Friday 23 February 2024

శ్రీ గరుడ పురాణము (99)

 


మన దేవాలయాలు కళలకు కాణాచులు. నాట్యం, సంగీతం నిరంతరం పిల్లలకు చెప్పబడుతూ వుండాలి. సంస్కృత వ్యాకరణం, ఇతర భాషల వ్యాకరణాలు కూడా గురువులు అక్కడ ఉచితంగా బోధించి దైవానికి ఆత్మబంధువులగా ఎదగాలి. విద్యాలయాలలో జీతం పుచ్చుకొని పనిచేయడం విద్యాదానం కాదు. కోవెలలో కోటి విద్యలను కాకున్నా తమకి వచ్చిన కొన్ని విద్యలను విద్యార్తులైన విద్యార్థులకు నేర్పడం ద్వారా గురువులు (టీచర్లు, లెక్చరర్లు, ప్రొఫెసర్లు) సార్థక జన్ములౌతారు. దేవాలయాన్ని నిర్మించినపుడే విద్యాలయానికి అవసరమైన స్థలాన్నీ కేటాయించి, ఆ వాతావరణాన్ని కల్పిస్తుంది హిందూమతం.


(అధ్యాయం - 47)


దేవప్రతిష్ఠ - సామాన్య విధి


విష్ణువు శివాది దేవతలకూ, సూతుడు శౌనకాది మహామునులకూ విగ్రహప్రతిష్ఠనెలా చేయాలో చెప్పసాగారు.


ప్రశస్తమైన తిథులనూ నక్షత్రాలనూ ఎంచుకొని ఈ పుణ్యకార్యాన్ని మొదలుపెట్టాలి. ముందుగా యజమాని తన వైదిక శాఖలో విధించబడిన బీజాక్షరాన్ని గానీ ఓంకారాన్ని గానీ వీలైనంత సేపు ఉచ్ఛరించి అయిదుగురు లేదా అంతకంటే ఎక్కువమంది ఋత్విజులను ఎంచుకొని తెచ్చి ఆదరంగా ఆసీనులను చేసి వేరొక మహానుభావుని ఆచార్యునిగా వరించి తెచ్చి వారి మధ్యలో కూర్చుండబెట్టాలి. తరువాత పాద్య, అర్ఘ్య, ముద్రిక, వస్త్ర, గంధ, మాల్య, అనులేపనీయద్రవ్యాలతో వారందరినీ సాదరంగా పూజించాలి. అప్పుడు ఆచార్యదేవులు మంత్రన్యాసపూర్వకంగా ప్రతిష్టాకర్మను సమారంభం గావించాలి.


మందిరం (లేదా దేవప్రాసాదం) అగ్రభాగంలో (అనగా ముందుభాగంలో) పది లేదా పన్నెండు హస్తాల పరిమాణంలో నొక మండపాన్ని నిర్మించి దానిపై పదహారు స్తంభాలను ఏర్పాటు చేసి వాటిలో ఎనిమిది మూలల్లో ఎనిమిది (నాలుగు దిక్కులు, నాలుగు మూలలు అని అర్థము) ధ్వజాలను ప్రతిష్టించాలి. తరువాత ఆ మండప మధ్యంలో నాలుగు హస్తాల పరిమాణంలోనొక వేదిని నిర్మించాలి. ఆ వేదిపై నదుల సంగమస్థానం తీరం నుండి తెచ్చిన ఇసుకను నెఱపాలి. ప్రధానకుండాన్ని నిర్మింపజేసి దానికి తూర్పున చతురస్రాకారంలోనూ, దక్షిణంలోనూ ధనురాకారంలోనూ, పశ్చిమంలో గుండ్రంగానూ, ఉత్తరంలో పద్మాకారంలోనూ మొత్తం నాలుగు కుండాలను నిర్మించాలి.


కుండనిర్మాణం తరువాత ఇష్టసిద్ధికై ఆచార్యుని చేతా, శాంతి కర్మకై ఇతరుల చేతా హవనం చేయించాలి. సాధారణంగా దీనికి ఈశానకోణంలోనున్న భూమిని ఆవుపేడతో అలికిన స్థలాన్ని వాడతారు.


No comments:

Post a Comment