Thursday, 1 December 2022

భేతాళ కథలు - 3



విక్రమార్కుడు పలకలేదు. మౌనంగా ఉండిపోయాడు. ఐనా వదలలేదు భేతాళుడు. “విక్రమార్క మహీపాలా! నేను- నీకు అలసట తెలియకుండానూ, యీ నిశీధిలో నడచి నడచి విసుగురాకుండానూ. ఒక కథ చెబుతాను. సరేనా?' 'అతను ఔననికాని కాదని కాని ఏమీ అనకుండా నిశ్శబ్దంగా ఉండిపోయాడు. శవాన్ని మోసుకుంటూ నడవసాగాడు.


మళ్లీ భేతాళుడి అన్నాడు. “కథ చెప్పాక నేను నిన్నొక ప్రశ్నవేస్తాను. ఆ ప్రశ్నకి నీకు సమాధానం తెలిసికూడా చెప్పక పోయావో తక్షణమే నీ తల వెయ్యి ముక్కలవుతుంది. కనుక జాగ్రత్తగా విను. కథ మొదలు పెడుతున్నాను. -”


భేతాళుడు హెచ్చరిస్తున్నట్లే అని మొదట కథ చెప్పడం మొదలుపెట్టాడు. విక్రమార్కుడు నోరు మెదపకుండానే నడుస్తూ కథ వినసాగాడు.


ఎవరు భర్త? ఎవరు సోదరుడు? 


"రాజా శోభావతీ అనే పురముండేది. దానిని యశఃకేతుడనే రాజు పరిపాలించేవాడు. అతను దేవ బ్రాహ్మణభక్తి కలవాడు. అంతే కాకుండా గొప్ప రాజకీయవేత్తగూడా. తన వేగుల (రహస్యముగా యితర దేశముల విషయములు తెలుసుకొను వారు) ద్వారా యితర దేశముల రహస్యములను సేకరించేవాడు. పని కొచ్చే సమాచారం తెచ్చిన వేగులకు చక్కని బహుమానాలనీ, విరివిగా జీతాల్నీ యిచ్చేవాడు.


మాకెప్పుడూ యీ రాజే కావాలని ప్రజలు కోరుకునే రీతిలో అతి చక్కగా.. ధర్మంగా రాజ్యపాలన చేస్తూండేవాడు. ప్రజలు ఎంతో సంతోషంగా ఉండేవారు. 


ఆ నగరానికి బయట ఒక కాళికాలయం ఉండేది. ప్రతి సంవత్సరమూ ఆ దేవికి తప్పకుండా జాతర చేసేవారు. ఆ ఆలయం కెదురుగా ఒక కోనేరుంది. జాతరని చూడడానికి వచ్చిన స్త్రీలు ఆ కోనేరులో స్నానం ఆ చేసి, శుచిగా, దేవి నారాధించి వెళ్లేవారు.


ఒక యేడు-ఉత్సవం నాడు కొందరు ఆడవారు కొలనులో స్నానం చేస్తున్నారు. మరో దేశం నుంచి ఎక్కడికో వెళ్తూ తోవలో ఉన్న యీ చోటుకి అనుకోకుండా వచ్చిన ధవళుడను రజకుడు కోనేటిలో స్నానమాడుతున్న ఒక స్త్రీని చూశాడు. అతనికా సౌందర్యవతి మీద విపరీతమయిన మోహం కలిగింది.

Wednesday, 30 November 2022

భేతాళ కథలు - 2



"వచ్చి?" అడిగాడు విక్రమార్కుడు. "అక్కడికి కొన్ని ఆమడల దూరంలో అమడంటే 8 మైళ్లు. ఒక పెద్ద మర్రి చెట్టుంటుంది. ఆ మర్రిచెట్టు కొమ్మకి ఒక శవం వేలాడుతూంటుంది. ఆ శవ శరీరమును నేను తపస్సు చేసే చోటుకి తేవాలి." అన్నాడు సన్యాసి.. "అలాగే" అంగీకరించాడు విక్రమార్కుడు. “మరి.. నేను రావలసిన ప్రదేశం?" అడిగాడు. నేను తపస్సు చేసే స్థలం చేరుకుందుకు గుర్తులు చెబుతాను. జాగ్రత్తగా విని గుర్తుంచుకో" అంటూ ఆ ప్రదేశం చేరడానికి మార్గం గుర్తులూ చెప్పి వెళ్లిపోయాడు సన్యాసి.


