Wednesday, 28 February 2024

శ్రీ గరుడ పురాణము (105)

 


ప్రతిహోత తాను అనుష్టించిన ఆజ్యాహుతుల శేషభాగాన్ని యథావిధిగా కలశలలో సమర్పించాలి. అప్పుడు ఆచార్యుడు దేవతా, మంత్ర, అగ్నిసహితంగా తాదాత్మ్య భావనా పూర్తిగా మరల పూర్ణాహుతినిప్పించాలి.


ఆచార్యుడు యజ్ఞమండలము నుండి పైకి వచ్చి సర్వదేవతలకూ బలులివ్వాలి. భూతాలకూ నాగులకూ కూడా బలులివ్వాలి. నిజానికి తిలలూ, సమిధలూ - రెండింటినే విహిత హోమపదార్థాలంటారు. నెయ్యి ఆ రెండిటికీ సహయోగం చేస్తుంది. దాని ప్రాముఖ్యానికి కారణం అది లేనిదే హవనీయ ద్రవ్యం అక్షయం (సంపూర్ణం) కాలేకపోవడం.


ఈ హవనకృత్యంలో పురుష సూక్తం, రుద్రసూక్తం, జ్యేష్ఠసామం, 'తన్నయామి' మంత్రయుక్త భరుండ సూక్తం, మహామంత్ర రూపంగా ప్రసిద్ధమైన నీలరుద్ర సూక్తం, అథర్వకుంభ సూక్తం యథాక్రమంగా తూర్పు, దక్షిణ, పశ్చిమ, ఉత్తర, తూర్పు, దక్షిణ దిక్కులలో ఆసీనులైన ఋత్విజుల చేత పారాయణం చేయబడాలి. ఈ హవనకర్మలో ఒక్కొక్కదానికి సహస్రాహుతులనివ్వాలి. ఈ ఆహుతులలో వేదమంత్రాలు, దేవతా మంత్రాలు, వేదశాఖల మంత్రాలు, గాయత్రీమంత్రం అన్ని వ్యాహృతులతో ప్రణవ సహితంగా ఘోషింపబడాలి. ఆయా దేవతల యొక్క శిరో, మధ్య, పాద భాగాలకు ఈ ఆహుతులు చేరుతున్నట్టు, కనిపిస్తున్నట్టే భావించుకొని మిక్కిలి ఉత్సాహంతో ఈ కర్మను గావించాలి. చివరగా హోత తానే దేవుడననుకోవాలి.


ఆచార్యుడీ క్రింది మంత్రాలతో దేవ విగ్రహన్యాసాన్ని చేయాలి.


ఓం అగ్నిమీలే (డే) .... ఇరుపాదాలు

ఓం ఇషేత్వేతి .... చీలమండలు

ఓం అగ్నఆయాహి .... జంఘలు

ఓం శం నో దేవీ ... మోకాళ్ళు

ఓం బృహద్రథంతర  ... తొడలు

ఓం దీర్ఘాయుష్ట్వాయ .... హృదయం

ఓం శ్రీశ్చతే .... కంఠము

ఓం త్రాతారమింద్ర .... వక్షస్థలం

ఓం త్ర్యంబక .... కన్నులు

ఓం మూర్ద్ధాభవ .... మస్తకం 


ఆ మంత్రాలను పూర్తిగా చదువుతున్నంత సేపూ భగవానుని ఈ అంగాలను న్యాసం చేయాలని అర్ధము. ఇక లగ్న ముహూర్తంలో హవనంచేయాలి. తరువాత ఓం ఉత్తిష్ట బ్రహ్మణస్పతే... అనే మంత్రం చదువుతూ విగ్రహాన్ని లేపి మంత్రవేత్తయైన ఆచార్యుడు దేవస్యత్వా... అనే మంత్రాన్ని పఠిస్తూ దేవతామూర్తిని పట్టుకొని వేదోక్త పుణ్యాహవాచనాలను ఘోషిస్తూ దేవప్రాసాదానికి అంటే కోవెల చుట్టూ ప్రదక్షిణ చేయాలి. అపుడు వివిధ రత్న, వివిధ ధాతు, తాలౌహద్రవ్య, యథావిధానంగా అనేక ప్రకారాల సిద్ధబీజములతో దిక్పాలురకూ అనేక ఇతర దేవతలకూ (ఈ సామగ్రిని చేత బట్టుకొని) ప్రదక్షిణ చేయాలి. అంతట దేవ విగ్రహాన్ని యథాస్థానంలో ప్రతిష్ఠించాలి.


Tuesday, 27 February 2024

శ్రీ గరుడ పురాణము (104)

 


తరువాత కలశకు దగ్గరలోనే కూర్చుని, ఆచార్యుడు, వేదమంత్రోచ్చారణ గావిస్తూ అగ్నిని స్థాపించాలి. ఋగ్వేదవేత్త యగు ఆచార్యానుచరుడొకడు (ఋత్విక్కు) తూర్పు వైపున్న కుండ సమీపంలో కూర్చుని శ్రీసూక్తం, పవమానసూక్తం చదవాలి.


కుండం దక్షిణం వైపున్న అథ్వర్యుడు, యజుర్వేదవేత్త, ఆచార్యుడు రుద్రసూక్తాన్నీ పురుషసూక్తాన్నీ పారాయణం చేయాలి. కుండానికి పశ్చిమ వైపున్న సామవేదీయాచార్యుడు వేదవ్రత, వామదేవ్య జ్యేష్ఠ సామ, రథంతర, భేరుండ నామాలను పఠించాలి. అలాగే కుండానికుత్తరం వైపున్న అథర్వవేదవేత్త, అథర్వశిరస్, కుంభసూక్త, నీలరుద్రసూక్త, మైత్ర సూక్తాలను పారాయణం చేయాలి.


అప్పుడాచార్యుడు అస్త్రమంత్రం ద్వారా కుండాన్ని బాగా ప్రోక్షించి స్వశక్తి మేరకు రాగి లేదా ఏ ఇతర ధాతు నిర్మిత పాత్రలో అగ్నిని గ్రహించి దేవతామూర్తి కెదురుగా వుంచాలి. ఆపై అమృతీకరణం చేయాలి. అనగా కవచమంత్రాలతో అగ్నిని రగుల్కొల్పాలి. తరువాత దానిని వేదమంత్రాలు చదువుతూ పాత్రతో సహా కుండానికి నాలుగు వైపులా తిప్పి ఈ మారు వైష్ణవ యోగంతో మరింత రగుల్కొల్పి ఆ పాత్రతో సహా అగ్నిని కుండం మధ్యలో స్థాపించాలి. దక్షిణం వైపు బ్రహ్మనీ, ఉత్తరంలో ప్రణీతాన్నీ స్థాపించి నాలుగు దిక్కులలోనూ కుశవిష్టరాలను వెదజల్లి ఒక పరిధి నేర్పాటు చేయాలి.


అప్పుడు గురువు త్రిమూర్తులను పూజించి దర్భలపై అగ్నిని కొంతవుంచి, దర్భజలంతోనే ప్రోక్షణం చేయాలి. ఎందుకంటే దర్భలతో, మంత్ర సహాయం అవసరం లేకుండానే దేనినైనా పవిత్రీకరించవచ్చు. అగ్నిలో వుంచి తీసిపెట్టిన దర్భలపై దేవతలు స్వయంగా 

వచ్చి కూర్చుంటారు. అగ్నిని ఈలాగున పవిత్రీకరించిన పిమ్మట ఆచార్యుడు ఆజ్య 

సంస్కారాన్ని చేపట్టాలి. ముందుగా నేతిని ఆహవయోగ్యం చేసుకోవాలి. అనగా దశల 

వారీగా ఆవేక్షణ, నిరీక్షణ, నీరాజన, అభిమంత్రణలను చేసి హవనానికి ముందే 'అభిఘారం' అనే యజ్ఞకార్యాన్ని ముగించాలి. తరువాత నేతితో అయిదేసి ఆహుతులను

రెండు మార్లివ్వాలి. ఇప్పుడు అన్ని అగ్ని సంస్కారాలనూ, గర్భాదానం నుండి గోదాన 

పర్యంతమూ, చేసి ఆచార్యుడు తన వేదశాఖా విహితమంత్రాలతో గాని ప్రణవంతోగాని ఆహుతి ప్రదానం చేయాలి. చివరగా ఆచార్యుడే పూర్ణాహుతిని కూడా ఇవ్వాలి. పూర్ణాహుతి వల్లనే యజమాని కోరికలన్నీ ఈడేరుతాయి.


ఈ విధంగా వేదవిహితంగా ఉత్పన్నమైన అగ్ని అన్ని కార్యాలనూ సిద్ధింపజేయగలదు. అందువల్ల దానిని మరల పూజించి అన్ని కుండాలలోనూ ప్రతిష్ఠితంచేయాలి. ప్రతి కుండము వద్ద ఋత్విక్కులు వారి వారి శాఖా మంత్రాలతో ఇంద్రాది దేవతలందరికీ నూరేసి ఆహుతులను ప్రదానం చేయాలి. పూర్ణాహుతిని సమర్పించి మరల ఆ దేవతలందరికీ ఒక్కొక్క ఆహుతినివ్వాలి.


Monday, 26 February 2024

శ్రీ గరుడ పురాణము (103)

 


ఒక కంచు లేదా రాగిపాత్రలో తేనె, నెయ్యిల మిశ్రమాన్ని తయారుచేయించి అంజనంగా చేసి దానిని బంగరు ముక్క (రేకు) తో తెచ్చి ఆ ప్రతిమ కనులకు పలుమార్లు అంజనమును పూయాలి. ఇలా కాటుక నిడుతున్నపుడు ఓం అగ్నిర్ జ్యోతీతి... అనే మంత్రంతో దేవుని లేదా దేవత నేత్రాలను తుడుస్తుండాలి.


నామకరణాన్ని యజమానియే చేయాలి. ఓం ఇమంమేగాంగేతి... అనే మంత్రంతో మూర్తి నేత్రాలను చల్లబఱచి, ఓం అగ్నిర్మూర్ ద్ధేతి... అనే మంత్రంతో పుట్ట వంటి శాస్త్రోక్త ప్రదేశాల నుండి తెచ్చి కలిపి వుంచిన మట్టిని దేవతామూర్తికి సమర్పించి మారేడు, చెఱకు, రావి, మఱి, మోదుగల నుండి తయారుచేయబడిన పంచకషాయమును తెచ్చి దానితో ఓం యజ్ఞా యజ్ఞేతి.... అనే మంత్రం ద్వారా స్నానం చేయించాలి. పిమ్మట పంచగవ్యాలతో స్నానం చేయించి సహదేవీ, బలా, శతమూలీ, శతావరీ, ఘృత కుమారీ, గుడూచీ, సింహీ, వ్యాఫ్రీ- అను పేళ్ళు గల ఔషధులను కలిపిన నీటితో ఓం యా ఓషధీతి... అనే మంత్రం ద్వారా స్నానం చేయించాలి. ఆపై ఓం యాః ఫలినీతి... అనే మంత్రం ద్వారా ఫలస్నానం చేయించాలి.


