Thursday 12 January 2017

మహర్షి మహేశ్ యోగి జయంతి



మహర్షి మహేశ్ యోగి. ఈ పేరు సగటు భారతీయునికి తెలియకపోవచ్చు, కానీ ప్రపంచ వ్యాప్తంగా వీరికున్న ఆదరణ అంతాఇంతా కాదు. సనాతన ధర్మాన్ని, ధ్యానాన్ని, వేదాన్ని విశ్వవ్యాప్తంగా ప్రచారం చేసిన మహనీయలలో ఒకరు మహర్షి మహేశ్ యోగి. 1918 లో జనవరి 12 వ తేదీన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో జన్మించారు. వీరి పూర్వ నామం మహేశ్ ప్రసాద్ వర్మ. అలహాబాద్ విశ్వవిద్యాలయంలో భౌతిక శాస్త్రం పూర్తి చేసి, జగద్గురువు ఆదిశంకరాచార్యుల వారు స్థాపించిన జ్యోతిర్మఠం పీఠాధిపతి వద్ద శిష్యరికం చేశారు. బాల బ్రహ్మచారిగా చేరి, స్వామి వారికి అత్యంత ఆప్తుడయ్యారు. ఆయన ఆంతరింగిక కార్యదర్శిగా పని చేశారు. ఆ సమయంలోనే ఆత్మానుభూతి పొందారు. వేదాలపై అనర్గళంగా ప్రసంగాలిచ్చారు.

బ్రాహ్మణేతరుడు కావడంతో బ్రహ్మానంద సరస్వతీ గారి తర్వాత జ్యోతిర్మఠానికి ఉత్తరాధికారి కాలేకపోయారు. అయినప్పటికి బ్రహ్మచారి మహేశ్‌కు స్వామి బ్రహ్మానంద గొప్ప బాధ్యతనే అప్పగించారు. విశ్వవ్యాప్తంగా సంచారం చేసి, ధ్యానాన్ని అందరికి నేర్పమని, అందరిలోకి తీసుకువెళ్ళమని ఆదేశించారు. బ్రహ్మానందులు 1953 లో మహాసమాధి చెందగా, మహేశ్ యోగి ఉత్తరకాశీకి పయనించారు. 1955 లో ఉత్తరకాశిని విడిచి జనం మధ్యకు వచ్చి భావాతీత ధ్యాన ప్రక్రియ (Transcendental Deep Meditation Technique) అనే పద్దతిని బోధ చేయడం ప్రారంభించారు. ఇది స్వామి బ్రహ్మానందుల ద్వారా తెలుసుకొన్నదేనని చెప్తారు. ఆ తర్వాత ఆ పద్ధతికి భావాతీత ధ్యానం (Transcendental Meditation) అనే పేరు స్థిరపడింది. 1958 లో తొలిసారిగా విదేశాల్లో పర్యటించారు. బర్మా, థాయిల్యాండ్, మలేషియా, సింగపూర్, హాంకాంగ్ మొదలైన దేశాలు పర్యటించి, 1959 లో హవాయి ద్వీపాలకు వెళ్ళారు. 'ఆయన వద్ద డబ్బు లేదు, ఆయనేదీ అడగడు. ఆయన సామానంతా ఒక చేతిలో పట్టుకోవచ్చు. మహర్షి మహేశ్ యోగి ప్రపంచ పర్యటనలో ఉన్నారు. ఈ ప్రపంచం నుంచి విచారాన్ని, అసంతృప్తిని నిర్మూలించే సందేశాం ఆయన మోసుతున్నారని చెప్తారు' అని అక్కడి పత్రికలు ప్రచురించాయి. 1959 లో భావాతీత ధ్యానం మీద హోనోలులు, సాన్ ఫ్రాన్సిస్కో, లాస్ ఏంజిల్స్, బోస్టన్, న్యూ యార్క్, లండన్ లో ప్రసింగైంచడమే కాక అక్కడ అనేకమందికి ఈ ధ్యాన ప్రక్రియ నేర్పించి, వారి జీవితాల్లో ఎంతో మార్పు తీసుకువచ్చారు. ఉన్నత స్థాయి ఆధ్యాత్మిక అనుభూతులను కలిగించారు. అప్పటికే వారికి పాశ్చాత్య దేశాల్లో ఎంతో ఆదరణ లభించింది. వారి పుస్తకాలు 15 భాషల్లోకి అనువాదం అయ్యాయి.

1966 లో వీరు ఆరంభించిన విద్యార్ధి అంతర్జాతీయ ధ్యాన సంస్థ 4 ఏళ్ళల్లో వేయికి పైగా శాఖలతో విస్తరించింది. హార్వర్డ్, యేల్, బర్కలీ వంటి విశ్వవిద్యాలయాల్లో సైతం ఈ ధ్యాన ప్రక్రియ కేంద్రలు ఆరంభమయ్యాయి. 1969 లో స్విట్జర్‌ల్యాండ్ లో కొత్త విశ్వ ఆధ్యాత్మిక కేంద్రాన్ని ఆరభించారు. అక్కడ సృజనాత్మక మేథోవిజ్ఞానంపై ఒక కోర్సును ఆరంభించగా, అమెరికాలోని 25 విశ్వవిద్యాలయాలు ఈ కోర్సును తమ కళాశాలలో ఆరంభించాయి. 1971 నాటికి 13 సార్లు విశ్వసందర్శనలో భాగంగా 50 కి పైగా దేశాల్లో పర్యటించి, 3600 శిక్షణా కేంద్రాలను విశ్వవ్యాప్తంగా ఆరంభించి, భావాతీత ధ్యాన శిక్షణను ఉధృతం చేశారు. 1973 లొ ఇల్లినాయిస్ రాష్ట్రంలో పాఠశాలల్లో ఈ ప్రక్రియ పాఠ్యాంశంగా చేరుస్తూ తీర్మానం కూడా ఆమోదించారు. 1974 లో అంతర్జాతీయ విశ్వవిద్యాలయాన్ని, ఆ తర్వాత మహర్షి వేద విజ్ఞాన విశ్వపీఠాన్ని, 1990 లో మహర్షి యూరోపియన్ రీసెర్చి యూనివర్సిటి ని స్థాపించారు. 22 భాషలలో, 144 దేశాల్లో భారతీయా ఆధ్యాత్మికతను చాటే వేద విజన్ అనే టివి చానెల్ ను ప్రారంభించిన ఘతన వీరిదే. చివరకు ఫిబ్రవరి 5, 2008 న మౌన దీక్షలో శివైక్యం చెందారు.

ఇలా ఎన్నో దేశాల్లో పర్యటించి, తాను వెళ్ళిన ప్రతి చోటా సనాతన ధర్మ సువాసనలను వెదజల్లుతూ, అంతర్జాతీయ స్థాయి వైదిక విశ్వవిద్యాలయాలను స్థాపిస్తూ, హిందూ ధర్మాన్ని దశదిశలా వ్యాపింపజేసిన మహర్షి మహేశ్ యోగిని మనం నిత్యం స్మరించాలి.  నేడు మహర్షి మహేశ్ యోగి జయంతి.

భక్తి పత్రిక మరియు వికీపీడియా నుంచి సేకరణ

No comments:

Post a Comment