Tuesday 17 October 2017

శ్రీ అరోబిందో - దుర్గాస్తోత్రం

1909 లో శ్రీ అరోబిందో దుర్గాదేవిని ఉద్దేసించి దుర్గాస్తోత్రం రాశారు. భారతీయులకు శక్తిని, ధరియాన్ని ఇవ్వమని, భారతదేశ బానిస సంకెళ్ళను త్రెంచే శక్తినివ్వమని, అంధకారంతో పోరాడే శకితిని సమకూర్చమని అందులో వేడుకున్నారు.... అది ఈ కాలానికి అన్వయమవుతుంది.

మాతాః దుర్గా! సింహవాహిని సర్వశక్తిదాయిని మాతః శివప్రియే!

నీ శక్త్యంశగా ఉత్పన్నమైన మేము, భారతయువత నీ మందిరంలో ఆసీనులై ఉన్నాము,
ప్రార్థిస్తున్నాము, విను మాతః, భారతదేశంలో ఆవిర్భూతమవ్వు, ప్రకటనమవ్వు | 1 |

దుర్గమ్మ తల్లి! సింహవాహిని, సకలశక్తులను ఇచ్చేదానవు, అమ్మవు, శివునకు ప్రియమైన దానవు! మేము,నీ అంశతో ఉద్భవించిన భారతీయ యువగణము, నీ ఆలయంలో ఆసీనులమై ఉన్నాము. మేము (భరతీయులము) నీ పిల్లలము, నీ అంశలము. ఆ మొర ఆలకించు. దేశం, ధర్మం కష్టాల్లో ఉన్నాయి. ఓ మాత, భూమిపై మళ్ళీ అవతరించు, ఈ భారతభూమిలో నిన్ను నువ్వు ప్రకటించుకో |

మాతః దుర్గ! యుగయుగాల్లో మానవశరీరమందు అవతరించిన (మేము), జన్మ-జన్మాంతరంలో నీ కార్యాన్ని నిర్వర్తించి, నీ ఆనందధామానికి చేరుకుంటాము| ఈసారి కూడా నీ కార్యం కోసమే జన్మించాము, విను మాతః, భారతదేశంలో అవతరించు, మాకు సహాయం చెయ్యి| 2 |

అమ్మా దుర్గమ్మ! ప్రతి యుగంలో, అనేక కాలాల్లో, మేము (భారతీయులము) మానవదేహం ధరించి, నీ కార్యాన్ని పూర్తి చేయడానికి భూమి మీదకు వస్తాము. కార్యం నిర్వహించి, తిరిగి ఆనందధామమైన నీ వద్దకే చేరుకుంటాము. ఇప్పుడు కూడా, మేము జన్మించింది నీవు సంకల్పించిన కార్యం నిర్వహించడానికి. ఓ మాత! సనాతన ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేయడం, భారతదేశాన్ని విశ్వగురు స్థానానికి తీసుకెళ్ళడం, స్వదేశీ భారతనిర్మాణం అనే నీ కార్యాన్ని పూర్తి చేయడం కోసం భూమి మీద, భారతదేశంలో అవతరించు, మాకు సహాయం చెయ్యి. 

మాతః దుర్గ! సింహవాహిని, త్రిశూలధారిణి, కవచాలంకృత సుందర శరీరే, మాతః జయధాయిని| భారతం నీకోసం నిరీక్షిస్తున్నది, మంగళకరమైన నీ యొక్క ఆ సుందరరూపాన్ని చూడాలనే ఉత్సుకతతో ఉంది| విను మాతః, భారతదేశంలో ఆవిర్భవించు, ప్రకటనమవ్వు | 3 |


అమ్మా దుర్గమ్మ! సింహవాహినివి, చేతిలో త్రిశూలం ధరించినదానివి. కవచం ధరించిన సుందరమైన శరీరం కలదానివి, అమ్మవు, విజయాన్ని ప్రసాదించేదానివి. భారతదేశం నీ కోసం నిరీక్షిస్తోంది, మంగళకరమైన, అందమైన, దివ్యమైన రూపాన్ని చూడాలని ఎంతో ఉత్సుకతతో ఎదురుచూస్తోంది. అమ్మా, విను, భూమి మీదకు దిగిరా, భారతదేశంలో అవతరించు, నిన్ను నువ్వు ప్రకటనం చేసుకో. 