బహుళ పక్షము అమావాస్య రానే వచ్చింది. ఆ రాత్రి - విక్రమార్కుడు కత్తి పట్టుకుని ఒంటరిగా బయలుదేరి - సన్యాసి తపస్సు చేసుకునే స్థలం చేరుకున్నాడు. "ఆ మర్రిచెట్టు ఎక్కడుందో... నేనేం చెయ్యాలో చెప్పండి" అని అడిగాడు. విక్రమార్కుడిని చూస్తూనే చాలా ఆనందం పొందిన ఆ సన్యాసి - యిలా చెప్పాడు. "ఇక్కడికి దక్షిణ దిక్కుగా నేను చెప్పిన వటవృక్షముంది. దానికి వేలాడే శవాన్ని నువ్వు యిక్కడికి తేవాలి. శవాన్ని మోసుకు వస్తున్నప్పుడు - ఆ శవం నిన్ను పలకరిస్తుంది. మాటలాడించబోతుంది-" "శవం మాట్లాడడమా!" ఆశ్చర్యపోయాడు విక్రమార్కుడు.


"అది మామూలు శవం కాదు. ఆ చెట్టుమీద భేతాళుడుంటాడు. నువ్వు శవాన్ని భుజానికెత్తుకోగానే ఆ భేతాళుడు ఆ శవాన్ని ఆవహిస్తాడు. ఆ భేతాళుడు నిన్నేవేవో ప్రశ్నలు వేస్తాడు. వాడు పలకరించినా నువ్వు బదులు చెప్పకు. నువ్వు మాట్లాడావో... నోరువిప్పావో... శవమూ శవంలోని భేతాళుడూ వెనక్కిపారిపోతారు. ఆ భేతాళుడే నా తపస్సుకు ఆటంకం కలగజేస్తున్నాడు. వాడిని నెత్తిమీద పెట్టుకుని నిశ్శబ్దంగా... మౌనంగా... యిక్కడికి తెచ్చావో - యిక నా కార్యానికి విఘ్నాలు కలిగించగలిగేవారెవరూ ఉండరు” “సరే” అని మర్రిచెట్టు వేపు బయలుదేరాడు విక్రమాదిత్యుడు.


చీకటి...జడలు విరబోసుకున్న దెయ్యాల్లా చెట్లు గాలికి ఊగుతూ...


గుండెలు జలదరింపజేసేలా ఏవేవో పక్షుల కూతలూ జంతువుల అరుపులూ వేటికీ వెరవకుండా మర్రిచెట్టుని చేరుకున్నాడు తను. అక్కడి వాతావరణం మరీ భయంకరంగా ఉంది. నేలమీద మానవ కపాలాలు. స్వేచ్ఛగా తిరుగాడుతున్న భయంకర సర్పాలూ. ఎక్కడి నుంచో నక్కల ఊళలు. తోడేళ్ల అరుపులు.... గుడ్లగూబల నవ్వులు. వేటినీ లెక్కచెయ్యకుండా మొలలో కత్తితో - మర్రి చెట్టు వేపు చూశాడు రాజు. మర్రి చెట్టు మహావికృతంగా ఉంది దాని కొమ్మకి శవం వేలాడుతోంది. 


అతను చెట్టెక్కాడు. శవానికి కట్టిన తాళ్లని కత్తితో ఛేదించాడు. అంతే ఆ తాళ్లు తెగడమేమిటి, శవం మాట్లాడడం మొదలు పెట్టింది. దానిని పట్టకోబోతే అది యథాస్థానానికి పోతూంది. ఓహో! ఈ శవ శరీరంలో భేతాళుడున్నాడన్న మాట! - అనుకుని విక్రమార్కుడు శవానికున్న తాళ్లని కోస్తూనే దానిని గట్టిగా పట్టుకుని నెత్తిమీద పెట్టుకుని బంధించి.... చెట్టుదిగి... మౌనంగా నడవసాగాడు. అప్పుడు- "రాజా!" పిలిచాడు భేతాళుడు - శవంలోంచి.


Tuesday, 29 November 2022

భేతాళ కథలు - 1



భేతాళ కథలకు పూర్వరంగం 


విక్రమార్కుడు ప్రజలు సుఖంగా ఉండేలా పరిపాలన చేస్తున్నాడు.


