Saturday, 3 August 2024

శ్రీ గరుడ పురాణము (254)

 


కాలం బహుశక్తివంతం. దానిని గెలుచుట కష్టసాధ్యం. అది దురతిక్రమణీయం. అదే ప్రాణులను పరిపాలిస్తుంది, సంహరిస్తుంది, ప్రాణులు నిద్రిస్తున్నా అది నిద్రించదు. కాలమే మానవ జీవితంలోని అన్ని ఘట్టాలనూ నిర్ణయిస్తుంది.


ఋషులారా! బృహస్పతి బోధనలవల్లే ఇంద్రాది దేవతలు నీతిజ్ఞులు కూడ అయినారు. ఆయన ఇంకా ఇలా చెప్పాడు:


స్థితిమంతులంతా అశ్వమేధయాగం చెయ్యాలి. దేవుళ్ళను పూజించినంత భక్తిశ్రద్ధలతోనే బ్రాహ్మణులనూ రాజర్షులనూ పూజించాలి.


ఉత్తమైః సహసాంగత్యం పండితైః సహ సత్కథాం ।

అలుబైః సహమిత్రత్వం కుర్వాణో నావసీదతి ॥


(ఆచర ... 108/12)


ఉత్తమ ప్రకృతి గల మంచివారితో కలిసి తిరగడం, పండితులతో మాట్లాడుతూ వారికి సల్లాపంబునందుల్లాసంబు కలిగింపజేసి ఉత్తమ కథలను విశేషాలను వినడం, లోభులు కాని వారితో స్నేహం చేయడం వీటిని పాటించే బుద్ధిమంతుడు సుఖపడతాడు.


ఇతరులను నిందించుట, పరుల ధనాన్ని అపహరించుట, మగనాలితో సరసాలాడుట, తనది కాని ఇంటిలో నుందుట ఎన్నడూ చేయరాదు. మనకి మేలు చేసేవాడు పరుడైనా బంధువే; మనకి కీడు చేసేవాడు బంధువైనా పరుడే అని గ్రహించాలి.



ఎవరు మనను పోషిస్తారోవారే మాతాపితలు. శరీరం నుండి పుట్టినదే అయినా వ్యాధిని తగిలేయడానికే చూస్తాము కదా! ఎక్కడో అడవిలో పుట్టినదైనా మందుని మనలో కలుపుకుంటాము కదా!


పరోఽపి హితవాన్ బంధుర్బంధు రష్యహితః పరః |

అహితో దేహజో వ్యాధిర్హిత మారణ్య మౌషధం ॥

సబంధుర్వోహితే యుక్తః సపితా యస్తు పోషకః |

తన్మిత్రం యత్ర విశ్వాసః సదేశోయత్ర జీవ్యతే ॥


(ఆచార ... 108/14,15)


చూసేవాడే నేస్తం, మానింది మందు, బతికింది ఊరు అని పెద్దలంటారు కదా!

Friday, 2 August 2024

శ్రీ గరుడ పురాణము (253)

 


బృహస్పతి ప్రోక్త నీతిసారం


నైమిషారణ్యంలో శౌనకాచార్యుని జిజ్ఞాస మేరకు అర్థశాస్త్రంపై ఆధారపడిన నీతిసారాన్ని, ఒకప్పుడు ఇంద్రునికి బృహస్పతి ఉపదేశించిన దాన్ని, ఇలా బోధించసాగాడు సూతమహర్షి.


"శౌనకాది మహామునులారా! ఇది రాజులు - అనగా పరిపాలకులు, వ్యాపార సామ్రాజ్యాధినేతలు, వారి గురువులైన మునులు, బ్రాహ్మణులు ఇలా అందరూ తెలుసుకోవలసిన విషయము.


