. లలితాంబికగా అవతరించింది. అదే సందర్భంలో శివుడు కామేశ్వరునిగా అవతరించి ఆమెను వివాహమాడాడు, ఎందుకంటే యుద్ధానికి అవివాహితను పంపండం ఎందుకని? వీరిద్దరిని కామేశ్వర కామేశ్వరి దంపతులుగా కీర్తిస్తారు. కామేశ్వరి మన మఠంలోని కామాక్షి. కామకోటి పీఠం ఆమె నిలయం. 

Tuesday, 29 September 2020

స్వామి వారి అమృత వచనాలు - గణపతి (39)


అచరూప్పాక్కం అనే నగరం చెంగల్పట్టునకు, తిండివనానికి మధ్యలో ఉంది. ఇక్కడే ఈశ్వరుని రథం విరిగిందని, కదలలేదని అంటారు. అచ్చు అంటే ఇరుసు - ఆరు అంటే విరిగింది, పొత్తం అంటే ప్రదేశం. 


ఇటీవల ఒక చిత్రమైన సంఘటన పురాణ కథను గుర్తు చేసింది. రామేశ్వరం దగ్గర మేము శంకరమఠాన్ని నిర్మించాలని అనుకున్నాం. జైపూర్ నుండి చలువరాయిని తెప్పించాం. కాంచీపురంలో శంకరుల విగ్రహం, నల్గురు శిష్యుల విగ్రహాలను చెక్కారు. ఒక వాహనం పై వీటిని రామేశ్వరం తీసుకొని వెళ్ళాలి. దారిలో సరిగ్గా అచరూప్పాక్కం దగ్గర వాహనం అగిపోయింది. కదలడం లేదు. 108 కొబ్బరికాయలు కొట్టి వాహనాన్ని బాగుచేయగా బండి బాగుపడింది. ఇక ఆటంకాలు లేకుండా తిన్నగా రామేశ్వరం వచ్చింది. ఆ శంకరుని రథం అప్పుడు కదలలేదు. శంకర భగవత్పాదులను తీసుకొని వెళ్ళే ఈ ఆధునిక వాహనానికీ ఆటంకం ఏర్పడింది. ఈయనా ఆగిపోయారు. చిత్రంగా ఉంది కదూ!

Monday, 28 September 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (38)


కొడుకే - తండ్రి నుండి పూజలందుకొనుట 


ఈశ్వరుడు, త్రిపురాసురులను జయించే సందర్భంలో అతని కొడుకును ధ్యానించలేదట. కొడుకు యొక్క గొప్పదనాన్ని గుర్తించలేదట. 


తనకు రావలసిన బాకీని గణపతి వదులుకుంటాడా? అందరు దేవతలు, ముందుగా గణపతిని పూజించాలన్నారు. శివుడు, దానిని దాటడానికి వీలు లేదు. పూజించకుండా ఈశ్వరుని రథం బయలుదేరబోతోంది. ఇరుసు విరిగి పోవుగాక అని గణపతి యనగా విరిగింది. ఇక రథమెట్లా కదులుతుంది?


అరెరె! నియమాన్ని అతిక్రమించాను, నేనేమో అందరికంటే పెద్దయని భావించాను. నియమాలను పాటించడంలో వ్యక్తిగతమైన గొప్పదనం పోకూడదని శివుడు గణపతిని పూజించాడట. (మరొక సందర్భంలో కనిష్ఠ పుత్రుడైన కుమారస్వామికే నమస్కరించి శివుడు ప్రణవోపదేశాన్ని పొందినట్లుంది కూడా).


వెంటనే ఆటంకాన్ని తొలగించాడు వినాయకుడు. రథం కదిలింది త్రిపురాసురులను జయించాడు, శంకరుడు. త్రిపురాంతకుడనే బిరుదు వహించాడు.


Sunday, 27 September 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (37)



ముఖ్యమైన దేవతగా


ఇతణ్ణి సంతోష పెడితే అయ్యవారు, అమ్మవారు సంతోష పడతారు లోగడచెప్పాను. ఇక ఆశీర్వదించే శక్తి తల్లిదండ్రులకే ఉందని, ఇతనికి లేదని భావించవద్దు. తల్లిదండ్రుల మాదిరిగానే అతడు భక్తులపై వరాల జల్లు చల్లగలడు.