ఒకనాడు - ఒక సన్యాసి అతని వద్దకు వచ్చాడు. రాజు ఆ సన్యాసినెంతో గౌరవించాడు.


అతని వినయవిధేయతలకీ, భక్తి ప్రపత్తులకీ ఆ సన్యాసి ఎంతో సంతోషించి, ఆశీర్వదిస్తూ ఒక పండుని ప్రసాదించాడు. ఐతే.. ఆ పండునేంచేయాలో మాత్రం చెప్పలేదు.


ప్రతిరోజూ ఆ సన్యాసిరావడం... ఒక పండునిచ్చి వెళ్లిపోడం... విక్రమార్కుడా పండుని దాచమని పక్కనే ఉన్న కోశాధికారికివ్వడమూ ఇలా జరుగుతూ వస్తూంది..


ఒకరోజు సన్యాసి ఫలమిచ్చేసరికి - విక్రమార్కుడికి సమీపంలో ఒక కోతి ఉంది. అదేమో ఆశగా ఆ పండు వేపే చూస్తుంది. అది గమనించిన రాజపురోహితుడు కోతికందించాడు. కోతి ఆ పండుని తినాలని దానిని కరవగా - పండులోంచి కొన్ని రత్నాలు జలజలమంటూ రాలాయి.


అదిచూసి విక్రమార్కుడు చాలా ఆశ్చర్యపోయి.. అంతవరకూ దాచి ఉంచమన్న పండ్లన్నిటినీ తెప్పించి పగలకొట్టించి చూడగా - వాటన్నిటియందును కూడా అతి విలువయిన రత్నాలున్నాయి. అప్పుడు రాజు ఆ సన్యాసి వేపు తిరిగి చేతులు జోడించి -


"మహాత్మా! మీరిలాంటి ఫలాలను నాకెన్నో దినములనుండి యిచ్చుచున్నారు. ఒక్కొక్క ఫలములోని రత్నాలవిలువా అపారము. నా నుండి మీరేమి ఆశించుచున్నారు? నేను మీకు చేయవలసిన సేవ ఏమి?" అని వినయంగా ప్రశ్నించాడు.


అప్పుడా సన్యాసి - "రాజా! నేను తపస్సుకి సంబంధించిన ఒక మహాకార్యదీక్షను చేయడానికి నిర్ణయించుకున్నాను. అది సక్రమంగా నెరవేరాలంటే నాకు నీవంటి సాహసమూ, ఔదార్యమూ, విక్రమమూ కలవాని అవసరమెంతో యున్నది. నీ నుండి ఆ సహాయమును కోరుకొనుటకే యిలా చేశాను..." అన్నాడు.


"నేను చేయవలసిన పని ఏమిటి?" అడిగాడు విక్రమాదిత్యుడు. "రాబోవు - బహుళ పక్షమునాటి - అమావాస్య రాత్రి నేను తపస్సు చేసే చోటుకి ఆయుధములు మాత్రమే కలిగియుండి ఒంటరిగా రావాలి....

Monday, 28 November 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 265 వ భాగం



రోజూ కంపా నదీతీరాన్ని ఆవాసంగా చేసుకొన్న కామేశ్వరిని అర్చించినట్లుంది.


ఇక్కడున్న మా మఠంలో చంద్రమౌళీశ్వర లింగాన్ని యోగ లింగమంటారు. దీని ప్రస్తావన శ్రీహర్షుని నైషధంలో కూడా ఉన్నట్లు లోగడ ఉపన్యాసాలలో చెప్పాను.


రక్షాక్షి నామ సంవత్సరంలోని వైశాఖ మాసంలో పంచమినాటికి 32 సంవత్సరాలు పూర్తి అయ్యాయి. ఆ మాసంలో వచ్చే ఏకాదశినాడు సిద్ధి పొందారు.


చివరి ఘడియలలో ఉపదేశ మిమ్మనగా 'వేదో నిత్యమధీయతాం... మొదలైన అయిదు శ్లోకాలను చెప్పారు. దానినే సోపాన పంచకమని, ఉపదేశ పంచకమని అంటారు.


వాటి సారాంశం: ప్రతి దినమూ వేదాధ్యయనం చేయి. వైదిక కర్మలను ఆచరించు. వాటిని స్వలాభం కోసం కాకుండా ఈశ్వరపూజ చేస్తున్నట్లు భావించి ఫలితాలను వదులు. కోరికలతో కర్మలను విడిచి పెట్టు. పాపాలను పోగొట్టుకో.