పురుషార్థ చతుష్టయాన్ని, అనగా ధర్మార్థ కామమోక్షాలను సిద్ధించుకోదలచుకున్న వాడు సజ్జనులతోనే చెలిమిచేయాలి. దుర్జన సాంగత్యంలోనే బతికేసేవాడు ఇహపరాలు రెండింటికీ చెడతాడు.


సద్భిఃసంగం ప్రకుర్వీత సిద్ధికామః సదానరః |

నాసద్భిరిహలోకాయ పరలోకాయ వాహితం ॥


(ఆచార ... 108/2)


క్షుద్రునితో సంభాషణా, దుష్టుని దర్శనమూ, శత్రు సేవకునిపై ప్రేమా, మిత్రునితో విరోధమూ, మూర్ఖునికుపదేశమూ, దుష్ట స్త్రీ నుండి సహాయ స్వీకరణమూ ప్రమాదకరములు, దుఃఖదాయకములు. కాలవైపరీత్యం వల్ల మిత్రునితో శత్రుత్వమూ, శత్రువుతో మిత్రత్వమూ నెఱపవలసి వచ్చినపుడు అది శాశ్వతంకాదని మనసులో గట్టిగా అనుకుంటూ జాగ్రత్తగా నిర్వహించాలి.


Thursday, 1 August 2024

శ్రీ గరుడ పురాణము (252)

 


కుక్కకాటుకి గురైనవాడు ఔషధసేవనం గావించి గాయత్రి మంత్రాన్ని జపిస్తే అశౌచం పోతుంది. స్వయంగా దాన్ని జపించే అర్హత లేనివారు బ్రాహ్మణునెవరినైనా ఆశ్రయించి ఆయన చేత ఈ జపాన్ని చేయించాలి. చండాలాదుల ద్వారా చంపబడిన బ్రాహ్మణుడు స్వయంగా అగ్నిహోత్రి అయితే ఆయనను లౌకికాగ్నితో దహనం చేయవచ్చును. ఆయన అస్థికలను సేకరించి మరల మంత్రపూర్వకంగా ఆయన యొక్క అగ్నిహోత్రశాల నుండి అగ్నిని తెచ్చి, అంతకు ముందే పాలతో శుద్ధి చేసిన ఆయన అస్థికలను అందులో దహనం చేయాలి. వ్యక్తి పరదేశంలో మరణిస్తే ఇక్కడి పరిజనులు తమ గృహాలలోనే కుశలతో ఆ వ్యక్తి శరీరాన్ని తయారుచేసి అగ్నికి ఆహుతిచేయాలి. ఆ పరదేశ మృతుడు అగ్నిహోత్రియైతే మృగచర్మంపై ఆరువందల పలాశ ఆకులను అతని ఆకారంలో పఱచి శిశ్నభాగంలో శమీ, వృషణభాగంలో అరణీ పెట్టి కుడిచేతి జాగాలో అన్నం కుండనీ ఎడమచేతి జాగాలో యజ్ఞియపాత్రనీ వుంచాలి. వక్షోభాగంలో సోమరసం తయారీలో వాడే రాతినుంచాలి. ముఖభాగంలో నేతిలో ముంచిన తిలలనూ, తండులాలనూ నేత్రాల వద్ద నేతికుండనూ ఉంచాలి. కనులు, చెవులు, ముక్కు, నోరు ప్రాంతాలలో చిన్న చిన్న బంగారు ముక్కలనుంచే పద్దతి కూడా వుంది. ఇలా అగ్నిహోత్రం యొక్క సమస్త ఉపకరణాలనూ వుంచి ఆ అగ్నిహోత్రి ఊహాకల్పిత కళేబరాన్ని 'అసౌస్వర్గాయ లోకాయ స్వాహా' అనే మంత్రాన్ని చదువుతూ నేతిని ఒక ఆహుతి నిచ్చి... అగ్నికి ఆహుతి చేస్తే ఆయనకు బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది.


