Thursday, 26 October 2017

శివయోగసాధన- శివారాధన- స్వామి శివానంద

శివారాధన


శివుడిని తన సగుణతత్త్వంలో శివలింగంగా పూజిస్తారు. సాధారణంగా శివభక్తులు పంచాయతనపూజ చేస్తారు. ఈ పూజలో శివ, గణేశ, పార్వతీ మాత, సూర్యనారాయణస్వామి మరియు సాలగ్రామాలను విధిగా ఆరాధిస్తారు.

శుభకరమైన రోజున పంచాయతన మూర్తులను తెచ్చుకోండి. గొప్ప విశ్వాసంతో వాటిని ఇంట ప్రతిష్టించండి. పెద్ద ఎత్తున ప్రత్యేకపూజలు, అర్చన, ఆరాధన, అభిషేకం నిర్వహించి బ్రాహ్మణులకు, మహాత్ములకు, పేదలకు అన్న సమారాధన చేయండి. దైవన్ని ప్రత్యేక గదిలో ప్రతిష్టించండి. ప్రతి రోజూ దేవాతమూర్తిని త్రికరణశుద్ధితో, విశ్వాసంతో పూజించండి. మీకు సమస్త సంపదలు, మనశ్శాంతి కలిగి, ధర్మ, అర్ధ, కామ, మోక్షాలు సిద్ధిస్తాయి. మీరు ఐశ్వర్యవంతమైన జీవనం గడిపి, మరణం తర్వాత అమరత్వాన్నిచ్చే శివ సాయుజ్యాన్ని ప్రవేశిస్తారు.

అధికసంఖ్యలో బిల్వదళాలను కోసుకురండి. ధూపం, దీపం, కర్పూరం, చందనపు కడ్డీలు, శుద్ధజలం, అధికసంఖ్యలో పువ్వులు, స్వామికి నైవేధ్యాలు, కూర్చోవడానికి పీట, ఒక గంట, శంఖము మరియు పూజకు అవసరమైన ఇతర సంభారాలను సిద్ధం చేసుకోండి. సూర్యోదయానికి పూర్వం తెల్లవారుఝామునే నిద్రలేవండి. ముఖం కడ్డుక్కుని, స్నానం చేయండి. పూజకోసం పెట్టుకున్న ప్రత్యేకమైన పట్టు వస్త్రాలు ధరించండి. పూజాగదిని చక్కగా అలంకరించండి. స్వామి నామాలను చదువుతూ, ఆయన్ను స్తుతిస్తూ, స్తోత్ర పారాయణ చేస్తూ, ఆయనకు నమస్కరిస్తూ ఆ గదిలోకి ప్రవేశించండి. పూజగదిలోకి ప్రవేశించే ముందు కాళ్ళు కడ్డుక్కోండి. సుఖాసనం (మీకు అనువుగా ఉన్న ఆసనం) లో కూర్చుని పూజ ప్రారంభించండి. నిర్ణీత పద్ధతిలో పూజ ఆరంభించే ముందుగా మీరు సంకల్పం చెప్పుకోవాలి. ఆ తర్వాత క్రమంగా కలశం, శంఖం, ఆత్మ, పీట (స్వామి ఆసనం) యొక్క పూజలను చేయాలి. అటు తర్వాత షోడశోపచార పూజ నిర్వహించి, మహామృత్యుంజయ మంత్రము, రుద్రపాఠము, పురుషసూక్తము, గాయత్రి మంత్రాలు జపించి, శుద్ధజలము, పాలు, చెఱుకురసము, నెయ్యి మరియు మీ శక్తి కొలదీ ఇతర ద్రవ్యాలతో లేద కేవలం శుద్ధజలంతో అభిషేకం చేయండి. 

రుద్రాభిషేకం అత్యంత ఫలప్రదం. మీరు కనుక రుద్రజపం చేసి అభిషేకం చేస్తే, మీ బాధలు, కష్టాలు మాయమై, విశ్వనాథుని అనుగ్రహంతో మానవజన్మ యొక్క లక్ష్యమైన పరమానాందాన్ని (మోక్షాన్ని) పొందుతారు. రుద్రం గొప్ప పవిత్రతను చేకూరుస్తుంది. రుద్రం మరియు పురుషుసూక్తంలో అగోచరమైన శక్తి దాగి ఉంది. రుద్రపారాయణంలో అద్భుతమైన ఉద్దీపనం ఉంది. పూజను ప్రారంభించి, దాని వైభావన్ని, తేజస్సును మీరే అనుభూతి చెందండి.

