Thursday 26 January 2017

దాశరధి శతకం - 1



1
శ్రీ రఘురామ చారుతులసీ దళధామ శమక్షమాది శృం
గార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్య రమాలలామ దు
ర్వార కబంధరాక్షస విరామ జగజ్జన కల్మషార్ణవో
త్తారకనామ భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ

భావం - దశరధ తనయా! కరుణా సముద్రుడా! నీవు రఘువంశమున పుట్టిన శ్రీ రాముడవు, సొంపైన తులసీ మాలలు ధరించవాడవు. శమ, క్షమా మొదలైన గుణాలచే అలంకరించబడి లోకానికి ఆదర్శమూర్తివైన అభిరాముడవు. మూడు లోకాలచే కీర్తింబడే పరాక్రమ లక్ష్మికి ఆభరణం అయినవాడవు. ఎవ్వరికీ లొంగని కబంధుడనే రాక్షసుని వధించినవాడవు. కేవలం నీ తారక నామ మహిమచే జనులను కల్మషాలనే సముద్రమును దాటించగల శక్తిమంతుడవు. భధ్రాచల వాసుడవు. (నా యందు దయచూపు).

2
రామవిశాల విక్రమ పరాజిత భార్గవరామ సద్గుణ
స్తోమ పరాంగనావిముఖ సువ్రత కామ వినీల నీరద
శ్యామ కకుత్ధ్సవంశ కలశాంభుధిసోమ సురారిదోర్భలో
ద్ధామ విరామ భద్రగిరి - దాశరథీ కరుణాపయోనిధీ!

భావం - దశరధ తనయా! కరుణా సముద్రుడా! శ్రీ రామ! అమితమైన పరాక్రమముచే పరశురాముని జయించిన వాడా! సద్గుణ సముదాయానికి ఆటపట్టయినవాడా! చక్కని నీల వర్ణం కలిగిన మేఘము వంటి శరీరకాంతి కలవాడా! కకుత్థ్స వంశమనే పాలసముద్రాన్ని ఉప్పొంగించే చంద్రుని వాంటివాడా! రాక్షసుల బలాన్ని నాశనం చేయువాడా! భద్రాచల శ్రీ రామ! నన్ను దయచూడవయ్యా!

3.
అగణిత సత్యభాష, శరణాగతపోష, దయాలసజ్ఘరీ
విగత సమస్తదోష, పృథివీసురతోష, త్రిలోక పూతకృ
ద్గగన ధునీ మరంద పదకంజ విశేష మణిప్రభా ధగ
ద్ధగిత విభూష భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ.

భావం: దశరధ తనయా! కరుణా సముద్రుడా! శ్రీ రామ! మాట తప్పక, లెక్కింప శక్యంకాని సత్యవాక్కులనే పలికేవాడా! నీవు తప్ప వేరే ఏ దిక్కు లేదని, నిన్నే శరణు పొందినవారిని రక్షించువాడా! నీ దయనే కాంతివంతమైన  ప్రవాహంతో పాపాలను కడిగేవాడా! బ్రమ్హజ్ఞాన సంపన్నులను సంతోషపెట్టువాడా! మూడు లోకాలను పవిత్రం చేసే ఆకాశ గంగను స్వరించినట్టి పాదపద్మాలు కలవాడా! మణుల యొక్క కాంతిచే ప్రకాశించు అలకారములు కలవాడా! భధ్రాచల రామా! (నన్ను కరుణించు).

4.
రంగదరాతిభంగ, ఖగ రాజతురంగ, విపత్పరంపరో
త్తుంగ తమఃపతంగ, పరి తోషితరంగ, దయాంతరంగ స
త్సంగ ధరాత్మజా హృదయ సారసభృంగ నిశాచరాబ్జమా
తంగ, శుభాంగ, భద్రగిరి దాశరథీ కరుణాపయోనిథీ.