ఇతణ్ణి ఈశ్వర తనయునిగా కాక ఇతనినే ముఖ్య దేవతగా కొలిచే గాణాపత్యులు ఏమంటారంటే శివ, పార్వతి, కుమారస్వామి, విష్ణు దేవతలను తమ తమ ఇష్టదైవంగా కొలిచేవారు, ముందుగా గణపతి పూజ చేసి కొలుస్తారు కదా, ముందుగా పసుపు విఘ్నేశ్వరుడందరికి ఉన్నాడని. కాని మేము మాత్రం గణపతిని పూజించేటపుడు శివాది ఇతర దేవతలను ముందుగా పూజించనవసరం లేదని అంటారు. ఇక వైష్ణవులు, పూజారంభంలో విష్వక్సేనుణ్ణి పూజిస్తారు. విఘ్నేశ్వరుని మరొక రూపమే అతడని అంటారు. 


వినాయకుడికి అగ్రపూజ ఉంది. ఆయనకి సంబంధించిన శ్లోకాల్లో ఈశ్వరుడు, పార్వతి, విష్ణువు, కుమారస్వామి ప్రస్తావన వచ్చినా, ఇతని గొప్పదనం వారివల్ల రాలేదని గుర్తించండని అంటారు. ఏదో ఒక సందర్భంలో మిగతా దేవతలందరూ ఇతని సాయం కోరినట్లుగానే పురాణాలు వర్ణించాయని అంటారు.


అసలు దేవతలలో ఒకరు ఎక్కువ, మరొకరు తక్కువ అనే విభజన ఉంటుందా? ఒకే పరమాత్మ భిన్న భిన్నంగా కనబడడం లేదా? అతని లీలలు అనంతం కదా! మానవుల మనః ప్రవృత్తుల కనుగుణంగా పురాణాలు ఆయా దేవతలను ఆయా సందర్భాలలో ఎక్కువని కీర్తిస్తూ ఉంటాయి. ఇష్ట దేవతపై భక్తుల మనస్సు కేంద్రీకరించబడాలనే ఉద్దేశ్యంతోనే అట్లా ఉంటాయి. భక్తులు తమ దేవతయే విజయం సాధించినట్లు భావిస్తారు. తద్వారా తమ భక్తిని దృఢం చేసుకొంటారు. ఒక దేవత గెలిస్తే మరొకరు ఓడినట్లే కదా! కాని వినాయకుడు ఓడినట్లుగా ఎక్కడా లేదు. మిగిలిన దేవతలు ఇతడిని కొలిచినట్లు కథలున్నాయి.

Saturday, 26 September 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (36)


ఇట్టి పిల్లవానిని మనం సంతోషపెట్టాలి. అతనికి కోపం కలిగించకూడదు. ముల్లోకాలకు పెద్ద పిల్లవాడు. అట్టి సుగుణవంతుని, దయార్ర్థ హృదయుడు, సంతోషపెట్టే పనులను చేయాలి. అతణ్ణి సంతోషపెడితే అతని తల్లిదండ్రులు సంతోషపడి మనకన్ని శుభాలను కల్గిస్తారు. 


ఇతర దేవతలు - స్వామిని కొలుచుట 

కొందరు తమకేమీ అర్హతలక్కరలేదని, ఫలానా వారు తాము కావలసినవారని పెద్దల పేర్లు చెబుతూ కాలక్షేపం చేస్తూ ఉంటారు. ఇట్లా నిర్లక్ష్యంగా గడుపుతూ ఉంటారు. 


కానీ మన గణపతి అట్టివాడా? శారీరక బలంలో గాని, మానసిక బలంలో గాని, ఇతరులపట్ల ప్రేమాభిమానాలను కురిపించుటలో గాని ఇతడు మేటియే కదా! తల్లిదండ్రుల గొప్పదనం వల్ల ఇతనికి గొప్పదనం రాలేదు. అతనికి ఒక ప్రత్యేక స్థానముంది. పిల్లవాడని ఏకవచనం ఉపయోగించరు. అసలీ బహువచనం పెద్దలకే కూడా.