తరువాత ఓం ద్రుపదాదివేతి.. అనే మంత్రంతో విద్వాంసులకు అభ్యంగన చేయించాలి. ఉత్తరాది దిశలలోనాలుగు కలశల నుంచి వాటిలో వివిధ రత్నాలను, సప్తధాన్యాలను, శతపుష్పిక (సోంపు వంటిది) యను పేరు గల ఔషధినీ నిక్షేపించాలి. ఆ పై నాలుగు సముద్రాలనూ, నలుదిక్కుల అధిష్టాన దేవతలనూ వాటిలోకి ఆవాహనం చేయాలి. నాలుగు కలశలనూ విడివిడిగా, పాలు, పెరుగు, నీళ్ళపాలు, నెయ్యిలో కాస్త జలములతో నింపి ఆ కుంభాలను క్రమంగా ఆప్యాయస్వ... ధధిక్రావణో..., యా ఓషధీ..., తేజోసి... అనే మంత్రాలతో అభిమంత్రితం చేసి ఇవే చతుస్సముద్రాలని భావించి వాటితో దేవప్రతిమకు స్నానం చేయించాలి.


తరువాత దేవ ప్రతిమను బహుసుదర వేషభూషలతో అలంకరించి గుగ్గిల ధూపం వేయాలి. తరువాత ఇందాకటి కుంభాలను మంత్రించి వాటిలోకి భూమిపైనున్న సమస్త తీర్థ, నదీ, సముద్ర జలాలను ఆవాహన చేసి ఓం యా ఓషధీతి... ద్వారా అభిమంత్రించి మరల దేవప్రతిమను అభిషేకించాలి. ఈ అభిషేకావశిష్ట (మిగిలిన) జలాలతో స్నానం చేసిన వారికి సర్వపాప విముక్తి లభిస్తుంది.


సర్వసాగరస్నానాన్ని ప్రతిమకుగావించిన తరువాత అర్ఘ్య ప్రదానం చేసి ఓం గంధద్వారేతి... అనే మంత్రం ద్వారా సుగంధిత చందనాది పదార్థాలతో ప్రతిమను అనులేపితం చేయాలి. శాస్త్రవిహితంగా దేవమూర్తిని న్యాసం చేయాలి. ఓం ఇమం వస్త్రేతి... అనే మంత్రం చదువుతూ మూర్తికి బట్టలు కట్టి ఓం కవి హావితి... అనే మంత్రాన్నుచ్చరిస్తూ దానిని మండపం మీదికి గొని వచ్చి ఓం శంభవాయేతి... మంత్రంతో శయ్యపై స్థాపించాలి. ఓం విశ్వతశ్చక్షు... మంత్రాన్నుచ్చరిస్తూ మొత్తం పూజా విధానాన్ని పరీక్షించుకొని సరి చూసుకోవాలి. మూల దేవత శిరోభాగంలో రెండు వస్త్రాలచే కప్పబడిన, స్వర్ణయుక్తమైన, ఓంకారముచే పవిత్రీకరింపబడిన కలశ ను స్థాపించాలి.


Sunday, 25 February 2024

శ్రీ గరుడ పురాణము (102)

 


తరువాత యజ్ఞగురువు ఒక అర్ఘ్యపాత్రలో గంధాదియుక్త జలాన్ని నింపి దాన్ని మంత్ర సమూహంతో అభిమంత్రించి ఆ జలాన్ని యజ్ఞమండపమంతటా జల్లాలి. తరువాత ఆ రోజు ప్రతిష్టితమవుతున్న దేవతామూర్తి పేర మండప ఈశాన కోణంలో నొక కలశను స్థాపించి దాని దక్షిణభాగంలో అస్త్రమంత్రాలతో అభిమంత్రింపబడిన "వర్ ద్ధిని'ని స్థాపించాలి. (* ఒకలాంటి కమండులువు. కలశ వలె పెద్దది. దేవ ప్రతిష్ఠలలోనే ఎక్కువగా వాడతారు.) తరువాత దానినీ, కలశనూ, గ్రహాలనూ, వాస్తోష్పత్తినీ ఆచార్యులు యథావిహిత ఆసనాలపై ప్రతిష్ఠించి పూజించి పలుమార్లు ప్రణవమంత్రాన్ని జపించాలి. తరువాత ఆ కలశను పంచరత్నాలు అద్దబడిన రెండు వస్త్రాలతో ఆచ్ఛాదించి, అన్ని ప్రకారాల సుగంధాల పొడినీ, ఔషధాల ముద్దనీ దానికి పూసి మరల ఆ కలశను ఆ రోజు ప్రతిష్ఠింపబడు దేవత యొక్క చిన్న ప్రతిమను అందులో స్థాపించి ఆ మూర్తినీ పూజించాలి.


తరువాత వర్ద్ధినిని వస్త్రాలతో కప్పి దానిని కలశతో బాటు అటూ ఇటూ తిప్పాలి. తరువాత దానిలోని నీటితో కలశను తడిపి ఆ కలశకు ముందలి జాగాలో దానిని స్థాపించాలి. స్థండిలముపై వీటిని పెట్టి మూలదేవతను కూడా వుంచి పూజించాలి.  


వాయవ్యకోణంలోనొక కుండను స్థాపించి గణపతినందులోకి ఆవాహన చేసి ఓం గణానాం త్వేతి... అనే మంత్రంతో ఆయనను పూజించాలి. ఈశాన కోణంలో మరొకఘటాన్ని పెట్టి అందులో ఓం వాస్తోష్పతే... అనే మంత్రంతో ఆయనను రావించి పూజించాలి. కుంభానికి (కలశ మొదలగు వాటికి తూర్పువైపున భూతాలకూ గణదేవులకూ బలులిచ్చి వేదిని 'ఆలంభనం' చేయాలి. ఆకుపచ్చని దర్భలను ఓం యోగేయోగేతి... అనే మంత్రంతో సిద్ధం చేసి ఒక స్నానపీఠంపై నుంచి ఆచార్యుడూ, ఋత్విజులూ, యజమానీ కలిసి ప్రతిష్ఠింపబోయే దేవమూర్తిని దానిపై ప్రతిష్ఠించాలి. ఆ సమయంలో ఆ ప్రాంతం వైదిక మంత్రోచ్ఛాటనలతో జయ జయధ్వానాలతో, వైదికమంత్ర ధ్వనులతో మార్మోగిపోవాలి.


స్నానార్థం ఆ దేవతామూర్తిని పీఠసహితంగా బ్రహ్మరథంపై మండపానికి ఈశాన్య కోణంలో అవస్థితం చేయాలి. తరువాత ఓం భద్రం కర్ణేతి... అనే మంత్రం పూర్తిగా పఠిస్తూ స్నానం చేయించి ఆ మూర్తిని యజ్ఞేయ సూత్రంతోగాని వల్కల వస్త్రంతోగాని శుభ్రంగా తుడిచి తూర్యాది వాద్యయంత్రాలను మ్రోయిస్తూ ఆ దేవతామూర్తికి 'లక్షణోద్ధారం' అనగా నామకరణం చేయాలి.


Saturday, 24 February 2024

శ్రీ గరుడ పురాణము (101)

 


తరువాత ఓం తమీశాన... అనే మంత్రంతో ఈశాన్యంలో ఈశానునీ, మండప మధ్యభాగంలో 

ఓం విష్ణోర్లోకేతి... అనే మంత్రంతో విష్ణు దేవునీ పూజించాలి.


ప్రతి తోరణ సమీపంలోనూ రెండేసి కలశలను స్థాపించి, వస్త్ర, ఉపవస్త్రాలతో వాటిని కప్పి, చందనాది సుగంధిత పదార్థాలతో అలంకరించి ఈ క్రింది మంత్రాలతో వాటిపై పుష్ప వితానాది ఉపచారాల నుంచుతూ దిక్పాలకులను పూజించాలి.


ఓం త్రాతార మింద్ర.... తో ఇంద్రునీ 

ఓం అగ్నిరూ.... తో అగ్నినీ, 

ఓం అస్మిన్ వృక్ష.... తో నిరృతినీ, 

ఓం కిం చే దధాతు.... తో వరుణునీ, 

ఓం ఆచత్వా... తో కుబేరునీ, 

ఓం ఇమారుద్రేతి.... తో రుద్రునీ,


ఇతర దిక్పతులనూ పూజించి ఆచార్య దేవుడు హోమద్రవ్యాలనూ, అన్య పూజా సామాగ్రినీ వాయవ్యకోణంలో స్థాపించి వుంచాలి. తరువాత అక్కడున్న శ్వేత శంఖాది శాస్త్రవిహిత సమస్త వస్తువులనూ ఆయనొకమారు దీక్షగా చూడాలి. వెంటనే ఆ నిశ్చిత ద్రవ్యాలన్నీ సంపూర్ణంగా శుద్ధాలయిపోతాయి.


అప్పుడు షడంగ న్యాసాన్నీ ప్రణవ, వ్యాహృతి సంయుక్తంగా ఇలా చేయాలి.


ఓం హృదయాయ నమః,

ఓం భూః శిరసే స్వాహా,

ఓం భువః శిఖాయై వషట్,

ఓం స్వః కవచాయ హుం,

ఓం భూర్భువః స్వః నేత్రత్రయాయ వౌషట్,

ఓం భూర్భువః స్వః కరతల కరపృష్ఠాభ్యాం ఫట్- అనే మంత్రాలను చదువుతూ క్రమంగా గుండె, తల, పిలక, కవచం, కనులు, అరచేయి, మండ-లను స్పృశించాలి. తరువాత ఓం అస్త్రాయఫట్ మంత్రంతో అస్త్రాలను (అంటే చేతులనే) న్యాసం చేసుకోవాలి. ఈ మొత్తం న్యాసకర్మ సమస్త వాంఛలనూ తీర్చగలదు.


అస్త్రమంత్రం ద్వారా అక్షతలనూ, విష్టరాలనూ (విష్టరాన్నీ) అభిమంత్రితము చేసి ఆ విష్టర ద్వారా యజ్ఞమండలంలోనొక చోట నుంచబడిన సమస్త ద్రవ్యాలను స్పృశించాలి. తరువాత అస్త్రమంత్రపూత అక్షతలను మండపమంతటా వెదజల్లాలి. తరువాత తూర్పుతో మొదలెట్టి అష్టదిక్కులలోనూ ఈ అక్షతలను నిక్షేపించి సంపూర్ణ యజ్ఞమండలాన్నీ లేపనంతో తుడవాలి.


శ్రీ గరుడ పురాణము (100)

 


మండపం పూర్వాది దిశలలో నాలుగు ద్వారాలతో శోభిల్లాలి. తోరణ స్తంభాలను ఏర్పాటు చేయాలి. ఇవి అయిదేసి హస్తాల పరిమాణంలో వుండాలి. న్యగ్రోధ (మట్టి) ఉదుంబర, అశ్వత్థ (రావి) బిల్వ, పలాశ, ఖదిర చెట్లలో ఒక్కొక్క చెట్టు నుండి ఒక్కొక్క కర్రను తయారు చేసి వాటిని వస్త్రపుష్పాదులతో అలంకరించి తోరణ స్తంభాలుగా మార్చి భూమిలోకి, ఒక హస్తం మేర లోతుకు పాతాలి. ఈ స్తంభాలు మండపము యొక్క అన్ని దిశల్లోనూ కనబడాలి.


మండపానికి తూర్పువైపు ద్వారంపై మృగేంద్ర, దక్షిణంపై హయరాజ, పశ్చిమంపై గోపతి, ఉత్తరీ ద్వారంపై దేవశార్దూల ప్రతిరూపాలనుంచాలి. క్రమంగా అగ్నిమీలే... ఈ షేత్వేతి... అగ్న ఆయాహి..., శంనోదేవీ... అనే మంత్రాలతో ఆయా దిక్కుల్లో ఈయీ సింహ, గజ, వృషభ, శార్దూల మూర్తులను న్యాసం చేయాలి.