అమ్మా దుర్గమ్మా! బలాన్ని, ప్రేమను, జ్ఞానాన్ని ఇచ్చేదానివి, శక్తిస్వరూపానివి, భీకరరూపిణివి, సౌమ్యము మరియు రౌద్రము అనే రెండు లక్షణాలు కలిగి ఉన్నదానివి. జీవన పోరాటంలో, భారతదేశం కోసం జరిగే సంగ్రామంలో మేమంతా నీ చేత ప్రేరేపించబడిన యోధులము. మాలో యుద్ధకాంక్ష రగిలించింది నీవే. అమ్మా! ప్రాణము మరియు మనస్సులో అసురులకు (రాక్షసులు) ఉండే కఠినమైన శక్తిని ప్రసాదించు; ఆ అసురశక్తితో దుష్టులను నిర్మోహమాటంగా వధిస్తాము. మా జీవితంలోని ఆటంకాల పట్ల, విదేశీ భావజాలం, విదేశీ భావదాస్యం పట్ల కఠినంగా, క్షమించకుండా పోరాడి అంతం చేస్తాము. అలాగే మాకు హృదయంలో మరియు బుద్ధిలో దేవతలకు ఉండే గుణాలను ప్రసాదించు, వారికి ఉండే జ్ఞానాన్ని ప్రసాదించు. (హృదయం అమ్మవారి స్థానం. హృదయంలో దైవీగుణాలు ఉంటే, అది ఎల్లప్పుడూ అమ్మవారికి కృతజ్ఞతతో, భక్తితో, ఆవిడ యందే లగ్నమై ఉంటుంది. బుద్ధి అనగా నిశ్చయాత్మకమైన జ్ఞానం గురించి చెప్పేది. దేవతలకు ఉండే జ్ఞాన్ని బుద్ధిలో నింపితే, అది ఎన్నడూ దైవం పట్ల, ధర్మం పట్ల విముఖత చూపదు. ధర్మాన్ని తప్పదు).

మాతః దుర్గే! జగత్-శ్రేష్ఠమైన భారతజాతి భయంకరమైన అంధకారంలో కప్పబడి ఉంది. మాతః, నీవు గగనప్రాంతంలో మెల్లిమెల్లిగా ఉదయిస్తున్నావు, నీ అలౌకికమైన అంధకార-వినాశకరమైన శరీరకాంతితో ఉషస్సు ప్రకాశిస్తోంది. ప్రకాశాన్ని విస్తరించు మాతః, తిమిరాన్ని దూరం చెయ్యి |5|


దుర్గా మాత! దేవేంద్రుడు సైతం భారతదేశంలో జన్మించిన వారిని చూసి, తన పదివికి పోటీ వస్తాడేమోనని భయపడతాడట. భారతదేశ ఖ్యాతిని, భారతీయుల అదృష్టాన్ని గంధర్వులు దేవలోకాల్లో గానం చేస్తారని వేదంలో కనిపిస్తుంది. భారతదేశంలో పుట్టడమే పెద్ద అదృష్టం. అలాంటి జగత్తులోనే శ్రేష్ఠమైన భారతజాతి ఎంతో భయంకరమైన అంధకారంతో కప్పబడి ఉంది. తీవ్రమైన తమస్సులో మునిగిపోయింది. మాతః, అయినప్పటికీ మాకు ఆశలు చిగురిస్తున్నాయి. ఎందుకో తెలుసా? ఆకాశంలో నీవు మెల్లిగా ఉదయిస్తున్నావు. నీ అలౌకికమైన, అద్భుతమైన శరీరంకాంతి అంధకారాన్ని, అజ్ఞానాన్ని నశింపజేస్తుంది. అలాంటి నీ శరీరం నుంచి వెలువడుతున్న కాంతికిరణాలతో ఉషస్సు (ఉషః కాలం - సూర్యోదయానికి పూర్వపు కాలం) ఎర్రగా ప్రకాశిస్తోంది. భారతదేశంలో ఇక అంధకారంలో కొట్టుకుపోయే పరిస్థితి అంతమవుతోంది. మాత నీ ప్రకాశాన్ని విస్తరించు. ఈ తిమిరాలను (చీకట్లను) దూరం చెయ్యి.