హంస, చిలుక, క్రౌంచం, చక్రవాకం, కోడి, నెమలిలలో దేనిని వధించినా ఒక పగలూ ఒక రాత్రీ ఉపవాసం చేస్తే పాపం పోతుంది. నాలుగు కాళ్ళ పశువును (గోవును కాదు) దేనిని వధించినా ఒక రోజంతా నిలబడి, ఉపవసించి, గాయత్రిని జపిస్తే పాపశాంతి కలుగుతుంది.


శూద్రుని వధిస్తే కృచ్ఛవ్రతం చేయాలి. వైశ్యుని హత్య చేస్తే అతికృచ్ఛవ్రతము చేయాలి. క్షత్రియుని చంపితే ఇరవై రెండూ, బ్రాహ్మణుని మృతి నొందిస్తే ముప్పదీ చాంద్రాయణ వ్రతాలు చేయాలి".


(అధ్యాయం 107)


Wednesday, 31 July 2024

శ్రీ గరుడ పురాణము (251)

 


మంచివాడు, సచ్ఛరిత్రుడునైన పతిని మదమెక్కి వదిలేసిన స్త్రీ ఏడుజన్మల దాకా ఆడదానిగానే పుడుతుంది. అన్ని జన్మలలోనూ విధవగానేపోతుంది. అన్నపానాదుల విషయంలో భ్రష్టురాలైన స్త్రీ మరుజన్మలో పందిగా పుడుతుంది.


ఔరసుడూ, క్షేత్రజ్ఞుడూ ఒకే తండ్రికి పుడితే ఆ తండ్రి పోయినపుడు రెండు రకాల వాళ్ళూ పిండదానం చేయవచ్చును.


పరివేత్త (అన్నకు పెండ్లి కాకుండా తానే ముందు చేసుకున్న తమ్ముడు) పరివిత్తి (తమ్ముడికి వివాహం జరిగిపోయి తాను అది లేకుండా వుండిపోయిన అన్న) ఈ రెండు రకాల వారికీ కృచ్ఛవ్రతం చేసుకునే దాకా శుద్ది లేదు. తమ్ముని పత్ని కూడా కృచ్ఛవ్రతం చేయాలి. కన్యాదాత అతికృచ్ఛం చేసుకోవాలి. ఇటువంటి వివాహాన్ని చేయించిన పురోహితుడు చాంద్రాయణ వ్రతం చేయాలి. అప్పుడుగాని వీరికి శుద్ధి లేదు.


అన్న గూనివాడో, మరుగుజ్జో, నపుంసకుడో, నత్తివాడో, జన్మాంధుడో, ఇతర అంగ విహీనుడో అయితే మాత్రం తమ్ముడు ముందుగా వివాహం చేసుకోవచ్చును. దోషం లేదు.


నిశ్చితార్థంలో ఎవరికో వాగ్దత్తయైన కన్య ఆ వరుడు పరదేశమేగిపోయి (ఇక రాడని తెలిసి)నా, మృతి చెందినా, సన్యాసం పుచ్చుకున్నా, నపుంసకుడని తెలిసినా, పతితుడై పోయినా (ఆమె) వేరొకరిని వరించి వివాహం చేసుకొనవచ్చును. పతితోబాటు, సతీధర్మముననుసరించి, అగ్ని ప్రవేశం చేయు స్త్రీ తన శరీరంపై ఎన్ని రోమాలున్నాయో అన్నేళ్లపాటు స్వర్గంలో నివాసముండగలదు*.


* సతీసహగమనాన్ని ప్రస్తుత రాజ్యాంగం నిషేధించింది - అను


Tuesday, 30 July 2024

శ్రీ గరుడ పురాణము (250)

 


తినకూడనివి తినడం, దొంగతనం, పోకూడని చోటికి పోవడం మనిషి పతనానికి కారణాలౌతాయి. వ్యవసాయం చేసేవాడు అలసిపోయిన ఎద్దుని మరల కాడికి కట్టరాదు. దాని చేత బరువులనూ మోయించరాదు. ద్విజులు స్నానం, యోగం, పంచయజ్ఞం వీటిని మానరాదు. బ్రాహ్మణులకి నిత్యం భోజనాలు పెట్టాలి. క్రూరకర్ముల విషయంలో మొగమాటానికీ స్వార్థానికీ తావివ్వకుండా ప్రవర్తించాలి.


