Monday 4 September 2017

వక్రతుండ మహాకాయ..... (5)



నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా|

నేను చేపట్టిన ప్రతి కార్యంలో ఎల్లప్పుడూ విఘ్నములు ఎదురుకాకుండా చూడు.....
ఇంతకముందు కొన్ని వక్రములు/ విఘ్నాల గురించి చెప్పుకున్నాము. అవి ఎదురుకాకుండా చూడు.
1. నిన్ను మర్చిపోవడమే పెద్ద విఘ్నము. నేను ఏ కార్యం చేస్తున్నా, నిన్ను మరువకుండా ఉండేలా చూడు. బయట పనులు చేయాలి, కానీ లోపల హృదయంలో మాత్రం నీ మీద ధ్యాస ఉండాలి. సదా ఇలా ఉండేలా ఆశీర్వదించు.
2. నీవే కర్తవు. నేను పాత్రధారిని. నేను కర్తను అనుకునప్పుడు, నాకీ కర్మలు అంటుకుంటాయి. అదే జన్మల పరంపరకు కారణమవుతోంది. నేను కర్తను కాదనే జ్ఞానాన్ని నాకు అనుభవంలో తెలియపరుచు.  వేల జన్మలుగా నేనే కర్తను అని conditioning చేయబడ్డాను. అందుకే తరచుగా అదే భ్రమలో పడిపోతున్నాను. కాబట్టి మర్చిపోయే ప్రమాదం కూడా ఉంది. కనుక ఓ వక్రతుండ, ఈ విఘ్నాన్ని తుండెము చేయి.
3. మేము గృహస్థాశ్రమంలో ఉన్నాము. లేదా గృహస్థాశ్రమంలోకి భవిష్యత్తులో అడుగుపెడతాము. ధార్మికంగా సుఖాలను అనుభవించడం వలన కలిగిన సంతృప్తితో జనించిన వైరాగ్యం ద్వారా (వివేకంతో కూడిన వైరాగ్యం ద్వారా) మాత్రమే జ్ఞానము పొంది, నిన్ను చేరుకుంటాము. మా జీవితంలో ఎప్పుడూ ఏదో ఒక విఘ్నాలు కలుగుతూనే ఉంటాయి. విద్యలో సమస్య, నిరుద్యోగం, సంతానహీనత, లేదా పిల్లలు మాట వినకపోవడం, అనారోగ్యం, దాంపత్యదోషాలు..... ఇలా ఎన్నో సమస్యలు. ప్రతి పనిలో ఆటంకాలే. ఇవన్నీ ఎదురుకాకుండా చూడు. సంతృప్తితో కూడిన జీవితాన్ని ఇవ్వు. నిన్ను స్మరిస్తున్నాం కనుక ఇప్పుడే, కాదు భవిష్యత్తులో ఎదురయ్యే విఘ్నాలను కూడా భస్మీపటలం చెయ్యి. మాకు కార్యసిద్ధిని కలిగించు. నీవు పూర్ణస్వరూపానివి. కనుక కోరికలను తీర్చుతూనే, జ్ఞానాన్ని కూడా ఇచ్చి, ఇటు ఇహాన్ని, పరాన్ని ప్రసాదించు. 
4. నీకే శరణాగతి చేద్దామని అనుకుంటాను. కానీ అప్పుడప్పుడూ అవిశ్వాసం మనసులోకి ప్రవేశిస్తోంది. అది వక్రము, దాన్ని తుండెము చేయు. నువ్వు చెప్పినట్లు కాక, మనసు చెప్పినట్లు నడుస్తున్నాను. కోపానికి, దురాశకు, అహంకారానికి వశుడనువుతున్నాను. ఇవన్నీ కూడా విఘ్నాలే స్వామి. కనుక ఎల్లప్పుడూ నీ మాట మాత్రమే వినేలా చూడు.

వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభ
నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా ||

ఇది బ్రహ్మదేవుడు వక్రతుండ గణపతిని ఉద్దేశించి చేసిన స్తోత్రంగా ఒక చోట చెప్పబడింది. చిన్న శ్లోకమైన మహిమకలది. కల్పవృక్షం వంటిది. ఈ శ్లోకం ఎప్పుడు వీలైతే అప్పుడు పఠించదగ్గది. కేవలం ఇహలోక భోగాలనే కాదు, ముక్తికి మార్గం చూపే శ్లోకం ఇది. పిల్లలకు దీన్ని నేర్పితే, దురలవాట్లకు లోనుకాకుండా, చక్కగా చదువుకుని, ఉన్నతంగా స్థిరపడి, అంతిమంగా స్వామిని చేరుతారు.   

స్వస్తి
ఓం శాంతిః శాంతిః శాంతిః
సర్వం శ్రీ గణేశ్వరరాపణమస్తు 

No comments:

Post a Comment