ఇక పతాకల వర్ణాలీ విధంగా వుండాలి.


తూర్పు - మేఘ

ఆగ్నేయ - ధూమ్ర

దక్షిణ - శ్యామల

నైరృత్య - ధూసర*


పశ్చిమ - పాండుర

వాయవ్య - పీత

ఉత్తర - రక్త

ఈశాన్య - శుక్ల


మండప మధ్యభాగంలో అన్ని రంగులు జెండాలూ రెపరెపలాడుతుండాలి. 


ఇంద్రవిద్యోతి... అనే మంత్రంతో తూర్పులో ఇంద్రునీ 

సంసుప్తి.... అనే మంత్రంతో ఆగ్నేయంలో అగ్నినీ,

యమోనాగ... అనే మంత్రంతో దక్షిణంలో యమునీ

రక్షోహణావే.... అనే మంత్రంతో పశ్చిమంలో వరుణునీ,

ఓం వాతేతి... అనే మంత్రంతో వాయవ్యంలో వాయుదేవునీ అభిషేకించి 

ఉత్తర దిశలో ఓం ఆప్యాయస్వేతి.... అనే మంత్రంతో కుబేరుని పూజించాలి. 


Friday, 23 February 2024

శ్రీ గరుడ పురాణము (99)

 


మన దేవాలయాలు కళలకు కాణాచులు. నాట్యం, సంగీతం నిరంతరం పిల్లలకు చెప్పబడుతూ వుండాలి. సంస్కృత వ్యాకరణం, ఇతర భాషల వ్యాకరణాలు కూడా గురువులు అక్కడ ఉచితంగా బోధించి దైవానికి ఆత్మబంధువులగా ఎదగాలి. విద్యాలయాలలో జీతం పుచ్చుకొని పనిచేయడం విద్యాదానం కాదు. కోవెలలో కోటి విద్యలను కాకున్నా తమకి వచ్చిన కొన్ని విద్యలను విద్యార్తులైన విద్యార్థులకు నేర్పడం ద్వారా గురువులు (టీచర్లు, లెక్చరర్లు, ప్రొఫెసర్లు) సార్థక జన్ములౌతారు. దేవాలయాన్ని నిర్మించినపుడే విద్యాలయానికి అవసరమైన స్థలాన్నీ కేటాయించి, ఆ వాతావరణాన్ని కల్పిస్తుంది హిందూమతం.


(అధ్యాయం - 47)


దేవప్రతిష్ఠ - సామాన్య విధి


విష్ణువు శివాది దేవతలకూ, సూతుడు శౌనకాది మహామునులకూ విగ్రహప్రతిష్ఠనెలా చేయాలో చెప్పసాగారు.


ప్రశస్తమైన తిథులనూ నక్షత్రాలనూ ఎంచుకొని ఈ పుణ్యకార్యాన్ని మొదలుపెట్టాలి. ముందుగా యజమాని తన వైదిక శాఖలో విధించబడిన బీజాక్షరాన్ని గానీ ఓంకారాన్ని గానీ వీలైనంత సేపు ఉచ్ఛరించి అయిదుగురు లేదా అంతకంటే ఎక్కువమంది ఋత్విజులను ఎంచుకొని తెచ్చి ఆదరంగా ఆసీనులను చేసి వేరొక మహానుభావుని ఆచార్యునిగా వరించి తెచ్చి వారి మధ్యలో కూర్చుండబెట్టాలి. తరువాత పాద్య, అర్ఘ్య, ముద్రిక, వస్త్ర, గంధ, మాల్య, అనులేపనీయద్రవ్యాలతో వారందరినీ సాదరంగా పూజించాలి. అప్పుడు ఆచార్యదేవులు మంత్రన్యాసపూర్వకంగా ప్రతిష్టాకర్మను సమారంభం గావించాలి.


మందిరం (లేదా దేవప్రాసాదం) అగ్రభాగంలో (అనగా ముందుభాగంలో) పది లేదా పన్నెండు హస్తాల పరిమాణంలో నొక మండపాన్ని నిర్మించి దానిపై పదహారు స్తంభాలను ఏర్పాటు చేసి వాటిలో ఎనిమిది మూలల్లో ఎనిమిది (నాలుగు దిక్కులు, నాలుగు మూలలు అని అర్థము) ధ్వజాలను ప్రతిష్టించాలి. తరువాత ఆ మండప మధ్యంలో నాలుగు హస్తాల పరిమాణంలోనొక వేదిని నిర్మించాలి. ఆ వేదిపై నదుల సంగమస్థానం తీరం నుండి తెచ్చిన ఇసుకను నెఱపాలి. ప్రధానకుండాన్ని నిర్మింపజేసి దానికి తూర్పున చతురస్రాకారంలోనూ, దక్షిణంలోనూ ధనురాకారంలోనూ, పశ్చిమంలో గుండ్రంగానూ, ఉత్తరంలో పద్మాకారంలోనూ మొత్తం నాలుగు కుండాలను నిర్మించాలి.


కుండనిర్మాణం తరువాత ఇష్టసిద్ధికై ఆచార్యుని చేతా, శాంతి కర్మకై ఇతరుల చేతా హవనం చేయించాలి. సాధారణంగా దీనికి ఈశానకోణంలోనున్న భూమిని ఆవుపేడతో అలికిన స్థలాన్ని వాడతారు.


Thursday, 22 February 2024

శ్రీ గరుడ పురాణము (98)

 


ముఖ్యద్వార స్థానంలోనే ధ్వజాదులనూ గర్భగృహాన్నీ నిర్మించాలి. సూత్రంతో జాగ్రత్తగా కొలిచి సరిసంఖ్యల గుణింతాలలో మండపాన్ని నిర్మిచంచి అందులో నాలుగవ వంతు కొలతలతో నొక భద్రగృహాన్ని నిర్మించాలి. భద్రగృహంలో కిటికీలుండవు. ప్రాసాదంలో ఏర్పాటు చేసే లతా మండపానికి భూమిని, విషమంగానూ అనేక రంగులతోనూ చేయాలి. పరిమాణపు లెక్కలు అవసరం లేదు. విషమరేఖలతో అలంకరించాలి.


ప్రాసాదము యొక్క ఆధారభూమి నాలుగు దిక్కులలో నాలుగు ద్వారాలతో నాలుగు మండపాలతో సుశోభితమై వుండాలి. నూరు శృంగాల (బురుజు స్తంభాల)తో వుండే ప్రాసాదాన్ని మేరు ప్రాసాదమంటారు. ఇది ఉత్తమం. ఇందులో ప్రతిమండపానికీ మూడేసి భద్రగృహాలుండాలి.


ఇవేకాక ఎన్నో రకాల దేవ ప్రాసాదాలున్నాయి. స్వయంభూదేవతల కోసం నిర్మించే ప్రాసాదాలకు పెద్దగా నియమాలుండవు.


చతురస్ర ఆలయాలలో చంద్రశాలయుక్తాలైన అరుగులుండాలి. వాటికెదురుగా ఆయా దేవతల వాహనాలకై లఘు మండపాలను నిర్మించాలి. దేవప్రాసాదాలలో ద్వారానికి దగ్గరగా నాట్యశాల వుండాలి. ద్వారపాలుర విగ్రహాలు శాస్త్రోక్తంగా నిర్మింపబడాలి. ఆలయానికి దగ్గర్లోనే అందులోనే పని చేసేవారికి ఇళ్ళు కట్టించాలి.


Wednesday, 21 February 2024

శ్రీ గరుడ పురాణము (97)

 


ద్వారంలాగే పీఠమధ్యభాగం కూడా ఛిద్రయుక్తంగానే వుండాలి. పాదిక, శేషిక, భిత్తి, ద్వార పరిమాణాలను అనుసరించియే అర్థ- అర్థ పరిమాణ దూరాల్లో అన్నిటినీ నిర్మించాలి. ఆ గర్భ భాగ విస్తృతికి సమానంగా మండప జంఘా భాగాన్ని నిర్మించి దానికి రెండింతల పరిమాణంలో ఉన్నత శిఖరభాగాన్ని కట్టాలి. శుక్రాంఘి భాగాన్ని ఇదివఱకటిలాగే కట్టి పై ద్వారాన్ని ఎత్తులోనే వుంచాలి.


ప్రాసాదానికి నాలుగు వైపులా ఒక అడుగు పరిమాణంలో పునాదిని నిర్మించి వుంచాలి. దీనిని 'నేమి' అని కూడా అంటారు. గర్భగుడికి ఈ నేమి రెండింతలుండాలి. ప్రహరీ గోడకి రెండింతల ఎత్తులో శిఖరముండాలి.


లక్షణాలను బట్టి ప్రాసాదాలనేక ప్రకారాలుగా వుంటాయి. ఇలా వైరాజ, పుష్పక, కైలాస, మాలిక (మాణిక), త్రివిష్టప. ఇవి క్రమంగా చతురస్ర, ఆయత, వృత్త, వృత్తాయత, అష్టకోణాకారాలలో వుంటాయి.


వైరాజ నామక ప్రాసాదంలో మరల తొమ్మిది ప్రకారాల చౌకోర ప్రాసాదాలు నిర్మింప బడుతున్నాయి. అవి మేరు, మందర, విమాన, భద్రక, సర్వతోభద్ర, రూచక, నందన, నందివర్ధన, శ్రీవత్సములు.


పుష్పక నామక ప్రాసాద నిర్మాణ కళలో ఈ క్రింది తొమ్మిది రకాలున్నాయి. వలభి, గృహరాజ, శాలగృహ, మందిర, విమాన, బ్రహ్మమందిర, భవన, ఉత్తంభ, శివికావేశ్శ.


కైలాస ప్రాసాద నిర్మాణ కళ నుండి వలయ, దుంధుభి, పద్మ, మహాపద్మ, ముకులీ, ఉష్ణీషీ, శంఖ, కలశ, గువావృక్ష మున్నగు ప్రకారాలుద్భవించాయి. అలాగే గజ, వృషభ, హంస, గరుడ, సింహ, సమ్ముఖ, భూముఖ, భూదర, శ్రీజయ, పృథివీధర - ఇవి మాలికా నామక వృత్తాయత ప్రాసాద కళా ప్రాదుర్భూతములు.


అలాగే త్రివిష్టప శిల్పకళ నుండి వజ్ర, చక్ర, ముష్టికవభ్రు, వక్రస్వస్తిక, ఖడ్గ, గదా, శ్రీవృక్ష, విజయ, శ్వేత ప్రకారాల ప్రాసాదాలు నిర్మింపబడుతున్నాయి. ఇవేకాక త్రికోణ, పద్మాకార, అర్ధచంద్రాకార, చతుష్కోణ, షోడశకోణీయ ప్రకారాల ప్రాసాదాలను ఒక నిర్దిష్ట ఫలం కోసం, క్రమంగా, రాజ్య, ఐశ్వర్య. ఆ యువర్ధన, పుత్ర, లాభ, స్త్రీ ప్రాప్తిల కోసం ప్రత్యేక మండపాలతో నిర్మిస్తారు.