నువ్వులనూ, నేతినీ అమ్ముకోరాదు. పంచసూనాజనిత దోషం పోవడానికి బలి వైశ్వ దేవహోమాన్ని నిత్యం చేయాలి. రైతు తన సంపాదన లేదా పంటలోని అరవభాగాన్ని రాజుకీ, ఇరువదవ భాగాన్ని దేవునికీ, ముప్పది మూడవ భాగాన్ని బ్రాహ్మణులకీ ఇవ్వాలి. దీని వల్ల కృషి హింసా పాపం ప్రక్షాళితమవుతంది. ఈ విధంగా ఇవ్వకపోతే (పన్ను ఎగ్గొడితే) పాపం వస్తుంది. అదీ దొంగతనంతో సమానమైన పాపం !


(పరాశరుడు ఏ వర్ణానికెన్నాళ్ళు మృత్యు అశౌచముంటుందో యాజ్ఞవల్క్యుని లాగే చెప్పాడు) బంధువులలో ఈ మైల నాలుగో తరం దాకా పది రోజులు, అయిదవ తరంలో ఆరురోజులు, ఆరో తరంలో నాలుగురోజులు, ఏడవతరంలో మూడురోజులు వుంటుంది. పరదేశంలో నున్న బాలకుడు పోతే మృత్యు అశౌచం పెద్దగా వుండదు. వార్త వినగానే స్నానం చేస్తే వెంటనే శుద్ధి అయిపోతుంది.


గర్భస్రావ, గర్భపాతాలలో బిడ్డ మరణించినపుడు తల్లి ఎన్నవ నెల గర్భవతి అయి వుండినదో అన్ని రోజుల అశుచి ఆ బిడ్డ బంధుగణానికి వుంటుంది. నాలుగవ నెల వఱకూ జరిగే గర్భనష్టాన్ని గర్భస్రావమని ఆరు మాసాలు నిండేలోగా గర్భనష్టం జరిగితే గర్భపాతమనీ అంటారు.


శిల్పకారుడూ, మేదరవాడు, రాజూ, రాజ గురువూ, శ్రోత్రియ బ్రాహ్మణుడూ, దాసదాసీ జనమూ, భృత్యులూ వీరిలో ఎవరు పోయినా (వారి సంతానానికి తప్ప) మైల వుండదు.


పురిటి మైల అనగా పిల్లలు పుట్టినపుడు కలిగే అశుచి కన్నతల్లికే పదిరోజుల పాటు వుంటుంది. తండ్రి స్నానం చేయగానే శుచి అవుతాడు. వివాహం లేదా యజ్ఞం తలపెట్టి అన్ని యేర్పాట్లూ చేసుకొన్నాక మృత్యు లేదా పురిటి వార్త తెలిసినా ఆ ఉత్సవం చేయువారికి, అందులో పాల్గొనువారికి అశుచి వుండదు. అనాథ శవాన్ని మోసేవారికి ప్రాణాయామ మాత్రమున శుద్ధి కలుగుతుంది. తెలిసీ శూద్రశవాన్ని మోసినవారికి మాత్రం మూడురాత్రుల వఱకూ అశుచి.