మాతః దుర్గే! శ్యామలా, సర్వసౌందర్య- అలంకృత, జ్ఞాన-ప్రేమ-శక్తులకు ఆధారమైన భారతభూమి నీ యొక్క విభూతి. ఇన్ని రోజులు తన శక్తిని నిగ్రహించుకోనుటకు ఆత్మగోపనం చేసుకుంది. రాబోయే యుగంలో, రాబోవు రోజుల్లో సమస్త విశ్వాన్ని తన కౌగిట్లోకి తీసుకొనుటకు భారతమాత జాగృతమవుతోంది. రా మాతః, ప్రకటనమవ్వు |6|

దుర్గా మాత! శ్యామ (నల్లని) వర్ణం కలదానువు కనుక శ్యామలవు. ఈ శ్యామల దేవిని మాతంగీ అని కూడా అంటారు. ఈవిడ దశమహావిద్యల్లో ఒకరు. శ్రీ కృష్నుడితో కలిసి జన్మినిచినది, కృష్ణావతరంలో నిత్యం శ్రీ కృష్ణులవారితో సంభాషణ జరిపి ఆయనకు సాయంగా ఉన్నది శక్తి శ్యామలదేవి. ఈ శ్యామలదేవిని రాజశ్యామల, రాజమాతంగీ అని కూడా అంటారు. లలితా పరమేశ్వరీ దేవి యొక్క బుద్ధి నుంచి ఉద్భవించిన శక్తి శ్యామలా దేవి. ఈవిడ లలితాదేవికి మంత్రిణి. చక్రరాజ రథారూఢా అంటూ లలితా సహస్రనామాల్లో వివరించబడేది శ్యామల దేవి గురించే.
సర్వ సౌందర్యరాశివి, ప్రపంచంలో ఉన్న సౌందర్యాలన్నిటిని అలంకరించుకున్నదానివి. జ్ఞానం, ప్రేమ, శక్తులకు ఆధారభూతమైన భారతభూమి నీ యొక్క విభూతి (ఇక్కడ భారతదేశాన్ని అమ్మవారి అంశగా చెబుతున్నారు అరోబిందో. ఇది వారి యోగదర్శనం. ఇంతకవరకు అమ్మవారిని ఉద్భవించమన్నారు. ఆ ఉద్భవించిన మాత ఎవరో ఇదే శ్లోకంలో చెబుతారు). అలాగే భారతదేశం ప్రపంచానికి పంచాల్సినవి ఏమిటో కూడా స్పష్టం చేశారు. ప్రథానంగా భారతదేశం పంచాల్సింది జ్ఞానం, ప్రేమ, శక్తి.

