Sunday, 28 July 2024

శ్రీ గరుడ పురాణము (248)

 


గురువు, అంతేవాసి (ఆశ్రమంలో వుండేవాడు) శిష్యుడు, వేదాంగ ప్రవక్త, బంధువు, శ్రోత్రియుడు (వేదాలలో ఒక శాఖని బోధించినవాడు) అనౌర పుత్రుడు (దత్తపుత్రుని వంటివాడు) రాజు, తెలిసిన మనిషి మృతి చెందినవార్త తెలియగానే గాని దహనానంతరం గాని స్నానం చేయగానే శుద్ధి జరిగిపోతుంది. ఆత్మహత్యకు పాల్పడ్డవారికీ అంతే.


సత్రమును ఇరవైనాలుగు గంటలూ ప్రజలకోసమే ఆశించకుండా నడిపేవాడు (అన్నం ఉచితంగా పెట్టేవాడు) కృచ్ఛ చాంద్రాయణాది వ్రతాలు చేస్తున్నవాడు, బ్రహ్మచర్య దీక్షలో నున్నవాడు, వానప్రస్థి, బ్రహ్మవిదుడైన సన్యాసి- (వీరు మానవాతీతులనో ఏమోగాని) వీరికి ఎవరు పోయినా మైల అంటదు. ఎట్టి అశౌచమూ వుండదు. దాన కార్యక్రమానికైసిద్ధం చేయబడిన సామగ్రికీ, వివాహ నిమిత్తం కూర్చబడిన ద్రవ్యానికీ, సంగ్రామ సమయంలో ఆ భయంతో నున్న ప్రజలకీ మైల వుండదు. అలాగే వరదల వంటి భయంకర విపత్కర పరిస్థితులలో చిక్కుకున్నవారికీ, అరాచక విప్లవ ప్రాంతాల్లో జీవిస్తున్నవారికీ ఏ మైలా అంటదు.


గ్రీష్మ ఋతు ప్రభావం వల్ల కుంచించుకు పోయిన జలాశయం మళ్ళా నీటితో నిండేదాకా ఎటువంటి శుద్ధి కార్యక్రమాలకూ పనికిరాదు. అంటే జలాశయానికే శుద్ధి అవసరం. అది నీటితో నిండినప్పుడే అవుతుంది. 

ఆపత్కాలంలో బ్రాహ్మణుడు క్షత్రియ లేదా వైశ్యవృత్తులను స్వీకరించవచ్చు. వైశ్యుడి వృత్తి అమ్మకమే అయినా అతడు ఎట్టి ఆపత్కర పరిస్థితుల్లోనైనా వైశ్యవృత్తి చేసే బ్రాహ్మణుడు పండ్లు, సోమలత, వస్త్రాలు, లతలు, ఔషధీలతలు, పాలు, పెరుగు, నెయ్యి, నీరు, నువ్వులు, అన్నం, రసం, ఉప్పు, తేనె, లక్క, హవిష్యాన్నం, మణులు, చెప్పులు, మృగచర్మం, మాంసం, సుగంధద్రవ్యాలు, మూలాలు - వీటిని అమ్మరాదు.


బ్రాహ్మణుడు తన శ్రోత -స్మార్త - యాజ్ఞపూర్ణతకై కావలసిన ధాన్యాన్నీ, అత్యావశ్యకములైన మందులనూ తిలలు విక్రయించి కొనుక్కోవచ్చును. అదీ ఆపత్కాలంలోనే. అప్పుడు కూడా లవణాదికములను అమ్ముకొనరాదు. తన వైయక్తికయజ్ఞాలను చేసుకొంటూనే ఆపద్ధర్మంగా ఇతర వృత్తులను చేయు బ్రాహ్మణుడు సూర్యుని వలె నిష్కలుషితంగానే ఉంటాడు. అతని బ్రాహ్మణ్యానికి తరుగూ విరుగూ వుండవు. వ్యవసాయం, పశుపాలనమూ కూడా అప్పుడు తప్పుకాదు. అయితే గుఱ్ఱాలను అమ్ముకోరాదు.


No comments:

Post a Comment