భావం: గర్వంచే విజృభించిన శత్రువులను నాశనము చేయువాడా! పక్షిరాజైన గరతుమంతుడే వాహనంగా కలవాడా! చీకటలను సూర్యుడు చేధించినట్లు, చీటక్ల వలే కమ్ముకున్న ఎన్నో ఆపదల వరసును పటాపంచలు చేసే సూర్య్నివంటి వాడా! జనసమూహంతో నిండిన సభను రంజింపజేయువాడా! కరుణతో నిండిన మనసు కలవాడా! మహాపురుషుల సాంగత్యం కలవాడా! సీతాదేవి హృదయకమలమందే తుమ్మెద వలె నివసించువాడా! దుష్టరాక్షసులనే తామరపువ్వులను నశింపజేసే మదపుటేనుగు వంటి వాడా! మంగళకరమైన రూపం కలవాడా! భద్రాచల శ్రీ రామ! దశరధ తనయ! కరుణాసముద్రుడా! నా యందు దయ చూపు.

5.
శ్రీద సనందనాది మునిసేవిత పాద దిగంతకీర్తిసం
పాద సమస్తభూత పరిపాల వినోద విషాద వల్లి కా
చ్ఛేద ధరాధినాథకుల సింధుసుధామయపాద నృత్తగీ
తాది వినోద భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ.

భావం: ఐశ్వర్యాన్నిచే వాడా! ఋషిపుంగవుల చేత సేవించబడే పాదపద్మాలు కలవాడా! దిగంతముల (దిక్కుల యొక్క అంతము) వరకు కీర్తిని సంపాదించినవాడా! సమస్త చరాచర ప్రపంచాన్ని పాలించి, కాపాడటంలో సంతోషం పొందేవాడా! దుఃఖములనే తీగలను తెగనరికేవాడా! క్షాత్ర ధర్మాన్ని, క్షత్రియ వంశాలనే సముద్రాన్ని ఉప్పొంగించే అమృతమయమైన చంద్రుని వంటి కిరణాలు కలవాడా! నాట్యము, సంగీతం మొదలైన కళల చేత వినోదము పొందువాడా! భధారచల శిఖరంపై కొలువున్న వాడా! దశరధ తనయ! కరుణా సముద్రా! శ్రీ రామచంద్ర! నన్ను బ్రోవు.

6.
ఆర్యుల కెల్ల మ్రొక్కివిన తాంగుడనై రఘునాధ భట్టరా
రార్యుల కంజలెత్తి కవి సత్తములన్ వినుతించి కార్య సౌ
కర్య మెలర్పనొక్క శతకంబొన గూర్చి రచింతునేడుతా
త్పర్యమునన్ గ్రహింపుమిది దాశరథీ కరుణాపయోనిధీ.

భావం: దశరధ తనయా! కరుణాసముద్రా! శ్రీ రామా! పూజింపదగిన శ్రేష్టమైన గుణములు కలవారందరికి (ఆర్యులందరికి) నమస్కరించి, మా గురుదేవులైన రఘునాధ భట్టాచార్యుల వారికి అంజలి ఘటించి, కవి శ్రేష్టులను స్తుతించి, పైవారి అనుగ్రహంతో నేను తలచిన కార్యం సఫలమవ్వాలని నీ పేరున శకతం రాస్తున్నాను. కావున నా భక్తి భావముని గమనించి దీన్ని దయతో స్వీకరించి, నన్ను అనుగ్రహించమని వేడుకుంటున్నాను.

7.
మసకొని రేంగుబండ్లుకును మౌక్తికముల్ వెలవోసినట్లు దు
ర్వ్యసనముజెంది కావ్యము దురాత్ములకిచ్చితి మోసమయ్యె నా
రసనకుఁ బూతవృత్తి సుకరంబుగ జేకురునట్లు వాక్సుధా
రసములుచిల్క బద్యముఖ రంగమునందునటింప వయ్య సం
తసమును జెంది భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ.

భావం: దశరధ తనయా! కరుణాసముద్రమైన శ్రీ రామచంద్రా! ఎంతో ఆశతో సామన్య రేగి పళ్ళను మంచి ముత్యములౌ భావించి కోట్లు పోసి కొన్నట్టు, కావ్య రచన చేసి దుష్టులకు అంకితమిచ్చి మోసపోయాను. ఓ భక్తజన కల్పద్రుమ! నా నాలుకను పవిత్రం చేసి, నా వాక్కుల యందు అమృతం చిందేట్లుగా పద్యం రచించే శక్తి నాకిచ్చి నా ముఖమందు నిలిచి ఉండమని ప్రార్ధిస్తున్నాను.

