Saturday 20 June 2015

వేమన పద్యం - రమణతత్వం

ఎరుక కన్నను సుఖ మేలొకమున లేదు
యెరుక నెరుగ నెవని కెరుక లేదు
యెరుక సాటి యెరుక యెరుకయే తత్వంబు
విశ్వదాభిరామ వినురవేమ.

భావం:

ఎరుకను మించిన సుఖం ఏ లోకంలోనూ లేదు. అయినా ఆ యెరుకను తెలుసుకోవాలి అన్న ఆలోచన ఎవరికీ లేదు.ఎరుకకు సాటి యెరుక యెరుకయే. అదే తత్వం.

ఎరుక అంటే రమణమహర్షి తత్వంలో 'నేను' అనే తలంపు. వారు చెప్పిన మాటలే చెప్పుకుందాం : ఈ లోకంలో ఏమి చేస్తున్నా, ఎలా ఉన్నా, ఎప్పుడూ నేను అనే ఆలోచన ఉంటుంది. అసలు ఆ నేను ఎవరు? నేను అనేది శరీరమా? శరీరమైతే మరణం తర్వాత చితిలో వేస్తే దానికి నొప్పి కలగదేం? నేను అనేది మనసైతే, నిద్రలో మనసులేదు, అయినా నేను లేనని మీరు అంటున్నారా? లేదు కదా. మరి నిజంగా నువ్వెవరు? నేను ఎవరు అని ప్రశ్నించుకుంటూ, నీవు కాని వాటిని తొలగించుకుంటే మిగిలేది నువ్వే. దాన్నే మనం ఆత్మ అంటున్నాం. ఆ నేనును (ఆత్మను) తెలుసుకోవడంలో ఉన్న సుఖం ఏ లోకంలో కూడా రాదు. ఆ నేను అనే తత్వాన్ని (ఆత్మను) తెలుసుకోవడం కంటే గొప్పగా తెలుసుకోవలసిన విషయం వేరొకటి లేదు. ఎప్పుడు నేను, నేను అంటున్నావు, ముందు ఆ నేను ఎవరో తెలుసుకో.

ఓం నమో భగవతే శ్రీ రమణాయ
నమోనమః శ్రీ గురుపాదుకాభ్యం   

No comments:

Post a Comment