వాస్తు మండల పూజావిధి
గృహనిర్మాణ ప్రారంభంలో విఘ్నమేదీ రాకుండా కాపాడుమని వాస్తు పురుషుని వేడుకుంటూ చేసే పూజ ఇది. ఈ వాస్తుపూజకై ఎనుబది యొక్క అడుగుల మండపాన్ని నిర్మించి దానిలోని ఈశాన్య కోణంలో పూజను మొదలెట్టి మండపమంతటా సంపూర్ణంగా వ్యాపింపజేయాలి.
ఈ మండల (లేదా మండప) ఈశాన్య కోణంలో వాస్తుదేవత మస్తకాన్ని నిర్మించాలి. నైరృతిలో రెండు పాదాలూ, మిగతా రెండు మూలల్లో చేతులూ వుండాలి. ఏ నిర్మాణాన్ని చేపట్టినా ముందుగా ఈ వాస్తు దేవతను స్థాపించి పూజించాలి. తరువాత ఇరువది యొక్కమంది దేవతలను మండల బాహ్యభాగంలోనూ పదముగ్గురు దేవతలను అంతర్భాగములోనూ ఉంచాలి.
బాహ్య దేవతలు వీరు : ఈశ, శిఖి, పర్జన్య, జయంత, కులిశాయుధ, సూర్య, సత్య, భృగు, ఆకాశ, వాయు, పూష, వితథ, గ్రహక్షేత్ర, యమ, గంధర్వ, భృగురాజ, మృగ, పితృగణ, దౌవారిక, సుగ్రీవ, పుష్పదంత, గణాధిప, అసుర, శేష, పాప, రోగ, అహిముఖ, భల్లాట, సోమ, సర్ప, దితి, అదితి వీరిని పూజించిన తరువాత ఈశాన్యంలో జలాన్నీ, ఆగ్నేయంలో సావిత్రినీ, నైరృత్యంలో జయనీ, వాయవ్యంలో రుద్రదేవునీ పూజించాలి. తరువాత తొమ్మిదడుగుల జాగాలో బ్రహ్మనీ ఆయనకు ఎనిమిది వైపులా తూర్పున మొదలెట్టి అర్యమ, సవిత, వివస్వాన్, విబుధాధిప, మిత్ర, రాజయక్ష్మ, పృథ్వీధర, అపవత్స అనే దేవతలను మండలం లోపల స్థాపించి పూజించాలి.
లోపలి భాగంలో పూజించవలసిన దేవతలు వీరు - వీరందరినీ రేఖలను జాగ్రత్తగా గీసి వాటి బిందువులపై పూజించాలి. ఈశాన్యం నుండి నైరృత్యం దాకా సూత్రం ద్వారా గీయబడిన రేఖను 'వంశ' అంటారు. అలాగే ఆగ్నేయం నుండి వాయవ్యానికున్న రేఖను 'దుర్ధర' అంటారు. వంశరేఖపై ఈశాన్య కోణంలో అదితినీ, దుర్ధరయోగ బిందువుపై హిమవంతునీ, నైరృత్య కోణాంతిమ బిందువుపై జయంతునీ పూజించాలి.
No comments:
Post a Comment