Monday, 12 February 2024

శ్రీ గరుడ పురాణము (88)

 


త్రివర్గ సిద్ధికై తానీ పవిత్రకాన్ని ధరిస్తున్నాని దేవునికి విన్నవించిన సాధకుడు ఆయనను ఇలా ప్రార్థించాలి.


వనమాలా యథాదేవ

కౌస్తుభం సతతం హృది |

తద్వత్ పవిత్రం తంతూనాం

మాలాం త్వం హృదయే ధర ॥


(ఆచార 43/41)


అనంతరం బ్రాహ్మణులకు భోజనాలు పెట్టి దక్షిణలిచ్చి సాయంకాలంగానీ మరునాడుగానీ మరల ఇలాగే పూజనొనర్చి ఈ క్రింది మంత్రాన్ని చదువుతూ దీక్షను విరమించాలి.


సాంవత్సరీ మిమాం పూజాం

సంపాద్య విధి వన్మయా |

ప్రజపవిత్రకే దానీం

విష్ణులోకం విసర్జితః ||


(ఆచార 43/43)


తన వల్ల విసర్జింపబడుతున్న పవిత్రకం తనకన్న ముందే విష్ణులోకం చేరాలని సాధకుని ఉద్దేశ్యం. (అధ్యాయం -43)


బ్రహ్మమూర్తి ధ్యాన నిరూపణం


పవిత్రకంతో భగవానుని పూజించి, ఆ పై శాస్త్రోక్తంగా బ్రహ్మను ధ్యానించిన సాధకుడు హరి సమానుడవుతాడు. (అంటే నా స్వరూపమే వానికీ వస్తుంది). మాయా జాలాన్ని ముక్కలు చేసే బ్రహ్మధ్యానాన్ని వినిపిస్తాను.


ప్రాజ్ఞుడు-అనగా విశేషసాధకుడు తన వాణినీ, మనసునీ అదుపులో పెట్టుకొని తన ఆత్మలో జ్ఞాన స్వరూపుడైన బ్రహ్మ కోసం యజ్ఞం చెయ్యాలి. జీవ-బ్రహ్మల అభేద దర్శనాన్ని వాంఛించి, దానికోసం తపము చేసి మహద్ బ్రహ్మజ్ఞాన భావనను కొంతకాలం పాటు భావించాలి.


బ్రహ్మధ్యానమే సమాధి. 'అహం బ్రహ్మాస్మి' అనే స్థాయికి చేరుకోవడం సమాధి ద్వారానే సాధ్యం. తనకంటె భిన్నుడు కాని బ్రహ్మను తురీయ రూపుడని కూటస్థ నిరంజన పరబ్రహ్మయని వేదాలు వర్ణించాయి. ఈ స్థితిని చేరుకోగలిగిన సాధకుడు దేహ, ఇంద్రియ, మనోబుద్ధ్యహంకారాలు, పంచమహాభూతాలు, పంచతన్మాత్రలు, (గంధ, రస, రూప, స్పర్శ, శబ్దాలు) వివిధ గుణ, జన్మ, భోజన శయనాది భోగాలు- వీటన్నిటికీ అతీతుడవుతాడు.


No comments:

Post a Comment