ముఖ్యద్వార స్థానంలోనే ధ్వజాదులనూ గర్భగృహాన్నీ నిర్మించాలి. సూత్రంతో జాగ్రత్తగా కొలిచి సరిసంఖ్యల గుణింతాలలో మండపాన్ని నిర్మిచంచి అందులో నాలుగవ వంతు కొలతలతో నొక భద్రగృహాన్ని నిర్మించాలి. భద్రగృహంలో కిటికీలుండవు. ప్రాసాదంలో ఏర్పాటు చేసే లతా మండపానికి భూమిని, విషమంగానూ అనేక రంగులతోనూ చేయాలి. పరిమాణపు లెక్కలు అవసరం లేదు. విషమరేఖలతో అలంకరించాలి.
ప్రాసాదము యొక్క ఆధారభూమి నాలుగు దిక్కులలో నాలుగు ద్వారాలతో నాలుగు మండపాలతో సుశోభితమై వుండాలి. నూరు శృంగాల (బురుజు స్తంభాల)తో వుండే ప్రాసాదాన్ని మేరు ప్రాసాదమంటారు. ఇది ఉత్తమం. ఇందులో ప్రతిమండపానికీ మూడేసి భద్రగృహాలుండాలి.
ఇవేకాక ఎన్నో రకాల దేవ ప్రాసాదాలున్నాయి. స్వయంభూదేవతల కోసం నిర్మించే ప్రాసాదాలకు పెద్దగా నియమాలుండవు.
చతురస్ర ఆలయాలలో చంద్రశాలయుక్తాలైన అరుగులుండాలి. వాటికెదురుగా ఆయా దేవతల వాహనాలకై లఘు మండపాలను నిర్మించాలి. దేవప్రాసాదాలలో ద్వారానికి దగ్గరగా నాట్యశాల వుండాలి. ద్వారపాలుర విగ్రహాలు శాస్త్రోక్తంగా నిర్మింపబడాలి. ఆలయానికి దగ్గర్లోనే అందులోనే పని చేసేవారికి ఇళ్ళు కట్టించాలి.
No comments:
Post a Comment