Monday, 29 July 2024

శ్రీ గరుడ పురాణము (249)

 


ఆపత్కాలంలో అనివార్యమైనపుడు గృహస్థ బ్రాహ్మణుడు కూడా భిక్షమెత్తుకోవచ్చును. ఇది మూడు రోజుల వఱకే అంగీకార్యము. ఆ బ్రాహ్మణుని నుండి ధాన్యమును భిక్షగా పొందిన బ్రాహ్మణుడు దానిని ఒక్కరోజు మాత్రమే ఆకలి తీర్చుకొనుటకు వాడుకోవాలి. ఆ విషయాన్ని బహిరంగంగా ఒప్పుకోవాలి. అప్పుడు అతని పాలకుడైన రాజు అతని వంశం, రీతి, శాస్త్రాధ్యయనం, వేదజ్ఞానం, తపము, జపము మున్నగు వైశిష్ట్యాలను విచారించి ఆ బ్రాహ్మణుడు ధర్మానుకూలంగా జీవించగలిగే ఏర్పాటు చేయాలి. అని యాజ్ఞవల్క్య మహర్షి చెప్పాడు.”


(అధ్యాయం 106)


పరాశర మహర్షి చెప్పిన వర్ణాశ్రమ ధర్మాలు: ప్రాయశ్చిత్త కర్మలు


సూతుడు శౌనకాది మహామునులతో మాట్లాడుతూ తన గురువైన వ్యాసమహర్షికి పరాశర మహర్షి వినిపించిన ధర్మకర్మాలను ఇలా ప్రవచింపసాగాడు.


"శౌనకాచార్యా! ప్రతి కల్పాంతంలోనూ అన్నీ నశించిపోతాయి. కల్పప్రారంభంలో మన్వాదిఋషులు వేదాలను స్మరించి బ్రాహ్మణాది వర్ణాల ధర్మాలను మరల విధిస్తుంటారు. కలియుగంలో దానమే ధర్మము. పాపమూ శాపమూ సర్వాంతర్యాములుగా పరిఢవిల్లే ఈ కలియుగంలో పాపాన్ని అంతంచేయలేము. పాపంచేసిన వారిని మాత్రమే పరిత్యజించవలసి వుంటుంది.


త్యజేద్దేశం కృతయుగే త్రేతాయాంగ్రామ ముత్సృజేత్ | 

ద్వాపరే కులమే కంతు కర్తారంతు కలౌయుగే ॥


సత్య (కృత) యుగంలో పాపాత్ములుంటే ఆ దేశాన్నే ఋష్యాదులు త్యజించేవారు. అలా త్రేతాయుగంలో గ్రామాన్నీ, ద్వాపరంలో పాపి కుటుంబాన్నీ త్యజించారు. కలియుగంలో పాపం సార్వలౌకికమైపోతుంది కాబట్టి పాపిని మాత్రమే త్యజించగలరు. మనిషి ఆచారం (సదాచారం, శౌచాచారం) ద్వారానే అన్నీ పొందగలుగుతాడు. సంధ్య, స్నానం, జపం, హోమం, దేవపూజనం, అతిథి సత్కారం అనే ఆరు సత్కర్మలనూ ప్రతి దినం చేయాలి. ఆచారవంతుడైన బ్రాహ్మణుడు గాని సర్వసంగపరిత్యాగియైన సన్యాసిగాని కలియుగంలో దుర్లభం. బ్రాహ్మణులు తమ వర్ణ ధర్మాలను పాటించాలి. (అధ్యయనాధ్యాపనాదులను వదులుకోరాదు) క్షత్రియులు దుష్టులైన శత్రువులను గెలిచి ప్రజలను కన్నబిడ్డల వలె చూసుకోవాలి. వైశ్యులు వ్యవసాయ, వ్యాపార, పశుపాలనాదికములను చేయిస్తూ న్యాయసమ్మతంగానే ధనార్జన చేయాలి. శూద్రులు ఈ పై మూడు వర్ణాల వారికీ నిష్కపటంగా సహకరిస్తూ దేశసౌభాగ్యానికి ఊతమివ్వాలి.