ఈ ప్రపంచంలో ఎన్నో నాగరికతలు వచ్చాయి, వెళ్ళిపోయాయి, కానీ సనాతనధర్మం, భారతదేశం మాత్రమే మిగిలి ఉన్నాయి. ఎందుకంటే భారతదేశం ఈ ప్రపంచానికి చేయాల్సింది ఎంతో ఉందని, అందుకే భగవంతుడు ఇంకా ఈ జాతిని నిలిపి ఉంచాడని స్వామి వివేకనంద, శ్రీ అరోబిందో అనేకసార్లు స్పష్టం చేశారు. భగవంతుడు భారతదేశానికి ఒక కార్యం అప్పజెప్పాడని, అది మర్చిపోతే, ఈ జాతిని ఆయనే ప్రపంచపటం నుంచి చెరిపివేస్తాడని కూడా స్పష్టం చేశారు. అందులో మనం (భారతీయులు), ప్రపంచానికి సనాతమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పంచాలి. ప్రపంచంలో మూఢనమ్మకాలను తొలగించాలి. షర్తుల్లేని ప్రేమను పంచాలి. ఎదుటివాడి నుంచి నీవేదీ ఆశించకుండా, నీవు వాడిని ప్రేమించగలగాలి. అటువంటి దివ్యప్రేమను పంచాలి. శక్తిని పంచాలి. అది కేవలం భౌతికశక్తి కాదు, ఆధ్యాత్మిక శక్తి. భౌతికమైన శక్తి అంటే బలం మాత్రమే. కానీ ఆధ్యాత్మికమైన శక్తి ఆత్మ నుంచి ఉద్భవిస్తుంది. అది ప్రపంచానికి పంచాలి. అంతకుముందుగా మనం కూడా జ్ఞానం, ప్రేమ, శక్తులను పొందాలి. తత్త్వాన్ని సరిగ్గా అర్దం చేసుకోవాలి. ఈ మూడింటిని అర్దం చేసుకుంటే భారతదేశం అర్దమవుతుంది, ఆదిపరాశక్తి అర్దమవుతుంది. అదే అరోబిందో చెబుతునారు.


ఇంతటి గొప్ప భారతదేశం వందల సంవత్సరాలు విదేశీయుల ఆక్రమణలకు బలైంది. తన శక్తిని దాచిపెట్టుకుంది. తన ఆత్మను తాను కప్పిపెట్టుకుని బందీగా బ్రతికింది. అవమానాలను, అత్యాచారాలను, చీత్కారాలను భరించింది. ఇంత దారుణమైన పరిస్థితి మనకు ఎందుకు వచ్చిందో కూడా ఆయనే ఇంకో చోట చెప్పారు. అయినప్పటికి భారతదేశం మరణించలేదు. ఆమె ఇంకా బ్రతికే ఉంది. ప్రపంచానికి ఏదో చేయటానికి సిద్ధంగా ఉంది.... ఎందుకంటే ఆమె పరమపావని ఐన దుర్గా మాత అంశ. సా.శ.1,900 నుంచి భారతదేశానికి స్వర్ణయుగం మొదలైందని అరోబిందో దర్శించారు. ఇక్కడ అదే చెబుతున్నారు. రాబోయే యుగంలో, రాబోయే రోజుల్లో సమస్త ప్రపంచాన్ని తన కౌగిట్లోకి తీసుకుని ప్రేమను పంచటానికి, ప్రపంచప్రజలను ఓదార్చి, పోషించటానికి భారతమాత (ఆ ఉద్భవించిన మాతయే 18 చేతులతో వ్యక్తమైన మహాదుర్గ) జాగృతమవుతోంది. రా మాత! నీకు ఆహ్వానం పలుకుతున్నాము. భారతదేశంలో నిన్ను నువ్వు ప్రకటించుకో..... 

మాతః దుర్గే! మేము నీ సంతానము, నీ ప్రసాదం చేత, నీ ప్రభావం చేత మహత్వమైన భావలను, మహత్వకార్యాలను చేయుటకు ఉపయుక్తంగా ఉన్నాము. క్షుద్రత్వం వినాశనం చెయ్యి, స్వార్ధాన్ని వినాశనం చెయ్యి, భయాన్ని వినాశనం చెయ్యి |7| 

దుర్గా మాత! మేము (భారతీయలము) నీ సంతానము (అంశలము). నీ చేత ప్రభావితమై, నీ అనుగ్రహంతో గొప్పకార్యాలను నెర్వేర్చటానికి, గొప్ప భావాలను కలిగి ఉండటానికి ఉపయుక్తంగా ఉన్నాము. అమ్మా! మాలోని క్షుద్రమైన గుణాలను నశింపజెయ్యి. స్వార్ధాన్ని నాశనం చేయ్యి. భయాన్ని సమూలంగా నశింపజెయ్యి.


