Sunday, 25 February 2024

శ్రీ గరుడ పురాణము (102)

 


తరువాత యజ్ఞగురువు ఒక అర్ఘ్యపాత్రలో గంధాదియుక్త జలాన్ని నింపి దాన్ని మంత్ర సమూహంతో అభిమంత్రించి ఆ జలాన్ని యజ్ఞమండపమంతటా జల్లాలి. తరువాత ఆ రోజు ప్రతిష్టితమవుతున్న దేవతామూర్తి పేర మండప ఈశాన కోణంలో నొక కలశను స్థాపించి దాని దక్షిణభాగంలో అస్త్రమంత్రాలతో అభిమంత్రింపబడిన "వర్ ద్ధిని'ని స్థాపించాలి. (* ఒకలాంటి కమండులువు. కలశ వలె పెద్దది. దేవ ప్రతిష్ఠలలోనే ఎక్కువగా వాడతారు.) తరువాత దానినీ, కలశనూ, గ్రహాలనూ, వాస్తోష్పత్తినీ ఆచార్యులు యథావిహిత ఆసనాలపై ప్రతిష్ఠించి పూజించి పలుమార్లు ప్రణవమంత్రాన్ని జపించాలి. తరువాత ఆ కలశను పంచరత్నాలు అద్దబడిన రెండు వస్త్రాలతో ఆచ్ఛాదించి, అన్ని ప్రకారాల సుగంధాల పొడినీ, ఔషధాల ముద్దనీ దానికి పూసి మరల ఆ కలశను ఆ రోజు ప్రతిష్ఠింపబడు దేవత యొక్క చిన్న ప్రతిమను అందులో స్థాపించి ఆ మూర్తినీ పూజించాలి.


తరువాత వర్ద్ధినిని వస్త్రాలతో కప్పి దానిని కలశతో బాటు అటూ ఇటూ తిప్పాలి. తరువాత దానిలోని నీటితో కలశను తడిపి ఆ కలశకు ముందలి జాగాలో దానిని స్థాపించాలి. స్థండిలముపై వీటిని పెట్టి మూలదేవతను కూడా వుంచి పూజించాలి.  


వాయవ్యకోణంలోనొక కుండను స్థాపించి గణపతినందులోకి ఆవాహన చేసి ఓం గణానాం త్వేతి... అనే మంత్రంతో ఆయనను పూజించాలి. ఈశాన కోణంలో మరొకఘటాన్ని పెట్టి అందులో ఓం వాస్తోష్పతే... అనే మంత్రంతో ఆయనను రావించి పూజించాలి. కుంభానికి (కలశ మొదలగు వాటికి తూర్పువైపున భూతాలకూ గణదేవులకూ బలులిచ్చి వేదిని 'ఆలంభనం' చేయాలి. ఆకుపచ్చని దర్భలను ఓం యోగేయోగేతి... అనే మంత్రంతో సిద్ధం చేసి ఒక స్నానపీఠంపై నుంచి ఆచార్యుడూ, ఋత్విజులూ, యజమానీ కలిసి ప్రతిష్ఠింపబోయే దేవమూర్తిని దానిపై ప్రతిష్ఠించాలి. ఆ సమయంలో ఆ ప్రాంతం వైదిక మంత్రోచ్ఛాటనలతో జయ జయధ్వానాలతో, వైదికమంత్ర ధ్వనులతో మార్మోగిపోవాలి.


స్నానార్థం ఆ దేవతామూర్తిని పీఠసహితంగా బ్రహ్మరథంపై మండపానికి ఈశాన్య కోణంలో అవస్థితం చేయాలి. తరువాత ఓం భద్రం కర్ణేతి... అనే మంత్రం పూర్తిగా పఠిస్తూ స్నానం చేయించి ఆ మూర్తిని యజ్ఞేయ సూత్రంతోగాని వల్కల వస్త్రంతోగాని శుభ్రంగా తుడిచి తూర్యాది వాద్యయంత్రాలను మ్రోయిస్తూ ఆ దేవతామూర్తికి 'లక్షణోద్ధారం' అనగా నామకరణం చేయాలి.


No comments:

Post a Comment