సజ్జనులతో కలిసి యుండు. భక్తిని కలిగియుండు. శాంతాది గుణాలను అలవర్చుకో. ఓంకార మంత్రాన్ని అర్థించు. ఉపనిషద్వాక్యల అర్థాలను విచారించు. కుతర్కాన్ని విడిచిపెట్టు. బ్రహ్మననే భావనతో ఉండు. గర్వాహంకారాలను వీడు. ఆకలి దప్పికలనే వ్యాధికి చికిత్స చేయి. లభించిన పదార్థంతో తృప్తి పడు ద్వంద్వాల పట్ల ఓర్పుతో ఉండు. ఏకాంత ప్రదేశంలో మౌనంగా కూర్చుండి బ్రహ్మము పట్ల చిత్తాన్ని లగ్నం చేయి. ఈ జగత్తంతా పూర్ణ బ్రహ్మలో లీనమైనట్లుగా భావించు. ప్రారబ్ధ కర్మను అనుభవిస్తూ బ్రహ్మ నిష్టుడవై యుండు. జ్ఞానాన్ని ఆశ్రయించు. ఇట్లా వీరి ఉపదేశం సాగుతుంది.


ఆనందగిరీయంలో వీరు స్థూల శరీరాన్ని సూక్ష్మ శరీరంలో, మరల దానికి కారణ శరీరంలో లీనం చేసారని, అఖండ చైతన్యంలో లీనమైనారని ఉంది.


వారి చరిత్రలను విన్న తరువాత చిత్తశుద్ధి, శాంతి, ప్రేమలు మనలో కలిగితే వినిన ఫలం అపుడు దక్కుతుంది. వారు చెప్పినవి ఆచరణలో పెట్టినపుడే వినడమనేది సార్ధకమౌతుంది. ఎంతో జ్ఞాన భక్తులకు సంబంధించిన సాహిత్యాన్ని అందించారు. 


ఎవరేది చెప్పినా నీవు మోక్ష స్వరూపుడవే అని మాయవల్ల తెలిసికోలేకపోతున్నావని, జ్ఞానం వల్ల అట్టి చీకటి తొలగించగలిగితే, నీవే బ్రహ్మవని తెలిసికొంటావని అన్నారు.


ఏదో శాశ్వత నరకం ఉంటుందని, అందు పాపులుంటారని చెప్పడం కాకుండా, అట్టి పాపులను కూడా పరమాత్మ స్వరూపులుగా తీర్చిదిద్దారు. 'మంగలం గురు శంకర' అనే కన్నడంలోని పాటలో మహాపాపిని కూడా పరమాత్మగా వీరు మార్చారని ఉంది. జయ జయ శంకర అంటేనే మనలో నూత్న ఉత్సాహం వస్తుంది. అనండి. అంటూ మంచి పనులను చేయండి.


నమః పార్వతీ పతయే

హరహర మహాదేవ


Sunday, 27 November 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 264 వ భాగం



ఒకే ఒక పరమాత్మ, నానా రూపాలను ధరిస్తున్నాడని, దానిని గుర్తించినవాడు సర్వజ్ఞుడౌతాడు. శంకరులీ అర్ధంలోనే కాదు. ఒకటి నుండే అనేక శాస్త్రాలు ఆవిర్భవించాయి. అన్ని శాస్త్రాలను అవలోకనం చేసినవాడు. సర్వజ్ఞుడౌతాడు కదా! అతడే సర్వజ్ఞ పీఠాన్ని ఎక్కడానికి అర్హుడు.


ఏదైనా పని చేయాలన్న ఇదేమైనా బ్రహ్మవిద్యా అని అంటాం. అట్టి బ్రహ్మ విద్యలోనూ వీరు పారంగతులే. సర్వజ్ఞ పీఠం ఎక్కేటప్పుడు దాని క్రింద అనేకమైన మెట్లుంటాయి. ఒక్కొక్క మెట్టెక్కినపుడు ఒక్కొక్క విద్యలో, నిష్ణాతుడు ప్రశ్నిస్తాడు. వానికి సమాధానం చెప్పి పై మెట్టునెక్కాలి. చివరగా, సరస్వతియే ప్రశ్నిస్తుంది. సమాధానం చెప్పగలిగితే సింహాసనం మీద కూర్చుండడానికి అర్హత వస్తుంది. అట్లా ఎక్కగలిగారు.


