బృహస్పతి ప్రోక్త నీతిసారం
నైమిషారణ్యంలో శౌనకాచార్యుని జిజ్ఞాస మేరకు అర్థశాస్త్రంపై ఆధారపడిన నీతిసారాన్ని, ఒకప్పుడు ఇంద్రునికి బృహస్పతి ఉపదేశించిన దాన్ని, ఇలా బోధించసాగాడు సూతమహర్షి.
"శౌనకాది మహామునులారా! ఇది రాజులు - అనగా పరిపాలకులు, వ్యాపార సామ్రాజ్యాధినేతలు, వారి గురువులైన మునులు, బ్రాహ్మణులు ఇలా అందరూ తెలుసుకోవలసిన విషయము.
పురుషార్థ చతుష్టయాన్ని, అనగా ధర్మార్థ కామమోక్షాలను సిద్ధించుకోదలచుకున్న వాడు సజ్జనులతోనే చెలిమిచేయాలి. దుర్జన సాంగత్యంలోనే బతికేసేవాడు ఇహపరాలు రెండింటికీ చెడతాడు.
సద్భిఃసంగం ప్రకుర్వీత సిద్ధికామః సదానరః |
నాసద్భిరిహలోకాయ పరలోకాయ వాహితం ॥
(ఆచార ... 108/2)
క్షుద్రునితో సంభాషణా, దుష్టుని దర్శనమూ, శత్రు సేవకునిపై ప్రేమా, మిత్రునితో విరోధమూ, మూర్ఖునికుపదేశమూ, దుష్ట స్త్రీ నుండి సహాయ స్వీకరణమూ ప్రమాదకరములు, దుఃఖదాయకములు. కాలవైపరీత్యం వల్ల మిత్రునితో శత్రుత్వమూ, శత్రువుతో మిత్రత్వమూ నెఱపవలసి వచ్చినపుడు అది శాశ్వతంకాదని మనసులో గట్టిగా అనుకుంటూ జాగ్రత్తగా నిర్వహించాలి.
No comments:
Post a Comment