Tuesday, 20 February 2024

శ్రీ గరుడ పురాణము (96)

 


ప్రాసాద లక్షణాలు


దేవాలయ నిర్మాణానికి ముందు వాస్తువిదుని పర్యవేక్షణలో అరవై నాలుగడుగుల పొడవు, అంతే వెడల్పు గల ఒక చతుష్కోణ భూఖండాన్ని తయారుచేయాలి. దానిలో నలభై ఎనిమిది అడుగుల మేరను పిట్టగోడలను కట్టి వుంచాలి. నలుదిక్కులలోనూ మొత్తం పన్నెండు ద్వారాలనేర్పాటు చేయాలి.


మనిషికిలాగే దేవాలయానికీ జంఘ వుంటుంది. ఇది మనిషి తొడకి రెండున్నర రెట్ల పరిమాణంలో వుంటుంది. దీనిపైనే గర్భగుడి నిర్మింపబడుతుంది. దీనిని నిర్మించి మూడు లేదా అయిదు భాగాలు చెయ్యాలి. జంఘపై నిర్మింపబడు గర్భగుడి భాగ విస్తార పరిమాపము అనగా కట్టడమును 'శుక్రాంఫ్రి' అంటారు. దీని ద్వారపు యెత్తు శిఖరపు 

యెత్తులో సగముండాలి. నాలుగు శిఖరాలను తయారు చేసి వాటిలో మూడవభాగపు కొలతలో వేదిబంధనం చేయాలి. నాలుగవ భాగంలో మరల ప్రాసాదం కంఠభాగాన్ని నిర్మించాలి. నాలుగు శిఖరాల మధ్యంలో పైకి వుండే భాగాన్ని కంఠభాగమంటారు.

మరోలా కూడా చేయవచ్చు. భవన నిర్మాణానికి సిద్ధం చేసిన భూమి ఖండాన్ని పదహారు సమాన భాగాలుగా చేసి వాటిలో నాలుగవ ముక్కలో గర్భగుడిని నిర్మించి, మిగిలిన పన్నెండు భాగాలనూ పిట్టగోడచే ఆవృతం చేయించాలి. ఈ చతుర్థభాగం ఎత్తును అనుసరించే మిగతా అన్ని భాగాల కొలతలూ నిర్ణయింపబడతాయి. భిత్తి (గోడ)కి శిఖరం రెండింతల ఎత్తు. ప్రదక్షిణభాగం విస్తృతి శిఖరం ఎత్తులో చతుర్థాంశం.


దేవప్రాసాదానికి నాలుగు దిక్కులలోనూ బయటికి పోడానికి ద్వారాలుండాలి. ద్వారం గర్భగుడి గోడలో అయిదవ వంతు కొలతలతో నుండాలి. గర్భగుడిలో ప్రతి అంశము యొక్క కొలతలూ వాస్తు శాస్త్రాన్ని అనుసరించే వుండాలి. ఎక్కడా ఏ మాత్రమూ తేడా ఉండరాదు.


ఇక లింగ నిర్మాణ పరిమాణం.


లింగపు కొలతలను బట్టే దాని పీఠం కొలతలుండాలి. పీఠభాగానికి రెండింతల పరిమాణంలో దానికి నలువైపులా గర్భభాగం వుండాలి. పీఠగర్భాన్ని అనుసరించి దాని గోడ, ఆ గోడ విస్తీర్ణంలో అర్ధభాగం కొలతలో లింగపీఠము యొక్క జంఘభాగము కట్టబడాలి. దానికి రెండింతల ఎత్తు శిఖరానికుండాలి. ద్వారాలు నాలుగు హస్తాల (ఆరడుగుల) పొడవుండాలి. (ఇదే వాస్తు చెప్పే అష్టభాగం)


Monday, 19 February 2024

శ్రీ గరుడ పురాణము (95)

 


వాస్తు మండల మధ్యంలోనే ఇల్లు కట్టాలి. దాని వెనుక భాగంలో కట్టకూడదు. మండలానికి ఎడమవైపు కూడా కట్టరాదు. అక్కడ వాస్తుదేవతలు నిద్రిస్తారు.


సింహ, కన్య లేదా తులారాశిలో పుట్టినవారు గృహద్వారాన్ని ఉత్తరంలో పెట్టించు కోవాలి. ఇతర రాశుల వారు ఇతర దిక్కులలో పెట్టించుకోవచ్చు. ఎందుకంటే భాద్రపద, అశ్వయుజ, కార్తిక మాసాలలో తూర్పు దిక్కున మస్తకాన్నీ, ఉత్తరంలో తోకనీ, దక్షిణ దిశలో క్రోడాన్నీ, పశ్చిమంలో చరణాలనీ విస్తరింపజేసుకొని వాస్తునాగాలు శయనిస్తాయి. కాబట్టి ఉత్తరదిశలో ద్వారం ఈ కాలంలో ప్రశస్తం. వృశ్చిక, ధను, మకరరాశుల వారు అనగా మార్గశిర, పుష్య, మాఘమాసాలలో ఈ నాగముల పృష్ఠభాగం తూర్పుదిక్కులో వుంటుంది. కాబట్టి ఆ దిక్కులో ద్వారం పెట్టుకోవలి. కుంభ, మీన, మేష రాశుల్లో అనగా ఫాల్గుణ, చైత్ర, వైశాఖ మాసాల్లో వాస్తు నాగముల మస్తకం పశ్చిమంలోనూ, పృష్ఠం దక్షిణంలోనూ చరణాలు ఉత్తర పూర్వాలలోనూ వుంటాయి కాబట్టి ఆయా రాశులలో జన్మించినవారు దక్షిణ దిశలో ద్వారాన్ని పెట్టుకోవాలి. అలాగే వృషభ, మిథున, కర్కాటక రాశుల వారు జ్యేష్ఠ, ఆషాఢ, శ్రావణ మాసాల్లో వాస్తు నాగశిరము ఉత్తరంలోనూ, పృష్ఠం పశ్చిమంలోనూ, వుంటాయి కాబట్టి పశ్చిమ దిశలో ద్వారమును పెట్టుకోవడం శ్రేయస్కరం.


భవనం పూర్తయినాక ఏ దిక్కున ఏ చెట్టు వుండాలో కూడా వాస్తు శాస్త్రం నిర్దేశించింది. తూర్పు - పీపల, దక్షిణ పాకడ, పశ్చిమ బరగద, ఉత్తర- గూలర, ఈశాన్య - సేమలక. ఈ వృక్షాలు శుభప్రదాలని శాస్త్రం చెప్పింది.


వృక్షో రక్షతి రక్షితః


(అధ్యాయం 46)


Sunday, 18 February 2024

శ్రీ గరుడ పురాణము (94)

 


తరువాత దుర్ధర రేఖ మొదట్లో అగ్నికోణంపై 'నాయిక' నీ చివరల్లో కాళికాదేవినీ పూజించాలి. తరువాత ఇంద్రాది దిక్పాలకులను పూజించి ఇతర దేవతలందరినీ మరల పూజించిన పిమ్మటనే భవన నిర్మాణ కార్యాన్ని ప్రారంభించాలి.


భవనానికెదురు భాగంలో దేవాలయం, ఆగ్నేయంలో పాకశాల, తూర్పులో యజ్ఞ మండపం, ఈశాన్యంలో సుగంధ ద్రవ్యాలనూ, పూలనూ దాచుకొనే చోటు, ఉత్తరంలో భాండాగారం, వాయవ్యంలో గోశాల, పశ్చిమం వైపు కిటికీలూ, జలాశయం, నైరృత్య కోణంలో సమిధ, కుశ, ఇంధన, అస్త్ర శస్త్రాదులకు చోటు, దక్షిణం వైపు సుందరమైన శయ్య, ఆసనం, పాదుకలు, జల, అగ్ని, దీపములు, భృత్యులు, అతిథి గృహం వుండాలి.


ఇంటిమధ్యలో, అంటే నడివాకిట్లో గల ఖాళీ జాగా నిత్యం నీటితో చెమ్మగా వుండాలి. అందులో నొక నుయ్యి, అరటి చెట్టు, అయిదు రకాలు పూల చెట్లు వుండాలి. భవన బాహ్యభాగంలో నాలుగు వైపులా అయిదేసి హస్తాల పిట్టగోడలను కట్టి వీలైనంత ఎక్కువ స్థలంలో వన, ఉపవనాల మధ్య విష్ణుమందిరాన్ని నిర్మించాలి.


ఈ మందిర నిర్మాణ ప్రారంభంలో అరవై నాలుగు అడుగుల వాస్తు మండలాన్ని నిర్మింపజేసి అందులో వాస్తు దేవతను విధ్యుక్తంగా పూజించాలి. అందులో మధ్యభాగంలో నాలుగడగుల మేర బ్రహ్మనూ ఆయన సమీపంలో రెండడుగుల జాగాలో ప్రత్యేకంగా అర్యమాది ఎనమండుగురు దేవులను పూజించాలి.


తరువాత కర్ణ భాగంపై కార్తికేయాదులకు పూజను గావించి, రెండు వైపులా పార్శ్వ బిందువులపై రెండేసి అడుగుల దూరంలో అన్య పార్శ్వ దేవతలనూ అర్చించాలి. తరువాత వాస్తుమండల ఈశానాది కోణాలలో క్రమంగా చరకీ, విదారీ, పూతనా, పాపరాక్షసీ అను పేళ్ళు గల దేవశక్తులను పూజించాలి. పిమ్మట వెలుపలి భాగంలో హైతుకాది దేవతలను పూజించాలి. హేతుక, త్రిపురాంతక, అగ్ని, వైతాల, యమ, అగ్నిజిహ్వ, కాలక, కరాల, ఏకపాదులను దేవతలనే హైతుకాది దేవతలంటారు. ఆపై ఈశాన కోణంలో భీమరూప, పాతాళం వైపు ప్రేతనాయక, ఆకాశం వైపు గంధమాలి ఆపై క్షేత్ర పాల దేవతలకూ పూజ చేయాలి. పొడవును వెడల్పు చేత భాగిస్తే వచ్చే సంఖ్యని వాస్తురాశి అంటారు. ఎనిమది చేత వాస్తురాశిని భాగిస్తే వచ్చేది 'ఆయ'. ఎనిమిదితో దీన్ని గుణించి ఏడుతో భాగిస్తే వచ్చేది ఋక్షభాగం. దీనిని నాలుగు చేత గుణించి తొమ్మిదితో భాగిస్తే మిగిలేది 'వ్యయం'. దీనిని ఎనిమిదితో గుణిస్తే వచ్చేదాన్ని 'పిండ' అంటారు. దాన్ని అరవై చేత భాగిస్తే 'జీవ' మిగులుతుంది. శేషాన్ని 'మరణ'మంటారు.


Saturday, 17 February 2024

శ్రీ గరుడ పురాణము (93)

 


వాస్తు మండల పూజావిధి


గృహనిర్మాణ ప్రారంభంలో విఘ్నమేదీ రాకుండా కాపాడుమని వాస్తు పురుషుని వేడుకుంటూ చేసే పూజ ఇది. ఈ వాస్తుపూజకై ఎనుబది యొక్క అడుగుల మండపాన్ని నిర్మించి దానిలోని ఈశాన్య కోణంలో పూజను మొదలెట్టి మండపమంతటా సంపూర్ణంగా వ్యాపింపజేయాలి.