దుర్గా మాత! మేము (భారతీయలము) నీ సంతానము (అంశలము). నీ చేత ప్రభావితమై, నీ అనుగ్రహంతో గొప్పకార్యాలను నెర్వేర్చటానికి, గొప్ప భావాలను కలిగి ఉండటానికి ఉపయుక్తంగా ఉన్నాము. అమ్మా! మాలోని క్షుద్రమైన గుణాలను నశింపజెయ్యి. స్వార్ధాన్ని నాశనం చేయ్యి. భయాన్ని సమూలంగా నశింపజెయ్యి |8|

మాత దుర్గమ్మ! నీవే కాళీ స్వరూపిణివి. దిగంబరివి. దిక్కులెల్లా, కదలడానికి చోటు లేకుండా అంతటా, అన్నింటా వ్యాపించి ఉన్నది కనుక అమ్మవారు దిగంబరి. మానవుల పుర్రెలను మాలగా ధరించినదానివి. చేతిలో ఖడ్గం ధరించినదానివి. అసురులను సమూలంగా నాశనం చేసేదానివి. అమ్మా! నీవు కృరూమైన, అతిభీకరమైన నినాదంతో, నిర్దయగా, మా అంతఃకరణంలో ఉన్న శతృగుణాలను అంతం చెయ్యి. వాటి పట్ల ఏమాత్రం కనికరం చూపకు. దుర్గుణాల్లో ఒకట్టి కూడా, మాలో మచ్చుకైనా జీవించడానికి వీల్లేదు. మేము విమలులం కావాలి, నిర్మలులం కావాలి (మలం అంటే చెడు, విసర్జించదగినది, నిర్మలం అంటే ఎంటువంటి చెడు లేకుండా ఉండటం), పవిత్రులం కావాలి. నీ పిల్లలైన మేము ప్రతి చర్యలో నిన్నే ప్రతిబింబించాలి. నీవు ఏ రాక్షసగుణాలతో పోరాటం చేశావో, మేమా రాక్షసగుణాలను మాలో నిలుపుకోలేము. వాటిని అంతం చెయ్యి మాత! అంతే, ఇదే మా ప్రార్థన మాత. భారతదేశంలో అవతరించు, నిన్ను నీవు ప్రకటించుకో.

మాతః దుర్గే! స్వార్థం, భయం, క్షుద్రాశయాలతో భారతదేశం మృతప్రాయమవుతోంది| మమ్మల్ని మహోన్నతులను చెయ్యి, మహత్ప్రయాసులను చెయ్యి, ఉదారచేతనులను చెయ్యి, సత్యసంకల్పులను చెయ్యి| ఇప్పటి నుంచి మాలో నిశ్చేష్టత, అలసత్వము, భయభీతి లేకుండుగాకా |9|