8.
శ్రీరమణీయహార యతసీ కుసుమాభ శరీర, భక్త మం
దార, వికారదూర, పరతత్త్వవిహార త్రిలోక చేతనో
ద్ధార, దురంత పాతక వితాన విదూర, ఖరాది దైత్యకాం
తార కుఠార భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ.

భావం: గొప్పకాంతిచే మనోహరమైన హారము కలవాడా. అవిసె పువ్వు వలె మృధువైన దేహం కలవాడా. భక్తులు కోరిన కోరికలు తీర్చే కల్పవృక్షం వంటి వాడా. వికారములను జయించినవాడా. పరతత్త్వంగా విహరించువాడా. మూడు లోకాలయందున్న ప్రాణులను ఉద్ధరించు వాడా. అంతములేని పాపముల సముదాయాన్ని నాశనం చేయువాడా. ఖరుడు మొదలైన రాక్షసులనే అడవిని నరకిన గొడ్డలి వంటి వాడా. భధ్రాచల వాసా, దశరధ తనయ, కరుణాసముద్రా, ప్రభూ శ్రీ రామచంద్ర. నన్ను రక్షించు.

9.
దురితలతాలవిత్ర, ఖర దూషణ కానన వీతిహోత్ర, భూ
భరణకళావిచిత్ర, భవ బంధ విమోచన సూత్ర, చారువి
స్ఫురదరవింద నేత్ర, ఘన పుణ్యచరిత్ర, వినీలభూరికం
ధరసమగాత్ర, భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ.

భావం: పాపాలనే తీగలను త్రుంచి వేసే కొడవలి వంటివాడవు. ఖరుడు, దూషణుడు అనే పేరుగల రాక్షసులనే అడవిని కాల్చి వేసిన అగ్నిహోత్రుని వంటివాడివి. భూభారాన్ని మోయడమనే కళలో కూడా విచిత్రమైన నేర్పుకలవాడివి. సంసారబంధం నుంచి విడిపించడమే పనిగా పెట్టుకున్నవాడివి. అందంగా ఉండి, వికసించిన పద్మముల వంటి కన్నులు కలవాడివి. ఎంతో గొప్పదైన, పవిత్రమైన చరిత్ర కలవాడివి. నీలమేఘముతో సమానమైన శరీరకాంతి కలవాడివి. భద్రాచల వాసుడవు, దశరధ తనయుడవు, కరుణా సముద్రుడవు, శ్రీ రాంచంద్రుడ్వు. (నిన్ను ఏమని పొగడాలి తండ్రీ! ఎంతని పొగడగలను).

10.
కనకవిశాలచేల భవకానన శాతకుఠారధార స
జ్జనపరిపాలశీల! దివిజస్తుత సద్గుణ కాండ! కాండ సం
జనిత పరాక్రమ! క్రమ విశారద! శారద కందకుంద చం
దన ఘనసార! సారయశ దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: గొప్పదైన బంగారంతో నేసిన వస్త్రములు ధరించినవాడవు. జనన-మరణ చక్రమనే అడవిని నరికి వేయగల పదునైన గొడ్డలి యొక్క అంచువంటి వాడవు. సజ్జనులను కాపాడే స్వభావం కలవాడివి. దేవతలచే స్తుతించబడే సద్గుణరాసి గలవాడివి. ధనుర్విద్యలో పండితుడివి. శరత్కాల మేఘము, మల్లెపువ్వులు, శ్రీ గంధము వంటి వాటివలె ఎంతో స్వచ్ఛమైన కీర్తి కలవాడివి. దశరధ తనయుడవు, కరుణా సముద్రుడవు, శ్రీ రామచంద్రుడవు. నన్ను దయ చూడు స్వామి.

No comments:

Post a Comment