ఈ మండల (లేదా మండప) ఈశాన్య కోణంలో వాస్తుదేవత మస్తకాన్ని నిర్మించాలి. నైరృతిలో రెండు పాదాలూ, మిగతా రెండు మూలల్లో చేతులూ వుండాలి. ఏ నిర్మాణాన్ని చేపట్టినా ముందుగా ఈ వాస్తు దేవతను స్థాపించి పూజించాలి. తరువాత ఇరువది యొక్కమంది దేవతలను మండల బాహ్యభాగంలోనూ పదముగ్గురు దేవతలను అంతర్భాగములోనూ ఉంచాలి.


బాహ్య దేవతలు వీరు : ఈశ, శిఖి, పర్జన్య, జయంత, కులిశాయుధ, సూర్య, సత్య, భృగు, ఆకాశ, వాయు, పూష, వితథ, గ్రహక్షేత్ర, యమ, గంధర్వ, భృగురాజ, మృగ, పితృగణ, దౌవారిక, సుగ్రీవ, పుష్పదంత, గణాధిప, అసుర, శేష, పాప, రోగ, అహిముఖ, భల్లాట, సోమ, సర్ప, దితి, అదితి వీరిని పూజించిన తరువాత ఈశాన్యంలో జలాన్నీ, ఆగ్నేయంలో సావిత్రినీ, నైరృత్యంలో జయనీ, వాయవ్యంలో రుద్రదేవునీ పూజించాలి. తరువాత తొమ్మిదడుగుల జాగాలో బ్రహ్మనీ ఆయనకు ఎనిమిది వైపులా తూర్పున మొదలెట్టి అర్యమ, సవిత, వివస్వాన్, విబుధాధిప, మిత్ర, రాజయక్ష్మ, పృథ్వీధర, అపవత్స అనే దేవతలను మండలం లోపల స్థాపించి పూజించాలి.


లోపలి భాగంలో పూజించవలసిన దేవతలు వీరు - వీరందరినీ రేఖలను జాగ్రత్తగా గీసి వాటి బిందువులపై పూజించాలి. ఈశాన్యం నుండి నైరృత్యం దాకా సూత్రం ద్వారా గీయబడిన రేఖను 'వంశ' అంటారు. అలాగే ఆగ్నేయం నుండి వాయవ్యానికున్న రేఖను 'దుర్ధర' అంటారు. వంశరేఖపై ఈశాన్య కోణంలో అదితినీ, దుర్ధరయోగ బిందువుపై హిమవంతునీ, నైరృత్య కోణాంతిమ బిందువుపై జయంతునీ పూజించాలి.


Friday, 16 February 2024

శ్రీ గరుడ పురాణము (92)

 

విస్తృత ఛిద్రాలు, చిన్న చక్రం - కృష్ణశిల

బిల్వాకార శిల - విష్ణుశిల

అంకుశం, ఆకారం, అయిదు రేఖలూ, కౌస్తుభ చిహ్నం - హయగ్రీవ శిల

చక్ర కమలాంకితం, మణుల రత్నాల కాంతి, నల్లరంగు - వైకుంఠశిల

ద్వారంపై రేఖ, విస్తృత కమల, సదృశ శిల - మత్స్యశిల

కుడివైపు రేఖ, నల్లరంగు రామచక్రాంకితం - త్రివిక్రమ శిల

ఒకద్వారం, నాలుగు చక్రాలు, వనమాల,

స్వర్ణరేఖ, గోపద సుశోభితం, కదంబ పుష్పాకృతి - లక్ష్మీనారాయణశిల


చక్రాలు మాత్రమే ఉండేవి ఇవి :


ఏకచక్రం - సుదర్శన శాలగ్రామం

రెండు చక్రాలు - లక్ష్మీనారాయణ 

మూడు చక్రాలు - త్రివిక్రమ

నాలుగు చక్రాలు - చతుర్వ్యూహ

అయిదు చక్రాలు - వాసుదేవ

ఆరు చక్రాలు - ప్రద్యుమ్న

ఏడు చక్రాలు - సంకర్షణ

ఎనిమిది చక్రాలు - పురుషోత్తమ

తొమ్మిది చక్రాలు - నవవ్యూహ

పది చక్రాలు - దశావతార

పదకొండు చక్రాలు - అనిరుద్ధ

పన్నెండు చక్రాలు - ద్వాదశాత్మ

పన్నెండు కన్ననెక్కువ - అనంత


(అధ్యాయం - 45)


Thursday, 15 February 2024

శ్రీ గరుడ పురాణము (91)

 


ద్వారంపై శ్వేతవర్ణంలో రెండు చక్రాలు ధరించియున్న వాసుదేవభగవానుని శాలగ్రామాలు కూడా వుంటాయి. అలాగే రక్తవర్ణం, రెండు చక్రాలు, తూర్పు భాగంలోనొక పద్మచిహ్నము గల సంకర్షణ నామకమైన శాలగ్రామశిల వుంది. పీతవర్ణంలో ప్రద్యుమ్నునికీ ఛిద్రశిలలలో అనిరుద్ధునికీ శాలగ్రామాలున్నవి. ద్వారముఖంపై నీలవర్ణంలో మూడు రేఖలూ, శేషభాగమంతా శ్యామలవర్ణంలో కల్పింపబడిన నారాయణ శిలలున్నాయి. మరికొన్ని లక్షణాలతో ఇతర దేవతల శాలగ్రామాల వివరాలు ఈ దిగువనీయ బడుతున్నాయి.


మధ్యంలో గదవంటి రేఖ


విస్తృత వక్షస్థలం


యథాస్థానంలో నాభిచక్రం - నృసింహ

పైవాటితో బాటు మూడు లేదా అయిదు బిందువులు - కపిల* (దీనిని బ్రహ్మచారులు తప్పనిసరిగా ఆరాధించాలి)

విషమ పరిణామాల రెండు చక్రాలు, శక్తి చిహ్నం - వారాహ

నీలవర్ణం, మూడు రేఖలు, స్థూలము, బిందుయుక్తము - కూర్మమూర్తి

పై లక్షణాలతో గుండ్రంగా వుండి వెనుకభాగంలో వంపు - కృష్ణ

అయిదు రేఖలు - శ్రీధర

అదనంగా గద - వనమాలి

గోళాకారం, తక్కువ పరిమాణం - వామన

ఎడమ భాగంలో చక్రం – సురేశ్వర

రకరకాల రంగులు, బహు రూపాలు, పడగల ముద్రలు - అనంతక 

స్థూలం, నీలవర్ణం, మధ్యలో కూడా నీలవర్ణంలోనే చక్రం - దామోదర

సంకుచిత ద్వారం, రక్తవర్ణం

పొడవైన రేఖలు, ఛిద్రాలు, చక్రం, కమలం, విశాలం - బ్రహ్మశిల


Wednesday, 14 February 2024

శ్రీ గరుడ పురాణము (90)

 

వివిధ *శాలగ్రామ శిలల లక్షణాలు


కైలాసవాసా! ఇపుడు శాలగ్రామ లక్షణాలను వినండి. (* సాలగ్రామమనే పదం సరైనది కాదు.) శాలగ్రామ శిలలను స్పృశించి నంత మాత్రముననే కోటిజన్మల పాపాలు కడుక్కుపోతాయి. కేశవ, నారాయణ, గోవింద, మధుసూదనాది పేర్లు గల విభిన్న శాలగ్రామాలుంటాయి. ఇవి శంఖచక్రాది చిహ్నాలతో సుశోభితాలై వుంటాయి. ఇలా :


కేశవ శాలగ్రామానికి శంఖ, చక్ర, కౌమోదకి (విష్ణుగద) పద్మాలుంటాయి. ఇవే చిహ్నాలు వేర్వేరు క్రమాల్లో ఇతర శాలగ్రామాలకుంటాయి.


అవి ఒక వరుసలో ఇలా వుంటాయి.


పద్మ, గద, చక్ర, శంఖ - నారాయణ

చక్ర, శంఖ, పద్మ, గద - మాధవ

గద, పద్మ, శంఖ, చక్ర - గోవింద

పద్మ, శంఖ, చక్ర, గద - విష్ణు

శంఖ, పద్మ, గద, చక్ర - మధుసూదన

గద, శంఖ, చక్ర, పద్మ - త్రివిక్రమ

చక్ర, గద, పద్మ, శంఖ - వామన

చక్ర, పద్మ, శంఖ, గద - శ్రీధర

పద్మ, గద, శంఖ, చక్ర - హృషీకేశ

పద్మ, చక్ర, గద, శంఖ - పద్మనాభ

శంఖ, చక్ర, గద, పద్మ - దామోదర

చక్ర, శంఖ, గద, పద్మ - వాసుదేవ

శంఖ, పద్మ, చక్ర, గద - సంకర్షణ

శంఖ, గద, పద్మ, చక్ర - ప్రద్యుమ్న

గద, శంఖ, పద్మ, చక్ర - అనిరుద్ధ

పద్మ, శంఖ, గద, చక్ర - పురుషోత్తమ

గద, శంఖ, చక్ర, పద్మ - అధోక్షజ

పద్మ, గద, శంఖ, చక్ర - నృసింహ

పద్మ, శంఖ, చక్ర, గద - అచ్యుత

శంఖ, చక్ర, పద్మ, గద - జనార్దన

గద, చక్ర, పద్మ, శంఖ - ఉపేంద్ర

చక్ర, పద్మ, గద, శంఖ - హరి

గద, పద్మ, చక్ర, శంఖ - శ్రీకృష్ణ


Tuesday, 13 February 2024

శ్రీ గరుడ పురాణము (89)

 


మానవుడు తన శరీరాన్ని రథంగానూ, ఆత్మను రథిగానూ ఊహించుకోవాలి. బుద్ధి సారథి, మనస్సు త్రాడు; ఇంద్రియాలు గుఱ్ఱాలు.


ఇంద్రియాలు, మనసు, ఆత్మలను కలిపి 'భోక్త' అనే మాటతో గుర్తించారు మనీషులు. ఇంద్రియాలను జ్ఞానసహాయంతో అదుపులో పెట్టుకొనేవారే పరమపదాన్ని చేరుకోగలరు. స్వర్ధుని (అజ్ఞాన ప్రవాహం)ని దాటి విష్ణువు లేదా పరబ్రహ్మనందుకోగలరు*.


(* 'శబ్దకల్పద్రుమంలో ఈ పదానికి' విగతంమానం ఉపమాయస్య' అనియూ 'విమాన ఏనేవ వైమానికః' అనియూ వ్యుత్పత్తులీయబడ్డాయి. అనగా నిరుపమేయుడు, ఉపమారహితుడు, సాటిలేనివాడు, మొత్తంగా సర్వోత్కృష్టుడు అని భావం.)


అహింసాది ధర్మాలూ, యమ శౌచాది కర్మ నియమాలూ ఈ పరమ యోగ సాధనానికి సోపానాలు. పద్మాసనం వేసుకొని కూర్చోవాలి. ప్రాణాయామం చేయాలి. ప్రాణ, అపానాది వాయువులపై విజయాన్ని పొందడమే ప్రాణాయామమనబడుతుంది. ధారణ చేయాలి. మనస్సును నియంత్రితం చేసుకోవడమే ధారణమనబడుతుంది. సమాధిగతులు కావాలి.. మనస్సును బ్రహ్మపై లగ్నం చేయడమే కాక ఆయనలో కేంద్రీకృతం చేయాలి. ఇది సమాధి అనబడుతుంది. ఈ సమాధి కుదరకపోతే బ్రహ్మమూర్తి (ఆకారం)ని ఈ రకంగా ఊహించుకొని ప్రార్థించాలి.