దుర్గా మాత! స్వార్థం, భయం, క్షుద్రమైన ఆశయాలతో భారతదేశం జీవచ్ఛవమైంది, మరణశయ్యపై మృత్యువుకు సిద్ధంగా ఉంది. 
జనులు స్వార్థంతో నిండిపోయారు. పదిమంది కలిసి దేశం కోసం, ధర్మం పనిచేయడానికి ముందుకు రావట్లేదు, ఎవరి వ్యక్తిగత అభివృద్ధిని వారు చూసుకుంటున్నారు. సంపద పోతుందనో, లేదా మరణిస్తామానో, లేదో ఇంకేదో కోల్పోతామనో భయపడుతూ మంచి మార్పు దిశగా ఒక్కరూ అడుగు వేయడంలేదు. క్షుద్రమైన ఆలోచనలు జనుల మనస్సులను ఆవరించాయి. తాము గొప్ప పనులు చేయరు. ఇంకేవరైనా చేస్తుంటే, తట్టుకోలేరు. వారిని క్రిందకు లాగాలనే చూస్తుంటారు. పదిమంది కలిసి ఒక సంఘంగా ఏర్పడలేరు. ఏర్పడినా, తామే నాయకులవ్వాలని అనుకుంటారు, పెత్తనం చెలాయించే ప్రయత్నం చేస్తారు. ఒకరి గురించి ఒకరు చాటుమాటుగా చాడీలు చెప్పుకుంటారు. ఇలాంటి దుర్గుణాల కారణంగా భారతదేశం మృతప్రాయమైంది. మరణించడానికి సిద్ధమైంది.

అమ్మా! మా ప్రార్థన ఒక్కటే. మమ్మల్ని మహోన్నతులను చెయ్యి, గొప్ప ప్రయత్నాలు చేసే దిశగా మమ్ము ప్రేరేపించు. మా హృదయాలను విశాలం చెయ్యి. మేము సంకల్పించుకున్న కార్యానికి కట్టుబడి ఉండే శక్తిని ప్రసాదించు. ఎన్ని ఆటంకాలు వచ్చినా, మేము అనుకున్న కార్యం దిశగా మరింత ఉత్సాహంతో ముందుకు దూకే శక్తినివ్వు. సత్యం దిశగా సాగే సంకల్పాలను చేసే శక్తిని ప్రసాదించు. ఇప్పటి నుంచి మాలో నిశ్చేష్టత ఉండకూడదు. అలసత్వం ఉండకూడదు. మేము దీనికి భయపడకూడదు. అటువంటి గొప్ప స్థితిని భారతీయులకు ప్రసాదించు మాత.

మాతః దుర్గే! యోగశక్తిని విస్తరించు. నీ ప్రియమైన ఆర్యసంతతి మేము. మేము కోల్పోయిన విద్య, శీలము, మేధాశక్తి, శ్రద్ధాభక్తులు, తపస్సు, బ్రహ్మచర్యము, సత్య-జ్ఞానాలు తిరిగి మాలో వికసింపజేసి, జగత్తుకు పంచు. మానవసహాయి దుర్గతినాశినీ జగదంబ, ప్రకటనం అవ్వు |10|


అమ్మా దుర్గామాత! యోగశక్తిని విస్తరించు. అది అందరికి సులువుగా అందేలా, దాన్ని అర్దం చేసుకునే శక్తిని ప్రసాదించు. భారతీయులమైన మేము నీ ప్రియమైన ఆర్యసంతతిమి. ఆర్య అనగా శ్రేష్టమైనది అని అర్ధం. శత్రువు ఎదురుగా లేనప్పుడు, వాడి యందు కోపం లేనివాడు; సత్యమే మాట్లాడేవాడు; ధర్మం తప్పనివాడు అంటూ కొన్ని లక్షణాలను శాస్త్రం చెప్పింది. ఆ లక్షణాలు కలిగి ఉన్నవారిని ఆర్యులు అని అన్నది శాస్త్రం. ఈ లక్షణాలను వేల ఏళ్ళుగా భారతీయులు అనుష్టించారు కనుక వారిని ఆర్యులు అన్నారు...... అన్యమత దాడుల్లో, దురాక్రమణాల్లో భారతీయులు ఎంతో కోల్పోయారు. మేము కోల్పోయిన విద్య, నడవడిక, మేధస్సు, శ్రద్ధ, భక్తి, తపస్సు, బ్రహ్మచర్యము, సత్యము, జ్ఞానాలను తిరిగి మాలో వికసింపజెయ్యి. వాటిని జగత్తుపై వర్షించు. మానవులకు సహాయం చేయుటకు దుర్గతులను నశింపజేసే ఓ జగన్మాత, భారతదేశంలో అవతరించు, ప్రపంచానికి నీ ఉనికిని చాటుకో.

