Sunday 3 September 2017

వక్రతుండ మహాకాయ..... (4)



కోటి సూర్యసమప్రభ.....

అనంతమైన సూర్యులకు సమానమైన కాంతితో విరాజిల్లుతున్నవాడు....
ఆ చిన్న శ్లోకంలో ముందు వక్రతుండ అన్నప్పుడు, వక్రబుద్ధిని నశించింది, మహాకాయ అని ధ్యానించినప్పుడు, ఆయనే సమస్తంగా భాసించడం కనిపించింది. వక్రబుద్ధి నశించి, అంతటా ఆయన్నే చూడటమే జ్ఞానం, అదే కోటి సూర్యసమప్రభ లో వ్యక్తమవుతోంది. అంటే ఇక్కడ స్వామి మనల్ని అజ్ఞానం నుంచి జ్ఞానానికి తీసుకువెళతున్నాడు (తమసోమా జ్యోతిర్గమయా), మృత్యువు నుంచి అమృతతత్వం వైపు తీసుకువెళుతున్నాడు (మృత్యోర్మా అమృతంగమయా)..... మనకు కనిపించే సూర్యుడు ఈ విశ్వాన్ని మాత్రమే ప్రకాశింప్జఏస్తాడు. కానీ కోటిసూర్యప్రభలతో వెలిగిపోతున్న వినాయకుడు, సమస్త లోకాలను, జీవులను ప్రకాశింపజేస్తున్నాడు.....

ఇక్కడ ఒక విశేషం ఉంది. సూర్యుడిని నేరుగా చేస్తూనే కాసేపు మనకు చిన్న చిన్న వస్తువులు కనిపించవు. మరి ఈయన అనంతసూర్య కాంతులతో వెలిగిపోతున్నాడు. అలాంటి ఈయన తన అనుగ్రహాన్ని ప్రసరిస్తే ఎలా ఉంటుంది??.... దివ్యమైన ఆ వెలుగు తప్ప, అన్యమైనదేదీ కనిపించదు. కళ్ళు మూసుకున్నా, చీకటి తారసపడదు. ఈ వెలుగును చూశాక, చీకటి (అజ్ఞానం) కూడా గుడ్డిదవుతుంది. ఆ కాంతి ఎలాంటిదంటే లోకమంతా వ్యాపించి ఉంటుంది. అప్పుడు లోకంలో దోషాలు కనిపించవు. ఆఖరికి నీలో ఉన్న దోషాలు కూడా కనిపించవు. మంచి, చెడు; సుఖదుఃఖాలు అనేవి ద్వంద్వాలు. అవి ఎప్పుడూ ఉంటాయి. అవన్నీ ఉంటేనే లోకం పూర్ణమవుతుంది. లోకంలో Perfection కోసం ప్రయత్నించడం మిథ్య. ఎందుకంటే ఈ ద్వంద్వాల్లో ఏదో ఒకటి మాత్రమే మిగిలితే, అప్పుడు ప్రళయం వస్తుంది.... కనుక స్వామి నుంచి వచ్చే కాంతి మనలో పూర్ణత్వాన్ని(Totality) నింపుతుంది. Perfections, imperfections నుంచి మనల్నిTotality  దిశగా నడిపిస్తుంది. అదే ఆయన చేతిలో ఉన్న మోదకానికి సంకేతం కూడా. 

ఈ కాంతి అన్ని లోకాల్లో వ్యాపించి, వాటి మధ్య బేధాన్ని నశింపజేస్తుంది. అంటే భగవంతుడిని పొందాలంటే లౌకికమైన జగత్తుకు దూరంగా జరగాలి, ఈ జగత్తును తిరస్కరించాలి వంటివి అప్పుడు ఉండవు. ఇది ఉన్నతమైన స్థితి.
ఇక్కడ (ఇహలోకంలో) చూసినా గణపతియే ఉంటాడు, పరలోకంలో చూసినా గణపతియే ఉంటాడు. ఎక్కడ వెతికితే అక్కడ గణపతే ఉంటాడు. (పూజ్యగురువులు వి.వి.శ్రీధర్ గారి ఉపదేశాల సారం గణపతికి సమన్వయం చేస్తూ ఇక్కడ చెప్పడం జరిగింది). అప్పుడు జ్ఞానం, అజ్ఞానం అనే బేధం (differentiation) ఉండదు. అప్పుడు ఉండేది ఏకత్వం. అదే అసలు జ్ఞానం. భగవాన్ రమణులు కూడా ఉపదేశశరంలో ఇదే చెప్తారు.... అప్పుడు ప్రత్యేకించి జగత్తుకు దూరంగా పరిగెత్తాల్సిన పనిలేదు. ఎందుకంటే స్వామి నుంచి ఈ జగత్తు వేరు కాదని తెలుసుకున్నాం కనుక. 

అప్పుడు మనలో శరణాగతి ఉదయిస్తుంది. 

యదంతరే సంస్థితమేకదంతస్తదాజ్ఞయా సర్వమిద విభాతి |
అనంతరూపం హృదిబోధకం యస్తమేకదంత శరణం వ్రజామః ||

అన్నిటిలోను అంతర్యామిగా ఉంటున్న ఆ ఏకదంతుని ఆజ్ఞ చేతనే అంతా జరుగుతున్నది. అనంతమైన రూపాలతో ఉండే ఆయన లీలావైభవం కేవలం హృదయానికి మాత్రమే అర్దమవుతుంది. అలాంటి ఏకదంతునికి శరణువేడుతున్నాను అని భావం.

అది బేషరతుగా చేసే శరణాగతి (Unconditional surrender). సంపూర్ణ శరణాగతి. ఇక అప్పుడు మనం ఆయన చేసే లీలలను గమనించడం తప్ప, వేరే ఏదీ అడగము. ఒకచోట అరోబిందో అంటారు.."ఒక వేళ భగవంతుడు నరకంలో నాకు స్థానం కల్పిస్తే, నేను స్వర్గం కోసం ఎందుకు ప్రయత్నించాలో నాకు అర్దం కావట్లేదు. నాకు ఏదీ మంచిదో ఆయనకే ఉత్తమంగా తెలుసు.... ఒకవేళ భగవంతుడు నన్ను స్వర్గం దిశగా లాగితే, అదే సమయంలో ఆయన వేరే చేత్తో నన్ను నరకంలోనే ఉంచే ప్రయత్నం చేస్తే, అప్పుడు నేను ఊర్ధ్వంగా వెళ్ళే ప్రయత్నం చేయాలి...." 
If God assigns to me my place in Hell, I do not know why I should aspire to Heaven. He knows best what is for my welfare.


If God draw me towards Heaven, then, even if His other hand strive to keep me in Hell, yet must I struggle upward.

జ్ఞానం, భక్తి, కర్మ, యోగం.... అన్ని మార్గాలు శరణాగతిలోనే ముగుస్తాయి. అప్పుడు మనది యోగదృష్టి అవుతుంది.... అదే ముక్తినిస్తుంది.
కోటి సూర్య సమప్రభ... తమసోమా జ్యోతిర్గమయా అనే ఉపనిషత్తు వాక్యాన్ని నిక్షిప్తం చేసుకుని ఉంది. అటువంటి స్థితిని ప్రసాదించేవాడు వక్రతుండుడు.

వివరణ ఇంకా ఉంది.... 

No comments:

Post a Comment