హృదయకమల కర్ణికా మధ్యంలో వెలిగేవాడు, శంఖ, చక్ర, గదా, పద్మములచే సుశోభితుడు, శ్రీవత్స చిహ్నుడు, కౌస్తుభ, వనమాల, లక్ష్మీ (కళ)లచే అలంకృతుడు, నిత్య శుద్ధుడు, ఐశ్వర్య సంపన్నుడు, సత్య, పరమానంద స్వరూపుడు, ఆత్మ, జ్యోతి స్స్వరూపుడు, ఇరవై నాలుగు విభిన్న ఆకారాలలో అవతరించినవాడు, శాలగ్రామాలలో ద్వారకా శిలలలో నివసించేవాడు, పరమేశ్వరుడు అయిన పరమాత్మయే ధ్యాన యోగ్యుడు. బ్రహ్మ నేనూ బ్రహ్మనే. అహం బ్రహ్మాస్మి.


ఈ రకంగా సర్వయమనియమాలనూ పాటిస్తూ ఏకాగ్రచిత్తంతో యోగసాధనతో ధ్యానం చేసి పరమాత్మను తనలోనే చూడగలిగేవాడు కోరుకుంటే ఏదైనా దొరుకుతుంది. అతడు *వైమానిక దేవుడై పోతాడు. నిష్కాముడై ఈ బ్రహ్మమూర్తిని ధ్యానిస్తూ ముక్తినొందుతాడు. 


(అధ్యాయం -44)


* ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవచ |

బుద్ధించ సారథిం విద్ధి మనం ప్రగ్రహమేవచ ॥

................................

తద్విష్ణోః పరమం పదం ||


(ఆచార 44/6-9)


Monday, 12 February 2024

శ్రీ గరుడ పురాణము (88)

 


త్రివర్గ సిద్ధికై తానీ పవిత్రకాన్ని ధరిస్తున్నాని దేవునికి విన్నవించిన సాధకుడు ఆయనను ఇలా ప్రార్థించాలి.


వనమాలా యథాదేవ

కౌస్తుభం సతతం హృది |

తద్వత్ పవిత్రం తంతూనాం

మాలాం త్వం హృదయే ధర ॥


(ఆచార 43/41)


అనంతరం బ్రాహ్మణులకు భోజనాలు పెట్టి దక్షిణలిచ్చి సాయంకాలంగానీ మరునాడుగానీ మరల ఇలాగే పూజనొనర్చి ఈ క్రింది మంత్రాన్ని చదువుతూ దీక్షను విరమించాలి.


సాంవత్సరీ మిమాం పూజాం

సంపాద్య విధి వన్మయా |

ప్రజపవిత్రకే దానీం

విష్ణులోకం విసర్జితః ||


(ఆచార 43/43)


తన వల్ల విసర్జింపబడుతున్న పవిత్రకం తనకన్న ముందే విష్ణులోకం చేరాలని సాధకుని ఉద్దేశ్యం. (అధ్యాయం -43)


బ్రహ్మమూర్తి ధ్యాన నిరూపణం


పవిత్రకంతో భగవానుని పూజించి, ఆ పై శాస్త్రోక్తంగా బ్రహ్మను ధ్యానించిన సాధకుడు హరి సమానుడవుతాడు. (అంటే నా స్వరూపమే వానికీ వస్తుంది). మాయా జాలాన్ని ముక్కలు చేసే బ్రహ్మధ్యానాన్ని వినిపిస్తాను.


ప్రాజ్ఞుడు-అనగా విశేషసాధకుడు తన వాణినీ, మనసునీ అదుపులో పెట్టుకొని తన ఆత్మలో జ్ఞాన స్వరూపుడైన బ్రహ్మ కోసం యజ్ఞం చెయ్యాలి. జీవ-బ్రహ్మల అభేద దర్శనాన్ని వాంఛించి, దానికోసం తపము చేసి మహద్ బ్రహ్మజ్ఞాన భావనను కొంతకాలం పాటు భావించాలి.


బ్రహ్మధ్యానమే సమాధి. 'అహం బ్రహ్మాస్మి' అనే స్థాయికి చేరుకోవడం సమాధి ద్వారానే సాధ్యం. తనకంటె భిన్నుడు కాని బ్రహ్మను తురీయ రూపుడని కూటస్థ నిరంజన పరబ్రహ్మయని వేదాలు వర్ణించాయి. ఈ స్థితిని చేరుకోగలిగిన సాధకుడు దేహ, ఇంద్రియ, మనోబుద్ధ్యహంకారాలు, పంచమహాభూతాలు, పంచతన్మాత్రలు, (గంధ, రస, రూప, స్పర్శ, శబ్దాలు) వివిధ గుణ, జన్మ, భోజన శయనాది భోగాలు- వీటన్నిటికీ అతీతుడవుతాడు.


Sunday, 11 February 2024

శ్రీ గరుడ పురాణము (87)

 


ఉపవాసం చేసి ఈ సూత్రాలను కుంకుమ, పసుపు, చందనాలతో చర్చితం చేసి అధివసితం గావించాలి. ప్రతి పవిత్రకాన్నీ వేరు వేరుగా అభిమంత్రితం చేసి పూజించాలి. తరువాత, అప్పటికే మండలంలో స్థాపించి వుంచిన దేవ ప్రతిమకెదురుగా పవిత్రకాన్ని పెట్టాలి.


బ్రహ్మాది అన్య దేవతలను కూడా మండలంలో స్థాపించి పూజించాలి. సూత్రాలను సిద్ధం చేసుకొని మూడు నుండి తొమ్మిది మార్లు వాటిని తిప్పివేది చుట్టూ కట్టాలి. తరువాత కలశ, నెయ్యి. అగ్నికుండం, విమానం, మండపం, గృహాలను సూత్రాలతో కట్టి తనను కూడా సూత్రంతో నుదుట చుట్టుకొని, ఒక పవిత్రకాన్ని దేవత మస్తకంపై వుంచాలి.


సంపూర్ణ సామగ్రిని విష్ణుదేవునికి నివేదించి, పూజించి ఈ మంత్రాన్ని పఠించాలి. ఆవాహితో సి దేవేశ పూజార్థం పరమేశ్వర ॥


తత్ప్రభాతే ర్చయిష్యామి సామగ్ర్యాః సన్నిధోభవ । (ఆచార 43/28, 29)


ఇలా 'ప్రాతఃకాలమే నీకు పూజ చేస్తాను స్వామీ' అన్ని విన్నపం చేసి ఆ రాత్రంతా జాగరం చేసి తెల్లారగానే కేశవస్వామిని పూజించి పవిత్రకాలను ఆయన కర్పించాలి. తరువాత స్వామికీ పవిత్రకాలకూ సుగంధిత ఆహ్లాదక ధూపాన్ని వేసి మంత్రాన్ని చదవాలి. (ఇలాటపుడే నాలుగు పాదాల గాయత్రిని పఠిస్తారు)


అనంతరం పవిత్రకాలతో దేవుని పూజించి వాటిని ఆయన ఎదుట పెట్టి ఇలా ప్రార్థించాలి.


విశుద్ధ గ్రంథికంరమ్యం మహాపాతక నాశనం । 

సర్వపాప క్షయం దేవతవాగ్రే ధారయామ్యహం ॥ (ఆచార 43/33)


తరువాత ఈ మంత్రం చదువుతూ సాధకుడు పవిత్రకాన్ని ధరించాలి.


పవిత్రం వైష్ణవం తేజః

సర్వపాతక నాశనం ॥

ధర్మకామార్థ సిద్ధ్యర్థం

స్వకంఠే ధారయామ్యహం ॥


(ఆచార 43/34,35)


Saturday, 10 February 2024

శ్రీ గరుడ పురాణము (86)

 


విష్ణు పవిత్రారోపణ విధి


భోగ, మోక్షాలు రెండింటినీ ప్రసాదిస్తూ విజయాన్ని కూడా కలిగించేది విష్ణు పవిత్రారోపణ. ఒకప్పుడు దానవులతో పోరాడి పరాజితులైన దేవతలు బ్రహ్మతో సహా వచ్చి విష్ణువును శరణు వేడగా ఆయన(చెప్తున్నది విష్ణువే అయినా ఈ పురాణంలో నన్ను, నేను అనే పదాలను వాడకపోవడానికి కారణం సూతుడు శౌనకాదులకు వివరిస్తుండడం. సర్వనామాలు వాడితే అర్థం బోధపడకపోవచ్చు అను) వారి కడగండ్లను చూసి, విని కరిగిపోయి తన మెడలోని హారాన్నీ, పవిత్రయను పేరు గల గ్రీవాభరణాన్నీ, ఒక ధ్వజాన్నీ, వారికి ప్రసాదించి 'దానిని చూస్తూనే దానవులు ధైర్యాన్ని కోల్పోవాల'ని దీవించాడు. ఆ తరువాత దేవతలు ఘనవిజయాన్ని సాధించారు. అప్పటినుండి ఈ పవిత్రకాలను అందరూ పూజిస్తున్నారు.


సదాశివా! పాడ్యమి నుండి పున్నమ దాకా ఒక్కొక్క తిథి ఒక్కొక్క దేవత పూజకు నిర్దేశింపబడింది. ఆయా దేవతలకు ఆయా తిథులలో పవిత్రారోపణ పూజను గావింపవలసి యుంటుంది. విష్ణువుకు ద్వాదశినాడు చేయాలి. వ్యతీపాతయోగ, ఉత్తరాయణ, దక్షిణాయన, చంద్ర సూర్యగ్రహణ, వివాహ, వృద్ధికార్య, గురుజన ఆగమన సందర్భాలలో కూడా ఈ పూజను చేయవచ్చును.


బ్రాహ్మణులకు పట్టుదారాలనూ, పత్తినీ, లతలనూ, క్షత్రియులకు పట్టునూ వైశ్యులకు క్షేమ, భోజపత్రదారాలనూ పవిత్రక నిర్మాణాలకై ఋషులు నిర్దేశించారు. పత్తి లేదా కమల నిర్మిత పవిత్రకాన్ని అన్ని వర్ణాల వారూ వాడవచ్చును.


ఈ పవిత్రక నవతంతువులలో ఓంకార, శివ, చంద్ర, అగ్ని, బ్రహ్మ, శేష, సూర్య, గణేశ, విష్ణు దేవతలుంటారు.


బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఈ పవిత్రకంలోని మూడు సూత్రాలకుఅధిష్ఠాన దేవతలు. ఈ సూత్రాలను బంగారం, వెండి, రాగి, వెదురు లేదా మట్టిపాత్రలలో వుంచాలి. నూట యెనిమిది, యాభై ఒకటి, లేదా ఇరవై యేడు తంతువులతో పవిత్రకాన్ని నిర్మించవచ్చు.


