Saturday 3 August 2024

శ్రీ గరుడ పురాణము (254)

 


కాలం బహుశక్తివంతం. దానిని గెలుచుట కష్టసాధ్యం. అది దురతిక్రమణీయం. అదే ప్రాణులను పరిపాలిస్తుంది, సంహరిస్తుంది, ప్రాణులు నిద్రిస్తున్నా అది నిద్రించదు. కాలమే మానవ జీవితంలోని అన్ని ఘట్టాలనూ నిర్ణయిస్తుంది.


ఋషులారా! బృహస్పతి బోధనలవల్లే ఇంద్రాది దేవతలు నీతిజ్ఞులు కూడ అయినారు. ఆయన ఇంకా ఇలా చెప్పాడు:


స్థితిమంతులంతా అశ్వమేధయాగం చెయ్యాలి. దేవుళ్ళను పూజించినంత భక్తిశ్రద్ధలతోనే బ్రాహ్మణులనూ రాజర్షులనూ పూజించాలి.


ఉత్తమైః సహసాంగత్యం పండితైః సహ సత్కథాం ।

అలుబైః సహమిత్రత్వం కుర్వాణో నావసీదతి ॥


(ఆచర ... 108/12)


ఉత్తమ ప్రకృతి గల మంచివారితో కలిసి తిరగడం, పండితులతో మాట్లాడుతూ వారికి సల్లాపంబునందుల్లాసంబు కలిగింపజేసి ఉత్తమ కథలను విశేషాలను వినడం, లోభులు కాని వారితో స్నేహం చేయడం వీటిని పాటించే బుద్ధిమంతుడు సుఖపడతాడు.


ఇతరులను నిందించుట, పరుల ధనాన్ని అపహరించుట, మగనాలితో సరసాలాడుట, తనది కాని ఇంటిలో నుందుట ఎన్నడూ చేయరాదు. మనకి మేలు చేసేవాడు పరుడైనా బంధువే; మనకి కీడు చేసేవాడు బంధువైనా పరుడే అని గ్రహించాలి.



ఎవరు మనను పోషిస్తారోవారే మాతాపితలు. శరీరం నుండి పుట్టినదే అయినా వ్యాధిని తగిలేయడానికే చూస్తాము కదా! ఎక్కడో అడవిలో పుట్టినదైనా మందుని మనలో కలుపుకుంటాము కదా!


పరోఽపి హితవాన్ బంధుర్బంధు రష్యహితః పరః |

అహితో దేహజో వ్యాధిర్హిత మారణ్య మౌషధం ॥

సబంధుర్వోహితే యుక్తః సపితా యస్తు పోషకః |

తన్మిత్రం యత్ర విశ్వాసః సదేశోయత్ర జీవ్యతే ॥


(ఆచార ... 108/14,15)


చూసేవాడే నేస్తం, మానింది మందు, బతికింది ఊరు అని పెద్దలంటారు కదా!

No comments:

Post a Comment