Sunday 27 September 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (37)



ముఖ్యమైన దేవతగా


ఇతణ్ణి సంతోష పెడితే అయ్యవారు, అమ్మవారు సంతోష పడతారు లోగడచెప్పాను. ఇక ఆశీర్వదించే శక్తి తల్లిదండ్రులకే ఉందని, ఇతనికి లేదని భావించవద్దు. తల్లిదండ్రుల మాదిరిగానే అతడు భక్తులపై వరాల జల్లు చల్లగలడు.


ఇతణ్ణి ఈశ్వర తనయునిగా కాక ఇతనినే ముఖ్య దేవతగా కొలిచే గాణాపత్యులు ఏమంటారంటే శివ, పార్వతి, కుమారస్వామి, విష్ణు దేవతలను తమ తమ ఇష్టదైవంగా కొలిచేవారు, ముందుగా గణపతి పూజ చేసి కొలుస్తారు కదా, ముందుగా పసుపు విఘ్నేశ్వరుడందరికి ఉన్నాడని. కాని మేము మాత్రం గణపతిని పూజించేటపుడు శివాది ఇతర దేవతలను ముందుగా పూజించనవసరం లేదని అంటారు. ఇక వైష్ణవులు, పూజారంభంలో విష్వక్సేనుణ్ణి పూజిస్తారు. విఘ్నేశ్వరుని మరొక రూపమే అతడని అంటారు. 


వినాయకుడికి అగ్రపూజ ఉంది. ఆయనకి సంబంధించిన శ్లోకాల్లో ఈశ్వరుడు, పార్వతి, విష్ణువు, కుమారస్వామి ప్రస్తావన వచ్చినా, ఇతని గొప్పదనం వారివల్ల రాలేదని గుర్తించండని అంటారు. ఏదో ఒక సందర్భంలో మిగతా దేవతలందరూ ఇతని సాయం కోరినట్లుగానే పురాణాలు వర్ణించాయని అంటారు.


అసలు దేవతలలో ఒకరు ఎక్కువ, మరొకరు తక్కువ అనే విభజన ఉంటుందా? ఒకే పరమాత్మ భిన్న భిన్నంగా కనబడడం లేదా? అతని లీలలు అనంతం కదా! మానవుల మనః ప్రవృత్తుల కనుగుణంగా పురాణాలు ఆయా దేవతలను ఆయా సందర్భాలలో ఎక్కువని కీర్తిస్తూ ఉంటాయి. ఇష్ట దేవతపై భక్తుల మనస్సు కేంద్రీకరించబడాలనే ఉద్దేశ్యంతోనే అట్లా ఉంటాయి. భక్తులు తమ దేవతయే విజయం సాధించినట్లు భావిస్తారు. తద్వారా తమ భక్తిని దృఢం చేసుకొంటారు. ఒక దేవత గెలిస్తే మరొకరు ఓడినట్లే కదా! కాని వినాయకుడు ఓడినట్లుగా ఎక్కడా లేదు. మిగిలిన దేవతలు ఇతడిని కొలిచినట్లు కథలున్నాయి.

No comments:

Post a Comment