Saturday 3 February 2024

శ్రీ గరుడ పురాణము (79)

 


గాయత్రి మంత్రాన్ని చదువుతూ ముట్టుకునే వస్తువులూ, చూసే పదార్థాలూ కూడా పవిత్రాలై పోతాయి.


యద్యత్ స్పృశతి హస్తేన

యచ్చ పశ్యతి చక్షుషా !

పూతం భవతి తత్ సర్వం

గాయత్ర్యా న పరం విదుః ||


దేవతలారా! వేయిమాటలేల? గాయత్రికంటె శ్రేష్ఠమైన మంత్రం లేదు. (ఆచార-35/11)


మహాదేవా! ఇక సర్వపాపనాశినియగు సంధ్యావందన విధిని వినిపిస్తాను. ముందుగా మూడుమార్లు *ప్రాణాయామం చేసి సంధ్యాస్నానానికి ఉపక్రమించాలి.


(* ప్రాణాయామాత్పూరమే సంధ్యోపాసనలో మాలాధారణ, పవిత్రీకరణ, శిఖాబంధన, భస్మధారణ, ఆచమన, మార్జన, భూమిశోధన, సంకల్పం, 'ఋతశ్చం' మంత్రపూత ఆచమనం వుంటాయని 'నిత్యకర్మ-పూజా ప్రకాశ' మను ప్రామాణిక గ్రంథంలో చెప్పబడింది.)


ప్రాణవాయువును సంయతం చేసుకొని (అదుపులో నుంచుకొని) ఓంకారంతో, సప్తవ్యాహృతులతో యుక్తమైన ఆపోజ్యోతీ రసోఽమృతం భూర్భువః స్వరోం అనే మంత్రాన్ని మూడుమార్లు పలకడాన్నే ప్రాణాయామమంటారు. ద్విజుడు ప్రాణాయామాల ద్వారా మానసిక, వాచిక, కాయిక దోషాలను భస్మం చేయగలడు. కాబట్టి మనం యథావిధి, యథానియతి అన్ని కాలాల్లో ప్రాణాయామ పరాయణులమై వుండాలి.


ప్రొద్దున్న సూర్యశ్చ అనే మంత్రంతోనూ, మధ్యాహ్నం ఆపఃపునంతు. అనే మంత్రం తోనూ, సాయంకాలం అగ్నిశ్చమామన్యుక్ష అనే మంత్రంతోనూ యధావిధి ఆచమనం చేసి ప్రణవమంత్ర యుక్తమైన ఆపోహి అనే ఋచాతో కుశోదకం ద్వారా మార్జనం చేసుకుంటూ మంత్ర ప్రతిపాదానికి ఒక మారు తలపై నీళ్ళు చిలకరించు కుంటుండాలి.


(సంధ్యావందన సమయంలో తప్పనిసరిగా పఠించవలసిన సప్తమంత్రాలూ అనుబంధం- 6 లో పూర్తిగా ఇవ్వబడ్డాయి)


No comments:

Post a Comment