అభిషేకం తర్వాత, శివుడిని చందనం మరియు పువ్వులతో చక్కగా అలంకరించండి. తర్వాత ఆయన నామాలు 'ఓం నమః శివాయ', 'ఓం మహేశ్వరాయ నమః' మొదలైన నామాలను ఉచ్ఛరిస్తూ అర్చన చేయండి. సాధ్యమైతే ప్రతి రోజు 108 లేదా 1008 అర్చనలు చేయండి. అర్చన తర్వాత వివిధ దీపాలతో హారతి ఇవ్వండి- ఏక హారతి, బిల్వ (మూడు వత్తుల) హారతి, పంచహారతి మరియు కర్పూర హారతి ఇవ్వండి. గంటలు వాయించండి, తాళములు వేయండి, శంఖము మొదలైనవి ఊదండి. భగవంతునికి నైవేద్యం అర్పించండి.

హారతి తర్వాత, చామరలు వీస్తూ స్వామిని కొనియాడుతూ మహిమ్నా స్తోత్రం, పంచాక్షరీ స్తోత్రం మొదలైనవి చదవండి. పూజ మిగుంపులో 'కాయేన వాచా', 'ఆత్మ త్వం గిరిజామతేః' మరియు 'కరచరణ కృతం' మొదలైనవి చదవండి. స్వామికి సర్వం అర్పించండి. మీరు ఆయన చేతిలో ఒక వస్తువు మాత్రమేనని భావించండి. దైవానుగ్రహం కోసం మాత్రమే ప్రతిదీ చేయండి. నిమిత్త భావాన్ని వృద్ధి చేసుకోండి. భక్తులను సేవించండి. తన భక్తులకు సేవ చేస్తే, స్వామి చాలా సంతోషిస్తాడు. చివరలో భక్తులకు ప్రసాదం పంచండి. గొప్ప విశ్వాసంతో ప్రసాదాన్ని తీసుకోండి. భగవంతుని ప్రసాద వైభవం వివరించలేనిది. విభూతిని ప్రసాదంగా స్వీకరించి, నుడుటన ధరించండి.

మీరు బాహ్యవస్తువులతో సగుణారాధనలో పురోగమించినప్పుడు, మానసపూజను మొదలుపెట్టవచ్చు. మీకు స్వామి దర్శనం కలిగి బంధ విముక్తి కలుగుతుంది.

సోమవారాలు మరియు ప్రదోషాల్లో (త్రయోదశి నాడు) ప్రత్యేకపూజలు నిర్వహించండి. ఈ రోజులు మరియు శివరాత్రి స్వామికి అత్యంత పవిత్రమైనవి. పెద్ద ఎత్తున శివరాత్రి జరుపుకోండి. రోజంతా ఉపవసించండి. త్రికాలపూజ, ప్రత్యేక అభిషేకం, ఏకాదశ-రుద్ర జపం, సహస్రనామార్చన, రాత్రి వేళ జాగరణ, స్తోత్రపఠనం, శివపురాణ పఠనం, శివలీలల ప్రవచనాలు వినటం వంటివి చేయండి. మరుసటి రోజు పూజానంతరం అభిషేకం చేసిన నీటితో ఉపవాసం ముగించండి. నివేదనలు సమర్పించి, ప్రసాదాన్ని స్వీకరించండి. మీకు గొప్ప మనశ్శాంతి, ఆధ్యాత్మిక ఎదుగుదల ఉంటుంది. ఏ అవకాశాన్ని వదులుకోవద్దు. రోజు పూజించడం అనేది అన్ని సమస్యలకు పరిహారం, మీరు ఎన్నడూ దరిద్రాన్ని అనుభవించరు. నా మాటగా తీసుకుని, ఈ రోజు నుంచి పూజ ప్రారంభించండి.

-- స్వామి శివానంద  

No comments:

Post a Comment