ఆపత్కాలంలో అనివార్యమైనపుడు గృహస్థ బ్రాహ్మణుడు కూడా భిక్షమెత్తుకోవచ్చును. ఇది మూడు రోజుల వఱకే అంగీకార్యము. ఆ బ్రాహ్మణుని నుండి ధాన్యమును భిక్షగా పొందిన బ్రాహ్మణుడు దానిని ఒక్కరోజు మాత్రమే ఆకలి తీర్చుకొనుటకు వాడుకోవాలి. ఆ విషయాన్ని బహిరంగంగా ఒప్పుకోవాలి. అప్పుడు అతని పాలకుడైన రాజు అతని వంశం, రీతి, శాస్త్రాధ్యయనం, వేదజ్ఞానం, తపము, జపము మున్నగు వైశిష్ట్యాలను విచారించి ఆ బ్రాహ్మణుడు ధర్మానుకూలంగా జీవించగలిగే ఏర్పాటు చేయాలి. అని యాజ్ఞవల్క్య మహర్షి చెప్పాడు.”
(అధ్యాయం 106)
పరాశర మహర్షి చెప్పిన వర్ణాశ్రమ ధర్మాలు: ప్రాయశ్చిత్త కర్మలు
సూతుడు శౌనకాది మహామునులతో మాట్లాడుతూ తన గురువైన వ్యాసమహర్షికి పరాశర మహర్షి వినిపించిన ధర్మకర్మాలను ఇలా ప్రవచింపసాగాడు.
"శౌనకాచార్యా! ప్రతి కల్పాంతంలోనూ అన్నీ నశించిపోతాయి. కల్పప్రారంభంలో మన్వాదిఋషులు వేదాలను స్మరించి బ్రాహ్మణాది వర్ణాల ధర్మాలను మరల విధిస్తుంటారు. కలియుగంలో దానమే ధర్మము. పాపమూ శాపమూ సర్వాంతర్యాములుగా పరిఢవిల్లే ఈ కలియుగంలో పాపాన్ని అంతంచేయలేము. పాపంచేసిన వారిని మాత్రమే పరిత్యజించవలసి వుంటుంది.
త్యజేద్దేశం కృతయుగే త్రేతాయాంగ్రామ ముత్సృజేత్ |
ద్వాపరే కులమే కంతు కర్తారంతు కలౌయుగే ॥
సత్య (కృత) యుగంలో పాపాత్ములుంటే ఆ దేశాన్నే ఋష్యాదులు త్యజించేవారు. అలా త్రేతాయుగంలో గ్రామాన్నీ, ద్వాపరంలో పాపి కుటుంబాన్నీ త్యజించారు. కలియుగంలో పాపం సార్వలౌకికమైపోతుంది కాబట్టి పాపిని మాత్రమే త్యజించగలరు. మనిషి ఆచారం (సదాచారం, శౌచాచారం) ద్వారానే అన్నీ పొందగలుగుతాడు. సంధ్య, స్నానం, జపం, హోమం, దేవపూజనం, అతిథి సత్కారం అనే ఆరు సత్కర్మలనూ ప్రతి దినం చేయాలి. ఆచారవంతుడైన బ్రాహ్మణుడు గాని సర్వసంగపరిత్యాగియైన సన్యాసిగాని కలియుగంలో దుర్లభం. బ్రాహ్మణులు తమ వర్ణ ధర్మాలను పాటించాలి. (అధ్యయనాధ్యాపనాదులను వదులుకోరాదు) క్షత్రియులు దుష్టులైన శత్రువులను గెలిచి ప్రజలను కన్నబిడ్డల వలె చూసుకోవాలి. వైశ్యులు వ్యవసాయ, వ్యాపార, పశుపాలనాదికములను చేయిస్తూ న్యాయసమ్మతంగానే ధనార్జన చేయాలి. శూద్రులు ఈ పై మూడు వర్ణాల వారికీ నిష్కపటంగా సహకరిస్తూ దేశసౌభాగ్యానికి ఊతమివ్వాలి.
No comments:
Post a Comment