మాతః దుర్గే! అంతరంగంలోని శతృవులను సంహరించు, బాహ్య బాధలు-విఘ్నాలను నిర్మూలించు| బలశాలీ, పరాక్రమీ, ఉన్నతచేతనమైన భారత జాతి పవిత్ర వనాల్లో, సారవంతమైన పంటపొలాల్లో, ఆకాశాన్ని తాకే పర్వతాల క్రింద, స్వచ్ఛమైన ప్రవాహం కలిగిన నదీతీరాల్లో, ఐక్యమత్యంలో, ప్రేమలో, సత్యంలో, శక్తిలో, శిల్పంలో, సాహిత్యంలో, విక్రమంలో, జ్ఞానంలో శ్రేష్ఠంగా నివాసముండు. మాతృచరణాల యందు ఇదే మా ప్రార్థన. ప్రకటనమవ్వు |11|


అమ్మా దుర్గమ్మ! (కోపం, తన యందే సానుభూతి, ద్వేషం, అసూయ, దురాశ, ఈర్ష్యా, లోభం, మోహం మొదలైనవి అంతరంగంలోని శతృవులు) అంతరంగంలో ఉన్న శతృవులను సంహరించు. బాహ్యంలో మాకు ఎదురవుతున్న బాధలను, కష్టాలను, విఘ్నాలను నిర్మూలించు. శ్రేష్టమైన బలము, పరాక్రమము, ఉన్నతమైన భావాల్లో తన రక్తంలోనే నింపుకున్న భారతజాతి యొక్క పవిత్రమైన అడవుల్లో, సారవంతము, ఆరోగ్యకరమైన ఆహారానిచ్చే పంటభూముల్లో, ఆకాశాన్ని తాకే ఎత్తైన శిఖరాలు కల పర్వతాల క్రింద, స్వచ్ఛమైన, శుద్ధమైన, పవిత్రమైన నీటి ప్రవాహం కలిగిన నదీతిరాల వెంబడి; అనేక సంప్రదాయాలు, ఆచారాలతో భిన్నత్వం కనిపిస్తున్నా, పూసల దండ మధ్యలో ఉండే దారంవలే ధర్మం వలన ఏర్పడిన ఐకమత్యంలో, దివ్యమైన ప్రేమలో, సత్యంలో, శక్తిలో, జ్ఞానంలో గొప్పగా నివసించు. అమ్మా! నీ పాదాలయందు ఇదే మా ప్రార్థన. భారతదేశంలో ప్రకటనమవ్వు.

మాత దుర్గేః! యోగబలంతో మా శరీరములయందు ప్రవేశించు. మేము నీ యొక్క యంత్రాలు కావాలి, అశుభనాశనం చేసే ఖడ్గాలము, అజ్ఞానాన్ని వినాశనం చేసే దీపాలము కావాలి, భారతీయ యువకుల ఈ అభిలాషను పూర్తి చెయ్యి. యంత్రివై యంత్రాన్ని నడుపు, అశుభహంత్రివై ఖడ్గాన్ని త్రిప్పు, జ్ఞాన-దీపప్రకాశినివై దీపాన్ని చేతిలోకి తీసుకో మాతః, ప్రకటనమవ్వు |12| 