వారి వాఙ్మయాన్ని పరిశీలిస్తే అనేక శాస్త్రాలలో పారంగతులైనట్లు తెలుస్తుంది. జ్యోతిశ్శాస్త్రంపై శంకరాచార్యం అనే పేరుతో పుస్తకమొకటుంది. ఒక సంగీత శాస్త్రజ్ఞుడు వచ్చి సంగీత శాస్త్రంలో గతి - గమనం గీతం అనే - మాటలు వస్తాయని వాటి సాంకేతిక విషయాలు మాకే తెలియవని అన్నపుడు శంకరులు 'గళే రేఖాః త్రిసా అనే శ్లోకంలో సంగీత శాస్త్ర విషయాలను ముచ్చటించారని ఆశ్చర్య పడ్డాడు.


అంతేకాదు, కొబ్బరి చెట్టును వంచడమనే విద్యను నేర్చుకొన్నారని చెప్పాను. అట్లే చెప్పులు కుట్టేవాని విద్య గురించి చెప్పినట్లు లోగడ ఉపన్యాసాలలో చెప్పాను.


రామునకు పట్టాభిషేకం జరిగిన తర్వాత రాజ్యాన్ని పాలించాడు కాని శంకరులు అన్ని పనులూ నిర్వర్తించిన తరువాత వీరికి పీఠారోహణ ఉత్సవం జరిగింది. అనగా జ్ఞాన రాజ్యానికి తుది అంకం. శంకరాభ్యుదయం ఇట్లా చెప్పింది. 


'కంపాతీరనివాసినీం అనుదినం కామేశ్వరీం అర్చయన్ 

బ్రహ్మానందమవిందత త్రిజగతాం క్షేమం కరో శంకరః'


Saturday, 26 November 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 263 వ భాగం



(నవ్వుతూ ఇట్లా అన్నారు స్వామి ఇదేమిటి? నిష్క్రియత్వాన్ని బోధించే అద్వైతమెక్కడ? క్రియాశక్తి స్వరూపమైన అమ్మవారెక్కడ? క్రియారహితురాలై, క్రియతో కూడినట్లుగా ఉంటుంది. శంభువుని నిష్క్రియుని శంకరునిగా మార్చి క్రియాసహితునిగా చేసింది. పరబ్రహ్మము, అవతారంగా వస్తే పరాశక్తినుండే శక్తిని పొంది నిర్వహిస్తాడు. ఇట్లా చేయడానికి ఆమె దయయే కారణం. జీవుణ్ణి స్వస్వరూపునిగా తెలిసికొనేటట్లు చేసేది ఆమెయే, అద్వైత మోక్షాన్ని ఇచ్చేది ఆమెయే. ఆమెయే జ్ఞాన దాత్రియని శంకరులకు తెలుసు.


శ్రీవిద్య, బ్రహ్మవిద్య రెండూ అద్వైతానికి దారి చూపించేవే. శివ శక్తుల సమ్మేళనాన్ని ప్రతిపాదించేవే. జ్ఞాన మార్గానికి దారి చూపిన శంకరులే ఉపాసన మార్గం యొక్క ప్రాముఖ్యాన్ని గుర్తించారు.


శివశక్తుల సమ్మేళనాన్ని గుర్తించే మఠాలలో చంద్ర మౌళీశ్వర అర్చనతో బాటు శక్తిపీఠాల అర్చన కూడా ఉంటుంది. కంచిలో కామాక్షి పీఠం; ద్వారకలో భద్రకాళి పీఠం, పూరీలో విమలాపీఠం, శృంగేరీలో శారదాపీఠం, బదరిలో పూర్ణగిరి పీఠాలున్నాయి.


అమ్మవారు, గర్భగృహంలో గుహలో, ఒక బిలాలయంలో ఉన్నట్లుంటుంది. ఆమె దగ్గర శ్రీ యంత్రాన్ని ప్రతిష్ఠించి ఉగ్రకళను బంధించి, సౌమ్యమూర్తిగా, ఆమెను తీర్చిదిద్దారు. గురు రహస్యంలో ఇట్లా శంకరులు చేసారని ఉండగా, మాకు పుణ్యం అయ్యేటట్లు చేసారని గురు రత్నమాలలో ఉంది:


"ప్రకృతించ గుహాశ్రయాం మహోగ్రాం 

స్వకృతే చక్రవరే ప్రవేశ్య యోఽగ్రే 

అకృతాశ్రిత సౌమ్యమూర్తిం ఆర్యాం 

సుకృతం నః సచినోతు శంకరార్యః 


అమ్మవారి ఎదురుగా ఇట్టి యంత్ర ప్రతిష్ఠ చేసినట్లు చిద్విలాసీయంలో ఉంది.