Friday, 25 September 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (35)



కుమారస్వామి - అన్నగారు


పైన వారే కాకుండా ఇతని తమ్ముడూ గట్టివాడే. వినాయకుడు పెద్దవాడు. వేదాలు తనిని, జ్యేష్ఠరాజం అని పేర్కొన్నాయి. అన్నగారికి పేరు వస్తే అన్నగారి పేరును తమ్ముడూ వాడుకుంటాడు. ఇక చిన్నవాడు గొప్పవాడైతే అట్టి తమ్మునికి అన్నగారని తానూ మురిసిపోయాడు. అయితే ఈశ్వరుని ఇద్దరు పిల్లలూ అన్నివిధాలా గొప్పవారే, కనుక వినాయకుని బంధుత్వం చెప్పేటప్పుడు కుమారస్వామినీ పేర్కొనాలి.


మన స్వామికి 16 నామాలు ప్రసిద్ధంగా ఉన్నాయి. అవి షోడశ నామాలు. మనం అష్టోత్తర శతంతో (108) పూజ చేయకపోయినా ఈ నామాలను చదివితే చాలంటారు. 


సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజకర్ణకః 

లంబోదరశ్చ వికటో విఘ్నరాజో వినాయకః 

ధూమ్ర కేతుః గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః

వక్రతుండ శూర్పకర్ణో హేరంబః స్కందపూర్వజః 


దీనిలో చివరి పేరు స్కంద పూర్వజుడు. అనగా స్కందునకు ముందు పుట్టినవాడు. చిన్నవాడు పేరుతో పెద్దవాడు కీర్తింపబడ్డాడు. చిన్నవాని వల్ల పెద్దవానికి పేరు వచ్చింది. 


Thursday, 24 September 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (34)

మొట్టమొదట పిల్లలకీ శ్లోకం చెబుతాం. ఈ శ్లోకం అంటున్నప్పుడు వినాయకుడే పిల్లలకు గుర్తుకు వస్తాడు.


ఈ శ్లోకంలోని విష్ణుపదం, ఇతనితో నున్న సంబంధాన్ని వెల్లడిస్తుందిది. వినాయకునకు మామ కదా విష్ణువు! 


ఇంతకముందే 'శ్రీకాంతో మాతులోయస్య' అని చదివాం. ఇది వింటూ ఉంటే మలయాళంలోని 'మారువాక్కతాయం' గుర్తుకు వస్తుంది. ఆ రాష్ట్రంలో మేనమామ సంపద మేనల్లునికి చెందుతుంది. ఇది వారసత్వం (ఔరసత్వం). 


ఇక తల్లిదండ్రుల గొప్పదనం: మామను ముందు పేర్కొని మామ చెల్లెలైన అనగా తల్లిని ఇట్లా పేర్కొన్నాడు: 


జననీ సర్వమంగలా - సర్వమంగలయైన పరాశక్తియే ఇతని తల్లి. ఆమె గుణాలు, క్రియలు శుభకరములే కదా! అమ్మవారిని నుతిన్చేటప్పుడీ శ్లోకాన్ని చదువుతారు.


సర్వమంగల మాంగల్యే శివే సర్వార్థ సాధికే 

శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి, సమోస్తుతే


ఎన్నో పేర్లు విష్ణువునకున్నా శ్రీకాంత పదం, సర్వ సంపదలు కలవాడని సూచిస్తుంది. అట్లాగే అమ్మవారికి ఎన్నో పేర్లున్నా సర్వమంగల పదం అట్టిదే. ఇక తండ్రి - జనకః శంకరో దేవః ఆనగా తండ్రి శంకర భగవానుడు.


శివునకెన్నో పదాలున్నా ఇక్కడ శంకర పదమే వాడబడింది. అంటే మంచి పనులు చేసేవాడని, లేదా ఆనందాన్నిచ్చేవాడని. ఇట్లా విఘ్నేశ్వరుడు శ్రీ మంగలం, సుఖం పదాలతో కూడి మామ, తల్లి, తండ్రులతో కూడియున్నాడు. 


శ్రీకాంతో వందే కుంజరాననం - తంకుంజరాననం వందే అట్టి గజముఖునికి నమస్కరిస్తున్నాను.