Friday, 9 February 2024

శ్రీ గరుడ పురాణము (85)

 


శివ పవిత్రారోపణ విధి


శివపవిత్రారోపణ సర్వఅమంగళాలనూ నశింపజేస్తుంది. జందెపు దారములను విగ్రహానికి చుట్టడాన్నే పవిత్రారోపణమని అంటారు. ఈ పూజను ఆషాఢ, శ్రావణ, మాఘ లేదా భాద్రపద మాసంలో చేస్తారు. సత్యయుగంలో స్వర్ణంతో, త్రేతాయుగంలో వెండితో, ద్వాపరయుగంలో తామ్రంతో ఈ దారాలను తయారు చేసేవారు. కలియుగంలో పత్తిని కన్య చేత దారాలుగా పేనించి ఈ పూజకు వాడాలి. మూడు పోగులను తయారుచేసి మరల వాటిని బలంగా చుట్టి మూడు పోగులుగా దళంగా చేయాలి. ఈ రకమైన నవగుణిత సూత్రాన్ని వామదేవ మంత్రం చదువుతూ ముడులు వేయాలి. దీనినే పవిత్రకమంటారు. తరువాత సద్యోజాత మంత్రం ద్వారా వాటిని కడిగి అఘోరమంత్రం తో తుడిచి, తత్పురుష మంత్రంతో చిక్కులు విడదీసి, ఈశాన మంత్రం చదువుతూ దానికి సుగంధిత ధూపాన్ని వేయాలి.


ఇప్పుడివి తొమ్మిది దారపు పోగులు కదా! ఈ నవతంతువులలో క్రమంగా ఓంకార, చంద్ర, అగ్ని, బ్రహ్మ, నాగ, శిఖి, ధ్వజ, సూర్య, విష్ణు, శివ- ఈ దేవతలు నివాసముంటారు. ఇటువంటి పవిత్రకాలను నూట ఎనిమిది, యాభై, లేదా పాతిక సంఖ్యలో ఒక పూజకు వాడాలి. పవిత్రకంలో పదేసి ముడులు వుండాలి. నాలుగేసి, రెండేసి, లేదా ఒక్కొక్క అంగుళం దూరంలో ముడివేస్తూ పోవాలి. ఈ గ్రంథులలో నివసించి తమ పేర్లను ప్రసాదించి వాటిని పవిత్రం చేసే దేవతలు- ప్రకృతి, పౌరుషి, వీర, అపరాజిత, జహ్యయ, విజయ, రుద్ర, అజిత, మనోన్మనీ, సర్వముఖి.


దేవతలారా! గ్రంథి బంధనానంతరం ఆ పవిత్రకాలను కుంకుమతో, చందనాది సుగంధాది పదార్థాలతో రంజితం చేయాలి. దానిని మహాదేవునికి సమర్పించి సర్వోపచారాలతో పూజించి 'హే దేవేశా! హే మహేశ్వరా! తమరు తమ గణాలతోసహా ఇక్కడ వేంచేసి వుండండి. ప్రాతర్వేళనే మీకు మరొక పూజను సమర్పించుకుంటాను' అని ఆహ్వానించాలి. ఆ రాత్రంతా నృత్య, గీత, వాద్యాలతో ఉత్సవాన్ని నడిపి జాగరం చేయాలి. తెల్లవారగానే ఆ పవిత్రకాలను మహేశ్వర సన్నిధిని స్థాపించి చతుర్దశి తిథి రాగానే స్నానం చేసి ముందుగా సూర్యునీ, తరువాత శివుని పూజించాలి. తరువాత సాధకుడు ధ్యానంలోకి పోయి లలాటంలో విశ్వరూపుని చూసుకొని తన ఆత్మ స్వరూపాన్ని పూజించుకోవాలి.


అప్పుడు పవిత్రకాలను అస్త్రమంత్రాలతో కడిగి, హృదయ మంత్రంతో అర్చించి, సంహితా మంత్రాలతో ధూపం వేసి, భగవంతునికి సమర్పించాలి. ఈ క్రింది మంత్రాల ద్వారా ఈయీ తత్త్వాలను ప్రార్థించాలి.


ఓం హౌం హౌం శివతత్త్వాయ నమః, ఓం హీం (హీః) విద్యాతత్త్వాయ నమః ఓం హాం (హౌః) ఆత్మతత్త్వాయ నమః, ఓం హాం హీం హూం క్షౌః సర్వతత్త్వాయ నమః |


పిమ్మట మహేశ్వరునికి విధిపూర్వకంగా పవిత్రకాన్ని సమర్పించి కాసేపుంచి దానిని తీసి కనులకద్దుకొని ప్రతి ధరించాలి.


(అధ్యాయం - 42)


Thursday, 8 February 2024

శ్రీ గరుడ పురాణము (84)

 


మహేశా! ఈశానదేవునికి కూడా అయిదు కళలుంటాయి. ముందుగా ఆ స్వామిని ఓం ఈశానాయ నమః అనే మంత్రంతో పూజించిన అనంతరం ఆ కళలను ఈ క్రింది మంత్రాలతో పూజించాలి. 

ఓం హాం సమిత్యై నమః

ఓం హాం అంగదాయై నమః

ఓం హాం కృష్ణాయై నమః

ఓం హాం మరీచ్యై నమః

ఓం హాం జ్వాలాయై నమః


శంకరా! ఆ తరువాత ఓం హాం శివపరివారేభ్యో నమః అంటూ పరమశివుని పరివారాన్నీ ఆ తరువాత ఈ క్రింది మంత్రాలతో దిక్పాలకులనూ, అనంతునీ, బ్రహ్మనీ, చండేశ్వరునీ ఆవాహన చేసి స్థాపన, సన్నిధాన, సంనిరోధ, సకలీకరణాలను గావించాలి.


ఓం హాం ఇంద్రాయ సురాధిపతయే నమః, 

ఓం హాం అగ్నయే తేజోధిపతయే నమః, 

ఓం హాం యమాయ ప్రేతాధిపతయే నమః, 

ఓం హాం నిరృతయే రక్షోఽధిపతయే నమః, 

ఓం హాం వరుణాయ జలాధిపతయే నమః, 

ఓం హాం వాయవే ప్రాణాధిపతయే నమః, 

ఓం హాం సోమాయ నేత్రాధిపతయే నమః, 

ఓం హాం ఈశానాయ సర్వవిద్యాధిపతయే నమః, 

ఓం హాం అనంతాయ నాగాధిపతయే నమః, 

ఓం హాం బ్రహ్మణే సర్వలోకాధిపతయే నమః, 

ఓం హాం ధూలి చండేశ్వరాయ నమః,


అనంతరము తత్త్వ న్యాస, ముద్రాప్రదర్శన, ధ్యానాలను నిర్వర్తించి పాద్య, ఆసన, అర్ఘ్య, పుష్ప, అభ్యంగ, ఉద్వర్తన, స్నాన, సుగంధానులేపన, వస్త్ర అలంకార, భోగ, అంగన్యాస, ధూప, దీప, నైవేద్యార్పణ, తాంబూల నివేదనల ద్వారానూ, నృత్య, వాద్య, గీతాలతోనూ మహేశ్వరుని సంతుష్టపఱచాలి. దేవదేవుని రూపాన్ని మనసులో ధ్యానిస్తూ జపం చేయాలి. పూజనూ, జపాన్నీ ఆయనకే సమర్పించి వేయాలి.


ఈ ప్రకారంగానే వివిధ కామనల సిద్ధికై విశ్వావసు అను గంధర్వునీ కాళరాత్రీ దేవినీ కూడా ఉపాసిస్తారు.


(అధ్యాయాలు 38-41)


Wednesday, 7 February 2024

శ్రీ గరుడ పురాణము (83)

 


ఫాలలోచనా! వామదేవునికి పదమూడు కళలుంటాయి. వాటిని కూడా గంధ పుష్పాదు లతో ఓం హాం వామదేవాయ నమః అనే మంత్రంతో వామదేవుని అన్ని ఉపచారాలతో అర్చించిన తరువాత ఈ క్రింది మంత్రాలతో పూజించాలి. (కళల మంత్రాలివి) :


ఓం హాం రజసే నమః, ఓం హాం రక్షాయై నమః, 

ఓం హాం రత్యై నమః, ఓం హాం కన్యాయై నమః, 

ఓం హాం కామాయై నమః, ఓం హాం జనన్యై నమః, 

ఓం హాం క్రియాయై నమః, ఓం హాం వృద్ద్యై నమః, 

ఓం హాం కార్యాయై నమః, ఓం హాం *రాత్ర్యై నమః,

ఓం హాం భ్రామణ్యై నమః, ఓం హాం మోహిన్యై నమః,

ఓం హాం *క్షరాయై నమః


(*కొన్ని ప్రాచీన గ్రంథాలలో రాత్రికి బదులు 'ధాత్రి', క్షరకి బదులు 'త్వర' అనేవి వామదేవ కళలుగా చెప్పబడినవి. వాటినైతే 'ఓం హాం ధాత్ర్యై నమః', 'ఓం హం త్వరాయై నమః' అనే మంత్రాలతో పూజించాలి)


హే మహేశ్వరాదులారా! తత్పురుష దైవతానికి నాలుగు కళలుంటాయి. ముందు ఓం హాం తత్పురుషాయ నమః అనే మంత్రం ద్వారా ఆ దేవతను పూజించి ఆ తరువాత ఈ క్రింది మంత్రాల ద్వారా ఆ కళలనర్చించాలి. ఓం హాం నివృత్యై నమః, ఓం హాం ప్రతిష్ఠాయై నమః, ఓం హాం విద్యాయై నమః, ఓం హాం శాంత్యై నమః.


పిమ్మట అఘోర భైరవ సంబంధి కళలారింటినీ ముందుగా ఓం హాం అఘోరాయ నమః అనే మంత్రంతో ఆయనను పూజించిన పిమ్మట ఈ క్రింది మంత్రాలతో పూజించాలి. ఓం హాం ఉమాయై నమః, ఓం హాం క్షమాయై నమః, ఓం హాం నిద్రాయై నమః, ఓం హాం వ్యాధ్యై నమః, ఓం హాం క్షుధాయై నమః, ఓం హాం తృష్ణాయై నమః.


Tuesday, 6 February 2024

శ్రీ గరుడ పురాణము (82)

 


'ఓం హాం శివాసనదేవతా ఆగచ్ఛత' అనే మంత్రంతో ఆసన దేవతలందరినీ ఆవాహనం చేసి, మండల ముఖ్యద్వారంలో స్నాన, గంధాదులతో ఈ క్రింది మంత్రాల ద్వారా ఆయా మంత్రాధి దేవతలను పూజించాలి.


ఓం హాం గణపతయే నమః,

ఓం హాం సరస్వత్యై నమః, 

ఓం హాం నందినే నమః,

ఓం హాం మహాకాలాయ నమః,

ఓం హాం గంగాయై నమః,

ఓం హాం లక్ష్యైనమః,

ఓం హాం మహాకాలాయై నమః,

ఓం హాం అస్త్రాయ నమః,

ఓం హాం బ్రహ్మణే వాస్త్వధిపతయే నమః,

ఓం హాం గురుభ్యో నమః,


ఆధారశక్తి నుండి అనైశ్వర్య శక్తి దాకా గల అన్ని మంత్రాలనూ (కూర్మ, పృథ్వి తప్ప) పంచతత్త్వ పూజలోలాగే చదివి, తరువాత


ఓం హాం ఊర్ధ్వచ్ఛందాయ నమః,

ఓం హాం అధశ్ఛందాయ నమః, 

ఓం హాం పద్మాయ నమః,

ఓం హాం కర్ణికాయై నమః,

ఓం హాం వామాయై నమః,

ఓం హాం జ్యేష్ఠాయై నమః,

ఓం హాం రౌద్ర్యై నమః,

ఓం హాం కాల్యై నమః,

ఓం హాం కలవికరణ్యై నమః,

ఓం హాం బలప్రమథిన్యై నమః,

ఓం హాం సర్వభూతదమన్యై నమః,

ఓం హాం మనోన్మన్యై నమః,

ఓం హాం మండలత్రితయాయ నమః,

ఓం హాం హౌంహం శివమూర్తయే నమః,

ఓం హాం విద్యాధిపతయే నమః, 

ఓం హాం హీం హౌం శివాయ నమః,

ఓం హం హృదయాయ నమః,

ఓం హీం శిరసే నమః,

ఓం హూం శిఖాయై నమః,

ఓం హైం కవచాయ నమః,

ఓం హౌం నేత్రత్రయాయ నమః,

ఓం హం అస్త్రాయ నమః,

ఓం హాం సద్యోజాతాయ నమః


సద్యోజాత భగవానునికి ఎనిమిది కళలుంటాయి. వాటిని పూర్వాది దిశలో, క్రమంగా గంధాదులతో ఈ క్రింది మంత్రాలతో పూజించాలి.