'కామాఖ్యా పురతో దేశ శ్రీచక్రం స్వయమాలిఖతో' ఆనంద గిరియంలోనూ అట్లాగే ఉంది. ఇట్లా కామకోటి పీఠాన్ని ఉజ్జలంగానే చేసారు. వీరి శిష్యులు నలుమూలలా పర్యటించి గురువులందించిన షణ్మతాలను వైదిక పద్ధతిలో కొనసాగేటట్లు చేసారు.


Friday, 25 November 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 262 వ భాగం

 


కంచిలోని పూజా పద్ధతులను సంస్కరించారు. ఉగ్రరూపంలో నున్న అమ్మవారిని రాజరాజేశ్వరిగా తీర్చిదిద్దారు. వినాయకుని ఆలయం, ముక్తి మంటపం కాశీలో ఉన్నట్లు ఇక్కడా ఉంటాయి. విష్ణు కంచిలోని వరద రాజస్వామి ఆలయంలోని పూజాపద్దతిని సంస్కరించారు. దానికి పడమరగా మా మఠం ఉంది.


వారక్కడ ఉండగా, అందరి క్షేమాన్ని కోరి అక్కడి రాజుతో కాంచీపురం శ్రీ చక్రాకారంగా నిర్మించాలని, అందు బిందుస్థానంలో కామాక్షి ఆలయం ఉండేటట్లు పట్టణాన్ని నిర్మించాలని చెప్పారట. ఆ రాజు, రాజసేనుడు అనే చోళరాజు.


శ్రీ చక్రాకారంగానే ఉంటుంది కంచి. ఎందుకిట్లా చేసారు? ఎన్నో దేవతామూర్తులున్నా ఇది ప్రధానంగా దేవీ క్షేత్రమే. శక్తిపీఠాలు 3,18,36, 51, 56, 64, 96, 108, 6400 సంఖ్యలో ఉన్నాయని అంటారు. ఇందు ప్రధానంగా కంచి పేర్కొనబడింది. ఇది అమ్మవారి నాభి పడినచోటు. ఇది నాభిపీఠం, నాభి శరీరం మధ్యలోనే ఉంటుంది. అట్లాగే కంచి ప్రపంచానికే నాభి వంటిది. కాంచి యనగా మొలనూలు. అదే ఒడ్డాణం. ఇది నాభికి కవచంలా ఉంటుంది. ఇట్లా మేరుతంత్రం, కామాక్షీ విలాసం, కంచి మాహాత్యం చెప్పాయి. కంచి కామాక్షి జనరేటర్ వంటిది. అన్ని బల్బులు వెలగడానికి ఈమెయే కారణం. ఇది తెలివిడి చేయడం కోసం కంచి ప్రాంతంలో 50 శివాలయాలున్నా అమ్మవారి మూర్తి అక్కడ ఉండదు. సుందరేశ్వర ఆయలంలో మీనాక్షి; జంబుకేశ్వరంలో అఖిలాండేశ్వరి; కపాలీశ్వర కోవెలలో కర్బగ అంబాళ్ ఉంటారు కాని, కామాక్షి ఆలయంలో ఈశ్వరుడుండడు. నాల్గు వైపులా గోపురముంటుంది. నాల్గువైపులా రాజవీధి యుంది. ఇట్టి గౌరవం, ఏకామ్రనాథునికి గాని, వరద రాజస్వామికి గాని లేదు.


శ్రీ విద్యా శాస్త్రంలో చెప్పబడినట్లుగా నాల్గు చేతులలో ధనుస్సు, అంకుశం, పాశంతో ఉంటుంది. తానిచ్చిన విద్యా శాస్త్రాన్ని, సౌందర్య లహరిగా అందించారు శంకరులు. ఇట్లా అన్ని కారణాల వల్ల ఇది శంకరులకు ప్రధాన కేంద్రమైంది.