దుర్గమ్మా! యోగబలంతో మా శరీరాల్లోకి ప్రవేశించు. మేము కేవలం భౌతిక, మానసిక శక్తులతో కాదు, యోగశక్తితో, దైవశక్తితో భారతదేశ పునర్వైభవం కోసం పాటుపడాలి. ఆ శక్తిని నీవే ఇవ్వాలి. మేము నీ యొక్క యంత్రాలము కావాలి. నీ పని మా ద్వారా జరగాలి. మేము అశుభాలను నశింపజేసే నీ చేతి ఖడ్గము కావాలి. అజ్ఞానాన్ని నశింపజేసే జ్ఞాన దీపపు జ్యోతులము కావాలి. భారతీయ యువత యొక్క అభిలాష ఇదే. భారతీయ యువతకు తెలుసు, ప్రతి పనిలోనూ పురుషాకారము (మానవప్రయత్నము), దైవానుగ్రహం ఉండాలని. కేవలం పురుషాకారంతోనే ఏదీ సాధ్యం కాదని కూడా వారికి తెలుసు. మేము నీ యంత్రాలము. నీవు యంత్రాన్ని నడిపే దానవు. మమ్ము ముందుకు నడుపు. అశుభాలను తొలగించడం నీ లక్షణం. అందుకే నీకు అశుభహంత్రి అనే పేరుంది. అశుభహంత్రివై ఖడ్గాన్ని త్రిప్పు. నీవే ఖడ్గాన్ని త్రిప్పే ఆ వేగానికి భారతదేశం జోలికి వచ్చే అశుభాలు నశిస్తాయి. జ్ఞానప్రకాశినివై నీ చేతిలో ఉన్న జ్ఞానాదీపాన్ని మాకు చూపు. ఆ వెలుతురు మాలోని అజ్ఞానమనే అంధర్కారాన్ని తొలగించాలి. నీవే మాకు అమ్మవు. మాత, భరతదేశంలో ప్రకటనమవ్వు.

మాతః దుర్గే! నిన్ను పొందిన తర్వాత మళ్ళీ విసర్జించము, శ్రద్ధ-భక్తి-ప్రేమతో నిన్ను బంధించి ఉంచుతాము. రా మాతః, మా మనస్సులో, ప్రాణంలో, శరీరంలో ప్రకటనమవ్వు. |13|


అమ్మా దుర్గమ్మా! ఒక్కసారి నీవు మాలో అవతరించిన తర్వాత, మేము నిన్ను పొందిన తర్వాత, ఇక మళ్ళీ నిన్ను విడిచిపెట్టము. మా దేశము, ధర్మం, మేమూ, ఇన్ని కష్టాలు ఎదురుకొనడానికి కారణం ఇతఃపూర్వం నిన్ను విడిచిపెట్టడమే. నీవు శ్రద్ధ, భక్తి, ప్రేమలకు తప్ప వేరే వేటికీ లొంగవు. వీటితో నిన్ను బంధించి ఉంచుతాము. రా అమ్మ! నీ బిడ్డలైన భారతీయుల మానస్సులో, ప్రాణంలో, శరీరంలో ప్రకటనమవ్వు. భారతదేశంలో అవతరించు.

వీరమార్గప్రదర్శిని, రావమ్మా! ఇప్పుడు విసర్జించము. మా జీవితమంతా అవిచ్ఛినమైన దూర్గాపూజగా అగుగాక, మా సమస్త కర్మలు నిరంతరం పవిత్రమైన ప్రేమమయమము, శక్తిమయమైన మాతృసేవ అగుగాక, ఇదే మా ప్రార్థన మాతః, భారతదేశంలో అవతరించు, ప్రకటనమవ్వు. |14| 


వీర మార్గాన్ని మాకు చూపేదానవు. రావమ్మా! ఈ సారి నిన్ను విడిచిపెట్టము. మా సమస్త జీవితము అవిచ్ఛిన్నమైన దూర్గాపూజ అగుగాక, మే చేసే ప్రతి కర్మ (పని), ప్రేమతో, శక్తితో నిండి, ఆ భవానీ మాతకు నిరంతరం చేసే సేవ అగుగాక. ఇదే మా ప్రార్థన, ఓ మాత, భూమి మీదకు దిగిరా, భారతభూమిలో అవతరించి నిన్ను నువ్వు ప్రకటనం చేసుకో.

No comments:

Post a Comment