తినకూడనివి తినడం, దొంగతనం, పోకూడని చోటికి పోవడం మనిషి పతనానికి కారణాలౌతాయి. వ్యవసాయం చేసేవాడు అలసిపోయిన ఎద్దుని మరల కాడికి కట్టరాదు. దాని చేత బరువులనూ మోయించరాదు. ద్విజులు స్నానం, యోగం, పంచయజ్ఞం వీటిని మానరాదు. బ్రాహ్మణులకి నిత్యం భోజనాలు పెట్టాలి. క్రూరకర్ముల విషయంలో మొగమాటానికీ స్వార్థానికీ తావివ్వకుండా ప్రవర్తించాలి.
నువ్వులనూ, నేతినీ అమ్ముకోరాదు. పంచసూనాజనిత దోషం పోవడానికి బలి వైశ్వ దేవహోమాన్ని నిత్యం చేయాలి. రైతు తన సంపాదన లేదా పంటలోని అరవభాగాన్ని రాజుకీ, ఇరువదవ భాగాన్ని దేవునికీ, ముప్పది మూడవ భాగాన్ని బ్రాహ్మణులకీ ఇవ్వాలి. దీని వల్ల కృషి హింసా పాపం ప్రక్షాళితమవుతంది. ఈ విధంగా ఇవ్వకపోతే (పన్ను ఎగ్గొడితే) పాపం వస్తుంది. అదీ దొంగతనంతో సమానమైన పాపం !
(పరాశరుడు ఏ వర్ణానికెన్నాళ్ళు మృత్యు అశౌచముంటుందో యాజ్ఞవల్క్యుని లాగే చెప్పాడు) బంధువులలో ఈ మైల నాలుగో తరం దాకా పది రోజులు, అయిదవ తరంలో ఆరురోజులు, ఆరో తరంలో నాలుగురోజులు, ఏడవతరంలో మూడురోజులు వుంటుంది. పరదేశంలో నున్న బాలకుడు పోతే మృత్యు అశౌచం పెద్దగా వుండదు. వార్త వినగానే స్నానం చేస్తే వెంటనే శుద్ధి అయిపోతుంది.
గర్భస్రావ, గర్భపాతాలలో బిడ్డ మరణించినపుడు తల్లి ఎన్నవ నెల గర్భవతి అయి వుండినదో అన్ని రోజుల అశుచి ఆ బిడ్డ బంధుగణానికి వుంటుంది. నాలుగవ నెల వఱకూ జరిగే గర్భనష్టాన్ని గర్భస్రావమని ఆరు మాసాలు నిండేలోగా గర్భనష్టం జరిగితే గర్భపాతమనీ అంటారు.
శిల్పకారుడూ, మేదరవాడు, రాజూ, రాజ గురువూ, శ్రోత్రియ బ్రాహ్మణుడూ, దాసదాసీ జనమూ, భృత్యులూ వీరిలో ఎవరు పోయినా (వారి సంతానానికి తప్ప) మైల వుండదు.
పురిటి మైల అనగా పిల్లలు పుట్టినపుడు కలిగే అశుచి కన్నతల్లికే పదిరోజుల పాటు వుంటుంది. తండ్రి స్నానం చేయగానే శుచి అవుతాడు. వివాహం లేదా యజ్ఞం తలపెట్టి అన్ని యేర్పాట్లూ చేసుకొన్నాక మృత్యు లేదా పురిటి వార్త తెలిసినా ఆ ఉత్సవం చేయువారికి, అందులో పాల్గొనువారికి అశుచి వుండదు. అనాథ శవాన్ని మోసేవారికి ప్రాణాయామ మాత్రమున శుద్ధి కలుగుతుంది. తెలిసీ శూద్రశవాన్ని మోసినవారికి మాత్రం మూడురాత్రుల వఱకూ అశుచి.
No comments:
Post a Comment