Sunday, 28 July 2024

శ్రీ గరుడ పురాణము (248)

 


గురువు, అంతేవాసి (ఆశ్రమంలో వుండేవాడు) శిష్యుడు, వేదాంగ ప్రవక్త, బంధువు, శ్రోత్రియుడు (వేదాలలో ఒక శాఖని బోధించినవాడు) అనౌర పుత్రుడు (దత్తపుత్రుని వంటివాడు) రాజు, తెలిసిన మనిషి మృతి చెందినవార్త తెలియగానే గాని దహనానంతరం గాని స్నానం చేయగానే శుద్ధి జరిగిపోతుంది. ఆత్మహత్యకు పాల్పడ్డవారికీ అంతే.


సత్రమును ఇరవైనాలుగు గంటలూ ప్రజలకోసమే ఆశించకుండా నడిపేవాడు (అన్నం ఉచితంగా పెట్టేవాడు) కృచ్ఛ చాంద్రాయణాది వ్రతాలు చేస్తున్నవాడు, బ్రహ్మచర్య దీక్షలో నున్నవాడు, వానప్రస్థి, బ్రహ్మవిదుడైన సన్యాసి- (వీరు మానవాతీతులనో ఏమోగాని) వీరికి ఎవరు పోయినా మైల అంటదు. ఎట్టి అశౌచమూ వుండదు. దాన కార్యక్రమానికైసిద్ధం చేయబడిన సామగ్రికీ, వివాహ నిమిత్తం కూర్చబడిన ద్రవ్యానికీ, సంగ్రామ సమయంలో ఆ భయంతో నున్న ప్రజలకీ మైల వుండదు. అలాగే వరదల వంటి భయంకర విపత్కర పరిస్థితులలో చిక్కుకున్నవారికీ, అరాచక విప్లవ ప్రాంతాల్లో జీవిస్తున్నవారికీ ఏ మైలా అంటదు.


గ్రీష్మ ఋతు ప్రభావం వల్ల కుంచించుకు పోయిన జలాశయం మళ్ళా నీటితో నిండేదాకా ఎటువంటి శుద్ధి కార్యక్రమాలకూ పనికిరాదు. అంటే జలాశయానికే శుద్ధి అవసరం. అది నీటితో నిండినప్పుడే అవుతుంది. 

ఆపత్కాలంలో బ్రాహ్మణుడు క్షత్రియ లేదా వైశ్యవృత్తులను స్వీకరించవచ్చు. వైశ్యుడి వృత్తి అమ్మకమే అయినా అతడు ఎట్టి ఆపత్కర పరిస్థితుల్లోనైనా వైశ్యవృత్తి చేసే బ్రాహ్మణుడు పండ్లు, సోమలత, వస్త్రాలు, లతలు, ఔషధీలతలు, పాలు, పెరుగు, నెయ్యి, నీరు, నువ్వులు, అన్నం, రసం, ఉప్పు, తేనె, లక్క, హవిష్యాన్నం, మణులు, చెప్పులు, మృగచర్మం, మాంసం, సుగంధద్రవ్యాలు, మూలాలు - వీటిని అమ్మరాదు.


బ్రాహ్మణుడు తన శ్రోత -స్మార్త - యాజ్ఞపూర్ణతకై కావలసిన ధాన్యాన్నీ, అత్యావశ్యకములైన మందులనూ తిలలు విక్రయించి కొనుక్కోవచ్చును. అదీ ఆపత్కాలంలోనే. అప్పుడు కూడా లవణాదికములను అమ్ముకొనరాదు. తన వైయక్తికయజ్ఞాలను చేసుకొంటూనే ఆపద్ధర్మంగా ఇతర వృత్తులను చేయు బ్రాహ్మణుడు సూర్యుని వలె నిష్కలుషితంగానే ఉంటాడు. అతని బ్రాహ్మణ్యానికి తరుగూ విరుగూ వుండవు. వ్యవసాయం, పశుపాలనమూ కూడా అప్పుడు తప్పుకాదు. అయితే గుఱ్ఱాలను అమ్ముకోరాదు.