ఓం హాం సిద్ద్యై నమః, ఓం హాం బుద్ద్యై నమః,

ఓం హాం విద్యుతాయై నమః, ఓం హాం లక్ష్మ్యై నమః,

ఓం హాం బోధాయై నమః, ఓం హాం కాల్యై నమః

ఓం హాం స్వధాయ నమః, ఓం హాం ప్రభాయై నమః


Monday, 5 February 2024

శ్రీ గరుడ పురాణము (81)

 


గాయత్రి మంత్ర ప్రథమ పాదాన్ని, అనగా, తత్సవితుర్వరేణ్యంను కవచంలోనూ, రెండవ పాదం భర్గోదేవస్య ధీమహిని నేత్రాలలోనూ, మూడవ పాదం థియోయోనః ప్రచోదయాత్ ను చేతులలోనూ, నాలుగవ పాదమైన పరోరజసేఽసావదోం ను సర్వాంగాల లోనూ న్యాసంచేయాలి. విధంగా సంధ్యావందనముచేసేవారికి సర్వశుభాలూ ప్రాప్తిస్తాయి.

 

గాయత్రి యొక్క మొదటి మూడు పాదాలూ బ్రహ్మ, విష్ణు, శివ స్వరూపాలు. ఋషినీ, ఛందాన్నీ స్మరిస్తూ మంత్రజపం చేసేవారికి బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది.

 

'పరోరజసేఽసావదోమ్'ని గాయత్రి తురీయ (శ్రేష్ఠ) పాదమంటారు. దీనికి ఋషి నిర్మలుడు, ఛందం గాయత్రి, దేవత పరమాత్మ.

 

ప్రాతః, మధ్యాహ్న, సాయంకాలాలలో 1008 లేదా 108 మార్లు గాయత్రి మంత్రాన్ని పఠించేవారు బ్రహ్మలోకానికి వెళ్ళే అధికారాన్ని పొందుతారు. (అధ్యాయాలు 35-37)

 

దుర్గాదేవి స్వరూపం సూర్యధ్యానం మరియు మాహేశ్వరీ పూజన విధి

 

మహాదేవా! నవమి మున్నగు తిథులలో 'ఓం హ్రీం దుర్గే రక్షిణి' అనే మంత్రంతో పూజించాలి. మార్గశిర తదియనాడు మొదలు పెట్టి క్రమగా నామాలతో రోజుకొక్క స్వరూపంతో అమ్మవారిని పూజించాలి. నామరూపాలేవనగా గౌరీ, కాళీ, ఉమా, దుర్గా, భద్రా, కాంతీ, సరస్వతీ, మంగళా, విజయా, లక్ష్మీ, శివా, నారాయణీశక్తులు. నామ, రూప, శక్తులు గల దేవిని పూజించువానికి ఇష్టవస్తు, ప్రియజన వియోగముండదు.

 

దుర్గాదేవికి పదునెనిమిది హస్తాలుంటాయి. వాటిలో ఖేటక, ఘంట, దర్పణ, ధను, ధ్వజ, డమరు, పరశు, పాశ, శక్తి, ముద్గర, శూల, కపాల, బాణ, అంకుశ, వజ్ర, చక్ర, శలాకలుండగా ఒకే చేయి తర్జనీ ముద్రలో వుంటుంది. అష్టాదశ భుజియైన దేవి స్వరూపాన్ని స్మరించిన వారికి అప్లైశ్వర్యాలూ అబ్బుతాయి. మహిషాసుర మర్దినియైన దేవి సింహంపై వుంటుంది.

 

శివదేవా! సూర్యార్చన విధిలో సూర్యభగవానుని తేజః స్వరూపాన్ని, రక్త వర్ణ కాంతి రూపాన్ని, శ్వేతపద్మంపై స్థితుని, ఏకచక్ర రథంపై ఆసీనుని, ద్విభుజయుక్తుని, కమలధరుని ధ్యానించాలి. (అనుబంధం-7లో చూడండి) మాహేశ్వరి పూజను వర్ణిస్తాను వినండి. ముందుగా స్నానం, ఆచమనం నిర్వర్తించి ఆసనంపై కూర్చుని న్యాసం చేసి ఒక మండలంలో మహేశ్వరుని చిత్రించి పూజించాలి. హరపూజను వీలైనంత ఎక్కువగా హరుని పరివారమంతటితో సహా చేయాలి.


Sunday, 4 February 2024

శ్రీ గరుడ పురాణము (80)

 


రజస్తమోగుణాల వల్లనూ, అజ్ఞానం వల్లనూ, జాగ్రత్, స్వప్న, సుషుప్తి అనే అవస్థలలోనూ మనం చేసుకున్న పాపాలూ, కాయిక, వాచిక, మానసిక పాపాలూ ఈ మంత్రాల వల్ల నశిస్తాయి.


కుడిచేతిలో నీటిని తీసుకొని దానిని ద్రుపదాం అనే మంత్రం ద్వారా అభిమంత్రితం చేసి తలపై పోసుకోవాలి. అఘమర్షణ మంత్రాలతో మూడు, ఆరు, ఎనిమిది లేదా పన్నెండు ఆవృతులను చేసి అఘమర్షణం చేసుకోవాలి. ఈ మంత్రాలేవనగా 

ఋతుంచ చాభీద్దాత్త పసోమఽధ్యజాయత । 

తతో రాత్ర్య జాయత | తతః సముద్రో 

అర్ణవః సముద్రాదర్ల వాదధి సంవత్సరో 

అజాయత। అహోరాత్రాణి విదధద్విశ్వస్య 

మిషతోవశీ | సూర్యచంద్ర మసౌధాతా 

యథాపూర్వమకల్పయత్ | దివంచ 

పృథివీం చాంతరిక్ష మథో స్వః ॥


(ఋగ్వేదం- 10/190/1)


వీటిని పఠించిన తరువాత చేతులను కడుక్కొని తుడుచుకొని మరల ఉదుత్యం, చిత్రమ్ అనే మంత్రాలను చదివి సూర్యోపస్థానం చేయాలి. దాని వల్ల దిన, రాత్రులలో చేసే పాపాలన్నీ నాశనమైపోతాయి.


ప్రాతఃకాలీనసంధ్యను నిలబడి వార్చాలి. ఇతర సంధ్యావందనాలను కూర్చుని చేయాలి. గాయత్రీమంత్రాన్ని పదిమార్లు జపిస్తే ఈ జన్మలో చేసిన పాపాలూ, వందమార్లు జపిస్తే పూర్వ జన్మపాపాలూ, వెయ్యిమార్లు జపిస్తే యుగంలో చేసిన పాపాలూ నశిస్తాయి.


(ఆచార 36/10)


గాయత్రి, సావిత్రి, సరస్వతి అనే మూడు మహాశక్తులు ఈ మంత్రం ద్వారా లభిస్తాయి. అవి క్రమంగా పొద్దున్న రక్తవర్ణంలోనూ, మధ్యాహ్నం శుక్లవర్ణంలోనూ, సాయంత్రం కృష్ణ వర్ణంలోనూ వుంటాయని పెద్దలు చెప్తారు.


ఇక వ్యాహృతి పూర్వక అంగన్యాసం ఇలా చేయాలి. గాయత్రి మంత్ర ప్రథమ వ్యాహృతియైన భూః ను 'ఓం భూః హృదయాయ నమః అంటూ గుండెలోనూ, ద్వితీయ వ్యాహృతియైన భువః ను ఓం భువః శిరసే స్వాహా అంటూ తలపైనా, తృతీయ వ్యాహృతి స్వః ను ఓం స్వః శిఖాయైవషట్ అంటూ శిఖలోనూ న్యాసము చేయాలి.


Saturday, 3 February 2024

శ్రీ గరుడ పురాణము (79)

 


గాయత్రి మంత్రాన్ని చదువుతూ ముట్టుకునే వస్తువులూ, చూసే పదార్థాలూ కూడా పవిత్రాలై పోతాయి.


యద్యత్ స్పృశతి హస్తేన

యచ్చ పశ్యతి చక్షుషా !

పూతం భవతి తత్ సర్వం

గాయత్ర్యా న పరం విదుః ||


దేవతలారా! వేయిమాటలేల? గాయత్రికంటె శ్రేష్ఠమైన మంత్రం లేదు. (ఆచార-35/11)


మహాదేవా! ఇక సర్వపాపనాశినియగు సంధ్యావందన విధిని వినిపిస్తాను. ముందుగా మూడుమార్లు *ప్రాణాయామం చేసి సంధ్యాస్నానానికి ఉపక్రమించాలి.


(* ప్రాణాయామాత్పూరమే సంధ్యోపాసనలో మాలాధారణ, పవిత్రీకరణ, శిఖాబంధన, భస్మధారణ, ఆచమన, మార్జన, భూమిశోధన, సంకల్పం, 'ఋతశ్చం' మంత్రపూత ఆచమనం వుంటాయని 'నిత్యకర్మ-పూజా ప్రకాశ' మను ప్రామాణిక గ్రంథంలో చెప్పబడింది.)


ప్రాణవాయువును సంయతం చేసుకొని (అదుపులో నుంచుకొని) ఓంకారంతో, సప్తవ్యాహృతులతో యుక్తమైన ఆపోజ్యోతీ రసోఽమృతం భూర్భువః స్వరోం అనే మంత్రాన్ని మూడుమార్లు పలకడాన్నే ప్రాణాయామమంటారు. ద్విజుడు ప్రాణాయామాల ద్వారా మానసిక, వాచిక, కాయిక దోషాలను భస్మం చేయగలడు. కాబట్టి మనం యథావిధి, యథానియతి అన్ని కాలాల్లో ప్రాణాయామ పరాయణులమై వుండాలి.


ప్రొద్దున్న సూర్యశ్చ అనే మంత్రంతోనూ, మధ్యాహ్నం ఆపఃపునంతు. అనే మంత్రం తోనూ, సాయంకాలం అగ్నిశ్చమామన్యుక్ష అనే మంత్రంతోనూ యధావిధి ఆచమనం చేసి ప్రణవమంత్ర యుక్తమైన ఆపోహి అనే ఋచాతో కుశోదకం ద్వారా మార్జనం చేసుకుంటూ మంత్ర ప్రతిపాదానికి ఒక మారు తలపై నీళ్ళు చిలకరించు కుంటుండాలి.


(సంధ్యావందన సమయంలో తప్పనిసరిగా పఠించవలసిన సప్తమంత్రాలూ అనుబంధం- 6 లో పూర్తిగా ఇవ్వబడ్డాయి)